కొండను తవ్వి..!
నల్లగొండ టుటౌన్ :జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. పథకం అమలులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినా... పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కేవలం సామాజిక తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఉపాధి పనుల్లో దాదాపు రూ.9.78 కోట్లు పక్కదారి పట్టినట్లు ఇప్పటి వరకు చేపట్టిన సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. కానీ ఈ డబ్బులను రికవరీ చేయడంలో సంబంధిత అధికారులు మొహం చాటేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో చిత్రమేమిటంటే.. సామాజిక తనిఖీల కారణంగా ఇప్పటి వరకు రూ. రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
రికవరీలో కనిపించని నిబద్ధత
ఉపాధి హామీ పథకంలో కల్పించిన పనులపై సామాజిక తనిఖీ చేపట్టిన అధికారుల బృందం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ పథకం జిల్లాలో 2007లో ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు నిర్వహించిన సామాజిక తనిఖీల్లో 6 వేల 900 పనుల్లో రూ.13 కోట్లకు పైగా నిధులపై అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో కేవలం రూ. కోటి 35 లక్షల వరకు రికవరీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగత విచారణలో కొన్ని పనులు సక్రమంగానే జరిగాయని మరో 2 కోట్ల రూపాయలకుపైగా తొలగించారు. 2007 నుంచి నేటి వరకు సామాజిక తనిఖీల నిర్వహణకు సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఒక మండలంలో ఒకసారి సామాజిక తనిఖీ ఖర్చు రూ. 1.50 లక్షలు అవుతుంది. ప్రతి మండలంలో ఒక రోజంతా తనిఖీ నిర్వహించి దుర్వినియోగమైన నిధులను రాబట్టకపోతే ఈ సామాజిక తనిఖీ వల్ల ఉపయోగమేమిటో సంబంధిత అధికారులకే తెలియాలి. క్షేత్రస్థాయి సిబ్బందినుంచి జిల్లాస్థాయి అధికారి వరకు ఈ అక్రమాల తంతులో భాగస్వామ్యం ఉండడంతోనే రికవరీ చేయడంలేదనే విమర్శలకు బలం చేకూరుతోంది. అక్రమాలకు పాల్పడే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంతో నిధుల దుర్వినియోగం యథేచ్ఛగా కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎందుకీ అలసత్వం ...
ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రూ.9.78 కోట్లు పక్కదారి పట్టినా నిధుల రికవరీకి గట్టిగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. సంబంధిత అధికారులు.. అక్రమాలకు పాల్పడిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడంతో వారిలో అవినీతి అంటే ఏమాత్రం భయంలేకుండా పోతోంది. అక్రమాల ద్వారా సంపాదించిన దాంట్లో కాసింత పైవారికి ముట్టజెపితే వారే చూసీ చూడనట్లు సర్దుకుంటారనే అపవాదు కూడా ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
నిధులు రికవరీ చేస్తాం : దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ
ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలో దుర్వినియోగమైనట్లు తేలిన నిధుల ను రికవరీ చేస్తాం. ఇటీవల కొన్ని కారణాల వల్ల దానిపై దృష్టి పెట్టలేదు. పనులు ఎంత వేగంగా చేస్తామో అక్రమాలకు పాల్పడిన వారిపై కూడా అంతే వేగంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోం.
అంతా ఉత్తుత్తి షోకాజ్ నోటీసులు...
ఉపాధి హామీ పనులలో అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. వారి నుం చి సంజాయిషీ తీసుకుని నిధులను రికవరీ చేయకుండా వదిలేశారు.
2007 నుంచి ఇప్పటి వరకు జరిగిన పనులు..
మొత్తంగా చేపట్టిన పనులు 6,900
అభ్యంతరాలు వచ్చిన పనుల విలువ రూ. 13,37,81,000
సక్రమమైనవిగా గుర్తించి తొలగించినవి రూ. 2,04,45,000
ఎటూ తేల్చనివి రూ. 1,54,53,000
దుర్వినియోగమైనట్టు తేల్చినవి రూ. 9,78,83,000
రికవరీ అయినవి రూ. 1,35,89,000
రికవరీ చేయాల్సినవి రూ. 8,42,94,000
ఒక మండలంలో ఒకసారి తనిఖీకి
రూ. 1,50,000
మొత్తం అయిన ఖర్చు
రూ. 6,00,00,000