సాక్షి, నల్లగొండ: పంచాయతీ సెక్రటరీ పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో 200 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. మొత్తం 59,793 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
పతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మొత్తం 3,204 మంది అధికారులు, ఉద్యోగులు పరీక్షల విధులు నిర్వహిస్తారు. నల్లగొండలో 95, భువనగిరిలో17, సూర్యాపేటలో 27, మిర్యాలగూడలో 34, దేవరకొండ, కోదాడ, హుజూర్‌నగర్‌లో 8 చొప్పున, చౌటుప్పల్‌లో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 52మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 52 మంది లైజన్ అధికారులు, 200 మంది సహాయ లైజన్ అధికారులు, 200 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2700 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాలు తెరిచింది మొదలు పరీక్ష ముగిసిన తర్వాత ఓఎమ్మార్ షీట్లు సీల్ చేసేంత వరకూ వీడియోలో చిత్రీకరిస్తారు.
10 నిమిషాలు ఆలస్యమైనా
ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని గతంలో కోల్పోయేవారు. పరీక్ష కేంద్రాలు దూర ప్రాంతాలలో కేటాయించడం, సకాలంలో బస్సులు రాకపోవడం తదితర కారణాలతో అభ్యర్థులు సకాలంలో పరీక్షకు హాజరుకాలేకపోతున్నారు. నెలల తరబడి పడిన కష్టమంతా వృథాకావడమే కాకుండా ఉద్యోగాన్ని చేజార్చుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీ పరీక్షకు సమయం విషయంలో కొంచెం మినహాయించింది. పరీక్ష ప్రారంభమైన 10నిమిషాల్లోపు హాల్‌లోకి అభ్యర్థులను అనుమతిస్తారు.
పరిశీలన ముఖ్యం
చిన్నచిన్న పొరపాట్ల వల్ల అభ్యర్థులు ఉద్యోగాలు చేజార్చుకుంటున్నారు. ఓఎమ్మార్ షీట్‌లు అసంపూర్తిగా పూరిస్తున్నారు. తద్వారా పరీక్ష ఎంతబాగా రాసినా ఉపయోగం లేదు. ఓఎమ్మార్ షీట్‌లో అడిగినట్లుగా అభ్యర్థి వివరాలు, పేపర్ కోడ్, హాల్‌టికెట్ నంబర్ వంటి వివరాలు సంపూర్ణంగా నమోదు చేయాలి. వీఆర్‌ఓ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది అభ్యర్థులు ఓఎమ్మార్ షీట్ సరిగా నింపలేదని అధికారులు వెల్లడించారు. దీంతో వీరంతా మార్కులు పొందినా ఉద్యోగాలు రానట్లే. కాబట్టి అభ్యర్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఓఎమ్మార్‌లో వివరాలు పేర్కొనాలి. అంతేగాక కొందరు అభ్యర్థులు ఒరిజినల్ ఓఎమ్మార్ షీట్ ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండా తమ వెంట తీసుకెళ్తున్నారు. ఇలా చేయడం నేరమే కాకుండా భవిష్యత్ తిరిగి పరీక్షకు హాజరయ్యే అవకాశాలు కోల్పోతారు.
స్క్రైబ్స్ (సహాయకులుగా)
చేతులులేని, దృష్టిలోపం, మస్తిష్క పక్షవాతం ఉన్న అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరవుతున్నారు. వీరికి సహాయకులు(స్క్రైబ్)గా పదోతరగతి చదువుతున్న విద్యార్థులను ఏర్పాటు చేస్తారు. ఈ బాధ్యత పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెడెంట్‌కు అప్పజెప్పారు. దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకు గంటకు 10 నిమిషాల అదనపు సమయాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. రెండు పేపర్లకూ అదనపు సమయాన్ని వినియోగించుకోవచ్చు.
సర్వం సిద్ధం
Published Sun, Feb 23 2014 4:16 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement