అధికారులు అప్రమత్తంగా ఉండాలి
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
Published Sat, Sep 24 2016 12:41 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టూటౌన్
భారీ వర్షాల కారణంగా వస్తున్న వరదల వల్ల నష్టాలు జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం రాత్రి నల్లగొండ పట్టణంలోని పానగల్ బైపాస్ రోడ్డు వద్ద వరద నీటిని పరిశీలించారు. వరద ఎక్కడినుంచి వస్తుంది....అద్దంకి – నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపైకి ఎలా వస్తుంది. దీన్ని ఎటువైపు మల్లిస్తే వాహనాలను, ప్రజలకు అంతరాయం కలుగకుండా ఉంటుంది.. అని సంబంధిత వివరాలను ఆర్ అండ్ బీ, ఐబీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు సమీపంలో ఉన్న నలాలు కబ్జా అయ్యాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా కబ్జాకు గురైన నాలాలను తక్షణమే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అద్దంకి – నార్కట్‌పల్లి రోడ్డుపైకి వరద నీరు చేరకుండా తక్షణమే తగిన చర్యలు చేపట్టి కింది ప్రాంతానికి నీటిని పంపించాలని సూచించారు. అనంతరం 39వ వార్డులోని ఎన్‌టీఆర్ నగర్‌లో పర్యటించారు. నలాలను పరిశీలించి వెడల్పు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా పాతబస్తీలోని మోతికుంటను పరిశీలించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణ, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, ఆర్డీఓ వెంకటాచారి, మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, కౌన్సిలర్లు ఆలకుంట్ల నాగరత్నం రాజు, రావుల శ్రీనివాస్‌రెడ్డి, దుబ్బా అశోక్ సుందర్ తదితరులున్నారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 34 చెరువులకు గండ్లు పడ్డాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం నల్లగొండలో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 34 చెరువులు గండ్లు పడగా తక్షణమే 24 చెరువులను పునరుద్ధరించడం జరిగిందన్నారు. గురువారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 9సెంమీ వర్షం పడిందని, దామరచర్ల 24, గుర్రంపోడులో 20 సెం.మీటర్ల చొప్పున అత్యధికంగా కురిసిందన్నారు. అన్ని మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ముగ్గురు మరణించినట్లు సమాచారం అందిందని తెలిపారు. మృతిచెందిన వ్యక్తులకు ప్రభుత్వం తరపున రూ.4లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సరక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగిందన్నారు. వర్షాలకు నానిపోయి కూలీపోయే ప్రమాదమున్న ఇళ్ల నుంచి ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. జిల్లా పోలీసు యంత్రాంగం, రెవెన్యూ, జిల్లా కలెక్టర్ సూచనలను పాటించి అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Advertisement
Advertisement