సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో పండ్ల తోటల సాగుకు కష్టకాలం వచ్చింది. సీజన్‌లో మొహం చూడని వానల కారణంగా పండ్ల తోటలు భవిష్యత్‌లో పుట్టెడు కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలోనే బత్తాయి సాగులో ప్రథమస్థానంలో ఉన్న జిల్లాలో ఈసారి దిగుబడి తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పండ్ల తోటలకు అవసరమైన తేమశాతం వాతావరణంలో తగ్గడంతో కాత దశలో పెద్దఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక కూడా పంపారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో 25 శాతం భూముల్లో పండ్లతోటలు సాగు చేస్తున్న రైతాంగంలో ఆందోళన నెలకొంది.
వానలు లేవు.. నీళ్లు లేవు
జిల్లాలో దాదాపు 3లక్షలకు పైగా ఎకరాల్లో మామిడి, బత్తాయి, నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఈ పంటల ద్వారా జిల్లాలో యేటా 25.6లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతాయన్నది ఉద్యానవన శాఖ అధికారుల లెక్క. అయితే వర్షాధారంతో పాటు భూగర్భ జలాలు, ముఖ్యంగా వాతావరణంలో తేమ శాతంపై ఆధారపడి పండించే పండ్లతోటలకు ఈసారి ఆ మూడూ లేకుండా పోయాయి. వర్షాలు లేక, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో భూమిలో ఉన్న తేమ శాతం కూడా ఆవిరి అయిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే చాలా చోట్లా పండ్ల తోటల కొమ్ములు ఎండిపోవడం కూడా ప్రారంభమైంది. కనీసం వర్షాలు రెండు, మూడు రోజులకు కూడా పడని సందర్భాలు పదుల సంఖ్యలో ఉండడంతో ఈ సీజన్‌లో పండ్ల తోటల దాహం తీరే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అసలు పండ్లు కాసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. జిల్లాలో సాగులో ఉన్న పండ్ల తోటల్లో 30 నుంచి 70 శాతం తోటల్లో అసలు పండ్లు కాసే పరిస్థితి లేకుండా పోయింది. అప్పుడప్పుడూ వర్షాలు కురువకుండా ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో దాదాపు 50 శాతం పండ్లు రాలే అవకాశాలు కూడా లేకపోలేదు.
తడి లేకపోతే ‘ఇత్తడే’
ముఖ్యంగా జిల్లాలో ప్రధాన పంటలయిన బత్తాయి, నిమ్మ పంటలకు భవిష్యత్ గడ్డు కాలమేనని ఉద్యానవనశాఖ అధికారులే చెబుతున్నారు. ఈ రెండు పంట మొక్కల మధ్యన ఉండే తేమ ఒత్తిడి కారణంగా వేరుకుళ్లు తెగులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు పంటల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వర్షాలు ఇప్పుడు కూడా రాకపోతే ఈ రెండు పంటలు కాసే మార్చి 2015, ఆగస్టు 2015ల్లో భారీ నష్టం జరగనుందని అంచనా. ఈ పరిస్థితుల్లో నీటి ని గ్రహించే తత్వం తక్కువగా ఉన్న జిల్లా భూముల్లో మరో 30 నుంచి 45 రోజుల పాటు వానలు రాకపోతే పెద్ద ఎత్తున పండ్ల రైతులు నష్టపోనున్నారు. ఈ పరిస్థితుల్లో పామ్‌పాండ్స్ కోసం ఇచ్చే సబ్సిడీని విస్తృత పర్చాలని, పండ్ల రైతుందరికీ దీనిని వర్తింపజేయాలని, అదే విధంగా భూమిలోని తేమను ఆవిరి చేయకుండా నివారించే మల్చింగ్ సామగ్రి (పాలిథీన్ మెటీరియల్)ని అందరికీ అందజేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణం
‘తెలంగాణ జిల్లాల్లో 35శాతం పండ్ల తోటలు మన జిల్లాలోనే ఉన్నాయి. కరువు కాటకాలను ఎదుర్కొంటున్న జిల్లా రైతాంగం తక్కువ నీటితో సాగయ్యే పండ్లతోటలను రైతులు ఎంచుకున్నారు. తోటలకు మార్కెటింగ్, కోల్డ్‌స్టోరేజీ, జ్యూస్‌ఫ్యాక్టరీలు లాంటి సౌకర్యాలు కల్పించలేదు. భూగర్భ జలాలను కాపాడే జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో జిల్లాలో గతంలో 4లక్షల ఎకరాల్లో సాగయిన బత్తాయి ఇప్పుడు 2లక్షల ఎకరాలకు వచ్చింది. వాస్తవంగా 500 హెక్టార్లకు ఒక ఉద్యాన అధికారి ఉండాల్సి ఉండగా, జిల్లా మొత్తంలో కూడా ఐదారుగురు లేరు. చీడపీడలను నివారించే సలహాలిచ్చేవారు లేరు. కరువు కారణంగా 2010, 2013లో 50 వేల ఎకరాల బత్తాయి తోటలు పూర్తిస్థాయిలో ఎండిపోయాయి. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు కరువు వచ్చినా చెరువులు లేదా కుంటలు నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టలేదు. అందుకే ఇప్పుడు బత్తాయి రైతు, పండ్ల తోటల రైతు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.’
- మల్లు నాగార్జున్‌రెడ్డి,
పండ్లతోటల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడ్డుకాలమే..!
Published Mon, Nov 10 2014 5:44 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement