హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కోరగా.. ఆ విషయంలోనూ ఊరట ఇవ్వలేదు. దీంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది.
వాస్తవానికి క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కేటీఆర్(KTR)కు ఊరట ఇచ్చింది. తీర్పు ఇచ్చేంతవరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని కోర్టు దర్యాప్తు సంస్థలకు సూచించింది. దీంతో ఇవాళ్టి వరకు ఎలాంటి చర్యలకు అవి ఉపక్రమించలేదు. మరోవైపు.. ఈ కారణం చూపిస్తూనే ఆయన దర్యాప్తు సంస్థల నుంచి విచారణ విషయంలో ఊరట కోరారు.
అయితే తాజా తీర్పు నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ బీఆర్‌ఎస్(BRS Party) శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.
కోర్టు తీర్పు అనంతరం బంజారాహిల్స్ నందినగర్(Nandi Nagar)లోని కేటీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. తీర్పు వేళ ఆయన సోదరి కవితతో పాటు హరీష్‌రావు, మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు అక్కడికి చేరుకుని కేటీఆర్‌తో మంతనాలు జరుపుతున్నారు. అయితే.. ఈ తీర్పును సవాల్ చేసే యోచనలో బీఆర్‌ఎస్ లీగల్ టీం ఉన్నట్లు సమాచారం.
హైకోర్టు ఉత్తర్వుల కాపీ ఇంకా అందలేదు. సాయంత్రంలోపు అందే అవకాశం ఉంది. అవి అందాక తదుపరి చర్యలపై ఆలోచన చేస్తాం అని లీగల్ టీం ప్రకటించింది. మరోవైపు..
ఏసీబీ(ACB) ఇప్పటికే ఆయన్ని 9వ తేదీన విచారణకు రావాలంటూ రెండోసారి నోటీసులు పంపింది. తన వెంట లాయర్‌ను అనుమతించకపోవడంతో సోమవారం ఆయన విచారణకు హాజరుకాకుండానే ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణ టైంలోనే కేటీఆర్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఆయన్ని ఈ కేసులో ఈడీ సైతం విచారణ జరపాల్సి ఉంది. తాజాగా.. హైకోర్టు క్వాష్ కొట్టేయడంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: కేటీఆర్ క్వాష్ కొట్టివేత, హైకోర్టు ఏం చెప్పిందంటే..
Comments
Please login to add a commentAdd a comment