యాచారం,న్యూస్‌లైన్: కష్టపడి పనులు చేసి పస్తులుంటున్నాం.. వెంటనే బకాయిలు చెల్లించాలని ‘ఉపాధి’ కూలీలు ప్రజాదర్బార్‌ను ముట్టడించారు. సోమవారం తక్కళ్లపల్లి, పిల్లిపల్లి గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు బకాయిల చెల్లించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజాదర్బార్‌ను ముట్టడించారు. వెంటనే బకాయిలు చెల్లించాలని ఎంపీపీ చాంబర్‌లో మండల ప్రత్యేకాధికారి అజయ్‌కుమార్ ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. అంజయ్య మాట్లాడుతూ.. మండలంలో పలు గ్రామాల్లో కూలీలకు అందాల్సిన బకాయిలు రూ. 30 లక్షలకు పైగానే ఉన్నాయన్నారు. పలుమార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేదని మండిపడ్డారు. ఓ బ్యాంక్ పేదల డబ్బులను స్వాహా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేకాధికారి అజయ్‌కుమార్, ఈజీఏస్ నాగభూషణాన్ని పిలిపించుకొని బకాయిల వివరాల గురించి తెలుసుకున్నారు. వెంటనే బకాయిలు కూలీలకు అందేలా కృషి చేయాలని సూచించారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ప్రత్యేకాధికారి హామీ ఇవ్వడంతో కూలీలు శాంతించి ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా కూలీలు అధికారులకు వినతి పత్రం అందజేశారు.
పస్తులుంటున్నాం.. పైసలివ్వండి
Published Tue, Feb 11 2014 2:02 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement