ఖమ్మం, న్యూస్‌లైన్ : వలసల నివారణ, కూలీలకు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లాలో మిథ్యగా మారింది. ఈజీఎస్‌లో పనిచేస్తున్న పలువురు అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు సకాలంలో వేతనం అందక పోవడం, జీరోమాస్ కంపెనీల చేతివాటంతో వేలాది రూపాయలు గల్లంతు కావడంతో.. కూలీలు డబ్బుల కోసం వారి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
ఇలా విసిగి వేసారి.. చివరకు ఉపాధి పనులంటేనే చిరాకు పడుతున్నారు. దీనికి తోడు సగటున రోజు కూలీ రూ.149 ఇవ్వాల్సి ఉండగా, అధికారులు రూ.100కు మించి ఇవ్వడం లేదు. దీంతో మరో 55 రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. ఇప్పటి వరకు 70 శాతం పనులు కూడా చేపట్టలేదు.
లక్ష్యానికి దూరంగా...
ఉపాధి హామీ పనుల్లో జిల్లా ఘోరంగా వెనుకబడింది. జిల్లాలో 5,82,759 జాబ్ కార్డులు ఉండగా, 14,41,083 మంది కూలీలు పనిచేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని అన్ని మండాలాల్లో 1.75 కోట్ల పనిదినాలు కల్పించాలని, ఇందుకు ప్రతి ఒక్కరికి రోజుకు రూ.137 చొప్పున రూ. 385 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే ఫిబ్రవరి నాలుగో తేదీ నాటికి జిల్లాలో 1.09 కోట్ల పనిదినాలు కల్పించి, రూ. 112 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వీటితో పాటు మరో రూ. 86 కోట్లు వివిధ రకాల పనిముట్ల కొనుగోలు, ఇతర ఖర్చులకు ఉపయోగించారు. అంటే మార్చి చివరి నాటికి ఇంకా సుమారు 65 లక్షల పనిదినాలు కల్పించి వాటి ద్వారా రూ.190 కోట్ల ఖర్చు చేయాల్సింది. ఇంతకాలం ఖర్చు చేయని నిధులు ఈ 55 రోజుల్లో ఏవిధంగా వినియోగిస్తారో అధికారులకే తెలియాలి.
అలాగే జిల్లాలో 1,13,765 ఎస్సీ, 2, 21,265 ఎస్టీ కుటుంబాలకు జాబ్ కార్డులు ఉండగా ఫిబ్రవరి నాటికి ఎస్సీలకు 85 వేలు, ఎస్టీలు 2.12 లక్షల మంది కూలీలకు మాత్రమే పని కల్పించారు. రాష్ట్రంలో ప్రతి మనిషికి రోజు కూలి రూ. 149 చెల్లించాలని నిబంధన ఉండగా, అధికారులు దీనిని రూ. 137కు కుదించారు. అందులోనూ సగటున రూ. 102 -37 పైసలు మాత్రమే చెల్లించారు.
వీటితో పాటు ప్రతి కుటుంబానికి 100 రోజుల పనికల్పించాలనే నిబంధన ఉండగా, వీటిని 150 రోజులకు పెంచాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే జిల్లా అధికారులు మాత్రం ఇప్పటి వరకు కుటుంబానికి సగటున 42.49 రోజుల పనిదినాలు మాత్రమే కల్పించడం గనమార్హం. జిల్లాలో కేవలం 19,487 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పనిని పూర్తి చేశాయి.
పనుల పట్ల కూలీల వెనుకడుగు..
ఉపాధి పని అంటేనే జిల్లాలోని కూలీలు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో 29 మండలాలు గిరిజన ఆవాస ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసించే గిరిజను లు రోజువారీగా పనిచేస్తేనే కుటుంబాలు గడిచే పరిస్థితి ఉంది. అయితే ఉపాధి కూలీకి వెళ్తే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియడం లేదు. మస్టర్‌లలో తప్పులు, ఇష్టానుసారంగా కొలతలు వేస్తుండడంతో చేసిన పనికి సరైన కూలి కూడా రావడం లేదు. అలాగే జీరోమాస్ అధికారుల చేతివాటంతో జిల్లాలో ఏళ్ల తరబడి కోట్లాది రూపాయలు కూలీలకు అందడం లేదు.
పనులు చేసి డబ్బు కోసం తిరగడం కంటే తక్కువ కూలీ వచ్చినా.. ఇతర పనులకు వెళ్లడమే మేలని కూలీలు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పనికి తగిన వేతనం చట్టాన్ని అమలు చేయడంతోపాలు డబ్బు పంపిణీలో జాప్యాన్ని నివారిస్తే తప్ప.. ఉపాధి హామీ పథకం పేదల ఆకలి తీర్చదని, వలసల నివారణ ఆగదని పలు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఉపాధి మిథ్యే..?
Published Fri, Feb 7 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement
Advertisement