‘ఉపాధి’లో జాతీయ రికార్డు | 'Employed' in the national record | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో జాతీయ రికార్డు

Published Fri, Apr 1 2016 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

‘ఉపాధి’లో జాతీయ రికార్డు

‘ఉపాధి’లో జాతీయ రికార్డు

లక్ష కుటుంబాలకు వంద రోజుల పనిఅరుదైన ఘనత సాధించిన విశాఖ పనులు తక్కువ.. పనిదినాలెక్కువ5.62 లక్షల మందికూలీలకు పనులు  రికార్డు స్థాయిలో   2.96 లక్షల పనిదినాలు

 

విశాఖపట్నం:జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో విశాఖ జిల్లా అరుదైన ఫీట్ సాధించింది. అత్యధిక కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించిన జిల్లాగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఎక్కువమంది కూలీలకు పనులు కల్పించడమే కాదు.. అత్యధిక పనిదినాలు కల్పించిన జిల్లాగా కూడా విశాఖ ఖ్యాతినార్జించింది.
 

 జిల్లాలో 4,70,162 కుటుంబాలకు జాబ్ కార్డులుండగా..38,550 శ్రమశక్తి సంఘాలున్నాయి. వాటి పరిధిలో 7,17,597 మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పనుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ పనిదినాలు కల్పించడంలో మాత్రం కొత్త రికార్డులు నెలకొల్పగలిగారు. కాగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.157 కోట్లకు రూ.57 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. ఈ ఏడాది రూ.298 కోట్లకు రూ.159 కోట్లను మాత్రమే ఖర్చు చేయగలిగారు. గతేడాది వంద కోట్లు మురిగి పోగా.. ఈఏడాది రూ.141 కోట్లు మురిగిపోయినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. అయిన ప్పటికీ పనులు కల్పించడంలో మాత్రం ఆలిండియా రికార్డును సాధించారు. ప్రస్తుతం 50 వేలకు పైగా పనులు జరుగుతుండగా.. రోజుకు 1.80 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
 

గతేడాది పనితీరు..
2014-15 ఆర్థిక సంవత్సరంలో 3.03 లక్షల కుటుంబాలకు చెందిన 5.44 లక్షల మంది కూలీలకు పనులు, లక్షా 95 వేల పనిదినాలు కల్పించారు. వేతనాల రూపంలో వీరికి రూ.236 కోట్లు చెల్లించారు. గతేడాది ప్రతి కుటుంబానికి గరిష్టంగా 64 రోజుల పనికల్పించగా.. ఒక్కో కూలీ రూ.121కు తక్కువ కాకుండా సరాసరి వేతనం పొందగలిగారు.

 

ఈ ఏడాది అన్నీ రికార్డులే..

2015-16 ఆర్థిక సంవత్సరంలో 3.13 లక్షల కుటుంబాలకు చెందిన 5,62,315 మంది కూలీలకు ఏకంగా 2.26 లక్షల పనిదినాలు కల్పించి వేతనాల రూపంలో రూ.299 కోట్లను పొందేలా చేశారు. ఈ ఏడాది ప్రతి కుటుంబానికి సరాసరిన 72 రోజులు పని కల్పించగా, ఒక్కో కూలీ సరాసరిన రూ.132.13 చొప్పున వేతనం పొందగలిగారు. లక్షా 575 కుటుంబాలకు వంద రోజుల పనులు కల్పించిన ఏకైక జిల్లాగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశంలోనే అరుదైన రికార్డును నెలకొల్పింది.

 

 
ఉపాధి హామీ సిబ్బందికి అభినందనలు

అత్యధిక కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించిన ఏకైక జిల్లాగా విశాఖ రికార్డు పుటల్లోకి ఎక్కడం ఆనందంగా ఉంది. ఇందుకోసం ఈ ఏడాది ఉపాధి హామీ సిబ్బంది కృషి అభినందనీయం. ముఖ్యంగా పనుల గుర్తింపు.. ప్రణాళికాబద్ధంగా పనులు కల్పించడంలో పీడీ శ్రీరాములు నాయుడు కృషి ప్రశంసనీయం.    -డాక్టర్ ఎన్.యువరాజ్, కలెక్టర్

 

చాలా ఆనందంగా ఉంది
వంద రోజుల పనిదినాలు కల్పించడంలో జిల్లా రికార్డు సృష్టించడం ఆనందంగా ఉంది. క్షేత్ర స్థాయిలో పనిచేసే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్‌తో సహా ఉపాధి హామీలో పనిచేసే సిబ్బంది సమష్టి కృషి ఇది. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా పనిచేస్తాం.

-శ్రీరాములు నాయుడు, పీడీ, డ్వామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement