ఉపాధి పనుల్లో కూలీలు
పుడమితల్లిని నమ్ముకున్న అన్నదాతను అనుక్షణం కష్టాలు వెంటాడుతున్నాయి..వరుణదేవుడు కరుణ చూపకపోవడం..ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కుదేలవుతున్నాడు.పది మందికి అన్నం పెట్టి పోషించిన రైతులే నేడు కుటుంబీకులను పోషించడానికి కూలి బాట పడుతున్నారు.
సాక్షి కడప : కరువు రక్కసి కాటు నుంచి అన్నదాతలు కోలుకోలేకపోతున్నారు. పంటలు పండక..అప్పుల పాలై..ఉపాధి కోసం కొందరు ఉన్న ఊరు వదిలి వలస వెళితే.. మరికొందరు ఇక్కడే ఉపాధి వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు బాగా బతికిన రైతు కుటుంబాలు కూడా కరువు కోరల్లో చిక్కి తల్లడిల్లిపోతున్నాయి. పెద్ద రైతులు సైతం కూలీబాట పడుతుండటం బాధాకరం. ప్రభుత్వాలు ఆదుకోనంత కాలం..పాలకులు పాలసీలలో మార్పులు తేనంత కాలం అన్నదాత ఏదో ఒక సమస్యతో కునారిల్లి చేసేదిలేక వద్దురా ఈ వ్యవసాయమంటూ తప్పుకుంటున్నారు.
జిల్లాలో 5.50లక్షల నుంచి 6లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రకృతి సహకరించకపోవడం..వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోవడం.. పనులకు యాంత్రీకరణ ఖర్చులు పెరగడం.. తెగుళ్లు, చీడ, పీడలతో లాభసాయం లేకపోగా అన్నదాతకు అప్పులు చేతికొస్తుండటంతో వ్యవసాయంపై అనాసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా వరుస కరువులు కూడా వారిని ప్రత్యామ్నాయం వైపు నడిపించాయి. అనేక పల్లెల్లో చాలామంది వలసబాట పట్టగా.. మరికొంతమంది పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకంవైపు అడుగులు వేశారు. ఉపాధి హామీ పథకం ఉన్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్లకుండా స్థానికంగా కొందరు కూలీలుగా మారి దినసరి పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి.
కరువు పాట.. ఉపాధి బాట..
జిల్లాలో వరుస కరువుల వల్ల అన్నదాత ఉపాధి వైపు అడుగులు వేశాడు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా మారిపోయారు. 3ఎకరాల నుంచి 10ఎకరాల ఉన్న వారు కూడా ఉపాధి పనులకు వెళుతున్నారు. పొలంలో ఎంత కష్టపడినా లాభాలు రాకపోవడంతో ఉపాధి పనులు చేసుకుంటే రూ.180లనుంచి రూ.200ల వరకు గిట్టుబాటు అవుతుందని పలుగు, పార చేత పట్టారు. ఒకప్పుడు ఐదారు ఎకరాల పొలం ఉన్న అసామి రోజు 20, 30మంది కూలీలతో పనులు చేయించేవారు. ప్రస్తుతం తానే పనులు చేసే పరిస్థితికి కాలం నడిపించింది.
కలిసిరాని వ్యవసాయం
అన్నదాతకు వ్యవసాయం కలిసి రాకుండా పోతోం ది. ఒకప్పుడు ఎకరా, రెండుఎకరాలు ఉంటే జీవ నం గడిచే పరిస్థితి. ప్రస్తుతం 10ఎకరాలు ఉన్నా కూడా కుటుంబం గడవడం గగనంగా మారింది. ఒకప్పుడు పశువులు, ఎద్దులతో కళకళలాడిన పల్లెలు నేడు కళావిహీనంగా మారుతున్నాయి.
రైతుల గోడు పట్టని ప్రభుత్వం
నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. వర్షాలు సక్రమంగా కురవక పోవడం, పంటలు పండడక పోవడంతో ఉపాధి కూలీ పని చేస్తూ బతకాల్సిన పరిస్థితి. నాతో పాటు భార్య, కుటుంబ సభ్యులు మొత్తం నలుగురు గంగమ్మ తల్లి గ్రూపు జాబ్‌కార్డు నెంబర్ 6010101లో పని చేసుకుటున్నాం. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా సహాయం అందిచడం లేదు. రైతుల గురించి పట్టించుకోవడం లేదు.ఉపాధి కూలీ పనికి వెళ్లాలంటే పెద్ద రైతులకు సిగ్గుగా ఉంది. కానీ పరిస్థితుల కారణంగా తప్పడంలేదు.
–ఎం.లక్ష్మినారాయణరెడ్డి, పెండ్లిమర్రి మండలం చెన్నంరాజుపల్లె గ్రామం
ఉపాధి పనులకు వెళుతున్నా
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 60 రోజులు దాటినా చినుకు జాడ లేదు. పొలాల్లో పనులు లేకపోవడంతో ప్రతిరోజు ఉపాధి పనికి వెళుతున్నా. నాకున్న మూడు ఎకరాల పొలంలో పత్తి, వరి సాగు చేస్తాను. ఈఏడాది ఇప్పటి వరకు పదునైన వాన పడకపోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. పత్తిపంట అదును దాటిపోతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – రవీంద్రారెడ్డి, రైతు, రాజుపాళెం
Comments
Please login to add a commentAdd a comment