రైతు కూలీలు జీవనం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే పనులు కల్పించేందుకు గాను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అమలులో నిర్లక్ష్యం కారణంగా కూలీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. పనులకు వెళ్లినా సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా బిల్లులు మంజూరు కాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పెండింగ్ బిల్లుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
చిత్తూరు అగ్రికల్చర్: జిల్లాలో 22,018 శ్రమ శక్తి సంఘాలున్నాయి. వాటి పరిధిలో 3,54,985 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ఇందులో మహిళలు 1,93,364 మంది, పురుషులు 1,61,621 మంది ఉన్నారు. 2,15,554 కుటుంబాలు ఉపాధి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అందులో ఇప్పటివరకు 20,288 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో రూ.641.67 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 260.59 కోట్ల మేరకు వెచ్చించారు.
అందని వేతనాలు
గత నెల 26వ తేదీ నుంచిఇప్పటివరకు ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 49,793 మంది కూలీలకు 5.54 లక్షల పనిదినాలకు గాను రూ.16,04,04,475 మేరకు పెండింగ్‌లో ఉన్నాయి. అదేగాక మెటీరియల్ కాంపొనెంట్ కింద ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.40.76 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్కన కూలీల వేతనాలు, మెటీరియల్ కాంపొనెంట్ కలిపి రూ.56.80 కోట్ల మేరకు ఉపాధి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదు వారాలుగా ఉపాధి వేతనాలు చేతికందకపోవడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు వారాల్లో సంక్రాంతి పండుగ వస్తున్నందున ఇప్పటి నుంచే గుబులు పట్టుకుంది. అప్పటికైనా వేతనాలు చేతికందేనా అన్న ఆందోళనలో కూలీలు కొట్టుమిట్టాడుతున్నారు.
పనులు అంతంత మాత్రమే
ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించడం అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఏడాదికి గాను రూ.641.67 కోట్లు వెచ్చించి 1,24,012 పనులు చేపట్టాల్సి ఉంది. అందులో ఇప్పటివరకు 75,961 పనులు మాత్రమే చేపట్టారు. వాటిలో 30,896 పనులు పూర్తి చేయగా, 45,065 పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. ఇందుకుగాను ఇప్పటివరకు రూ.260.59 కోట్లు మాత్రమే వెచ్చించారు. ఉపాధి పనుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన మేరకు లక్ష్యాలను అధిగమించలేకపోతున్నారు. రోజుకు కనీసం లక్ష మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తెలుపుతోంది. ఆచరణలో కనిపించడం లేదు. రోజుకు కేవలం 49 వేల మంది మాత్రమే ఉపాధి పనులకు వస్తున్నట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి.
పనుల్లేక .. వేతనాలు అందక
ఉపాధి హామీ పనుల వేతనాలు వారాల తరబడి రాకపోవడంతో కూలీలు ఆర్థికంగా చితికిపోతున్నారు. వ్యవసాయ పనులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అవి కూడా తూర్పు మండలాల్లోనే ఉంటున్నాయి. ఈ క్రమంలో కూలీలకు ఆశించిన మేరకు పనులు దొరకడం లేదు. ఉపాధి పనులకు వెళ్లినా వేతనాలు సకాలంలో అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులను మంజూరు చేసి, పనులు విరివిగా కల్పించి, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరో పది రోజుల్లో బిల్లులు వస్తాయి
పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు మరో పది రోజుల్లో మంజూరయ్యే అవకాశముంది. ప్రస్తుతం రబీ సీజన్‌కు వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. దీంతో కూలీలు ఉపాధి పనులకు రావడం కొంతమేరకు తగ్గింది. జనవరి నుంచి ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరుగుతుంది. రోజుకు కనీసం లక్ష మందికి పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.– బి.చంద్రశేఖర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment