నత్తే నయం
బుచ్చిరెడ్డిపాళెం(కోవూరు) : జిల్లాలో 2016–17 ఏడాదికి 11,200 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో శ్లాబులు, పూర్తి అయినవి కలిపి 4,450 ఉన్నాయి. రూఫ్‌లెవల్‌లో 888 ఉండగా, బేస్‌మట్టానికే పరిమితమయినవి 2,264 ఇళ్లు ఉన్నాయి. అసలు నేటికీ ప్రారంభించకుండా 2,992 ఇళ్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే గృహాల నిర్మాణం ఏ మేరకు జరుగుతుందో తెలుస్తోంది.
ఇల్లు కట్టి చూడు...పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. దీనికి ప్రకారం ఇళ్లు కట్టడం ఎంత కష్టమో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిరుపేదలు ఇల్లు కట్టుకోవడం అంత సులువుకాదు. దీనికి తోడు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది రూ.1.5 లక్షలు మాత్రమే. అందులోను రూ.95వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. రూ.55 వేలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు నేటికీ లబ్ధిదారుల ఖాతాల్లో జమకాలేదు.
పెరిగిన ధరలతో బెంబేలు
ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇటుక, ఇసుక, ఇనుము, సిమెంట్ ధరలు ఆకాశాన్నంటాయి. రెండేళ్లలో ధరలు గణనీయంగా పెరిగాయి. వెయ్యి ఇటుకపై రూ.1,000 పెరిగింది. సిమెంట్‌పై బస్తాకు రూ.50 నుంచి రూ.100 పెరిగింది. ఇనుముపై టన్నుకు రూ.7వేల నుంచి రూ.10వేలకు పెరిగింది. ఇక లారీ ఇసుక రూ.25వేలు పలుకుతోంది. ఈ క్రమంలో రూ.1.5 లక్షలతో ఇళ్లు ఎలా పూర్తి చేయాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల జాడేదీ?
ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.95 వేలు ఇవ్వగా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారుడికి రూ.55వేలు రావాలి. రెండు కలిపి రూ.1.5 లక్ష మంజూరు చేస్తారు. అయితే రూ.95వేలు మంజూరులో జాప్యం లేకపోయినా ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులపై నేటికీ స్పషత లేదు. జిల్లాలో రూ.50 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉంది. నేటికీ వీటిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోలేకుంది.
అప్పుల బాటలో లబ్ధిదారులు
పేరుకే ఎన్టీఆర్ గృహాలే తప్ప పునాదుల నుంచి లబ్ధిదారులు అప్పుల వేటలో పడాల్సిందే. పునాదులు తవ్వడం మొదలు బేస్‌మట్టం కట్టే వరకు అయ్యే ఖర్చు సైతం అప్పు చేయాల్సిందే. బేస్‌మట్టం కట్టిన తరువాత వచ్చే బిల్లు తీసుకుని అప్పు చెల్లించినా, మళ్లీ రూఫ్ లెవల్ నిర్మాణం వరకు అప్పు చేయాల్సిందే. అనంతరం శ్లాబు నిర్మాణానికి బయట అప్పు తెచ్చి నిర్మించి బిల్లు వచ్చిన తరువాత వడ్డీతో సహా కట్టాల్సిందే. ఇలా ఇళ్లు నిర్మించేందుకు లబ్ధిదారుడు అప్పుల బాటలో నడవాల్సిన దౌర్భాగ్యం తలెత్తింది.