సాక్షి, అమరావతి: పచ్చిమేత కొరతతో పాల దిగుబడి తక్కువగా వస్తున్న నేపథ్యంలో.. ఆ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పశువులకు అవసరమైన మేతలో కేవలం మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొరతను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలు పచ్చిమేత సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశాయి. ఫలితంగా పచ్చిమేత సాగు చేసే రైతులు మూడేళ్ల పాటు రాయితీ పొందవచ్చు. పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.గంగునాయుడు పచ్చిమేత సాగుపై పలు విషయాలను వెల్లడించారు.
ఖరీఫ్ సీజనే అనువు..
పచ్చిమేత సాగునకు ఖరీఫ్ సీజనే అనువైనది. పాడి రైతులు అధిక దిగుబడిని ఇచ్చే పచ్చిమేతల్లో సూపర్ నేపియర్‌తో పాటు అజొల్లా, హైడ్రోపోనిక్స్‌ను సాగు చేసుకోవచ్చు. వ్యవసాయ పంటల సాగుకు పనికిరాని భూమిని పచ్చిమేత కోసం ఉపయోగించుకోవచ్చు. పచ్చిమేత పుష్కలంగా ఉంటే ఐదు లీటర్ల పాలిచ్చే పశువుకు మరింకే దాణా వేయాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా పశు పోషణలో 70 శాతం ఖర్చు మేపుదే. అవిశ, సుబాబుల్ లాంటి చెట్లను నాటిన నాటి నుంచి 40, 50 రోజుల్లోపు పది కిలోల గడ్డి అందుబాటులోకి వస్తుంది. సూపర్ నేపియర్ అన్ని విధాలా మంచిది. ఎకరానికి సాలీనా వంద నుంచి 120 టన్నుల దిగుబడి సాధించవచ్చు. ఆరేడు కోతలు కోయవచ్చు. ఒకసారి నాటితే 6 ఏళ్ల వరకు ఢోకా ఉండదు. పాడిరైతులు నేపియర్ గడ్డి కణుపుల కోసం కృష్ణా జిల్లా గన్నవరం, తిరుపతిలోని పశువైద్య కళాశాల ఫారాలను, గరివిడి వ్యవసాయ క్షేత్రం అధికారులను సంప్రదించవచ్చు. భూమి తక్కువగా ఉన్న రైతులు ధాన్యపు, పప్పుజాతి పశుగ్రాసాలను 2:1 నిష్పత్తిలో మిశ్రమ పంటగా సాగు చేయవచ్చు. జొన్న, అలసందలతో కలిపి పశుగ్రాసాలను పెంచవచ్చు.
ప్రభుత్వ సాయం ఇలా..
పాడి రైతులు పచ్చిమేతను పెంచుకోవడానికి ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ ఏడాది దాదాపు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి ప్రోత్సాహకాలు అందజేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. పశుసంవర్థక శాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తే గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. లబ్ధిదారులు నిర్ణీత ప్రాంతంలో మూడేళ్లు పచ్చిమేతను పెంచాలి. ఈ కాలంలో ఉపాధి హామీ నిధుల నుంచి ఎకరానికి రూ.77,204 వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. మూడేళ్లలో 18 కోతలపాటు పశుగ్రాసం పాడిరైతుకు అందుబాటులోకి వస్తుంది. తొలి విడతగా రూ.35,204, మిగతా రెండు విడతల్లో రూ.21 వేల చొప్పున లబ్ధిదారునికి ప్రభుత్వ సాయం అందుతుంది.
పశుగ్రాసానికి 'ఉపాధి' ఊతం
Published Thu, Sep 2 2021 3:35 AM | Last Updated on Thu, Sep 2 2021 3:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment