ఖమ్మం, న్యూస్‌లైన్ : వలసలు నివారించడంతో పాటు కూలీలకు పని కల్పించేదుకు ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లాలో మిథ్యగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు పనులు చేసినా సకాలంలో డబ్బులు రాక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. నెలల తరబడి నిరీక్షించినా డబ్బులు ఎప్పుడొస్తాయో..? అసలు వస్తాయో.. ? రావో..? అనే అనుమానం వారిని వేధిస్తోంది. దీంతో గత్యంతరం లేక తక్కువ కూలీకి ఇతర పనులకు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి విడుదలైన డబ్బును కూలీలకు అందించకుండా కాజేసిన పలువురు జీరోమాస్ సిబ్బందిపై పోలీసు కేసులు పెట్టి రికవరీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు.
అందని కూలి.. తప్పని అవస్థలు..
జిల్లాలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు గత ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఏడాది రెండు నెలల డబ్బులు అందక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి తోడు, ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో డబ్బు విడుదల కాకపోవడంతో పంపిణీ నిలిచిపోయినట్లు తెలిసింది. పనిచేసిన వారం రోజుల్లో కూలి డబ్బులు ఇవ్వాలని ఒక వైపు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా.. జిల్లా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. బూర్గంపాడు మండలంలోని 1800 మంది కూలీలకు రూ.6 లక్షలు, పినపాక మండలంలోని 1700 మంది కూలీలకు రూ. 17లక్షలు పంపిణీ చేయకుండా జీరోమాస్ సిబ్బంది కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మొత్తాన్ని వరంగల్‌లోని ఎపీఎన్‌జీవీబీ ప్రదాన కేంద్రం నుంచి జీరో మాస్ సంస్థ డ్రా చేసింది. అయితే వాటిని కూలీల ఖాతాల్లో జమచేయలేదు. వైరా మండలంలో గత ఏడాది మే 15 నుంచి జూన్ 12 వరకు 9 గ్రామపంచాయితీల్లో 243 మంది కూలీలకు రూ.1.40 లక్షలు వేతనాలు చె ల్లించాల్సి ఉంది. ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామ పంచాయితీలో 250 మంది కూలీల వేతనాలు రూ.57 వేలు చెల్లించలేదు. వీటిని ఓ కస్టమర్ సర్వీస్ కో ఆర్డినేటర్ (సీఎస్‌సీ- వీరిని జీరోమాస్ సంస్థ నియమించింది) వాడుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి సదరు సీఎస్‌సీపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం.
అలాగే జూలూరుపాడు మండలంలో 3200 మంది కూలీలకు 14 వారాలకు సంబంధించిన రూ.8 లక్షలు నగదు చెల్లించాల్సి ఉంది. దమ్మపేట మండలం గణేష్‌పాడులో రూ.2 లక్షలు, నాచారంలో రూ.లక్ష కూలీలకు చెల్లించకుండానే మాయమయ్యాయి. గణేష్‌పాడులో ఆ డబ్బు తీసుకున్న సీఎస్‌సీ కూలీలకు పంచకుండానే మృతిచెందింది. దీంతో ఆ నిధులు ఏమయ్యాయో అధికారులకే తెలియాలి. నాచారంలో సీఎస్‌సీ విధుల నుంచి తప్పుకున్నాడు. అయితే అతడి నుంచి ఈ మొత్తం రికవరీ చేయలేదు.
చింతూరు మండలంలో 2014 ఏప్రిల్ చివరి నాటికి సుమారు రూ. 72 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎంత పంపిణీ చేశారో అధికారులకే అంతుపట్టడం లేదు. భద్రాచలం మండలంలో ఈఏడాది మార్చి 4 నుంచి ఇప్పటివరకు 5500 మంది కూలీలకు రూ 77.67 లక్షలు అందజేయాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 9 వరకు కూలీలకు ఇవ్వాల్సిన సుమారు రూ.56 లక్షల వేతనాలు స్మార్ట్‌కార్డుధారులకు ఇచ్చేందుకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెపుతున్నారు. కానీ నేటికి ఒక్కరికి కూడా వేతనాలు మంజూరు చేయలేదు. ఇలా జిల్లాలోని పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల పరిధిలో గత సంవత్సరం డబ్బులు ఇప్పటికీ అందలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వారం రోజుల్లో అందజేస్తాం: డ్వామా పీడీ
ఉపాధి కూలీలకు అందాల్సిన డబ్బును వారం రోజుల్లో అందజేస్తామని డ్వామా పీడీ వెంకటనర్సయ్య తెలిపారు. గత రెండు నెలలుగా జిల్లాలో సుమారు రూ. 1.45 కోట్ల చెల్లింపులు నిలిచి పోయాయని చెప్పారు. వీటిని సకాలంలో అందించేందుకు సీఆర్‌డీ(కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్) దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 65లక్షలు జీరోమాస్ సిబ్బంది నిర్లక్ష్యంతో పంపిణీ చేయలేదన్నారు. దీనిపై రాష్ట్ర అధికారులు జీరోమాస్ సంస్థ నిర్వాహకులపై పోలీసు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.
పనిచేసినా పస్తులే..
Published Mon, May 12 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement
Advertisement