ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ఏటా రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. దేశం మొత్తమ్మీద 2019 –20 ఆర్థిక ఏడాదిలో రూ.68,300 కోట్లు ఖర్చు జరిగితే, ఈ ఏడాది ఇప్పటికి రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ పథకం కింద చేపట్టిన పనులు సక్రమంగా జరిగాయా లేదా అని నిర్ధారించుకోవడానికి ఏడాదికి రెండుసార్లు గ్రామస్తుల సమక్షంలో గ్రామ సభ నిర్వహించి చర్చించాలి. కానీ చాలా రాష్ట్రాల్లో ఏడాదికి ఒక్కసారి కూడా సామాజిక తనిఖీ జరగడం లేదు. మన రాష్ట్రంలో మాత్రం ప్రతి గ్రామంలో ఏడాదికి ఒకసారి కచ్చితంగా ఆడిట్ జరుగుతోంది.
పాలనలో పూర్తి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్రంలోని గ్రామాల్లో జరిగే ఉపాధి హామీ పనుల ఆడిట్ ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏడాది కొకసారి కాకుండా ఎప్పుడు జరిగే పనులపై అప్పుడే.. గరిష్టంగా పని జరిగిన నెల రోజుల్లోపే ఆడిట్ పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమల్లోకి రానుంది.
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరిగిన పనులకు ప్రభుత్వం విడుదల చేసే కూలి డబ్బులు.. ఎక్కడా అవినీతికి తావులేకుండా అసలైన లబ్ధిదారులకు చేరాయా? లేదా? జరిగిన పని నాణ్యతతో చేశారా.. లేదా? అన్న అంశాలపై సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో.. వివిధ రాష్ట్రాల్లో సోషల్ ఆడిట్ నిర్వహణపై రాష్ట్రాల వారీగా మార్కులను కేంద్రం ప్రకటించింది. సమావేశానికి ముందు కేంద్రం నిర్దిష్ట పద్ధతిలో అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం తెప్పించుకుంది, ఆ సమాచారాన్ని విశ్లేషించి ఆయా రాష్ట్రాల్లో సోషల్ ఆడిట్ అమలు ఆధారంగా మార్కులు కేటాయించింది. సోషల్ ఆడిట్ అమల్లో రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులు, అందుకోసం సిబ్బంది నియామకం, వారికి అందజేస్తున్న శిక్షణ తదితర అంశాల వారీగా కేంద్రం రాష్ట్రాల పనితీరును అంచనా వేసింది.
ఆడిట్‌కు నాంది పలికిన వైఎస్సార్
2006లో ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టినప్పుడు దేశంలో ఎక్కడా సోషల్ ఆడిట్ విభాగాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తొలిసారిగా ఈ విధానానికి నాంది పలికారు. గ్రామ స్థాయిలో సామాజిక తనిఖీ నిర్వహించేందుకు 15,856 మంది మహిళలను విలేజ్ రిసోర్స్ పర్సన్లుగా నియమించి, వారందరికీ శిక్షణ ఇప్పించారు. 575మంది రిసోర్స్ పర్సన్లు కేంద్రం నిర్వహించే 30 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2009లోనే ఈ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు.
94.5 శాతం ఆడిట్ పూర్తి
గత ప్రభుత్వ హయాంలో 2018–19 ఆర్థిక ఏడాదిలో ఉపాధి పనులు జరిగిన ప్రాంతాల్లో అధికారిక లెక్కల ప్రకారం 80.52 శాతం మాత్రమే సోషల్ ఆడిట్ నిర్వహించగా, 2019–20 చివర్లో కరోనా కారణంగా ఇబ్బంది ఏర్పడినా 94.5 శాతం ఆడిట్ పూర్తి చేయడం గమనార్హం. కూలీల ఇళ్లకీ వెళ్లి వివరాలు సరిపోల్చుకునే ప్రక్రియ 2018–19లో 90.9శాతం మేర జరగ్గా, 2019–20లో 96.6 శాతం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో సోషల్ ఆడిట్ ప్రక్రియకు ఏడాదికి రూ.21 కోట్లు ఖర్చుపెట్టగా.. ఇప్పుడు సోషల్ ఆడిట్ స్థాయి పెరిగినప్పటికీ వ్యయం మాత్రం రూ.17 కోట్లకే పరిమితం చేశారు.
ఇతర సంక్షేమ పథకాలకూ వర్తింపు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సోషల్ ఆడిట్ ప్రక్రియను కేవలం ఉపాధి హామీ పథకం అమలుకే పరిమితం చేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ వర్తింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలన్నింటితో పాటు ఇతర పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగానే, ఆయా జాబితాలను ముందుగా సచివాలయ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచి, అనంతరం ఆయా జాబితాల్లోని లబ్ధిదారులపై గ్రామస్తులందరి సమక్షంలో గ్రామసభలో చర్చకు చేపట్టి తుది జాబితా ప్రకటించడం తప్పనిసరి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment