
న్యూఢిల్లీ: కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో పోటీ సంస్థ షావోమీని వెనక్కి నెట్టి.. మళ్లీ అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 29 శాతం మార్కెట్ వాటాను సాధించింది.
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం జూన్ క్వార్టర్లో షావోమీ 28 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానానికి పరిమితమైంది. కొన్నాళ్లుగా దేశీ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్న శాంసంగ్ 2018 అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో రెండో స్థానానికి పడిపోగా.. షావోమీ నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకుంది.
మళ్లీ రెండు క్వార్టర్ల తర్వాత ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో శాంసంగ్ మరోసారి అగ్రస్థానానికి చేరినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనలిస్టు కరణ్ చౌహాన్ తెలియజేశారు. జే సిరీస్ ఫోన్స్, పెద్ద సంఖ్యలో కొత్త మోడల్స్ ప్రవేశపెట్టడం తదితర అంశాలు శాంసంగ్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి తోడ్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో... ముఖ్యంగా రాబోయే పండుగల సీజన్‌లో రెండు సంస్థల మధ్య పోరు పోటాపోటీగా ఉండవచ్చని తెలిపారు.
జూన్ క్వార్టర్‌లో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో వివో 12 శాతం, ఒప్పో 10 శాతం, ఆనర్ 3 శాతం వాటాలను నమోదు చేశాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో (రూ.30,000 పైబడి ధర ఉన్న ఫోన్స్) వన్‌ప్లస్ సంస్థ తొలిసారిగా నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకుంది. పంపిణీ వ్యూహాల్లో మార్పుల కారణంగా టెక్ దిగ్గజం యాపిల్ మార్కెట్ 1 శాతానికి పరిమితమైంది.
ఇటీవలి కాలంలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. మరోవైపు ఫీచర్ ఫోన్ మార్కెట్లో రిలయన్స్ జియో (47 శాతం వాటా), శాంసంగ్ (9 శాతం), నోకియా (8%), ఐటెల్ (6%), లావా (5% వాటా) టాప్ అయిదు స్థానాల్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 18 శాతం మేర, ఫీచర్ ఫోన్ మార్కెట్ 21 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment