minister eetala rajender
-
విలువలు పెంపొందించాలి
మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కల్చరల్ : ప్రస్తుత సమాజంలో మానవవిలువలు, కుటుంబ సంబంధాలు అంతరించిపోయాయని వాటిని పెంపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక సంఘం, తెలంగాణ రంగస్థల సాంస్కృతిక కళాకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలను ఆదివారం స్థానిక కళాభారతిలో ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సినిమాలు, టీవీలలో ప్రసారమయ్యే సీరియల్స్ మానవ విలువలు తగ్గేంచేలా ఉంటున్నాయన్నారు. ప్రభుత్వం కళలు, కళాకారులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు గోపాల్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, జిల్లా అధ్యక్షుడు వంగల సుధాకర్ పాల్గొన్నారు. -
ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలి
మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్: జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇళ్లు కోల్పోయిన ముంపు గ్రామాల ప్రజలను మానవతాద క్పథంతో ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్లంపల్లి ముంపు గ్రామాల పునరావాస కాలనీల మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మొత్తం భూములు కోల్పోయి ఇళ్లు మాత్రమే మిగిలిన వారికి తగిన న్యాయం చేయాలని సూచించారు. ముంపు గ్రామాల ప్రజలకు శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యమానేరు ప్రాజెక్టులో సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ముంపు గ్రామాల ప్రజలకు 15 రోజులు గడువు ఇచ్చి పునరావాస కాలనీలకు తరలించాలని సూచించారు. చెగ్యాం గ్రామంలో 34 ఇళ్ల సమస్య ఉందని, వారికి రీసర్వే ప్రకారం పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, పెద్దపల్లి, కరీంనగర్ ఆర్డీవోలు పి.అశోక్‌కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. తరలివచ్చిన ముంపు గ్రామాల ప్రజలు ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని చెగ్యాం, ముక్కట్రావుపేట, పాశిగాం, కోటిలింగాల ముంపు గ్రామాల ప్రజలు మంగళవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జేసీ శ్రీదేవసేన, జిల్లా అధికారులు నిర్వాసితులతో సమీక్ష నిర్వహించారు. ముంపు గ్రామాలకు చెందిన పలువురు బాధితులు మాట్లాడుతూ తమకు పరిహారం చెల్లించడంలో అన్యాయం జరిగిందని, పరిహారాన్ని పెంచి ఇవ్వాలని కోరారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకుని ప్రభుత్వం చట్టం ప్రకారం తన పని తాను చేసుకపోతుందని, అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్దామని, అందుకయ్యే ఖర్చులను సైతం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. -
క్లీన్‌సిటీకి సహకరించండి
వృత్తుల్లో మార్పులు వస్తున్నాయ్ పరిస్థితులకు తగ్గట్టుగా మారాలి మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కార్పొరేషన్ : కులవృత్తులు, చేతివృత్తుల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా ప్రతిఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పందుల పెంపకందార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎదుగుదల ఉండాలంటే చేసే వృత్తిని అసహ్యించుకోకుండా నూతన పద్ధతులను ఆకళింపు చేసుకోవాలని, కసి, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని అన్నారు. దొంగతనం, మోసం లేకుండా చెమటోడ్చి చేసే ప్రతిపనిలోనూ సంతృప్తి ఉంటుందన్నారు. పందులు నగరంలో తిరగడం వల్ల జబ్బులు వస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ఉందన్నారు. నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడానని, పందులు చంపడం పరిష్కారం కాదని, అందరితో మాట్లాడి పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే మొదటి అడుగువేశామన్నారు. స్థలం సేకరించి ప్రయోగాత్మకంగా ఫాంలు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక కొత్త పద్ధతిలో ముందుకు వెళితే ఫలితాలు వాటంతటవే వస్తాయని తెలిపారు. చేస్తరా..? చూస్తరా..? అనే అనుమానం తమలో కలుగకుండా చేతల్లో చూపించి ఆత్మ విశ్వాసం కల్గిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునే దిశగా మనం నడవాలని, నగరంలో పందులు తిరగకుండా ఫాంలు ఏర్పాటుకు అన్ని సౌకర్యాలతో స్థలం కేటాయిస్తామన్నారు. ఉన్నత చదువులు చదివిన వారికి జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. పందులు, పేదరికం రెండింటికీ విముక్తి కావాలని అన్నారు. పంది మాంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ఎదగాలని పిలుపునిచ్చారు. పందుల ఫాంలతో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ కులవృత్తిలో ఎంతమంది ఉన్నారు..? ఎవరికి ఏం అవసరం ఉంది..? అనే అంశాలపై చర్చిస్తున్నామని తెలిపారు. ఉపాధి బాటవైపు వెళ్లే వారికి రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పందిమాంసం అమ్ముకునేందుకు హైదరాబాద్ తరహాలో లైసెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా సొసైటీగా ఏర్పడాలని కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేషన్ కమిషనర్ డి.కృష్ణబాస్కర్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, నాయకులు కట్ల సతీష్, చొప్పరి వేణు, ఎరుకల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి, మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి, మున్సిపల్ అధికారులు, పందుల పెంపకందారులు పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం
అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాన్యం మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వచ్చే యేడాదిలో రైతులకు రుణ విముక్తి వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం మూడెకరాల భూపంపిణీ నిరంతర ప్రక్రియ రూ.147 కోట్లతోమానేరుపై సస్పెన్షన్ బ్రిడ్జి రూ.70 కోట్లతో బృందావన్ గార్డెన్ నిర్మాణం స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ ముకరంపుర : ప్రజల సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా సుపరిపాలన అందిస్తూ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగం స్ఫూర్తితో అసమానతలు లేని అభివృద్ధికి పాటుపడతామన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన 70వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయజెండాను మంత్రి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలు, ఆదర్శాల సాధనకు మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నిలిచిందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమంతో సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నామని వివరించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ చిన్నదే అయినా.. దేశ చిత్రపటంలో సమున్నత స్థానం సంపాదించుకున్నదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి వచ్చే మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మేడిగడ్డ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.20 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తామని, ఇందులో జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నీటిమట్టం 48 టీఎంసీలకు చేరిన వెంటనే కాకతీయ కాల్వ ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం జిల్లాకు 36 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, యంత్రపరికరాలను రైతులకు అందిస్తోందన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామన్నారు. ఎన్నికల హామీ మేరకు మూడు విడతల్లో రైతులకు రుణమాఫీ చేశామని, వచ్చే ఏడాదిలో పూర్తిగా రుణవిముక్తి కలుగుతుందని చెప్పారు. 19 కరువు మండలాల్లో 50 శాతం సబ్సిడీపై పశువులకు దాణా సరఫరా చేశామన్నారు. ఈ సంవత్సరం 3200 హెక్టార్లలో రూ.2.60 కోట్లతో బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. మిషన్ కాకతీయలో జలకళ చెరువుల పునర్నిర్మాణం ద్వారా కాకతీయుల నాటి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. జిల్లాలో 5939 చెరువులను పునరుద్ధరించనుండగా, మొదటి విడతలో 823 చెరువుల్లో 711 చెరువులు పూర్తయ్యాయని తెలిపారు. రెండో దశలో 1082 చెరువుల్లో 115 చెరువుల్లో పూర్తయ్యాయని, మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో 12 పెద్ద చెరువులను మినీ ట్యాంకు బండ్లుగా తీర్చిదిద్దేందకు రూ.108.21 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో చెరువులు జలకళ సంతరించుకున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వందశాతం మరుగుదొడ్లు రాష్ట్రంలో సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి నియోజకవర్గాల్లో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి స్వచ్ఛ నియోజకవర్గాలుగా ప్రకటించుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలో హుజూరాబాద్‌ను స్వచ్ఛ నియోజకవర్గంగా ప్రకటించనున్నామని తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది డిసెంబర్ నాటికి వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. వెలుగుల తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో సతమతం కాగా... స్వరాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ అందిందిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. వ్యవసాయానికి ఏప్రిల్ నుంచి పట్టపగలే 9గంటలు సరఫరా చేస్తున్నామన్నారు. అందుకు రూ.200 కోట్లతో అదనపు విద్యుత్ సామగ్రిని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో లో ఓల్టేజీ సమస్య నివారణకు 33/11 కేవీ సబ్స్టేషన్లు 47, 132/33 కేవీ సబ్స్టేషన్లు ఐదు, రెండు 220/132 సబ్స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ' బంగారు భవిష్యత్తుకే సన్నబియ్యం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకోసం ప్రభుత్వం అన్ని వసతిగృహాలు, పాఠశాలల్లో సన్నబియ్యం భోజనం అమలు చేస్తోందని ఈటల చెప్పారు. ప్రతినెలా జిల్లాలో 1051 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో నాలుగు కిలోలున్న రేషన్ బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచామన్నారు. మైనార్టీలకు మెరుగైన విద్యనందించేందుకు ఈ సంవత్సరం జిల్లాలో నాలుగు బాలుర, మరో నాలుగు బాలికల మైనారిటీ గురుకులాలను ప్రారంభించామన్నారు. ఈ ఏడాదిలోనే ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో ఇప్పటివరకు 6947 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశామన్నారు. సీఎం కేసీఆర దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్‌లో 247 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ముల్కనూరు మాదిరిగానే ఈ ఏడాదిలో జిల్లాలో ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. – కరీంనగర్ బైపాస్ నుంచి సదాశివపల్లి మార్గంలో రూ.147 కోట్లతో మానేరు నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మరో రూ.150 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. – పర్యాటక అభివృద్ధిలో భాగంగా మైసూర్ బృందావన్ గార్డెన్ మాదిరిగా రూ.70 కోట్లతో బృందావన్ గార్డెన్ నిర్మిస్తామన్నారు. కేంద్రప్రభుత్వ సహకారంతో కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బడ్జెట్లో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లకు రూ.100 కోట్ల చొప్పున ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రూ.300 కోట్ల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. – దళితులకు మూడెకరాల భూపంపిణీలో భాగంగా జిల్లాలో 411 మంది రైతులకు 1100 ఎకరాలు పంపిణీ చేశామన్నారు. మరో 500 ఎకరాలు పంపిణీ చేస్తామని, ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుందన్నారు. – జిల్లాలో 5,68,412 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పథకం ద్వారా ప్రతినెలా రూ.70 కోట్ల పింఛన్లు ప్రభుత్వం అందిస్తోందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా 2167 మందికి రూ.11,05 కోట్లు, షాదీముబారక్ ద్వారా 2217 మందికి రూ.11.30 కోట్లు మంజూరు చేశామన్నారు. – జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వెడల్పు పనులకు ప్రభుత్వం రూ.2వేల కోట్లతో 307 పనులు మంజూరు చేసిందన్నారు. 146 పనులు పూర్తికాగా మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. రోడ్లకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఇదే ప్రథమమన్నారు. – జిల్లాకు 750 పడకల ఆస్పత్రి మంజూరయ్యిందని, సరిపడా వైద్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 10 పడకలతో ఐసీయూ యూనిట్, ఆరు పడకలతో పాలీట్రామా సేవలను ప్రారంభించామన్నారు. – రూ.6వేల కోట్లతో పునరుద్ధరించనున్న రామగుండం ఎరువుల కర్మాగానికి ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుపస్థాపన చేయడం శుభపరిణామమని, ఇందులో 2018లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. – రామగుండంలో రూ.10,500 కోట్లతో రెండు 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్లకు కూడా శంకుస్థాపన చేయగా 2018లో పూర్తవుతాయన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్‌కు సైతం ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయగా పనులు శరవేగంగా జరుగుతాయని మంత్రి వివరించారు. – హరితహారంలో ఇప్పటివరకు 3.20 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, కరీంనగర్, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, టీఆఎర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, ఎస్పీ జోయెల్‌డేవిస్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, నగర పాలక సంస్థ కమిషనర్ డి.కృష్ణభాస్కర్, అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్యతోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలి
జిల్లాను మెుదటిస్థానంలో నిలుపుదాం ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ రూరల్: మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ మండలం చామన్‌పల్లిలో గురువారం నిర్వహించిన హరితహారంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ హరితహారంలో జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. మొక్కలు నాటి సంరక్షించి బాధ్యతను మహిళలు స్వచ్ఛందంగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీ కోఆప్షన్‌సభ్యుడు జమిలొద్దీన్, సర్పంచు గంట శంకరయ్య, ఎంపీటీసీ సభ్యులు అశోక్, బాలయ్య, తహశీల్దార్ జయచంద్రారెడ్డి, ఎంపీడీవో దేవేందర్‌రాజు పాల్గొన్నారు. హరితహారం లఘుచిత్ర షూటింగ్ ప్రారంభం తిమ్మాపూర్: రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ సారథ్యంలో చిత్రీకరిస్తున్న తెలంగాణకు హరితహారం లఘుచిత్రాన్ని తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలుపుదామని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2.50 కోట్ల మొక్కలు నాటామని, వర్షాలు లేక ఆలస్యమవుతున్నా ఇంకా 1.50కోట్ల మొక్కలు నాటాలనే సంకల్పంతో ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఖాళీల స్థలాలను గుర్తించి వర్షాలు పడగానే లక్ష్యం మేరకు మొక్కలు నాటి రక్షించుకుందామన్నారు. జిల్లాలో మానకొండూర్, కరీంనగర్ నియోజకవర్గాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటాయని చెప్పారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ చెట్టుతో ఉపయోగాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఆగస్టు 15వరకు పూర్తి చేసి విడుదల చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎంపీపీ ప్రేమలత, జెడ్పీటీసీ పద్మ, తహశీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
ఈ నెలాఖరు వరకు మరో రెండు కోట్ల మొక్కలు నాటాలి ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తిమ్మాపూర్/బెజ్జంకి : హరితహారం కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నాలుగో స్థానంలో ఉందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లక్ష్యం మేరకు నాలుగు కోట్ల మెుక్కలు నాటి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని ఎల్ఎండీ హెడ్ రెగ్యులేటర్ సమీపంలోగల ఎస్సారెస్పీ స్థలంలో మెుక్కలు నాటారు. బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని బుడిగజంగాలకు చెందిన 16 ఎకరాల భూముల్లో 50 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరితహారంలో ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల తరువాత కరీంనగర్ నాలుగో స్థానంలో ఉందన్నారు. జిల్లాలోని సగం మంది ఎమ్మెల్యేలు అమెరికాలోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు వెళ్లడంతో ఆయా నియోజకవర్గాలు హరితహారంలో వెనుకబడ్డాయని అన్నారు. జిల్లాలో నాలుగు కోట్ల మెుక్కలు నాటడం లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 2.45కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. మిగతా రెండు కోట్ల మెుక్కలు నాటే లక్ష్యాన్ని ఈ నెలలో పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యే నుంచి వార్డు మెంబరు దాకా.. కలెక్టర్ నుంచి అటెండర్ దాకా ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమాల్లో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యకే తొలి ప్రాధాన్యం
మంత్రి ఈటల రాజేందర్ శాతవాహన వర్సిటీని తనిఖీ చేసిన మంత్రి కమాన్‌చౌరస్తా: శాతవాహన యూనివర్సిటీని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. వర్సిటీ పాలన విభాగం, నిర్మాణంలో ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనం, సెంట్రల్ లైబ్రరీ, సైన్స్ కళాశాలను పరిశీలించారు. సైన్స్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. భోజన శాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కళాశాల ఎదుట మొక్కలు నాటారు. ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తోందని అని మంత్రి ఈటల అన్నారు. విద్యాభివృద్ధి కోసం జిల్లాలోని ప్రతి నియోజకవర్గాని రూ. 10 కోట్ల చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ. 15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది వర్సిటీ కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పారు. విద్యాపర్యవేక్షణకు ఒక కమిటీని వేస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. కంప్యూటర్‌సైన్స్, ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీలను త్వరలో రెగ్యూలర్ కోర్సులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల చదువు, వసతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. 12–బీ గుర్తింపునకు కావాల్సి వనరులను అందిస్తామన్నారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ కావాల్సిన గుర్తింపు, కేంద్రం నుంచి వచ్చే నిధులు త్వరగా వచ్చేలా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, కరీంన గర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ రవీందర్‌సింగ్, శాతవాహన రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిశోర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సూరెపల్లి సుజాత, టీఆర్ఎస్ నాయకులు సిద్దం వేణు, కట్ల సతీష్, ఏనుగు రవీందర్‌రెడ్డి, రెడ్డవేని తిరుపతి, బోనాల శ్రీకాంత్, చల్లహరిశంకర్, బండారి వేణు, మల్లెంకి శ్రీనివాస్, సయ్యద్ అక్బర్ హుస్సేన్ వర్సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణలో నంబర్‌వన్‌గా నిలవాలి
సంరక్షణకు అనువైన చోటనే నాటండి మంత్రి ఈటల రాజేందర్ టీఎన్జీవోల ఆధ్వర్యంలో హరితహారం, వనభోజనం ముకరంపుర: హరితహారంలో భాగంగా మొక్కలనాటడంలో ఉన్న పోటీతత్వాన్ని వాటి సంరక్షణలో చూపి రాష్ట్రంలోనే జిల్లాను నంబర్‌వన్‌గా నిలపాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో భగత్‌నగర్‌లోని టీఎన్జీవో కోఆపరేటివ్ హౌసింగ్సొసైటీ కాలనీలో హరితహారం వారోత్సవాలను బుధవారం ప్రారంభించారు. అనంతరం వన భోజనం కార్యక్రమంలో ఉద్యోగులు సామూహికంగా భోజనాలు చేశారు. కాలనీలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజల సంఘటిత శక్తిపై ఉన్న నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక నిర్ణయాలు తీసుకుంటారన్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ కనీస కర్తవ్యంగా స్పందించడం కేసీఆర్ సాధించిన విజయమేనని పేర్కొన్నారు. మొక్కల సంరక్షణకు అనువుగా ఉన్న చోటనే నాటాలని సూచించారు. అంగన్వాడీలకు మూడు నెలలుగా జీతాలు రాలేదని ఆయన దృష్టికి తేవడంతో చిన్న ఉద్యోగులకు జీతాలు రాకుంటే వారి బాధ తెలుసునని, ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ నీతూప్రసాద్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, టీఎన్జీవోస్ కోఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి గూడ ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్లు రవీందర్, హర్మీందర్‌సింగ్, లక్ష్మి, మామిడి రమేశ్, శ్రీధర్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సుగుణాకర్రెడి, జిల్లా ఉపాధ్యక్షుడు రాంకిషన్‌రావు, టీఎన్జీవోస్ పట్టణ కార్యదర్శి కాళీచరణ్, నాయకులు సుధీర్, ఈశ్వర్ప్రసాద్, కిరణ్, రాజేశ్, తిరుమల్ పాల్గొన్నారు. -
ఇంటింటికీ తాగునీరందిస్తాం
మంత్రి ఈటల రాజేందర్ ఇబ్రహీంపట్నం : మిషన్ భగీరథ ద్వారా 2017 డిసెంబర్ వరకు ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో మిషన్ భగీరథపై కోరుట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరువులోనూ స్వచ్ఛమైన తాగునీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బా వద్ద మిషన్ భగీరథ పనులు చేపట్టేందుకు రూ.1300 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఇది చేతల ప్రభుత్వమని, తాము చేసే పనులతో పదేళ్లపాటు కచ్చితంగా అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తంచేశారు. భవిష్యత్తరాల కోసం హరితహారం కార్యక్రమం చేపట్టామని, వనంతోనే వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై మెుక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలుపెంచి కరువును పారద్రోలాలని కోరారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో హరితహారంలో 40 లక్షల మొక్కలు నాటుతామన్నారు. మిషన్ భగీరథతో కలిగే లాభాలు, పనులు తీరును మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్‌రావు వివరించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఇబ్రహీంపట్నం నుంచి మెట్‌పల్లికి Ðð ళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో శశికుమార్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.