- వృత్తుల్లో మార్పులు వస్తున్నాయ్
- పరిస్థితులకు తగ్గట్టుగా మారాలి
- మంత్రి ఈటల రాజేందర్
క్లీన్‌సిటీకి సహకరించండి
Published Tue, Aug 16 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
కరీంనగర్ కార్పొరేషన్ : కులవృత్తులు, చేతివృత్తుల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా ప్రతిఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పందుల పెంపకందార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎదుగుదల ఉండాలంటే చేసే వృత్తిని అసహ్యించుకోకుండా నూతన పద్ధతులను ఆకళింపు చేసుకోవాలని, కసి, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని అన్నారు. దొంగతనం, మోసం లేకుండా చెమటోడ్చి చేసే ప్రతిపనిలోనూ సంతృప్తి ఉంటుందన్నారు. పందులు నగరంలో తిరగడం వల్ల జబ్బులు వస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ఉందన్నారు. నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడానని, పందులు చంపడం పరిష్కారం కాదని, అందరితో మాట్లాడి పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే మొదటి అడుగువేశామన్నారు. స్థలం సేకరించి ప్రయోగాత్మకంగా ఫాంలు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక కొత్త పద్ధతిలో ముందుకు వెళితే ఫలితాలు వాటంతటవే వస్తాయని తెలిపారు. చేస్తరా..? చూస్తరా..? అనే అనుమానం తమలో కలుగకుండా చేతల్లో చూపించి ఆత్మ విశ్వాసం కల్గిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునే దిశగా మనం నడవాలని, నగరంలో పందులు తిరగకుండా ఫాంలు ఏర్పాటుకు అన్ని సౌకర్యాలతో స్థలం కేటాయిస్తామన్నారు. ఉన్నత చదువులు చదివిన వారికి జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. పందులు, పేదరికం రెండింటికీ విముక్తి కావాలని అన్నారు. పంది మాంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ఎదగాలని పిలుపునిచ్చారు. పందుల ఫాంలతో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ కులవృత్తిలో ఎంతమంది ఉన్నారు..? ఎవరికి ఏం అవసరం ఉంది..? అనే అంశాలపై చర్చిస్తున్నామని తెలిపారు. ఉపాధి బాటవైపు వెళ్లే వారికి రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పందిమాంసం అమ్ముకునేందుకు హైదరాబాద్ తరహాలో లైసెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా సొసైటీగా ఏర్పడాలని కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కార్పొరేషన్ కమిషనర్ డి.కృష్ణబాస్కర్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, నాయకులు కట్ల సతీష్, చొప్పరి వేణు, ఎరుకల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి, మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి, మున్సిపల్ అధికారులు, పందుల పెంపకందారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement