జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం | karimanagar district in top in develpment | Sakshi
Sakshi News home page

జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం

Published Mon, Aug 15 2016 7:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం

జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం

  • అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాన్యం 
  • మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి
  • వచ్చే యేడాదిలో రైతులకు రుణ విముక్తి
  • వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం 
  • మూడెకరాల భూపంపిణీ నిరంతర ప్రక్రియ
  • రూ.147 కోట్లతోమానేరుపై సస్పెన్షన్‌ బ్రిడ్జి
  • రూ.70 కోట్లతో బృందావన్‌ గార్డెన్‌ నిర్మాణం 
  • స్వాతంత్య్ర వేడుకల్లో  మంత్రి ఈటల రాజేందర్‌
  • ముకరంపుర : ప్రజల సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా సుపరిపాలన అందిస్తూ రాష్ట్రంలోనే కరీంనగర్‌ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగం స్ఫూర్తితో అసమానతలు లేని అభివృద్ధికి పాటుపడతామన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన 70వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయజెండాను మంత్రి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలు, ఆదర్శాల సాధనకు మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నిలిచిందని, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మలిదశ ఉద్యమంతో సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నామని వివరించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ చిన్నదే అయినా.. దేశ చిత్రపటంలో సమున్నత స్థానం సంపాదించుకున్నదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదన్నారు. 
     
    మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి 
    వచ్చే మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మేడిగడ్డ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.20 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తామని, ఇందులో జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నీటిమట్టం 48 టీఎంసీలకు చేరిన వెంటనే కాకతీయ కాల్వ ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తామన్నారు. 
     
    వ్యవసాయ యాంత్రీకరణ 
    వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం జిల్లాకు 36 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, యంత్రపరికరాలను రైతులకు అందిస్తోందన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామన్నారు. ఎన్నికల హామీ మేరకు మూడు విడతల్లో రైతులకు రుణమాఫీ చేశామని, వచ్చే ఏడాదిలో పూర్తిగా రుణవిముక్తి కలుగుతుందని చెప్పారు. 19 కరువు మండలాల్లో 50 శాతం సబ్సిడీపై పశువులకు దాణా సరఫరా చేశామన్నారు. ఈ సంవత్సరం 3200 హెక్టార్లలో రూ.2.60 కోట్లతో బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
     
    మిషన్‌ కాకతీయలో జలకళ
    చెరువుల పునర్నిర్మాణం ద్వారా కాకతీయుల నాటి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. జిల్లాలో 5939 చెరువులను పునరుద్ధరించనుండగా, మొదటి విడతలో 823 చెరువుల్లో 711 చెరువులు పూర్తయ్యాయని తెలిపారు. రెండో దశలో 1082 చెరువుల్లో 115 చెరువుల్లో పూర్తయ్యాయని, మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో 12 పెద్ద చెరువులను మినీ ట్యాంకు బండ్‌లుగా తీర్చిదిద్దేందకు రూ.108.21 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో చెరువులు జలకళ సంతరించుకున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 
     
    వందశాతం మరుగుదొడ్లు
    రాష్ట్రంలో సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి నియోజకవర్గాల్లో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి స్వచ్ఛ నియోజకవర్గాలుగా ప్రకటించుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలో హుజూరాబాద్‌ను స్వచ్ఛ నియోజకవర్గంగా ప్రకటించనున్నామని తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. 
     
    వెలుగుల తెలంగాణ
    ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో సతమతం కాగా... స్వరాష్ట్రంలో 24 గంటలు విద్యుత్‌ అందిందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుకే దక్కిందన్నారు. వ్యవసాయానికి ఏప్రిల్‌ నుంచి పట్టపగలే 9గంటలు సరఫరా చేస్తున్నామన్నారు. అందుకు రూ.200 కోట్లతో అదనపు విద్యుత్‌ సామగ్రిని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో లో ఓల్టేజీ సమస్య నివారణకు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 47, 132/33 కేవీ సబ్‌స్టేషన్లు ఐదు, రెండు 220/132 సబ్‌స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. '
     
    బంగారు భవిష్యత్తుకే సన్నబియ్యం
    విద్యార్థుల బంగారు భవిష్యత్తుకోసం ప్రభుత్వం అన్ని వసతిగృహాలు, పాఠశాలల్లో సన్నబియ్యం భోజనం అమలు చేస్తోందని ఈటల చెప్పారు. ప్రతినెలా జిల్లాలో 1051 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో నాలుగు కిలోలున్న రేషన్‌ బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచామన్నారు. మైనార్టీలకు మెరుగైన విద్యనందించేందుకు ఈ సంవత్సరం జిల్లాలో నాలుగు బాలుర, మరో నాలుగు బాలికల మైనారిటీ గురుకులాలను ప్రారంభించామన్నారు. 
     
    ఈ ఏడాదిలోనే ఇళ్ల నిర్మాణాలు
    జిల్లాలో ఇప్పటివరకు 6947 మందికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేశామన్నారు. సీఎం కేసీఆర దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్‌లో 247 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ముల్కనూరు మాదిరిగానే ఈ ఏడాదిలో జిల్లాలో ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. 
     
    – కరీంనగర్‌ బైపాస్‌ నుంచి సదాశివపల్లి మార్గంలో రూ.147 కోట్లతో మానేరు నదిపై సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మరో రూ.150 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు.
    – పర్యాటక అభివృద్ధిలో భాగంగా మైసూర్‌ బృందావన్‌ గార్డెన్‌ మాదిరిగా రూ.70 కోట్లతో బృందావన్‌ గార్డెన్‌ నిర్మిస్తామన్నారు. కేంద్రప్రభుత్వ సహకారంతో కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బడ్జెట్‌లో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్‌లకు రూ.100 కోట్ల చొప్పున ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రూ.300 కోట్ల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. 
    – దళితులకు మూడెకరాల భూపంపిణీలో భాగంగా జిల్లాలో 411 మంది రైతులకు 1100 ఎకరాలు పంపిణీ చేశామన్నారు. మరో 500 ఎకరాలు పంపిణీ చేస్తామని, ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుందన్నారు. 
    – జిల్లాలో 5,68,412 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పథకం ద్వారా ప్రతినెలా రూ.70 కోట్ల పింఛన్లు ప్రభుత్వం అందిస్తోందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా 2167 మందికి రూ.11,05 కోట్లు, షాదీముబారక్‌ ద్వారా 2217 మందికి రూ.11.30 కోట్లు మంజూరు చేశామన్నారు. 
    – జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వెడల్పు పనులకు ప్రభుత్వం రూ.2వేల కోట్లతో 307 పనులు మంజూరు చేసిందన్నారు. 146 పనులు పూర్తికాగా మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. రోడ్లకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఇదే ప్రథమమన్నారు. 
    – జిల్లాకు 750 పడకల ఆస్పత్రి మంజూరయ్యిందని, సరిపడా వైద్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 10 పడకలతో ఐసీయూ యూనిట్, ఆరు పడకలతో పాలీట్రామా సేవలను ప్రారంభించామన్నారు. 
    – రూ.6వేల కోట్లతో పునరుద్ధరించనున్న రామగుండం ఎరువుల కర్మాగానికి ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుపస్థాపన చేయడం శుభపరిణామమని, ఇందులో 2018లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు.
    – రామగుండంలో రూ.10,500 కోట్లతో రెండు 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్లకు కూడా శంకుస్థాపన చేయగా 2018లో పూర్తవుతాయన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌కు సైతం ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయగా పనులు శరవేగంగా జరుగుతాయని మంత్రి వివరించారు. 
    – హరితహారంలో ఇప్పటివరకు 3.20 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించేందుకు సహకరించాలని ఆయన కోరారు.  
    ఈ వేడుకల్లో కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్, కరీంనగర్, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ, నగర మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్, టీఆఎర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కలెక్టర్‌ నీతూప్రసాద్, ఎస్పీ జోయెల్‌డేవిస్, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన, నగర పాలక సంస్థ కమిషనర్‌ డి.కృష్ణభాస్కర్, అసిస్టెంట్‌ జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్యతోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement