develpment
-
Birthday Special: ‘వాజపేయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు?
నేడు (డిసెంబరు 25) దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మరోవైపు వాజపేయి అద్భుతమైన ప్రసంగాలకు, ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యానికి ప్రతీకగా నిలిచారు. అందరినీ కలుపుకొని పోయేవిధంగా రాజకీయాలు నడుపుతూ, ప్రత్యర్థులను కూడా తన వెంట తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. వాజపేయి వాక్చాతుర్యం, తర్కం ముందు ఎవరూ నిలబడలేకపోయేవారని చెబుతుంటారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 25న దేశంలో సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు. అటల్ బిహారీ వాజపేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. హిందీ, సంస్కృతం, ఆంగ్లం, రాజనీతి శాస్త్రంలో విద్యాభ్యాసం చేశారు. ఒకప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జనతా పార్టీలో కొనసాగిన అటల్ బిహారీ వాజపేయి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా వాజపేయి ఘనత సాధించారు. వాజపేయి మొదటి నుంచి తన ప్రసంగాలతో ఇతరులను అమితంగా ప్రభావితం చేసేవారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా వాజపేయి ప్రసంగాలకు ప్రభావితమయ్యారు.. ఏదో ఒకరోజు అటల్జీ ప్రధాని అవుతారని నెహ్రూ అన్నారు. వాజపేయి ప్రతి ప్రసంగంలోనూ ఆయనలోని కవి మేల్కొనేవాడు. ఒకప్పుడు భారత రాజకీయాల్లోని పలుపార్టీలు భారతీయ జనతా పార్టీకి దూరంగా మసలేవి. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసేవి. అయితే వాజపేయి దీనికి భిన్నమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనను విమర్శించడానికి భయపడేవారు. వాజపేయి హిందుత్వవాదాన్ని బహిరంగంగా సమర్థించారు. విమర్శకుల నోరు మూయించడంలో సమర్థుడైన నేతగా నిలిచారు. వాజపేయి 2018, ఆగస్టు 16న కన్నుమూశారు. ఇది కూడా చదవండి: గుడ్‌బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ.. -
నేడు ప్రధాని మోదీ వారణాసి రాక..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) యూపీలోని వారణాసికి రానున్నారు. ఆది, సోమవారాలలో ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉంటారు. డిసెంబర్ 17న తన కాశీ పర్యటనలో మొదటి రోజున ప్రధాని మోదీ.. నాడేసర్‌లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రారంభిస్తారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 18న విహంగం యోగాకు చెందిన స్వర్వేద మహామందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తరువాత బర్కిలో జరిగే బహిరంగ సభలో మిషన్-2024కు శంఖనాదం చేసిన అనంతరం ప్రసంగించనున్నారు. అలాగే కాశీ సంసద్ స్పోర్ట్స్ కాంపిటీషన్ విజేతలను కలుసుకోనున్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా తన పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేశారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. బార్కి నుంచి ఢిల్లీ-వారణాసి వందే భారత్‌తో సహా ఐదు రైళ్లను ప్రారంభించనున్నారు. దీనితోపాటు రూ.19,150 కోట్ల విలువైన 37 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కటింగ్ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాని మోదీ.. పీఎం ఆవాస్, పీఎం స్వనిధి, పీఎం ఉజ్వల తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఇది కూడా చదవండి: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. కేరళలో జేఎన్.1 కేసు నమోదు! -
26/11 తరువాత ముంబై రైల్వే స్టేషన్ల పరిస్థితి ఇదే..
మహానగరం ముంబైలో నిత్యం రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు 2008, నవంబరు 26న దాడులు జరిపారు. ఈ దాడుల్లో 50 మంది రైల్వే స్టేషన్లోనే మృతి చెందారు. ఈ ఘటన అనంతరం రైల్వేశాఖ స్టేషన్లలో భద్రతకు పలు చర్యలు చేపట్టింది. ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, రౌండ్ ది క్లాక్ భద్రతను కల్పించారు. సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలోని 80 సున్నితమైన ప్రదేశాలలో 3,459 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాల్లోని రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది ఫుటేజీని పర్యవేక్షిస్తారు. పశ్చిమ రైల్వే లైన్‌లోని ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ కింద 31 స్టేషన్లలో 2,770 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీడియో సర్వైలెన్స్ సిస్టమ్ ద్వారా 62 స్టేషన్లకు మరో 1,039 సీసీ కెమెరాలు మంజూరయ్యాయని, నిర్దిష్ట స్టేషన్లలో ఇప్పటికే 160 కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వాకీ-టాకీలు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్లు, బారికేడ్లు వంటి అవసరమైన భద్రతా పరికరాలను కొనుగోలు చేశామని, వీటిని ప్రయాణికుల భద్రత కోసం ఉపయోగిస్తున్నామని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. ఇది కూడా చదవండి: నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? -
‘ఆదర్శం’.. వీర్నపల్లి
నాడు నక్సల్స్ ప్రభావిత ఖిల్లా... నేడు అభివృద్ధిలో దూసుకెళుతున్న పల్లె సారా తయారీ బంద్.. సంపూర్ణ మద్యపాన నిషేధం ఫోన్ సౌకర్యం కూడా లేని పల్లెలో నేడు 3జీ సేవలు ఆదర్శ గ్రామాల్లో దేశంలోనే వీర్నపల్లికి 11వ స్థానం ప్రకటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వీర్నపల్లి... ఈ పేరు వినగానే ఒకనాడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా, పోలీసు బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లిన గ్రామమే గుర్తుకొస్తుంది. నక్సల్స్, పోలీసుల కాల్పుల్లో 17 మంది యువకులు బలైన విషాదం గుండెలను పిండుతుంది. బతుకుదెరువుకు నాటుసారాను నమ్ముకున్న గిరిజనులను అదే నాటుసారా ఎనిమిది మందిని కాటేసిన విషయం కన్నీళ్లు పెట్టిస్తుంది. నిన్నటివరకు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం నేడు దేశంలోనే ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. దాని కథేమిటో తెలుసుకోవాలని ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (సాగి) ఈ గిరిజన పల్లె రూపురేఖలనే మార్చివేసింది. దేశంలోనే 11వ స్థానం.. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో భాగంగా ఈ గ్రామాన్ని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ గతేడాది దత్తత తీసుకున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, అక్షరాస్యతాపరంగా అత్యంత వెనుకబడిన ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడమే సాహసం అని చెప్పొచ్చు. సిరిసిల్ల నియోజకవర్గంలోని మారుమూల అటవీ ప్రాంతంలోనున్న ఈ గ్రామం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడి నివసిస్తున్న ప్రజల్లో 98 శాతం దళిత, గిరిజన, బీసీలే. రెండు శాతం మాత్రమే అగ్రవర్ణాల ప్రజలున్నారు. సరైన వ్యవసాయం, ఉపాధి లేక బతుకుదెరువుకు కొందరు దుబాయ్ వెళితే, మెజారిటీ కుటుంబాలు నాటుసారానే నమ్ముకున్నారు. గత ఏడాది జనవరి 18న ఈ గ్రామాన్ని సందర్శించిన ఎంపీ వినోద్‌కుమార్ తన నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన గ్రామం ఇదేనని భావించారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఏడాదిన్నరలో ఈ గ్రామ రూపురేఖలు మారుస్తానని ప్రకటించారు. అందుకనుగుణంగా సంవత్సరకాలంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈ గ్రామంలో చేపట్టారు. దేశవ్యాప్తంగా 702 మంది ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు నివేదికలు అందజేశారు. వాటిని పరిశీలించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందులోని వాస్తవాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం దేశవ్యాప్తంగా టాప్ 15 గ్రామాల జాబితాను రూపొందించారు. అందులో వీర్నపల్లికి 11వ స్థానం దక్కడం విశేషం. గంగదేవిపల్లి స్ఫూర్తిగా.... గ్రామాభివృద్ధిలో వరంగల్ జిల్లా గంగదేవిపల్లిని స్ఫూర్తిగా తీసుకున్న ఎంపీ వినోద్‌కుమార్ వీర్నపల్లి గ్రామస్తులందరినీ వెంటబెట్టుకుని ప్రత్యేక బస్సుల్లో గంగదేవిపల్లికి తీసుకెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధిని, అమలవుతున్న పథకాలను, గ్రామస్తుల భాగసామ్యాన్ని, జాతీయస్థాయిలో ఈ గ్రామానికి గుర్తింపు రావడానికి గల కారణాలను వీర్నపల్లి వాసులకు అర్థమయ్యేలా వివరించారు. అదే తరహాలో వీర్నపల్లిని అభివృద్ధి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఈ గ్రామంలో ప్రజల స్థితిగతులపై బేస్‌లైన్ సర్వేను చేయించారు. గ్రామంలో పారిశుధ్యం, అక్షరాస్యత, సారా నిషేదం, మంచినీటి సరఫరా, ఉపాధిహామీ అమలు కోసం 168 మందితో 18 మంది కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల పర్యవేక్షణలో అభివృద్ధికి బాటలు వేశారు. కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి పలుమార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మారిన ముఖచిత్రం ఎంపీ దత్తత తీసుకున్నాక వీర్నపల్లి ముఖచిత్రమే మారిపోయింది. గ్రామానికి 3జీ సౌకర్యం కల్పించారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో కూడా పిల్లలు పాఠశాల మైదానంలో ఆటలాడుకోగలుగుతున్నారు. నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించిన గ్రామంగా జాతీయ అవార్డుకు పోటీ పడుతోంది. గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. అంతకుముందు బ్యాంకింగ్ అవసరాల కోసం స్థానికులు 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. గ్రామీణ బ్యాంకు ఏర్పడ్డాక రూ.1.80 కోట్ల డిపాజిట్లు వచ్చాయి. ఈ బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.1.30 కోట్లు రుణాలను అందజేశారు. గ్రామంలో 1109 మంది మహిళలుండగా వారంతా 80 స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డారు. 2015–16లో రూ.68 లక్షలు, 2016–17లో ఇప్పటివరకు రూ.80 లక్షల మొత్తాన్ని జమ చేశారు. వాసన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాయితీ విత్తన, వ్యవసాయ, వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు భూసార పరీక్షలు నిర్వహించి కార్డులను ఆందజేశారు. విత్తనాలను పంపిణీ చేశారు. 80 మంది రైతులతో కలిసి సొసైటీని ఏర్పాటు చేశారు. రైతులకు రూ.80 లక్షల మేరకు పంట రుణాలిచ్చారు. గ్రామంలో భూముల గురించి రెవెన్యూ అధికారులు పూర్తి సర్వే నిర్వహించి బినామీ పేర్లతో ఉన్న పట్టా పుస్తకాలను రద్దు చేశారు. ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్న 191 మంది రైతులకు వారి పేరిట పట్టా పాసుపుస్తకాలు అందజేశారు. ఈ గ్రామంలో ఏకంగా 70 మంది యువత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 200 మందికిపైగా యువత కంప్యూటర్లో నైపుణ్యత సాధించారు. 25 మందికి ముద్ర రుణాల పేరిట రూ.20 లక్షలిచ్చారు. పీఎంజేజేవై కింద 600 మంది, పీఎంఎస్బీవై కింద 3వేల మందికి బ్యాంకు ఖాతాలు ప్రారంభించారు. 65 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిరంతరం వాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 23 స్వయం సహాయ సంఘాల సభ్యులకు 50 శాతం సబ్సిడీ చొప్పున 54 యూనిట్ల కోడిపిల్లలను, 23 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.30 వేల విలువ చేసే గొర్రెపిల్లలను 50 శాతం సబ్సిడీపై అందజేశారు. 20 కుటుంబాలకు 50 శాతం సబ్సిడీపై 40 గేదెలను అందించారు. మరో 50 కుటుంబాలకు వంద గేదెలను మంజూరు చేశారు. తద్వారా ప్రతిరోజు ఈ గ్రామంలో వెయ్యి లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. 45 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతోపాటు కుట్టుమిషన్లను అందజేశారు. గ్రామంలోని అన్ని కుటుంబాలకు ఆమ్ ఆద్మీ బీమా యోజన, అభయహస్తం పథకాలను వర్తింపజేశారు. అభివృద్ధి పనులివీ.. గ్రంథాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ కింద వెంకటరాయని చెరువు పునరుద్ధరించారు. రూ.68 లక్షలతో అంగన్వాడీ, రూ.13 లక్షలతో పంచాయతీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. గ్రామంలో 500 మీటర్ల మేరకు సీసీ రోడ్ల నిర్మాణం రూ.52 లక్షలు ఖర్చుతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చారు. ఎన్టీపీసీ సహకారంతో పాఠశాలకు ప్రహారీగోడను నిర్మిస్తున్నారు. చుట్టుపక్కలనున్న ఎనిమిది తండాల నుంచి వీర్నపల్లికి వచ్చేందుకు అనువుగా రూ.9 కోట్ల వ్యయంతో రింగురోడ్డును నిర్మిస్తున్నారు. గతంలో ఈ గ్రామంలో ఒకే రేషన్ దుకాణం ఉండేది. ఎంపీ దత్తత తీసుకున్నాక అదనంగా మరో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ అవుట్లెట్ మంజూరైంది. -
అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి
– వీరశైవులకు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి పిలుపు – శ్రీశైలంలో వీరశైవ సాహిత్య సదస్సు శ్రీశైలం: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వీరశైవులు అధ్యాత్మికతతోపాటు సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా కూడా అభివృద్ధిసాధించాలని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిజీ అన్నారు. శ్రీశైలమహాక్షేత్రంలోని శరణు బసవేశ్వర సదాశివయ్య వీరశైవ నిత్యాన్నదాన సత్రంలో ఈ నెల 26 నుంచి జరుగుతున్న అఖిలభారత వీరశైవ మహాసభలో భాగంగా ఆదివారం వీరశైవ సాహిత్య సదస్సులో పీఠాధిపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యపరంగా ఎందరో వీరశైవ శివచరుణులు తమ ప్రవచనాలతో సాధారణ వ్యక్తులకు సైతం అర్థమయ్యే రీతిలో అనేక సత్యాలను బోధించారన్నారు. వీరశైవుల అభ్యున్నతికి బసవేశ్వరస్వామి చేసిన కషిని కొనియాడారు. హేమారెడ్డి మల్లమ్మ, అక్కమహాదేవి వంటి శివచరుణులెందరో శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకుని ఆయనలో ఐక్యమైపోయిన వీరశైవుల ప్రగాఢమైన భక్తికి నిదర్శనంగా నిలిచినట్లు తెలిపారు. చరిత్రలో వీరశైవ మత గురువులు, మహాత్ములకు ఉన్నస్థానం వారు సమాజానికి అందించిన ధర్మసిద్ధాంతాలు, సేవలు ప్రతి ఒక్కరు మననం చేసుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ బాధ్యతను విస్మరిస్తే భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. దీన్ని దష్టిలో ఉంచుకుని వర్తమానాన్ని సరిపోల్చుకుంటూ భవిష్యత్ నిర్మాణానికి పూనాది వేయాల్సిన అవసరాన్ని వీరశైవులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే వీరశైవ ధర్మజాగతి కోసం సదాశివయ్యసత్రంలో సాహిత్య సదస్సు ఏర్పాటు చేసినట్ల తెలిపారు. కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన జగద్గురు సూర్యసింహాసన సమాజ సేవా సమితి అధ్యక్షులు నేతి జ్ఞానేశ్వర్, అఖిలభారత వీరశైవ మహాసభ అధ్యక్షులు నేతి మహేశ్వర్‌ను తెలంగాణ వీరశైవ సమాజానికి చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గసభ్యులను ఘనంగా సన్మానించారు. చివరి రోజు సమావేశంలో భాగంగా వీరశైవంలో గురు– జంగంల ప్రాధాన్యం– భక్తుల పాత్రపై సదాశివపేట కల్యాణమయ్యస్వామి, పంచాచారాలు, సామాజికస్పహ అనే అంశంపై సిద్ధిపేట ఆనందయ్య తమ పరిశోధనలను సమర్పించినట్లు నేతి జ్ఞానేశ్వర్ తెలిపారు. -
జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం
అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాన్యం మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వచ్చే యేడాదిలో రైతులకు రుణ విముక్తి వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం మూడెకరాల భూపంపిణీ నిరంతర ప్రక్రియ రూ.147 కోట్లతోమానేరుపై సస్పెన్షన్ బ్రిడ్జి రూ.70 కోట్లతో బృందావన్ గార్డెన్ నిర్మాణం స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ ముకరంపుర : ప్రజల సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా సుపరిపాలన అందిస్తూ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగం స్ఫూర్తితో అసమానతలు లేని అభివృద్ధికి పాటుపడతామన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన 70వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయజెండాను మంత్రి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలు, ఆదర్శాల సాధనకు మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నిలిచిందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమంతో సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నామని వివరించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ చిన్నదే అయినా.. దేశ చిత్రపటంలో సమున్నత స్థానం సంపాదించుకున్నదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి వచ్చే మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మేడిగడ్డ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.20 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తామని, ఇందులో జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నీటిమట్టం 48 టీఎంసీలకు చేరిన వెంటనే కాకతీయ కాల్వ ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం జిల్లాకు 36 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, యంత్రపరికరాలను రైతులకు అందిస్తోందన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామన్నారు. ఎన్నికల హామీ మేరకు మూడు విడతల్లో రైతులకు రుణమాఫీ చేశామని, వచ్చే ఏడాదిలో పూర్తిగా రుణవిముక్తి కలుగుతుందని చెప్పారు. 19 కరువు మండలాల్లో 50 శాతం సబ్సిడీపై పశువులకు దాణా సరఫరా చేశామన్నారు. ఈ సంవత్సరం 3200 హెక్టార్లలో రూ.2.60 కోట్లతో బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. మిషన్ కాకతీయలో జలకళ చెరువుల పునర్నిర్మాణం ద్వారా కాకతీయుల నాటి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. జిల్లాలో 5939 చెరువులను పునరుద్ధరించనుండగా, మొదటి విడతలో 823 చెరువుల్లో 711 చెరువులు పూర్తయ్యాయని తెలిపారు. రెండో దశలో 1082 చెరువుల్లో 115 చెరువుల్లో పూర్తయ్యాయని, మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో 12 పెద్ద చెరువులను మినీ ట్యాంకు బండ్లుగా తీర్చిదిద్దేందకు రూ.108.21 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో చెరువులు జలకళ సంతరించుకున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వందశాతం మరుగుదొడ్లు రాష్ట్రంలో సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి నియోజకవర్గాల్లో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి స్వచ్ఛ నియోజకవర్గాలుగా ప్రకటించుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలో హుజూరాబాద్‌ను స్వచ్ఛ నియోజకవర్గంగా ప్రకటించనున్నామని తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది డిసెంబర్ నాటికి వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. వెలుగుల తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో సతమతం కాగా... స్వరాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ అందిందిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. వ్యవసాయానికి ఏప్రిల్ నుంచి పట్టపగలే 9గంటలు సరఫరా చేస్తున్నామన్నారు. అందుకు రూ.200 కోట్లతో అదనపు విద్యుత్ సామగ్రిని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో లో ఓల్టేజీ సమస్య నివారణకు 33/11 కేవీ సబ్స్టేషన్లు 47, 132/33 కేవీ సబ్స్టేషన్లు ఐదు, రెండు 220/132 సబ్స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ' బంగారు భవిష్యత్తుకే సన్నబియ్యం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకోసం ప్రభుత్వం అన్ని వసతిగృహాలు, పాఠశాలల్లో సన్నబియ్యం భోజనం అమలు చేస్తోందని ఈటల చెప్పారు. ప్రతినెలా జిల్లాలో 1051 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో నాలుగు కిలోలున్న రేషన్ బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచామన్నారు. మైనార్టీలకు మెరుగైన విద్యనందించేందుకు ఈ సంవత్సరం జిల్లాలో నాలుగు బాలుర, మరో నాలుగు బాలికల మైనారిటీ గురుకులాలను ప్రారంభించామన్నారు. ఈ ఏడాదిలోనే ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో ఇప్పటివరకు 6947 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశామన్నారు. సీఎం కేసీఆర దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్‌లో 247 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ముల్కనూరు మాదిరిగానే ఈ ఏడాదిలో జిల్లాలో ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. – కరీంనగర్ బైపాస్ నుంచి సదాశివపల్లి మార్గంలో రూ.147 కోట్లతో మానేరు నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మరో రూ.150 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. – పర్యాటక అభివృద్ధిలో భాగంగా మైసూర్ బృందావన్ గార్డెన్ మాదిరిగా రూ.70 కోట్లతో బృందావన్ గార్డెన్ నిర్మిస్తామన్నారు. కేంద్రప్రభుత్వ సహకారంతో కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బడ్జెట్లో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లకు రూ.100 కోట్ల చొప్పున ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రూ.300 కోట్ల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. – దళితులకు మూడెకరాల భూపంపిణీలో భాగంగా జిల్లాలో 411 మంది రైతులకు 1100 ఎకరాలు పంపిణీ చేశామన్నారు. మరో 500 ఎకరాలు పంపిణీ చేస్తామని, ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుందన్నారు. – జిల్లాలో 5,68,412 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పథకం ద్వారా ప్రతినెలా రూ.70 కోట్ల పింఛన్లు ప్రభుత్వం అందిస్తోందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా 2167 మందికి రూ.11,05 కోట్లు, షాదీముబారక్ ద్వారా 2217 మందికి రూ.11.30 కోట్లు మంజూరు చేశామన్నారు. – జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వెడల్పు పనులకు ప్రభుత్వం రూ.2వేల కోట్లతో 307 పనులు మంజూరు చేసిందన్నారు. 146 పనులు పూర్తికాగా మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. రోడ్లకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఇదే ప్రథమమన్నారు. – జిల్లాకు 750 పడకల ఆస్పత్రి మంజూరయ్యిందని, సరిపడా వైద్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 10 పడకలతో ఐసీయూ యూనిట్, ఆరు పడకలతో పాలీట్రామా సేవలను ప్రారంభించామన్నారు. – రూ.6వేల కోట్లతో పునరుద్ధరించనున్న రామగుండం ఎరువుల కర్మాగానికి ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుపస్థాపన చేయడం శుభపరిణామమని, ఇందులో 2018లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. – రామగుండంలో రూ.10,500 కోట్లతో రెండు 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్లకు కూడా శంకుస్థాపన చేయగా 2018లో పూర్తవుతాయన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్‌కు సైతం ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయగా పనులు శరవేగంగా జరుగుతాయని మంత్రి వివరించారు. – హరితహారంలో ఇప్పటివరకు 3.20 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, కరీంనగర్, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, టీఆఎర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, ఎస్పీ జోయెల్‌డేవిస్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, నగర పాలక సంస్థ కమిషనర్ డి.కృష్ణభాస్కర్, అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్యతోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.