
నేడు (డిసెంబరు 25) దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మరోవైపు వాజపేయి అద్భుతమైన ప్రసంగాలకు, ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యానికి ప్రతీకగా నిలిచారు. అందరినీ కలుపుకొని పోయేవిధంగా రాజకీయాలు నడుపుతూ, ప్రత్యర్థులను కూడా తన వెంట తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. వాజపేయి వాక్చాతుర్యం, తర్కం ముందు ఎవరూ నిలబడలేకపోయేవారని చెబుతుంటారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 25న దేశంలో సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు.
అటల్ బిహారీ వాజపేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. హిందీ, సంస్కృతం, ఆంగ్లం, రాజనీతి శాస్త్రంలో విద్యాభ్యాసం చేశారు. ఒకప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జనతా పార్టీలో కొనసాగిన అటల్ బిహారీ వాజపేయి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా వాజపేయి ఘనత సాధించారు. వాజపేయి మొదటి నుంచి తన ప్రసంగాలతో ఇతరులను అమితంగా ప్రభావితం చేసేవారు.
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా వాజపేయి ప్రసంగాలకు ప్రభావితమయ్యారు.. ఏదో ఒకరోజు అటల్‌జీ ప్రధాని అవుతారని నెహ్రూ అన్నారు. వాజపేయి ప్రతి ప్రసంగంలోనూ ఆయనలోని కవి మేల్కొనేవాడు. ఒకప్పుడు భారత రాజకీయాల్లోని పలుపార్టీలు భారతీయ జనతా పార్టీకి దూరంగా మసలేవి. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసేవి. అయితే వాజపేయి దీనికి భిన్నమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనను విమర్శించడానికి భయపడేవారు. వాజపేయి హిందుత్వవాదాన్ని బహిరంగంగా సమర్థించారు. విమర్శకుల నోరు మూయించడంలో సమర్థుడైన నేతగా నిలిచారు. వాజపేయి 2018, ఆగస్టు 16న కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: గుడ్‌బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ..