స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాజకీయ వారసత్వం అమితమైన ఆసక్తిని కలిగిస్తుంటుంది. ఆ మధ్య చరిత్రకారుడు రామచంద్ర గుహ మాట్లాడుతూ ‘జవహర్‌లాల్ నెహ్రూ ఎదుర్కొన్న సవాళ్లను ఆధునిక భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఎదుర్కోలేదనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. నెహ్రూ దేశానికి సారధ్యం వహించే సమయంలో దేశం ఒక జాతిగా దాని సొంత కాళ్లపై కూడా నిలబడలేని స్థితిలో ఉన్నదన్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజాస్వామ్యం, నైతికత, లౌకికవాదం, సోషలిజం మొదలైనవాటిని దేశంలో పెంపొందించేదుకు నెహ్రూ కృషి చేశారని చెబుతారు. అయితే నెహ్రూ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు, వ్యక్తిగత సంబంధాలు, అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు చాలావరకూ తెరమరుగునే ఉన్నాయి. నెహ్రూకు గాలిపటాలు ఎగురవేయడం అంటే చాలా ఇష్టం. ఈ అభిరుచి అతనికి ఇంగ్లాండ్‌లోని హారో, కేంబ్రిడ్జ్‌లలో ఉంటున్నప్పుడు ఏర్పడింది. అదేవిధంగా నెహ్రూకు న్యాయశాస్త్రం చదవడమంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినా, తండ్రి కోరిక మేరకు లా పూర్తిచేసి, న్యాయవాదిగా మారారు. జవహర్‌లాల్ నెహ్రూకి సంబంధించి బయటి ప్రపంచానికి అంతగా తెలియని కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జవహర్‌లాల్ నెహ్రూను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో అతని సహవిద్యార్థులు ‘జో నెహ్రూ’ అని పిలిచారు. దీనికి కారణం అలా పిలవడం చాలా సులభమని వారు భావించేవారు. నెహ్రూను పూర్తి పేరుతో పిలవడం వారికి కష్టంగా అనిపించేదట.
హారో, కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు నెహ్రూకు గాలిపటం ఎగురవేయడమనేది ఒక క్రీడగా పరిచయం అయ్యింది. గాలిపటాలపై నెహ్రూకు మక్కువ మరింతగా పెరిగి, వాటిని బాగా ఎగురవేయగలిగే నైపుణ్యం సంపాదించారు. ఈ నేపధ్యంలో నెహ్రూ భారతదేశం నుండి మంచి గాలిపటాలను తెప్పించుకుని, వాటి ఎగురవేస్తూ ఆనందం పొందేవారు.
నెహ్రూ తన తండ్రి ఒత్తిడి మేరకు న్యాయశాస్త్రం చదివారు. నిజానికి నెహ్రూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆర్థిక శాస్త్రం చదువుకోవాలనుకున్నారు. తనను లాయర్‌గా మార్చినందుకు నెహ్రూ తన తండ్రిపై తరచూ పలు ఆరోపణలు చేసేవాడు.
గాంధీజీ మరణానంతరం నెహ్రూ చేసిన ‘మన జీవితాల్లో వెలుగులు ఆరిపోయాయి’ అనే ప్రసంగం ఆయన చేసిన ప్రముఖ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ప్రసంగాన్ని ఆయన ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా చేయడం విశేషం.
జైలులో ఉన్నప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిర వివాహానికి లేత గులాబీ ఖాదీ చీరను నేశారు. ఆ తర్వాత సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కూడా తమ తమ పెళ్లిళ్లలో అదే ధరించారు.
నెహ్రూకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఆయన తన ఇంటిలో పెద్ద సంఖ్యలో వివిధ రకాల పెంపుడు జంతువులను పెంచేవారు. వీటిలో ఒక పాండా కూడా ఉండేది.
జవహర్‌లాల్ నెహ్రూ తన వస్త్రధారణలో జాకెట్, షేర్వానీ, క్యాప్ ధరించి కనిపించేవారు. ఈ లుక్ నెహ్రూకు అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ఈ లుక్ ఎంత పాపులర్ అయ్యిందంటే చివరికి అది నేషనల్ డ్రెస్ కోడ్‌లా మారింది. నెహ్రూ ప్రభావంతో ఘనా అధ్యక్షుడు క్వామే న్క్రుమా, ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తో, చైనా నేత మావో కూడా నెహ్రూ తరహాలో దుస్తులను ధరించేందుకు ఇష్టపడేవారట.
1963 అక్టోబర్‌లో ప్లేబాయ్ పత్రిక జవహర్‌లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసింది. ఈ పత్రికలో తన గురించి లోతైన కథనాలు ప్రచురితమయ్యాయని నెహ్రూ భావించారు. నెహ్రూ తన సోదరి విజయలక్ష్మి పండిట్‌ను నయన్ అని పిలిచేవారు. ఆమె అతనికి అత్యంత నమ్మకస్తురాలని చెబుతుంటారు. నెహ్రూ తన తల్లి, భార్య భార్యకు మించి విజయలక్ష్మి పండిట్‌తో ఓపెన్‌గా మాట్లాడేవారట.
ఇది కూడా చదవండి: నేతాజీకి అండగా నిలిచిన మహిళా సేనాని ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment