నేడు శత జయంతి సందర్భంగా ఆయనను దేశం ఆప్యాయంగా గుర్తు చేసుకుంటోంది. ఘనంగా నివాళులు అర్పిస్తోంది.
స్వతంత్ర భారత చరిత్రలో అతికొద్ది మంది రాజనీతిజ్ఞుల్లో అగ్రగణ్యుడు
అగ్ర రాజ్యపు బెదిరింపులను బేఖాతరు చేస్తూ దేశ భద్రతకు ‘అణు కవచం’ తొడిగిన నాయకుడు
రాజకీయ ప్రత్యర్థులు కూడా ఏనాడూ వేలెత్తి చూపనంతటి గొప్ప వ్యక్తిత్వానికి చిరునామా
దేశ ప్రగతి ప్రస్థానంపై చెరగని రీతిలో శాశ్వత ముద్ర వేసిన అరుదైన దార్శనికుడు
సున్నిత మనస్కుడైన ఓక కవి
భగ్న హృదయుడైన విఫల ప్రేమికుడు
ఉర్రూతలూగించే ప్రసంగాలకు పెట్టింది పేరు
అతడే... అటల్ బిహారీ వాజ్‌పేయి
అది 1984 డిసెంబర్ 30. ముంబైలోని శివాజీ పార్కు. బీజేపీ సదస్సులో అటల్ ప్రసంగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా విని్పంచేంతటి నిశ్శబ్దం నడుమ అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ‘‘చీకట్లు విడిపోతాయి. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారాయన. అప్పట్లో అంతా పెదవి విరిచినా, మరో పుష్కరం తిరక్కుండానే హస్తిన కోటపై కాషాయ జెండా ఎగరేసి చూపించారు. ప్రాణమిత్రుడు ఆడ్వాణీతో కలిసి బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి కేంద్రంలో అధికార పీఠం దాకా ఒక్కొక్క మెట్టూ ఎక్కించారు. ఒకప్పుడు రాజకీయాల్లో అంటరానిదిగా పరిగణన పొందిన బీజేపీని వాజ్‌పేయీ ప్రబల శక్తిగా తీర్చిదిద్దారు.
ఆ క్రమంలో ఎదురైన ఆటుపోట్లను ఏమాత్రమూ చలించని నిబ్బరంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. అంతకుముందు లోక్‌సభలో విపక్ష నేతగానూ పార్టీలకతీతంగా మన్ననలూ అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పొరుగు దేశం కుట్రలను పటాపంచలు చేసి దేశ వైఖరిని ప్రస్ఫుటంగా చాటారు. నెహ్రూ తనకిష్టమైన నేత అని చెప్పినా, పాక్ పీచమణిచి బంగ్లాను విముక్తం చేసిన ఇందిరను విజయేందిరగా కొనియాడినా వాజ్‌పేయికే చెల్లింది. తర్వాత కొన్నేళ్లకే ఎమర్జెన్సీ వేళ అదే ఇందరి నియంతృత్వాన్ని ఆయన అంతే నిస్సంకోచంగా కడిగిపారేశారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాల కంటే దేశమే ముందని, ముఖ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మడమే గాక దాన్ని ఆచరణలోనూ చూపారు. పలు సందర్భాల్లో మాతృ సంస్థ ఆరెస్సెస్ విధానాలతోనే విభేదించారు.
బాబ్రీ మసీదు కూల్చివేతపై పార్టీ వైఖరికి భిన్న స్వరం వినిపించేందుకు కూడా వెనకాడలేదు. అంతేనా...? తొలిసారి ప్రధాని పదవి తనకు 13 రోజుల ముచ్చటగానే ముగిశాక నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు ఏకంగా కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా ముందుకొచి్చన దేశ ప్రేమికుడు వాజ్‌పేయి. ఇలా బహుముఖీనమైన వ్యక్తిత్వంతో పార్టీలకతీతంగా చెరగని అభిమానం సంపాదించుకున్నారు వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయారు. ఆయన జయంతి డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం సముచిత నిర్ణయమే తీసుకుంది.
ఆదర్శ నాయకుడు
1984 సార్వత్రిక ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంది. వాజ్‌పేయి నేతృత్వంలో 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాల సాయంతో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ రూపంలో జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రయోగాలకు వాజ్‌పేయి ఆద్యునిగా నిలిచారు. పదో ప్రధానిగా ప్రమాణం చేశారు. 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చినా 1998లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 13 నెలల అనంతరం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయినా చలించలేదు. ఆ వెంటనే వచి్చన ఎన్నికల్లో నెగ్గి ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి పూర్తికాలం పదవిలో కొనసాగారు. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచిపోయారు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దశాబ్దాల విభేదాలకు, ఉద్రిక్తతలకు శాంతిచర్చలే విరుగుడంటూ సాహసోపేతంగా సంప్రదింపులకు తెర తీశారు. నాటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సరీ్వసును ప్రారంభించారు. పాక్ కపట బుద్ధి కార్గిల్ యుద్ధానికి దారి తీసినా ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. 2003లో ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా సైనిక సాయం కోరితే నిష్కర్షగా తిరస్కరించిన ధీశాలి వాజ్‌పేయి. డజన్ల కొద్దీ దేశాలు అమెరికా పక్షం వహించినా, అదే బాటన నడుద్దామని సొంత మంత్రివర్గ సభ్యులే ఒత్తిడి తెచి్చనా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అదే మేలని మీడియా సలహాలిచి్చనా ససేమిరా అన్నారు. ఇరాక్‌పై అమెరికా యుద్ధంలో పాల్గొనేది లేదని పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన కీలక ఘట్టంగా మిగిలిపోయింది.
కీలక సంస్కరణలు
మూడోసారి ప్రధానిగా కీలక ఆర్థిక సంస్కరణలకు వాజ్‌పేయి బాటలు వేశారు. పీవీ బాటన సాగుతూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని, సరళీకృత విధానాలను, విదేశీ పెట్టుబడులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. హైవేల అభివృద్ధి, ప్రధాని గ్రామసడక్ పథకాలతో దేశ రవాణా రూపురేఖలనే మార్చేశారు. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేశారు. నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1998లో పోఖ్రాన్‌లో రెండో అణు పరీక్షల ద్వారా భారత అణ్వస్త్ర పాటవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలో టెలికాం విప్లవానికి బాటలు పరిచిందీ వాజ్‌పేయే. ఆయన హయాం సుపరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది.
2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం వాజ్‌పేయీ క్రమంగా రాజకీయ రంగం నుంచి తప్పుకున్నారు. 2006లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ తర్వాత చివరిసారిగా మీడియాతో మాట్లాడారు వాజ్‌పేయి. ఈ సందర్భంగానే నాయకత్వ బాధ్యతలను ఆడ్వాణీకి అప్పగించారు. క్షీణించిన ఆరోగ్యానికి నిదర్శనంగా అప్పటికే చేతికర్ర సాయం తీసుకున్నారు. 2007లో చివరిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత 2018 ఆగస్టు 16న కన్నుమూసేదాకా దాదాపు పుష్కర కాలం వాజ్‌పేయి ఏకాంత జీవితమే గడిపారని చెప్పాలి.
ఆ గళం.. అనితరసాధ్యం
వాజ్‌పేయి అద్భుత వక్త. హిందీ, ఇంగ్లీష్ ల్లో తిరుగులేని వాగ్ధాటి ఆయన సొంతం. 1957లో పార్లమెంటేరియన్‌గా తొలి ప్రసంగంతోనే నాటి ప్రధాని నెహ్రూతో సహా అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రధాని అవుతాడంటూ నెహ్రూ ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా అయినా, ప్రధానిగా హోదాలోనూ ఆయన మాట్లాడేందుకు లేచారంటే సభ్యులంతా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యం, చమత్కారాలు, అక్కడక్కడా అవసరమైన మేరకు వ్యంగ్యం మేళవిస్తూ కవితాత్మకంగా సాగే వాజ్‌పేయి ప్రసంగాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి.
హిందీ అంతగా అర్థం కాని తమిళ దిగ్గజం సీఎన్ అన్నాదురైని కూడా ఆకట్టుకున్న ఘనత ఆయన ప్రసంగాలకు దక్కింది! 1994లో జెనీవా వేదికపై కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఏరికోరి వాజ్‌పేయినే ఎంచుకున్నారు. ఏ అంశంపై అయినా సమగ్ర కసరత్తు చేశాకే మాట్లాడేవారు. గణాంకాలు తదితరాలను తప్పకుండా ప్రస్తావించేవారు. అందుకే పార్లమెంటులో ఆయన వాదనలను తిప్పికొట్టలేక ప్రత్యర్థి పక్షాల్లోని మహామహులైన నేతలు కూడా చేష్టలుడిగేవారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన క్షణాలు తనకు మరపురానివని గుర్తు చేసుకునేవారు. వాజ్‌పేయి కొంతకాలం జర్నలిస్టుగా కూడా రాణించారు.
సినీ ప్రియుడు
వాజ్‌పేయి సినీ ప్రియుడు. పాత హిందీ సినిమాలు బాగా చూసేవారు. తీస్రీ కసమ్, దేవదాస్, బందినీ వంటివి ఆయన ఆల్‌టైం ఫేవరెట్ హిందీ సినిమాల్లో కొన్ని. లతా మంగేష్కర్, ముకేశ్, ఆయన అభిమాన గాయనీ గాయకులు. ‘మీకూ నాకూ ఎన్నో పోలికలు. ఇద్దరమూ ఒంటరితనమే. ఇంగ్లీష్ లో నా పేరు (అటల్)ను తిరగేస్తే మీ పేరు (లత) వస్తుంది’ అంటూ ఓసారి లతా మంగేష్కర్‌తో చమత్కరించారట! అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా బాగా ఇష్టపడేవారు. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వై తనకిష్టమైన సినిమా అని తరచూ చెప్పేవారు. అలాగే బార్న్ ఫ్రీ, గాంధీ సినిమాలు కూడా. వాజ్‌పేయి కవితలకు పలువురు గాయకులు ప్రాణం పోయడం మరో విశేషం.
ఆయన రాసిన ‘క్యా ఖోయా, క్యా పాయా’, ‘దూర్ కహీ కోయీ రోతా హై’, ‘ఝుకీ న ఆంఖే’ వంటి వేదనాభరిత కవితలను గజల్ సమ్రాట్ జగ్జీత్‌సింగ్ తన గళంతో అజరామరం చేశారు. శరత్, ప్రేమ్‌చంద్ సాహిత్యమన్నా వాజ్‌పేయికి ప్రాణం. ఎమర్జెన్సీ వేళ జైల్లోనూ కవితా రచన చేసిన కళాపిపాసి వాజ్‌పేయీ. అడ్వాణీ ఆయనకు ఆజన్మాంతం ప్రియమిత్రుడు. తనతో కలిసి ఢిల్లీ వీధుల్లో స్కూటర్‌పై చక్కర్లు కొట్టేవారు. పానీపూరీ, చాట్ వాజ్‌పేయి ఎంతో ఇష్టంగా తినేవారని అడ్వాణీ చెబుతారు. ఆయన చేయి తిరిగిన వంటగాడే గాక మంచి భోజనప్రియుడు కూడా.
చావు అయుష్షెంత, రెండు క్షణాలేగా! మరి జీవితమేమో ప్రగతిశీలం, ఒకటీ రెండు నాళ్లలో ముగిసేది కాదు
ప్రధానిగా ఒకనాటికి మాజీని అవుతానేమో. మాజీ కవిని మాత్రం ఎప్పటికీ కాలేను
మిత్రులను మార్చగలం గానీ పొరుగువారిని మార్చుకోలేం
భారతీయులుగా మనమంతా ఉత్కృష్ట నాగరికతకు వారసులం. శాంతే మన జీవిత గీతిక
అధికారం కోసం పార్టీని చీల్చాల్సి, కొత్త గ్రూపులు కట్టాల్సే వస్తే అలాంటి అధికారాన్ని తాకనైనా తాకను
పేదరికం బహుముఖీనం. దాన్ని కేవలం డబ్బు, ఆదాయం, విద్య, ఆరోగ్య పరామితుల్లో కొలవలేం
పుడమి వయసు లక్షల ఏళ్లు. మనిషివి అంతులేని జీవన గాథలు. కానీ మన దేహానికి హద్దులున్నాయి.శత శరత్కాలాల వాణిని విన్నాం.
అది చిట్టచివరిసారి తట్టినపుడైనా మనసు తలుపు తెరుద్దాం
పాలిటిక్స్‌తో విసిగిపోయా. వాటిని వదిలేద్దామనుకుంటున్నాను. కానీ అవి నన్ను వదిలేలా లేవు
స్వేచ్ఛకు సంకెళ్లు వేద్దామనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. నిప్పుతో చెలగాటాలొద్దు. పక్కింటికి నిప్పుపెడితే ఆ దావాగ్ని మీ ఇంటినీ కాల్చేస్తుంది
–వాజ్‌పేయి
Comments
Please login to add a commentAdd a comment