ప్రపంచం మెచ్చిన విలక్షణ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న కన్యాకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణా దేవి, కృష్ణ బిహారీ వాజ్‌పేయి. తండ్రి గ్వాలియర్‌లో స్కూల్ టీచర్. తాత శ్యామ్‌లాల్ వాజ్‌పేయి ఉత్తరప్రదేశ్‌లోని బటేశ్వర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని మొరేనాకు వలస వెళ్లారు.
తర్వాత మెరుగైన జీవనోపాధి కోసం గ్వాలియర్‌కు చేరారు. అక్కడి సరస్వతి శిశు మందిర్‌లో వాజ్‌పేయి ప్రాథమిక విద్య అభ్యసించారు. గ్వాలియర్ విక్టోరియా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో బీఏ ఉత్తీర్ణులయ్యారు. కాన్పూర్‌లో ఆగ్రా వర్సిటీకి చెందిన డీఏవీ కాలేజీ నుంచి ఎంఏ (పొలిటికల్ సైన్స్) చేశారు.
ఆర్య సమాజోద్యమంతో ప్రస్థానం
ఆర్య సమాజ ఉద్యమం పట్ల వాజ్‌పేయి చిన్నప్పుడే ఆకర్షితులయ్యారు. గ్వాలియర్‌లో ఆర్య సమాజ ఉద్యమ యువజన విభాగమైన ఆర్యకుమార సభలో చేరారు. 1944లో ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1939లోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో చేరారు. 16 ఏళ్ల వయసులోనే స్వయం సేవకునిగా చురుకైన పాత్ర పోషించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టై 24 రోజులు జైల్లో ఉన్నారు. 1947లో ఆరెస్సెస్ ప్రచారక్ (పూర్తిస్థాయి కార్యకర్త)గా ఎదిగారు. దేశ విభజన పరిణామాల నేపథ్యంలో న్యాయ విద్యను మధ్యలోనే ఆపేశారు. ఆర్‌ఎస్‌ఎస్ పత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించారు. కవిగా, రచయితగా, ప్రజానాయకుడిగా రాణించారు.
ఆరెస్సెస్ రాజకీయ విభాగం భారతీయ జన సంఘ్‌లో సభ్యుడిగా చేరారు. దాని అధినేత శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రధాన అనుచరుడిగా ఉత్తరాదిన పార్టీని ముందుకు నడిపారు. 1957 సాధారణ ఎన్నికల్లో బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. పార్లమెంట్‌లో పలు అంశాలపై ఉర్రూతలూగించేలా ప్రసంగించేవారు. ఆయనపై నెహ్రూ ప్రభావం బాగా ఉండేది. నెహ్రూనూ వాజ్‌పేయి ప్రతిభ ఆకట్టుకుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణం తర్వాత జన సంఘ్ బాధ్యతలను వాజ్‌పేయి స్వీకరించారు. 1968లో జనసంఘ్ అధ్యక్షుడయ్యారు. నానాజీ దేశ్‌ముఖ్, ఎల్.కె.ఆడ్వాణీ వంటి సహచరుల తోడ్పాటుతో పార్టీ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారు.
పదవీ వ్యామోహం లేదు
ప్రధాని పదవి పట్ల వాజ్‌పేయికి ఎన్నడూ వ్యామోహం లేదంటారు. 1995 డిసెంబర్‌లో బీజేపీ భేటీలో ఆడ్వాణీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో సార్టీ గెలిస్తే వాజ్‌పేయే ప్రధాని అవుతారని ప్రకటించగా ఆయన వారించారు. ఎన్నికల్లో నెగ్గడంపైనే దృష్టి పెట్టాలని, ప్రధాని అభ్యర్థి ఎవరన్నది అప్రస్తుతమని సున్నితంగా హెచ్చరించారు. 1996 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీకి అడుగు దూరంలో ఆగినా ఏకైక అతిపెద్ద పారీ్టగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ వాజ్‌పేయిని రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆహ్వానించారు. దాంతో వాజ్‌పేయి తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభలో మెజారీ్టని కూడగట్టడంలో విఫలం కావడంతో 13 రోజుల్లోనే వాజ్‌పేయి రాజీనామా చేయాల్సి వచ్చింది.
1996 నుంచి 1998 మధ్య రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కొలువుదీరినా మధ్యలోనే కూలిపోయాయి. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజార్టీ రావడంతో వాజ్‌పేయి రెండోసారి ప్రధాని అయ్యారు. కానీ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించడంతో 13 నెలల తర్వాత ప్రభుత్వం కుప్పకూలింది. 1999 ఏప్రిల్ 17న లోక్‌సభలో విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. కార్గిల్ విజయం తదితరాల సాయంతో 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. లోక్‌సభలో 543 సీట్లకు గాను 303 సీట్లు గెలుచుకుంది. వాజ్‌పేయి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. 1999 నుంచి 2004 దాకా ఐదేళ్లపాటు పూర్తికాలం పదవిలో ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు లోక్‌సభల్లో ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి నాయకుడిగా వాజ్‌పేయి రికార్డుకెక్కారు. నాలుగు వేర్వేరు రాష్ట్రాలు(ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ) నుంచి వేర్వేరు సమయాల్లో పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నేత వాజ్‌పేయి. తగిన మెజార్టీ లేక వాజ్‌పేయి ప్రభుత్వాలు కూలిపోవడాన్ని హేళన చేసిన ప్రతిపక్షాలతో, ‘‘చూస్తూ ఉండండి! ఏదో ఒక రోజు బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి వస్తుంది’’ అని పార్లమెంట్‌లో వాజ్‌పేయి బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన వాక్కు నిజమైంది.
బీజేపీ తొలి అధ్యక్షుడు..
1975లో ఎమర్జెన్సీ సమయంలో వాజ్‌పేయీ అరెస్టయ్యారు. తర్వాత 1977 ఎన్నికల్లో జనసంఘ్ ఇతర పార్టీలతో కూడిన జనతా కూటమి నెగ్గి మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. వాజ్‌పేయీ విదేశాంగ మంత్రిగా రాణించారు. 1977లో ఐరాసలో హిందీలో మాట్లాడి చరిత్ర సృష్టించారు. 1980లో జనసంఘ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)గా మారాక దాని తొలి అధ్యక్షుడయ్యారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో లోక్‌సభకు పదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, 1999 నుంచి పూర్తిస్థాయిలో ఐదేళ్లూ ప్రధానిగా చేశారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలతో ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. దాయాది పాకిస్తాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యమిచ్చారు. లాహోర్ బస్సు యాత్ర చేశారు. కార్గిల్ యుద్ధం తర్వాత కూడా పాక్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు. గొప్ప రాజనీతిజు్ఞడిగా దేశ విదేశాల్లో పేరుగాంచారు. పార్టీలకతీతంగా ఎంపీలతో ఆయనకు సత్సంబంధాలుండేవి. అంతర్జాతీయ వ్యవహారాలపై వాజ్‌పేయీకి అమితాసక్తి ఉండేది. ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. వాజ్‌పేయీ హయాంలో 2001లో పార్లమెంట్‌పై దాడి 2002లో గుజరాత్‌లో మత కలహాలు జరిగాయి. ఆయన్ను భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment