అటల్ బిహారీ వాజ్‌పేయి అవివాహితునిగా మిగిలిపోవడం వెనక ఆసక్తికరమైన కథ ఉంది. కాలేజీ రోజుల్లోనే ఆయన మనసు దోచిన రాజ్‌కుమారీ హస్కర్ అనే మహిళ దూరమవడంతో పెళ్లి చాప్టర్‌కు దూరమయ్యారు. ఏక్ నిరంజన్‌లా ఉండిపోయారు.
ఎవరీ హస్కర్?
కశ్మీర్ పండిట్ల కుటుంబానికి రాజ్‌కుమారీ హస్కర్ వాజ్‌పేయికి కాలేజీ రోజుల్లో సహాధ్యాయి. ఇందిరాగాందీకి దూరపు బంధువంటారు. పలు కార్యక్రమాల్లో కలిసి పని చేసే క్రమంలో మొదలైన స్నేహం ప్రేమగా మారింది. కానీ ఎవరూ దాన్ని బయటపెట్టలేదు. వాజ్‌పేయి ఆమెకు ప్రేమలేఖ రాసినా నేరుగా ఇవ్వకుండా గ్రంథాలయంలో ఆమె చదివే అవకాశమున్న ఓ పుస్తకంలో పెట్టారు. అయితే హస్కర్ ఆ పుస్తకాన్ని చదవలేదు. అలా వాజ్‌పేయి ప్రేమలేఖ ఆమెకు అందనే లేదు. రాజకీయాలు చేసే వ్యక్తికి కూతురును ఇవ్వడం హస్కర్ తండ్రికీ ఇష్టం లేకపోయింది. దాంతో బ్రిజ్ నారాయణ్ కౌల్ అనే ప్రొఫెసర్‌తో ఆమె వివాహం జరిగిపోయింది. అలా హస్కర్ శ్రీమతి కౌల్‌గా మారి వాజ్‌పేయి జీవితం నుంచి అదృశ్యమైంది. వాజ్‌పేయి కూడా ప్రేమ సంగతి మర్చిపోయి క్రియాశీల రాజకీయాల్లో మునిగిపోయారు.
16 ఏళ్ల తర్వాత
దాదాపు 16 ఏళ్ల తర్వాత వాజ్‌పేయి, శ్రీమతి కౌల్ ఓ కాలేజీ ఫంక్షన్‌లో అనుకోకుండా పరస్పరం తారసపడ్డారు. ఢిల్లీలో తన భర్త పని చేసే కాలేజీలో కీలకోపన్యాసం సందర్భంగా అక్కడ కౌల్‌ను చూసి వాజ్‌పేయి నిశ్చేషు్టలయ్యారు. తర్వాత కౌల్ దంపతులతో ఆయన అనుబంధం బలపడింది. వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా ఉండగా కౌల్ దంపతులు కూడా తమ కూతురు నమితతో కలిసి ఆయన ఇంటికి మారిపోయారు. దాంతో వారి బంధంపై ఢిల్లీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. భావ సారుప్యత ఉన్న కౌల్‌ను వాజ్‌పేయీ పెళ్లాడితే మంచిదని సన్నిహితులు, రాజకీయ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు చెప్పినా ఆయన కొట్టిపారేశారంటారు.
‘‘దీనిపై చర్చ అనవసరం. నేను పెళ్లీడు వయసులో ఉండగా ఆదర్శవంతమైన భార్య కోసం అన్వేషణ మొదలెట్టాను. దొరికినా దురదృష్టవశాత్తు ఆమె తండ్రి తనకు అనువైన ఆదర్శ భర్త కోసం వెతికారు’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్‌పేయిలోని ఈ కోణాన్ని జాతీయ మీడియా ఎప్పుడూ పతాక శీర్షికలకు ఎక్కించలేదు. కౌల్ కూతురు నమితను వాజ్‌పేయి తన కన్నకూతురిలా చూసుకున్నారు. తర్వాత దత్తత తీసుకున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియలను నమిత, ఆమె కూతురు నీహారిక దగ్గరుండి జరిపించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment