నిలువెత్తు కవితాత్మకతకు ప్రతిరూపం అటల్
కవితాత్మక ప్రసంగాలతో మంత్రముగ్దుల్ని చేసే చాతుర్యం వాజ్‌పేయికి వెన్నతో పెట్టిన విద్య. తేలికైన పదాలతో బరువైన భావాలను వెల్లడించే మాటలకు ఆయన పెట్టింది పేరు. సాహితీ రంగంలోనూ అటల్ తనదైన ముద్ర వేశారు. హిందూ పురాణాల సారాన్ని నింపుకున్న ఆయన వాక్యాలకు పార్లమెంటులో పార్టీలకు అతీతంగా సభ్యులంతా సలామ్ కొట్టేవారు. ఆయన రాజకీయ ప్రసంగాలు కూడా సాహితీ సౌరభాలు వెదజల్లేవి. తాను అధికారంలో ఉండగా విపక్షాలు చేసే విమర్శలకు హుందాగా, చమత్కారంగా బదులిచ్చేవారు. ‘మనసారా మాట్లాడండయ్యా’ అంటూ తోటివారిని ప్రోత్సహించేవారు.
చిరస్మరణీయ ప్రసంగం
ప్రజాస్వామ్యంపై వాజ్‌పేయికి ఉన్న అపార నమ్మకం ఆయన దార్శనికతలో తొణికిసలాడేది. తన తొలి ప్రభుత్వం 13 రోజులకే కూలిన సందర్భంలో 1996 మే 27న ఆయన పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం మరపురానిది! దాన్ని నాటి పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నేతలు నేటికీ గుర్తు చేసుకుంటారు. ఎమర్జెన్సీ వేళ జైలు జీవితం గడుపుతూ రాసిన కవితలతో ‘ఖైదీ కవి కుండలీ’ అనే కవితా సంకలనం రచించారు. ‘అమరత్వం అగ్ని లాంటిది’, ‘నా 51 కవితలు’ వంటి పలు సంకలనాలు వెలువరించారు. ‘కవిత్వం రాసుకునేంత సమయాన్ని కూడా రాజకీయాలు మిగల్చలేదు. నా కవితా వర్షపుధార రాజకీయ ఎడారిలో ఇంకిపోయింది’ అని ఓసారి వాపోయారు. ధోతీ, కుర్తాలో నిండుగా కనిపించే అటల్ ఖాళీ సమయాల్లో కవితలు రాస్తూ సాహిత్యంతో దోస్తీ చేసేవారు.
అవుంటేనే కవిత
వాజ్‌పేయి సరదా మనిషి. ‘‘కవిత్వం రాయాలంటే అనువైన వాతావరణముండాలి. మనసు లగ్నం చేయగలగాలి. మనల్ని ఆవిష్కరించుకునే సమయం చిక్కాలి. ఈ రణగొణ ధ్వనుల మధ్య అవెలా సాధ్యం?’’ అన్నారోసారి. కొంతమేర సాహిత్య కృషి చేసినా పెద్దగా రాణించలేదంటూ తెగ బాధపడేవారట. ‘‘కవిత్వంలో నేను చేసింది సున్నా. అసలు రాజకీయాల గడప తొక్కక పోయుంటే హాయిగా కవితలు రాసుకుంటూ, కవి సమ్మేళనాల్లో పాల్గొంటూ ముషాయిరాల్లో మునిగి తేలుతూ గడిపేవాడిని’’ అంటూ తరచూ అంతర్మథనానికి లోనయ్యేవారు.
Comments
Please login to add a commentAdd a comment