హైదరాబాద్‌లో జరిగినవాజ్‌పేయి స్మారకోపన్యాసంలో బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది
సిద్ధాంతానికి కట్టుబడ్డ వ్యక్తి వాజ్‌పేయి అని కొనియాడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖ్యులని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది కొనియాడారు. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మారకోపన్యాసంలో త్రివేది ప్రసంగించారు.
దేశ చరిత్రలో ఇప్పటివరకు నాయకులుగా పుట్టి ప్రధాని పగ్గాలు చేపట్టింది ఇద్దరేనని.. వారిలో వాజ్‌పేయి అయితే మరొకరు నరేంద్ర మోదీ అన్నారు. వాజ్‌పేయి ఆలోచలను ప్రధాని మోదీ అనుసరిస్తున్నారని త్రివేది చెప్పారు. దేశంలో మౌలికవసతుల కల్పనకు వాజ్‌పేయి బీజం వేస్తే దాన్ని మోదీ వటవృక్షం చేశారన్నారు.
విద్యతోపాటు, నైపుణ్యం, డిజిటల్ విద్య, డిజిటల్ ఎకానమీ వరకు అన్నింటినీ గ్రామాల చెంతకు చేర్చారని ప్రశంసించారు. నాటి వాజ్‌పేయి ప్రభుత్వం దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రస్తుతం మోదీ సర్కారు అణ్వాయుధాలను భూమ్యాకాశాల నుంచి ప్రయోగించే సామర్థ్యానికి తీసుకెళ్లిందని గుర్తుచేశారు.
అందరినీ మెప్పించిన నేత వాజ్‌పేయి: కిషన్‌రెడ్డి
అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పాయ్ పేరు కాదని, ఒక చరిత్ర అని అన్నారు. దేశ ప్రధానిగా, కేంద్రమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధినేతగా వేలెత్తి చూపించలేని పనితీరుతో అందరినీ మెప్పించారన్నారు. చివరి శ్వాస వరకు జాతీయ వాదానికి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. అటల్‌జీ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామన్నారు.
మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ వాజ్‌పేయిని ప్రజలు దేశానికి ఒక కాంతిరేఖగా గుండెల్లో దాచుకున్నారన్నారు. అలాంటి వ్యక్తి పాలనలో పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, వాజ్‌పేయి ఫౌండేషన్ చైర్మన్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment