‘ఆదర్శం’.. వీర్నపల్లి | veernapally develpment top | Sakshi
Sakshi News home page

‘ఆదర్శం’.. వీర్నపల్లి

Published Thu, Sep 1 2016 7:29 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

‘ఆదర్శం’..  వీర్నపల్లి

‘ఆదర్శం’.. వీర్నపల్లి

  • నాడు నక్సల్స్‌ ప్రభావిత ఖిల్లా... నేడు అభివృద్ధిలో దూసుకెళుతున్న పల్లె
  • సారా తయారీ బంద్‌.. సంపూర్ణ మద్యపాన నిషేధం 
  • ఫోన్‌ సౌకర్యం కూడా లేని పల్లెలో నేడు 3జీ సేవలు
  • ఆదర్శ గ్రామాల్లో దేశంలోనే వీర్నపల్లికి 11వ స్థానం
  • ప్రకటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ :  వీర్నపల్లి... ఈ పేరు వినగానే ఒకనాడు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంగా, పోలీసు బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లిన గ్రామమే గుర్తుకొస్తుంది. నక్సల్స్, పోలీసుల కాల్పుల్లో 17 మంది యువకులు బలైన విషాదం గుండెలను పిండుతుంది. బతుకుదెరువుకు నాటుసారాను నమ్ముకున్న గిరిజనులను అదే నాటుసారా ఎనిమిది మందిని కాటేసిన విషయం కన్నీళ్లు పెట్టిస్తుంది. నిన్నటివరకు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం నేడు దేశంలోనే ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. దాని కథేమిటో తెలుసుకోవాలని ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన (సాగి) ఈ గిరిజన పల్లె రూపురేఖలనే మార్చివేసింది. 
    దేశంలోనే 11వ స్థానం.. 
    సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజనలో భాగంగా ఈ గ్రామాన్ని కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ గతేడాది దత్తత తీసుకున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, అక్షరాస్యతాపరంగా అత్యంత వెనుకబడిన ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడమే సాహసం అని చెప్పొచ్చు. సిరిసిల్ల నియోజకవర్గంలోని మారుమూల అటవీ ప్రాంతంలోనున్న ఈ గ్రామం నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం. ఇక్కడి నివసిస్తున్న ప్రజల్లో 98 శాతం దళిత, గిరిజన, బీసీలే. రెండు శాతం మాత్రమే అగ్రవర్ణాల ప్రజలున్నారు. సరైన వ్యవసాయం, ఉపాధి లేక బతుకుదెరువుకు కొందరు దుబాయ్‌ వెళితే, మెజారిటీ కుటుంబాలు నాటుసారానే నమ్ముకున్నారు. గత ఏడాది జనవరి 18న ఈ గ్రామాన్ని సందర్శించిన ఎంపీ వినోద్‌కుమార్‌ తన నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన గ్రామం ఇదేనని భావించారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజనలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఏడాదిన్నరలో ఈ గ్రామ రూపురేఖలు మారుస్తానని ప్రకటించారు. అందుకనుగుణంగా సంవత్సరకాలంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈ గ్రామంలో చేపట్టారు. దేశవ్యాప్తంగా 702 మంది ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు నివేదికలు అందజేశారు. వాటిని పరిశీలించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందులోని వాస్తవాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం దేశవ్యాప్తంగా టాప్‌ 15 గ్రామాల జాబితాను రూపొందించారు. అందులో వీర్నపల్లికి 11వ స్థానం దక్కడం విశేషం. 
    గంగదేవిపల్లి స్ఫూర్తిగా....
    గ్రామాభివృద్ధిలో వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లిని స్ఫూర్తిగా తీసుకున్న ఎంపీ వినోద్‌కుమార్‌ వీర్నపల్లి గ్రామస్తులందరినీ వెంటబెట్టుకుని ప్రత్యేక బస్సుల్లో గంగదేవిపల్లికి తీసుకెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధిని, అమలవుతున్న పథకాలను, గ్రామస్తుల భాగసామ్యాన్ని, జాతీయస్థాయిలో ఈ గ్రామానికి గుర్తింపు రావడానికి గల కారణాలను వీర్నపల్లి వాసులకు అర్థమయ్యేలా వివరించారు. అదే తరహాలో వీర్నపల్లిని అభివృద్ధి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఈ గ్రామంలో ప్రజల స్థితిగతులపై బేస్‌లైన్‌ సర్వేను చేయించారు. గ్రామంలో పారిశుధ్యం, అక్షరాస్యత, సారా నిషేదం, మంచినీటి సరఫరా, ఉపాధిహామీ అమలు కోసం 168 మందితో 18 మంది కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల పర్యవేక్షణలో అభివృద్ధికి బాటలు వేశారు. కలెక్టర్‌ నీతూప్రసాద్‌తో కలిసి పలుమార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
    మారిన ముఖచిత్రం 
    ఎంపీ దత్తత తీసుకున్నాక వీర్నపల్లి ముఖచిత్రమే మారిపోయింది. గ్రామానికి 3జీ సౌకర్యం కల్పించారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో కూడా పిల్లలు పాఠశాల మైదానంలో ఆటలాడుకోగలుగుతున్నారు. నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించిన గ్రామంగా జాతీయ అవార్డుకు పోటీ పడుతోంది. 
    గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. అంతకుముందు బ్యాంకింగ్‌ అవసరాల కోసం స్థానికులు 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. గ్రామీణ బ్యాంకు ఏర్పడ్డాక రూ.1.80 కోట్ల డిపాజిట్లు వచ్చాయి. ఈ బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.1.30 కోట్లు రుణాలను అందజేశారు. గ్రామంలో 1109 మంది మహిళలుండగా వారంతా 80 స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డారు. 2015–16లో రూ.68 లక్షలు, 2016–17లో ఇప్పటివరకు రూ.80 లక్షల మొత్తాన్ని జమ చేశారు. వాసన్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాయితీ విత్తన, వ్యవసాయ, వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
    సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు భూసార పరీక్షలు నిర్వహించి కార్డులను ఆందజేశారు. విత్తనాలను పంపిణీ చేశారు. 80 మంది రైతులతో కలిసి సొసైటీని ఏర్పాటు చేశారు. రైతులకు రూ.80 లక్షల మేరకు పంట రుణాలిచ్చారు. గ్రామంలో భూముల గురించి రెవెన్యూ అధికారులు పూర్తి సర్వే నిర్వహించి బినామీ పేర్లతో ఉన్న పట్టా పుస్తకాలను రద్దు చేశారు. ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్న 191 మంది రైతులకు వారి పేరిట పట్టా పాసుపుస్తకాలు అందజేశారు.
    ఈ గ్రామంలో ఏకంగా 70 మంది యువత పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 200 మందికిపైగా యువత కంప్యూటర్‌లో నైపుణ్యత సాధించారు. 25 మందికి ముద్ర రుణాల పేరిట రూ.20 లక్షలిచ్చారు. పీఎంజేజేవై కింద 600 మంది, పీఎంఎస్‌బీవై కింద 3వేల మందికి బ్యాంకు ఖాతాలు ప్రారంభించారు. 65 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. 
    పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిరంతరం వాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 23 స్వయం సహాయ సంఘాల సభ్యులకు 50 శాతం సబ్సిడీ చొప్పున 54 యూనిట్ల కోడిపిల్లలను, 23 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.30 వేల విలువ చేసే గొర్రెపిల్లలను 50 శాతం సబ్సిడీపై అందజేశారు. 20 కుటుంబాలకు 50 శాతం సబ్సిడీపై 40 గేదెలను అందించారు. మరో 50 కుటుంబాలకు వంద గేదెలను మంజూరు చేశారు. తద్వారా ప్రతిరోజు ఈ గ్రామంలో వెయ్యి లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. 45 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతోపాటు కుట్టుమిషన్లను అందజేశారు. గ్రామంలోని అన్ని కుటుంబాలకు ఆమ్‌ ఆద్మీ బీమా యోజన, అభయహస్తం పథకాలను వర్తింపజేశారు. 
     
    అభివృద్ధి పనులివీ.. 
    గ్రంథాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. 
    మిషన్‌ కాకతీయ కింద వెంకటరాయని చెరువు పునరుద్ధరించారు. 
    రూ.68 లక్షలతో అంగన్‌వాడీ, రూ.13 లక్షలతో పంచాయతీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. 
    గ్రామంలో 500 మీటర్ల మేరకు సీసీ రోడ్ల నిర్మాణం
    రూ.52 లక్షలు ఖర్చుతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చారు.
    ఎన్టీపీసీ సహకారంతో పాఠశాలకు ప్రహారీగోడను నిర్మిస్తున్నారు. 
    చుట్టుపక్కలనున్న ఎనిమిది తండాల నుంచి వీర్నపల్లికి వచ్చేందుకు అనువుగా రూ.9 కోట్ల వ్యయంతో రింగురోడ్డును నిర్మిస్తున్నారు. 
    గతంలో ఈ గ్రామంలో ఒకే రేషన్‌ దుకాణం ఉండేది. ఎంపీ దత్తత తీసుకున్నాక అదనంగా మరో రేషన్‌ దుకాణాన్ని ఏర్పాటు చేశారు.
    స్థానికంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌ అవుట్‌లెట్‌ మంజూరైంది. 
     
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement