సాక్షి, వేములవాడ: అనుమానం..వేధింపులు పెరిగిపోవడంతో భర్తను భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గతనెల21న అగ్రహారం గుట్టల్లో వ్యక్తి శవమై కనిపించిన లక్ష్మణ్ (27)ను అతడి భార్య మౌనిక (25)నే కడతేర్చిందని ఆరోపిస్తూ గురువారం వీర్నపల్లి గ్రామస్తులు వేములవాడ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం... వీర్నపల్లికి చెందిన మంచాల లక్ష్మణ్ (27) ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. నాలుగేళ్లక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మాణం పనులు కొనసాగుతున్న క్రమంలో సెల్‌ఫోన్లో సంభాషణపై దృష్టి పెట్టాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని, ఎవరితో నీకు సంబంధాలు ఉన్నాయని, నీకు వ్యాధి సోకిందని నిత్యం వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. తనకు చెకప్ చేయించాలని మౌనిక భర్తను ప్రాధేయపడింది. లక్ష్మణ్‌కు భార్య మౌనిక ప్రవర్తనపై రోజురోజుకు అనుమానాలు పెరిగిపోయాయి. దీంతో నిత్యం గొడవలు జరగడం కొనసాగాయి.
ఈ క్రమంలో గతనెల16న కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనంకోసం లక్ష్మణ్, మౌనికతోపాటు కుమారుడు, కూతురు వెళ్లారు. అంజన్నను దర్శించుకుని వేములవాడకు చేరుకుని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. 17న ఉదయం ఇద్దరు పిల్లల్ని లాడ్జి వద్దనే ఉంచి భార్యభర్తలిద్దరూ అగ్రహారం ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భర్తతో చనువుగా మాట్లాడుతూ అగ్రహారం గుట్టపై ఉన్న క్వారీ వద్దకు తీసుకెళ్లింది. అప్పటికే మద్యంలో తాను వెంట తెచ్చిన గడ్డి ముందు కలిపి లక్ష్మణ్‌కు తాగించి గుట్టపైనుంచి నెట్టేసి చంపినట్లు అనుమానిస్తున్నారు.
మంచాల లక్ష్మణ్(ఫైల్): గతనెల 21న అగ్రహారం గుట్టల్లో లభ్యమైన మృతదేహం
అనంతరం వీర్నపల్లికి చేరుకున్న మౌనిక తన భర్త లక్ష్మణ్ తిరిగి గల్ఫ్‌కు వెళ్లాడని చెప్పింది. అనుమానం వ్యక్తం చేసిన లక్ష్మణ్ కుటుంబసభ్యులు, బంధువులు మౌనికపై ఒత్తిడి పెంచారు. పలుమార్లు హెచ్చరించడంతో గతనెల 29న పోలీస్‌స్టేషన్‌లో తన భర్త లక్ష్మణ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు 30న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మౌనికను విచారణ చేపట్టగా జరిగిన విషయం పోలీసులకు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు వేములవాడలోని పలు ప్రాంతాలను గురువారం పరిశీలించినట్లు తెలిసింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వీర్నపల్లి గ్రామస్తులు ఠాణా నుంచి వెళ్లిపోయారు. కాగా హత్య ప్రమేయంలో మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎవరేది పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment