missing case filed
-
Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి!
జిన్నారం/పటాన్చెరు టౌన్/కేపీహెచ్‌బీ (హైదరాబాద్): హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. సగానికి పైగా కాలిన స్థితిలో ఉన్న శవాన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ప్రేమ వివాహమే ఈ ఘోరానికి కారణంగా తెలుస్తోంది. మాట్లాడుకుందాం రమ్మంటూ యువకుడిని పిలిచిన యువతి బంధువు ఫుల్లుగా మద్యం తాగించి, మరొకరి సహకారంతో గొంతు నులిమి హత్య చేసి శివారు అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశారు. కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో.. కేపీహెచ్‌బీ, జిన్నారం సీఐలు కిషన్‌కుమార్, వేణు కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా పొదల కొండపల్లికి చెందిన శనివారపు బాలిరెడ్డి కుమారుడు నారాయణ రెడ్డి (25) ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ ఒకటిలోని ఓ ఇంట్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 27న రాత్రి 9 గంటల సమయంలో తాను శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని కలిసేందుకు వెళుతున్నట్లు చెప్పి బయటకు వెళ్లిన నారాయణరెడ్డి తిరిగిరాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో అతని స్నేహితులు నారాయణరెడ్డి బావ వెంకటేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. ఆయన గత నెల 30న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని గ్రామానికే చెందిన కారు డ్రైవర్ షేక్ ఆషిక్‌లపై నిఘా పెట్టారు. తర్వాత ఆషిక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా నారాయణ రెడ్డిని హత్య చేసి సంగారెడ్డి జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా గుర్తించారు. వెంటనే 80 శాతం దహనమైన స్థితిలో ఉన్న నారాయణ రెడ్డి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబీకులు నారాయణరెడ్డి ఏడాది కిందట తన స్వగ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యువతి కుటుంబీకులు వారి వివాహాన్ని అంగీకరించకపోగా యువతిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయినా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో యువతి కుటుంబీకులు నారాయణ రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నారాయణ రెడ్డిని అతని గది నుంచి బయటకు రప్పించిన పొదల కొండపల్లికే చెందిన యువతి బంధువు శ్రీనివాస్ రెడ్డి.. ఆషిక్ కారులో రాయదుర్గం తీసుకెళ్లాడు. అక్కడ అతనికి మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు జిన్నారం ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆషిక్, శ్రీనివాస్‌రెడ్డితో పాటు హత్యోదంతంలో పాల్గొన్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. యువతి కుటుంబసభ్యులు మరికొందరి ప్రమేయం పైనా, సుపారీ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సభ: సోమవారం ఉదయం వరకు ఆ రోడ్డు మూసివేత -
అమ్మా.. నాన్నా..! నన్ను క్షమించండి..
‘అమ్మా.. నాన్నా..! నన్ను క్షమించండి.. నేను దేవుడి దగ్గరికి వెళ్లిపోతున్నా.. ఇలా చేసినందుకు బాధపడకండి.. మీ అంత గొప్ప తల్లిదండ్రులకు బిడ్డగా ఉండే హక్కు నాకు లేదు’ అంటూ మండలంలోని మార్జేపల్లెకు చెందిన గణేష్ (20) లేఖ రాసి అదృశ్యమైన సంఘటన గంగవరం మండలంలో కలకలం రేపింది. వారం కిందట జరిగిన ఈ ఉదంతం బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. గంగవరం: మండలంలోని మార్జేపల్లెకు చెందిన డిగ్రీ విద్యార్థి గణేష్ తాను దేవుడి దగ్గరికి పోతున్నానని లేఖ రాసి అదృశ్యమైన ఘటన తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. గ్రామస్తులు, పోలీసుల కథనం.. మార్జేపల్లెకు చెందిన శివశంకర్, పద్మజ దంపతులకు గణేష్ మొదటి సంతానం. ఇతను మండల కేంద్రానికి సమీపంలోని ఓ కళాశాలలో బీకాం డిగ్రీ ఫైనల్ చదువుతున్నాడు. చదువుపై బాగా శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించేవాడు. ఇతర సాంఘిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. వ్యవసాయం, ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ చక్కగా మసలుకునేవాడు. ఈనెల 21వ తేదీ రాత్రి నోట్‌బుక్‌లో రెండు పేజీల లేఖను రాసి అదృశ్యమయ్యాడు. మోటార్ సైకిల్, సెల్‌ఫోన్, కళాశాల పుస్తకాల బ్యాగ్ కూడా కనిపించలేదు. అప్పటి నుంచి అతడు ఎక్కడున్నాడో..ఏమయ్యాడోనని నిద్రాహారాలు మాని తల్లిదండ్రులు, బంధువులు పలుప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియక పోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఫొటో పోస్టు చేశారు. కుమారుడు లేని ఇంట్లో తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్లను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. అతడు రాసి రెండు పేజీల లేఖ చర్చనీయాంశమైంది. అన్నికోణాల్లో దర్యాప్తు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. సెల్ ఫోన్ ఐఎంఏ ద్వారా ఆచూకీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. –సుధాకర్‌రెడ్డి, ఎస్ఐ లేఖలోని ముఖ్య సారాంశం ‘నాన్న! నన్ను క్షమించండి. నేను దేవుని దగ్గరకు వెళ్లిపోతున్నా.. నేను ఎంత మరిచిపోదామనుకున్నా ఈ బాధ రోజురోజుకూ నరకం చూపిస్తోంది. నటించడం ఇక నావల్ల కాదు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుట్టాలని ఉంది. మరో జన్మలో అయినా మీరు చెప్పినట్టు నడుచుకునేట్టు ఆ దేవుడిని వరం అడుగుతా. అమ్మా.. నా కోసం మీరు ఎంత ఏడ్చినా నేను ఎక్కడా ఆనందంగా ఉండలేను. నేను అసలు పుట్టనే లేదనుకో. మా తమ్ముడు జాగ్రత్త. వాడే నేననుకో. నాన్నా.. నీకు ఒకవేళ నేను తలవంపులు తెచ్చింటే నన్ను క్షమించు. తమ్ముడికి కొడుకుగా పుడతా.. మళ్లీ నువ్వే నన్ను పెంచి పెద్ద చేయాలి. అప్పుడే నువ్వు చెప్పినట్టు వింటాను. నేను ఎవరినీ సాధించడానికి ఈ పని చేయలేదు.త మ్ముడూ.. అమ్మానాన్నకు ఇక అన్నీ నువ్వే.’ అంటూ రాసిన ఆ రెండు పేజీల లేఖ ఆ కన్నవారికి తీరని వ్యథ మిగిల్చింది. -
సరూర్‌నగర్‌లో మిస్సింగ్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : చేవూరి విద్యాసాగర్ రావు అనే వ్యక్తిపై రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా ఈ నెల 10 నుంచి విద్యాసాగర్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరూర్ నగర్‌లోని బాపూ నగర్లో ఉంటున్న విద్యాసాగర్ రావు ఇద్దరు పిల్లలు. భార్య ఉపాద్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తనకు అవమానం జరిగిందని దీంతో తీవ్రంగా ఆవేదన చెందాడనీ.. ఆ తర్వాత అప్పుడప్పుడు మతిస్థిమితం తప్పినట్టుగా ప్రవర్తిస్తుంటాడని కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఓ పెళ్లి వివాహానికి వెళ్లి వచ్చే తండ్రి ఇంట్లో కనింపించడం లేదని, తమ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో లభించిన దృశ్యాలను పరిశీలిసంచగా కొత్తపేటలో చివరిసారిగా కనిపించాడని ఆయన కుమారుడు పోలీసులకు తెలిపారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు 9703521011 నెంబర్‌కు గానీ, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దీనిపై ఫిర్యాదు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానిస్తున్నాడని చంపేసింది?
సాక్షి, వేములవాడ: అనుమానం..వేధింపులు పెరిగిపోవడంతో భర్తను భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గతనెల21న అగ్రహారం గుట్టల్లో వ్యక్తి శవమై కనిపించిన లక్ష్మణ్ (27)ను అతడి భార్య మౌనిక (25)నే కడతేర్చిందని ఆరోపిస్తూ గురువారం వీర్నపల్లి గ్రామస్తులు వేములవాడ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం... వీర్నపల్లికి చెందిన మంచాల లక్ష్మణ్ (27) ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. నాలుగేళ్లక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మాణం పనులు కొనసాగుతున్న క్రమంలో సెల్ఫోన్లో సంభాషణపై దృష్టి పెట్టాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని, ఎవరితో నీకు సంబంధాలు ఉన్నాయని, నీకు వ్యాధి సోకిందని నిత్యం వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. తనకు చెకప్ చేయించాలని మౌనిక భర్తను ప్రాధేయపడింది. లక్ష్మణ్‌కు భార్య మౌనిక ప్రవర్తనపై రోజురోజుకు అనుమానాలు పెరిగిపోయాయి. దీంతో నిత్యం గొడవలు జరగడం కొనసాగాయి. ఈ క్రమంలో గతనెల16న కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనంకోసం లక్ష్మణ్, మౌనికతోపాటు కుమారుడు, కూతురు వెళ్లారు. అంజన్నను దర్శించుకుని వేములవాడకు చేరుకుని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. 17న ఉదయం ఇద్దరు పిల్లల్ని లాడ్జి వద్దనే ఉంచి భార్యభర్తలిద్దరూ అగ్రహారం ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భర్తతో చనువుగా మాట్లాడుతూ అగ్రహారం గుట్టపై ఉన్న క్వారీ వద్దకు తీసుకెళ్లింది. అప్పటికే మద్యంలో తాను వెంట తెచ్చిన గడ్డి ముందు కలిపి లక్ష్మణ్‌కు తాగించి గుట్టపైనుంచి నెట్టేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. మంచాల లక్ష్మణ్(ఫైల్): గతనెల 21న అగ్రహారం గుట్టల్లో లభ్యమైన మృతదేహం అనంతరం వీర్నపల్లికి చేరుకున్న మౌనిక తన భర్త లక్ష్మణ్ తిరిగి గల్ఫ్‌కు వెళ్లాడని చెప్పింది. అనుమానం వ్యక్తం చేసిన లక్ష్మణ్ కుటుంబసభ్యులు, బంధువులు మౌనికపై ఒత్తిడి పెంచారు. పలుమార్లు హెచ్చరించడంతో గతనెల 29న పోలీస్‌స్టేషన్‌లో తన భర్త లక్ష్మణ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు 30న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మౌనికను విచారణ చేపట్టగా జరిగిన విషయం పోలీసులకు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు వేములవాడలోని పలు ప్రాంతాలను గురువారం పరిశీలించినట్లు తెలిసింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వీర్నపల్లి గ్రామస్తులు ఠాణా నుంచి వెళ్లిపోయారు. కాగా హత్య ప్రమేయంలో మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎవరేది పోలీసులు విచారిస్తున్నారు. -
పెళ్లైన నెలకే భర్త అదృశ్యం
అనంతపురం, పుట్టపర్తి అర్బన్: పెళ్లైన నెల రోజులకే భర్త అదృశ్యమయ్యాడు. తన భర్త ఆంజనేయులు ఆచూకీ తెలపాలని వెంకటగారిపల్లికి చెందిన గంగమ్మ బుధవారం పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధనుంజయ పేర్కొన్నారు. నవంబర్ రెండో తేదీన ఓడీసీ మండలం సున్నంపల్లి పంచాయతీ పెద్దగుట్లపల్లికి చెందిన గంగులప్ప వెంకటలక్ష్మమ్మ కుమారుడు ఆంజనేయులుతో గంగమ్మకు వివాహమైంది. నూతన దంపతులు గంగమ్మ చెల్లెలు రమణమ్మ గ్రామమైన గోరంట్ల మండలం బుగ్గపల్లికి నవంబర్ 22న వెళ్లారు. పది రోజులు అక్కడే సంతోషంగా గడిపారు. డిసెంబర్ మూడో తేదీ సాయంత్రం ఐదు గంటలకు బుగ్గపల్లి నుంచి వెళ్లిన ఆంజనేయులు తిరిగి రాలేదు. మొబైల్ ఫోన్ కూడా పని చేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. బంధువుల ఇళ్లు, స్నేహితుల ఇళ్లు పలు గ్రామాల్లో వెదికినా ఎక్కడా జాడ కనిపించలేదు. తన భర్త ఆచూకీ తెలపాలని గంగమ్మ పోలీసులను కోరారు. ఆచూకీ తెలిసిన వారు 95352 38979, 83099 75202 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
పవర్‌స్టార్ కిడ్నాపయ్యారా?
పెరంబూరు: నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ ను కందువడ్డీ వ్యాపారులు కిడ్నాప్ చేశారా? ఆయన కూతురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రను పోషించి ప్రాచుర్యం పొందారు. అయితే ఈయనపై పలు ఆర్థిక పరమైన కేసులు ఉన్నాయి. ఆ మధ్య అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకు కూడా వెళ్లి బెయిల్‌పై తిరిగొచ్చారు. గురువారం ఉదయం పవర్‌స్టార్ శ్రీనివాసన్ అనూహ్యంగా కనిపించకుండాపోయారు. దీంతో ఆయన భార్య అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు శ్రీనివాసన్‌కు ఫోన్ చేయగా తాను ఊటీలో ఉన్నట్లు చెప్పారు. ఆయకు అక్కడ ఒక బంగ్లా ఉంది. దాన్ని అమ్మే విషయమై వెళ్లినట్లు సమాచారం. శనివారం ఉదయం శ్రీనివాసన్ కూతురు వైష్ణవి చెన్నైలో విలేకరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె గత 5వ తేదీన పోలీసులమని చెప్పి కొందరు తన తండ్రిని నగరంలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లారని కారు డ్రైవర్ చెప్పినట్లు తెలిపింది. దీంతో తాను వెంటనే తన తండ్రి సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ అని వచ్చిందంది. ఆ రోజు సాయంత్రం తన తండ్రి ఫోన్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి చెన్నైలోని ఒక ఆస్పత్రి వద్దకు రావలసిందిగా చెప్పాడని తెలి పింది. తన తల్లి ఆ ప్రాంతానికి వెళ్లగా ఆస్తులకు సంబంధించిన వివరాలను వాయిస్ రికార్డు చేసి నీ భర్తను పంపేస్తామని వాళ్లు చెప్పినట్లు తెలిపిం ది. బెంగళూర్‌కు చెందిన ఒక వడ్డీ వ్యాపారి వద్ద తన తండ్రి డబ్బు అప్పు తీసుకున్నారని, ఆ వ్యక్తే తన తండ్రిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని వైష్ణవి అం ది. పోలీసులు తన తండ్రి వ్యవహారం గురించి పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. -
మరో 24 గంటల్లో పెళ్లి.. పెళ్లి కుమారుడి అదృశ్యం
కడప అర్బన్ : మరో 24 గంటల్లో పెళ్లి అనగా గురువారం కనిపించకుండా పోయిన పెళ్లికుమారుడు, అతని తండ్రిపై శుక్రవారం చిన్నచౌక్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ నగర్లో నివాసం ఉంటున్న ఓ యువతికి, గాజుల వీధి నివాసి రామసుబ్బయ్య, స్వర్ణకుమారీ కుమారుడు వెంకట ఫణీంద్ర కుమార్‌కు శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య వివాహం జరగనుంది. అయితే 30 వ తేదీన ఉదయం పెళ్లికుమార్తె బంధువులు కార్యక్రమాల గురించి మాట్లాడుకునేందుకు గాజుల వీధిలోని పెళ్లికుమారుని ఇంటికి వెళ్లారు. ఐతే ఆ సమయంలో వెంకట ఫణీంద్రకుమార్, అతని తండ్రి రామసుబ్బయ్యలు కనిపించకుండా పోయారు. దీంతో ఆవేదనతో గురువారం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. ఎట్టకేలకు యువతి, వారి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చిన్నచౌక్ ఎస్ఐ మోహన్ తెలిపారు. వరుడు హైకోర్టులో టైపిస్ట్‌గా పని చేస్తున్నాడు. కాగా ఇతనికి కట్నకానుకల కింద రూ. 15 లక్షలు ఇచ్చారు. -
అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు, ఓ బాలుడి ఆచూకీ లభ్యమైంది. ముంబయి సమీపంలోని కళ్యాణ్ పట్టణంలో చిన్నారులను గుర్తించినట్లు బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో కనిపించిన చిన్నారులను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి వారిని అక్కున చేర్చుకుంది. స్వచ్ఛంద సంస్థ సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సహా చిన్నారుల కుటుంబ సభ్యులు కళ్యాణ్ బయల్దేరి వెళ్లినట్లు సమాచారం. అసలు విషయం ఏంటంటే.. ఇంటి నుంచి వెళ్లిపోతున్నామంటూ ఇద్దరు బాలికలు, ఓ బాలుడు లేఖ రాసిపెట్టి అదృశ్యం కావడం నగరంలోని టోలీచౌకీలో కలకలం రేపింది. 'అమ్మా.. నాన్నా మీకు భారం కాము.. మీకు దూరంగా వెళ్లిపోతున్నాం.. అందరూ పిల్లల లాగే మేము ఉంటాం..' అంటూ ఈ ముగ్గురు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆపై ముంబయి వెళ్తున్నామంటూ ఫోన్ చేయడంతో కుటుంబసభ్యులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టోలీచౌకీకి చెందిన కైఫ్ సబెరి (11), అస్మా సబెరి (12), హాఫ్సా సబెరి (15)ల అదృశ్యంపై విచారణ చేపట్టిన క్రమంలోనే ముంబయి నుంచి ఫోన్ చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ ముగ్గురి సమాచారం అందించింది. వారికి నగరానికి తీసుకొచ్చేందుకు పోలీసులు, చిన్నారుల కుటుంబసభ్యులు కళ్యాణ్‌కు వెళ్లారు. -
ఆరు నెలల ముందు అదృశ్యం.. అస్థిపంజరమై ప్రస్తుతం
భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం సమీప అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు శవమై కనిపించాడు. భీమ్‌గల్‌కు చెందిన అడపా భూమన్న (41) ఆరు నెలల క్రితం అదృశ్యం కాగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, శుక్రవారం మెండర గ్రామ సమీపంలోని షీర్ల గుట్టపై ఓ చెట్టుకు అస్థిపంజరం వేలాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ అస్థిపంజరం భూమన్నదిగా గుర్తించారు. చాలా రోజుల క్రితమే చెట్టుకు ఉరివేసుకోవడం వల్ల చివరికి అస్తిపంజరం మిగిలినట్లు భావిస్తున్నారు.