
అదృశ్యమైన ఆంజనేయులు
అనంతపురం, పుట్టపర్తి అర్బన్: పెళ్లైన నెల రోజులకే భర్త అదృశ్యమయ్యాడు. తన భర్త ఆంజనేయులు ఆచూకీ తెలపాలని వెంకటగారిపల్లికి చెందిన గంగమ్మ బుధవారం పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధనుంజయ పేర్కొన్నారు. నవంబర్ రెండో తేదీన ఓడీసీ మండలం సున్నంపల్లి పంచాయతీ పెద్దగుట్లపల్లికి చెందిన గంగులప్ప వెంకటలక్ష్మమ్మ కుమారుడు ఆంజనేయులుతో గంగమ్మకు వివాహమైంది.
నూతన దంపతులు గంగమ్మ చెల్లెలు రమణమ్మ గ్రామమైన గోరంట్ల మండలం బుగ్గపల్లికి నవంబర్ 22న వెళ్లారు. పది రోజులు అక్కడే సంతోషంగా గడిపారు. డిసెంబర్ మూడో తేదీ సాయంత్రం ఐదు గంటలకు బుగ్గపల్లి నుంచి వెళ్లిన ఆంజనేయులు తిరిగి రాలేదు. మొబైల్ ఫోన్ కూడా పని చేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. బంధువుల ఇళ్లు, స్నేహితుల ఇళ్లు పలు గ్రామాల్లో వెదికినా ఎక్కడా జాడ కనిపించలేదు. తన భర్త ఆచూకీ తెలపాలని గంగమ్మ పోలీసులను కోరారు. ఆచూకీ తెలిసిన వారు 95352 38979, 83099 75202 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.