
కడప అర్బన్ : మరో 24 గంటల్లో పెళ్లి అనగా గురువారం కనిపించకుండా పోయిన పెళ్లికుమారుడు, అతని తండ్రిపై శుక్రవారం చిన్నచౌక్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ యువతికి, గాజుల వీధి నివాసి రామసుబ్బయ్య, స్వర్ణకుమారీ కుమారుడు వెంకట ఫణీంద్ర కుమార్‌కు శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య వివాహం జరగనుంది.
అయితే 30 వ తేదీన ఉదయం పెళ్లికుమార్తె బంధువులు కార్యక్రమాల గురించి మాట్లాడుకునేందుకు గాజుల వీధిలోని పెళ్లికుమారుని ఇంటికి వెళ్లారు. ఐతే ఆ సమయంలో వెంకట ఫణీంద్రకుమార్, అతని తండ్రి రామసుబ్బయ్యలు కనిపించకుండా పోయారు. దీంతో ఆవేదనతో గురువారం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. ఎట్టకేలకు యువతి, వారి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చిన్నచౌక్ ఎస్‌ఐ మోహన్ తెలిపారు. వరుడు హైకోర్టులో టైపిస్ట్‌గా పని చేస్తున్నాడు. కాగా ఇతనికి కట్నకానుకల కింద రూ. 15 లక్షలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment