Kadapa Crime News
-
ట్రేడింగ్‌లో మోసాలకు పాల్పడిన ముగ్గురికి రిమాండ్
సాక్షి, వైఎస్సార్ కడప: ఆన్లైన్ ట్రేడింగ్‌లో 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కానీస్టెబుల్ ఈశ్వర్ మోసపోవడంతో రాజంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అధిక లాభాలు గడించవచ్చనే ఆశతో కానిస్టేబుల్ ఈశ్వర్ అప్పు చేసిన ఆన్లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. దీంతో పీటీ వారెంటుతో నిందితులను పోలీసులు హైదరాబాద్ నుంచి రాజంపేటకు తీసుకువచ్చారు. నిందితుల్లో ఒకరూ చైనా దేశస్థుడు కాగా మరో ఇద్దరూ ఇండియాకు చెందిన హర్యానా వాసులుగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం నందలూరు జేఎఫ్ఎం కోర్టులో నిందితులను ప్రవేశపెట్టగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. -
కర్ణాటక గ్యాంగ్ ఘరానా మోసం
-
ఏవి సుబ్బారెడ్డి హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు
సాక్షి, వైఎస్సార్ కడప : ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి హత్య కుట్రను చిన్న చౌక్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కడప డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.. ఏవి సుబ్బారెడ్డిని హతమార్చేందుకు నిందుతులు రూ.50లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. నిందితులు ముగ్గురు కర్నూలు జిల్లాకు చెందినవారేనని పేర్కొన్నారు. కడపలో హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 3.20 లక్షల నగదు, ఒక పిస్టల్, 6 తూటాలు, రెండు సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులపై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు, సంజురెడ్డి అనే నిందితుడు సూడో నక్సలైట్‌గా తేలింది. ఇప్పటికే రెండుసార్లు సుబ్బారెడ్డి ఇంటిని రెక్కి చేసిన నిందితులు.. ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులకు బయపడి వెనక్కి వచ్చారు. -
బద్వేలులో సవతి తండ్రి దారుణం
బద్వేలు అర్బన్ : కంటికి రెప్పలా కూతురిని కాపాడాల్సిన ఓ సవతి తండ్రి కామాంధుడిలా మారాడు. బద్వేలు పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే ..తమిళనాడుకు చెందిన చిత్ర అనే ఓ మహిళకు 15 ఏళ్లక్రితం అక్కడే ఓ వ్యక్తితో వివాహమైంది. ఏడాది తర్వాత చిత్ర గర్భవతిగా ఉన్న సమయంలో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత ఆడబిడ్డకు జన్మనిచ్చిన చిత్ర నెలల పాపతో జిల్లాలోని ప్రొద్దుటూరుకు వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ సమయంలో బాలకృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.ఇరువురు బద్వేలులోని సుందరయ్యకాలనీ సమీపంలోని ఓ ఇంటిలో సహజీవనం చేస్తూ అక్కడే ఉన్న ఓ కొబ్బరిపీచు తయారు చేసే పరిశ్రమలో పనిచేస్తుండేవాడు. బాలకృష్ణ కూతురు లాంటి బాలిక(14)పై కన్నేశాడు. చిత్రను బెదిరించి బాలికతో తనకు వివాహం జరిపించాలని వేధిస్తుండేవాడు. కొన్ని రోజులుగా మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వస్తున్న బాలకృష్ణ ఆదివారం రాత్రి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిసింది. భయభ్రాంతులకు గురైన బాధిత బాలిక ఇంటికి వెళ్లే సాహసం చేయక సమీపంలోని ముళ్లపొదల్లో దాక్కుంది. స్థానికులు గుర్తించి ఆరా తీయగా విషయం చెప్పింది. దీంతో స్థానికులు అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రమేష్‌బాబు, రూరల్ ఎస్ఐ లలిత, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో బాలికను విచారించారు. సవతి తండ్రిపై ఐపీసీ 376, సెక్షన్ 4ఆఫ్ఫోక్సోయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రామాపురం మండలం కొండవాండ్లపల్లి సమీపంలో జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవాను లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా... మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. పొద్దుటూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాయచోటికి చెందిన అర్షద్, హజీరా, చిత్తూరు జిల్లాకు చెందిన హరుణ్ బాషా, అఫిరాలు మృత్యువాతపడ్డారు. హజీరా, అర్షద్‌లు రాయచోటికి చెందిన స్టార్ పైపుల షాపు యజమాని కూతురు, అల్లుడు అని సమాచారం. -
తెల్లవారకుండానే తెల్లారిన బతుకులు
కడప కార్పొరేషన్/కడప అగ్రికల్చరల్/చిన్నమండెం/రాయచోటి : మరి కాస్సేపట్లో ఇంటికి చేరుకోనున్న వారంతా అనూహ్యంగా విగతజీవులయ్యారు. తెలతెలవారక ముందే వారి బతుకులు తెల్లవారిపోయాయి. చిన్నమండెం మండలం కేశాపురం చెక్‌పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కుటుంబీకులను శోకసముద్రంలో ముంచింది. నలుగురు ప్రాణాలు తీసిన దుర్ఘటన తీవ్ర విషాదం నింపింది. మృతులలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా మరొకరు వాహన డ్రైవరు. కడప నగరం అంబాభవానీ నగర్‌కు చెందిన జగదీష్(48) కిరాణా వ్యాపారం చేసేవాడు. ఆయన అన్న రాజా కూడా అదే వ్యాపారంలో ఉన్నాడు. వీరి కుటుంబాలు అన్యోన్యతతో కలిసుండేవి. జగదీష్‌కు కుమార్తె పండు..కొడుకు హర్షవర్ధన్ ఉన్నారు. హర్ష ఇటీవలేబీటెక్ పూర్తి చేశాడు. పండుకు వివాహమైంది. ఈ మధ్య ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. బెంగళూరులో చికిత్స పొందుతోంది. ఆమెను చూసి వద్దామని జగదీష్ తన కుమారుడు హర్ష(20), వదిన భూదేవి(45)లతో కలిసి గురువారం ఉదయం బెంగళూరు వెళ్లారు. కారు బాడుగకు మాట్లాడుకుని డ్రైవర్ బాషా(40)ను తీసుకెళ్లారు. కుమార్తెను చూసి గురువారం రాత్రి వీరంతా కడపకు బయలుదేరారు. తెల్లవారుజామున చిన్నమండెం మండలం కేశాపురం చెక్‌పోస్టు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఖాదర్‌బాషా, జగదీశ్వరరావు, భూదేవి తీవ్రంగా గాయపడి అక్కడే ప్రాణాలు విడిచారు. కొనఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్న హర్షవర్ధన్ కాస్సేపు మృత్యుపోరాటం చేశాడు. కేశాపురం గ్రామస్థులు, వాహనాలలో వెళుతున్న ప్రయాణికులు సంఘటన స్థలానికి చేరుకుని హర్షవర్ధన్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నించారు. 108 ద్వారా ఆసుపత్రికి తరలిస్తుండగానే హర్షవర్ధన్ కూడా చనిపోయాడు..కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. మృతుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా మారాయి. అలముకున్న విషాదం ఎదురుగా వస్తున్న లారీని గుర్తించి క్రాస్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. లేదా తెల్లవారుజామున కారు డ్రైవర్ నిద్ర వల్ల రెప్పమూతపడినా ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. చిన్నమండెం సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి చొరవ తీసుకుని స్థానికుల సహకారంతో వాహనాల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీయించారు. లారీ కిందకు దూసుకుపోయిన కారును వెనక్కు లాగినా అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ఏఎస్ఐ నాగరాజు సిబ్బందితో హుటాహుటిన చేరుకున్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె సిఐలు రాజు, యుగందర్‌లు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. కడప నగరంలోని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. మృతదేహాలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పంచనామా అనంతరం సాయంత్రం కడపలోని ఇంటికి మృతదేహాలను తరలించారు. మృతదేహాలు చేరగానే కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కలిసికట్టుగా ఉన్న అన్నదమ్ముల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందంటూ ఇరుగుపొరుగు కన్నీటి పర్యంతమయ్యారు. మరో మృతుడు డ్రైవర్ బాషా ఇంటి వద్ద కూడా విషాదఛాయలు అలముకున్నాయి. -
కాపాడబోయి మృత్యువు ఒడిలోకి
సాక్షి, కొండాపురం(కడప) : నీరు చూడగానే వారిలో ఉత్సాహం పెల్లుబికింది. సరాదాగా ఈత కొడదామని దిగారు. అందులో ఓ వ్యక్తి మునిగిపోతుండటాన్ని చూసి మరొక వ్యక్తి రక్షించాడు. కాస్సేపటికే మరొకరిని కాపాడే యత్నంలో తానూ ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి. చిత్రావతిలో ఈతకు దిగిన ఇద్దరు మరణించిన సంఘటన కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చింది. వివరాలివి. మండలంలోని యనమలచింతల గ్రామంలో పీర్లపండుగ జరుగుతోంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కట్టుబడి హాజివలి ఇంటికి మంగళవారం బం ధువులు వచ్చారు. వీరు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు గ్రామానికి చెందినవారు. వీరిలో అన్వర్‌వలి(14), షేక్. బాబావలి(26) ఉన్నారు. బాబావలి తాడిపత్రిలోని ఎస్‌జెకే స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్యతో పాటు మూడు నెలల పాప ఉంది. అన్వర్ వలి తాడిపత్రిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చిత్రావతిలో నీరు చేరిందనే సంగతి తెలుసుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరిద్దరూ మరో ముగ్గురితో కలిసి సరదాగా ఈతకు వెళ్లారు. ఆలయం దగ్గర నదిలోకి దిగారు. ఇందులో దస్తగిరి అనే వ్యక్తి నీటిలో మునిగిపోతుండగా షేక్ బాబాలివలి గుర్తిం చాడు. వెంటనే స్పందించి కాపాడి బయటకు తీసుకువచ్చాడు. ఇంతలోనే అన్వర్‌వలి అనే బాలుడు కూడా మునిగిపోతూ కేకలు వేశాడు. అతడ్ని కూడా రక్షించాలని బాబావలి వెంటనే నీటిలో దూకాడు. అన్వర్‌వలిని నీటి నుంచి రక్షించి తీసుకువస్తూ పూడికలో చిక్కుకున్నాడు. దీంతో ముందుకు కదలలేకపోయాడు. అన్వర్‌వలి..బాబావలి నీటిలో మునిగిపోయారు. వెంటనే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు అందించిన సమాచారం మేరకు కొందరు చేరుకుని రక్షించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అతిథులుగా వచ్చి విగతజీవులైన వీరిద్దరి మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. గ్రామంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ రాజారెడ్డి చేరుకున్నారు. ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి విషయం తెలుసుకుని వెంటనే హాజివలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహాలకు నివాళులర్పించారు. -
కుందూలో మూడో మృతదేహం లభ్యం
సాక్షి, కడప(రాజుపాళెం) : మండలంలోని కుందూనదిలో గాదెగూడూరుకు చెందిన కాకనూరు వెంకటలక్షుమ్మ (45) మృతదేహాన్ని సోమవారం సాయంత్రం కనుగొని ఒడ్డుకు చేర్చారు. ఇప్పటికే కాకనూరు తిరుపతిరెడ్డి, ఆయన కుమార్తె కాకనూరు ప్రవళిక మృతదేహాలను పోలీసులు కుందూనదిలో కనుగొన్న విషయం తెలిసిందే. గత గురువారం మండలంలోని గాదెగూడూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఈముగ్గురు అదృశ్యంపై రాజుపాళెం ఎస్ఐ లక్ష్మీప్రసాదరెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలూరు–కొట్టాల గ్రామాల మధ్య తిరుపతిరెడ్డి ద్విచక్ర వాహనం ఉండటంతో ఈ ముగ్గురు కుందూనదిలో దూకి ఉండవచ్చునని అనుమానంతో పోలీసులు నదిలో తెప్పల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఐదు రోజులుగా ఎస్ఐ లక్ష్మీప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు మండలంలోని ఏకర్లపాళెంకు చెందిన గజ ఈతగాళ్లు, కర్నూలుకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు, రాజుపాళెం ఏఎస్ఐ సుబ్బారెడ్డి, పోలీసులు చంద్రానాయక్, ఓబులేసు కుందూనదిలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కష్టపడి ముగ్గురి మృతదేహాలను కనుగొన్నారు. ఆ మృతదేహాలు కుందూలో లభ్యం కావడంతో తిరిగి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. ప్రజల నుంచి ఎస్ఐ, పోలీసులకు ప్రశంసలు.. కాకనూరు తిరుపతిరెడ్డి, ఆయన భార్య వెంకటలక్షుమ్మ, కుమార్తె ప్రవళిక మృతదేహాలను కుందూనదిలో నీటి ఉధృతి అధికంగా ఉన్నా కష్టపడి ఐదురోజులుగా గజ ఈతగాళ్ల సాయంతో వెలికితీయడంతో ప్రజలు పోలీసుల తీరును ప్రశంసిస్తున్నారు. -
రైల్వే ప్రయాణికుడి వేషంలో చోరీలు
సాక్షి, కడప అర్బన్ : కడప రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు నగలు, సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడున్న నిమ్మకాయల నరేష్ అనే నిందితుడిని రైల్వే సీఐ మహమ్మద్‌బాబా ఈనెల 22న అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు పంపారు. సోమవారం సీఐ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా యల్లనూరు మండలం, చింతకాయమందకు చెందిన నిమ్మకాయల నరేష్, రైళ్లో జనరల్ టికెట్‌ను తీసుకుని ప్రయాణికుడి వేషంలో ఎక్కుతాడు. పక్క స్టేషన్లలో దిగి ఏసీ బోగీలలో ప్రయాణించేవారిని లక్ష్యంగా చేసుకుంటాడు. అదమరిచి నిద్రించేవారికి సంబంధించిన సెల్ఫోన్లను, బంగారు ఆభరణాలను దొంగిలించి, పరారవుతాడు. అతన్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 15గ్రాముల బంగారు నెక్లెస్, 10 గ్రాముల బంగారుచైన్, రూ. 2000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు. కడప రైల్వే పోలీసు స్టేషన్లో నమోదైన మూడు కేసుల్లో వీటని రికవరీ చేశారు. అతన్ని విచారించగా మరో15 సెల్ఫోన్లు దొరికాయి వీటి మొత్తం విలువ సుమారు రూ. 1.76 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో రైల్వే ఎస్ఐ కెఎస్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర, జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాసరాజు, కానిస్టేబుల్స్ ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసులు, సురేష్‌బాబులు తమ వంతు కృషి చేశారనీ, సిఐ అభినందించారు. ఈ సమావేశంలో రైల్వే ప్రొటెక్షన్ ఇన్స్పెక్టర్ నార్నరాం, కానిస్టేబుల్ మనోహర్‌లు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ముఠా అరెస్టు
సాక్షి, రాజంపేట: చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ఫోన్‌కాల్స్ ముఠాను అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ వీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఐ బి. శుభకుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఫోన్‌కాల్ నిర్వహిస్తున్న ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి వద్దనున్న రూ. లక్షల్లో విలువజేసే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ఫ్రొటోకాల్ టెలికమ్యూనికేషన్ సామగ్రి, కంప్యూటర్లను, అలాగే దాదాపు 500కుపైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలియజేశారు. పట్టణ బీఎస్ఎన్ఎల్ జేఈ ప్రసాద్ ఫిర్యాదు మేరకు అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ముఠాపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ తదితర పరికరాలు రెడ్డివారి వీధిలో నిర్వహించే ఈ ముఠా నెలకు రూ. 10లక్షలు మేరా ఆదాయం ఆర్జీస్తున్నట్లు తెలిపారు. పట్టణానికి చెందిన సయ్యద్ మహ్మద్ షరీఫ్ అలియాస్ మున్నా, పోలికి చెందిన గుండ్రాజు సుదర్శన్ రాజు, రాజశేఖర్ నాయుడు అలియాస్ నాయుడులను అదుపులోకి తీకున్నామన్నారు. ప్రధాన సూత్రధారి రెడ్డివారి వీధికి చెందిన లక్ష్మీనారాయణ కువైట్‌లో ఉన్నాడన్నారు. వీరి వద్ద నుంచి అతడు లింక్ తీసుకొని అక్కడ నుంచి కువైట్, ఇండియా, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాలకు నిమిషానికి రూ.32 అయ్యే కాల్ని రూ. 6 లకే అందిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అక్రమమార్గంలో టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ కాల్స్ చేయడం నేరమన్నారు. కార్యక్రమంలో పట్టణ పోలీసులు పాల్గొన్నారు. చదవండి : స్మార్ట్ దోపిడీ -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
సాక్షి, పులివెందుల(కడప) : వివాహేతర సంబంధం ఓ యువకుడి నిండు ప్రాణాలు బలిగొంది. అయితే ఈ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినా.. పోలీసుల దర్యాప్తుతో ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను పులివెందుల అర్బన్ సీఐ సీతారాంరెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పులివెందుల పట్టణం నగరిగుట్టకు చెందిన కంచర్ల చంద్రశేఖరరెడ్డి రెండవ కుమారుడు కంచర్ల జయశేఖరరెడ్డి(21) జులై 7వ తేదీన ఇంట్లో ఉండగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదేనెల 10వ తేదీన తండ్రి చంద్రశేఖరరెడ్డి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో తన కుమారుడు కనిపించలేదని ఎస్ఐ శివప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. పులివెందుల అర్బన్ సీఐ సీతారాంరెడ్డి మృతుడి కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ సతీష్‌కుమార్‌రెడ్డి పీఏగా వ్యవహరిస్తున్న సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామానికి చెందిన జక్కిరెడ్డి పెద్దిరెడ్డి హత్య చేసినట్లుగా గుర్తించారు. పెద్దిరెడ్డి గుంటూరుకు చెందిన తన స్నేహితులైన కనపర్తి శ్రీను, వెంకటేష్, జగదీష్‌ల సాయంతో జయశేఖరరెడ్డిని హత్య చేసినట్లు తెలిసింది. జులై 7వ తేదీన వీరు నలుగురు కలిసి జయశేఖరరెడ్డిని పులివెందుల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు పిలిపించుకుని అక్కడి నుంచి ఏపీ02ఏకే 8614 అనే నెంబర్ గల స్కార్పియో వాహనంలో జయశేఖరరెడ్డిని ఎక్కించుకుని సింహాద్రిపురం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో మద్యంలో విషపు గుళికలు కలిపి జయశేఖరరెడ్డికి తాపించారు. అనంతరం జయశేఖరరెడ్డిని స్కార్పియో వాహనంలో ముద్దనూరు మండలంలోని శెట్టివారిపల్లె రైల్వే ట్రాక్‌పై పడుకోబెట్టి రైలు ప్రమాద సంఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసుల దర్యాప్తులో జయశేఖరరెడ్డిది హత్యగా తేలడంతో నిందితులు నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని సీఐ పేర్కొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
సాక్షి, మైదుకూరు(కడప) : మండల పరిధిలోని ఉత్సలవరం గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బేతంచర్ల ఎర్రన్న, సుబాన్‌బీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సుబాన్‌బీ చెల్లెలిని ఎర్రన్న రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి దస్తగిరి అనే కుమారుడు, మరో ఇద్దరు కుమార్తెలు సంతానం. దస్తగిరిని బీటెక్ వరకు చదివించారు. ఐదేళ్ల నుంచి బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన ఇద్దరు చెల్లెళ్లను, తల్లిని బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని భార్యను కూడా బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఏడాది పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దస్తగిరి తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం బెంగళూరులోని కేఆర్‌పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేఆర్‌పురం పోలీసులు విచారణ చేపట్టగా దస్తగిరి ఈనెల మూడవ తేదీన ఓ ఇంటిని బాడుగకు తీసుకున్నాడని అతని స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంటికి తలుపులు వేసి ఉండటంతో కిటికీలోనుంచి చూడగా దస్తగిరి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఉత్సలవరం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు. రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి.. కడప కోటిరెడ్డిసర్కిల్/అర్బన్: కమలాపురం రైల్వే గేటు సమీ పంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(35) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే హెడ్ కానిస్టేబుల్ వి.సుభాన్ బాషా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తుపట్టిన వారు 9440900811,9502051021 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. మైదుకూరు రూరల్ : మండల పరిధిలోని ఉత్సలవరం గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బేతంచర్ల ఎర్రన్న, సుబాన్‌బీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సుబాన్‌బీ చెల్లెలిని ఎర్రన్న రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి దస్తగిరి అనే కుమారుడు, మరో ఇద్దరు కుమార్తెలు సంతానం. దస్తగిరిని బీటెక్ వరకు చదివించారు. ఐదేళ్ల నుంచి బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన ఇద్దరు చెల్లెళ్లను, తల్లిని బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని భార్యను కూడా బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఏడాది పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దస్తగిరి తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం బెంగళూరులోని కేఆర్‌పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేఆర్‌పురం పోలీసులు విచారణ చేపట్టగా దస్తగిరి ఈనెల మూడవ తేదీన ఓ ఇంటిని బాడుగకు తీసుకున్నాడని అతని స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంటికి తలుపులు వేసి ఉండటంతో కిటికీలోనుంచి చూడగా దస్తగిరి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఉత్సలవరం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు. -
వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని..
సాక్షి, కడప : కడప నగర శివార్లలోని ఓ ప్రైవేటు కర్మాగారంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడింది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో బహుజననగర్‌లో నివసిస్తున్న గంగాదేవి, హరిచరణ్లకు జమున, గాయత్రి, మాధవచరణ్లు సంతానం. గాయత్రి గత ఏడాది నుంచి ప్రైవేటు కర్మాగారంలో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. రోజు మాదిరిగానే శనివారం ఉదయం తాను పనిచేస్తున్న కర్మాగారంలో మిషన్ ఆపరేటింగ్ చేస్తుండగా తాను వేసుకున్న దుస్తులు మిషన్‌కు తగులుకుని ఆమె దాంతో పాటు గిరగిరా తిరిగింది. మరో యువతి అరుణ (19) ఆమెను రక్షించడానికి వెళ్లి తాను చేయిని పోగొట్టుకుని తీవ్రంగా గాయపడింది. గాయత్రిని రిమ్స్‌కు హుటాహుటిన తీసుకెళ్లగానే పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మరో యువతి అరుణ(19) తీవ్రంగా గాయపడటంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటనపై రిమ్స్ ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి
సాక్షి, రైల్వేకోడూరు : ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వస్తున్న కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లె పంచాయతీ మ్యాంగో యార్డు సమీపంలో కడప– తిరుపతి జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో మైసూరివారిపల్లెకు చెందిన కావేటి శివయ్య (45), లక్కాకుల మురళి (43) మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైసూరివారిపల్లెకు చెందిన కావేటి శివయ్య మ్యాంగో యార్డు వద్ద టీ కొట్టు నిర్వహిస్తూ ఆయా సీజన్లలో మామిడి, బొప్పాయి వ్యా పారాలు చేసేవాడు. అతని గ్రామానికి చెందిన బంధువు లక్కాకుల మురళితో కలిసి గురువారం ఉదయం మ్యాంగో యార్డుకు వచ్చేందుకు ద్విచక్రవాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో కడప – తిరుపతి జాతీయ రహదారిపై వెనుక వస్తున్న రైల్వేకోడూరుకు చెందిన ఓ కారు వేగంగా వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ద్విచక్రవాహనం దెబ్బతినగా శివయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఎడమ కాలు విరిగి తీవ్ర రక్తస్రావమైన మురళిని తిరుపతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కుక్కలదొడ్డి వద్ద మృతి చెందాడు. ప్రమాదానికి గురైన కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. మృతుడు శివయ్యకు భార్య జ్యోతి కుమారి, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు తండ్రికి చేదోడువాదోడుగా టీ కొట్టులో ఉంటున్నాడు. మురళికి భార్య శారద ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతులిద్దరు బంధువులు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాజంపేటకు తరలించారు. -
రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. డబ్బులు ఎగ్గొట్టారు
సాక్షి, కడప : రూ.10 కోట్ల 24 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.50 లక్షలు ఎగ్గొట్టడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు.. కడప నగరం హబీబుల్లా వీధిలో నివాసముంటున్న జేకే రాజేష్‌సింగ్, అతని అన్న రమేష్‌సింగ్‌లకు కడప సమీపంలోని విశ్వనాథపురంలో 3 ఎకరాల 30 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని వారు ప్రొద్దుటూరులోని బి.కొత్తపల్లె, వీఆర్ కాలనీకి చెందిన మణిప్రసాద్‌రెడ్డి భార్య కవితకు అమ్మాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత ఏడాది అక్టోబర్ 24న రూ.2కోట్ల 50 లక్షలు అడ్వాన్సుగా తీసుకుని అగ్రిమెంట్ రాయించారు. ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 28న భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు కడప బాలాజీనగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వారిని పిలిపించారు. అయితే వారు పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకురాకపోవడంతో ఈనెల 3వ తేదీకి రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాజేష్ సింగ్, రమేష్ సింగ్‌లు 3వ తేదీ మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ప్రొద్దుటూరుకు చెందిన కవిత, మణిప్రసాద్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, మురళి ఉన్నారు. వారంతా కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇవ్వాల్సిన డబ్బుల్లో రూ.50 లక్షలు తక్కువ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత డబ్బులు తక్కువ ఇస్తే ఎలా అని బాధితులు ప్రశ్నించగా ‘ మీకు డబ్బులు ఇచ్చేది లేదు.. మా జోలికి వస్తే చంపుతాం’ అంటూ బెదిరించి దాడికి పాల్పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించి రిజిస్ట్రేషన్ చేయించుకుని, తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కడప తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. -
అ‘మాయ’కుడు.. ‘మంత్రులే టార్గెట్’
ఉన్నత చదవు చదివాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయినా సంతృప్తి చెందలేదు. డబ్బుపై వ్యామోహం పెరిగింది. వంచన మార్గం ఎంచుకున్నాడు. పెద్ద పెద్ద నాయకులనే టార్గెట్ చేశాడు. కొంత కాలం తన ఆటలు సాగాయి. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు హైటెక్ మోసగాడు. పేరు బాలాజీ నాయుడు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం వాసి ఇతను. సాక్షి, రాయచోటి(కడప): సమాజంలో మోసగించే వాళ్లు ఉన్నతంత కాలం మోసపోయే వాళ్లూ ఉంటారు. అలాంటి వారు పలు మార్గాల్లో అమాయకులను ఎంచుకుంటారు. చీటీలు, రియల్ ఎస్టేట్, ఒకటి కొంటే మరోక్కడి ఉచితం, రూ. పది వేలు దాస్తే చాలు మీకు రూ. లక్షలు ఇస్తాం ..అంటూ.ఇలా మోసం చేయడానికి ఎత్తులు వేస్తుంటారు. ఈ మాయ గాళ్ల ఉచ్చులో సామాన్యులు చిక్కుకుని నష్టపోతున్నారు. కానీ ఈ సారి బడా బాబుల వంతు వచ్చింది. మంత్రులు, నాయకులే టార్గెట్ చేశాడు ఓ ఘరానా మోసగాడు. ఒక ఫోన్ కాల్‌తో వాళ్ల జేబులకు చిల్లు వేశాడు. అది కూడా ఒకరా ఇద్దరా....వందమందికి పైగా నాయకులు ఆ బడా మాయగాడి చేతిలో మోసపోయారు. పైకి అమాయకుడిలా కనిపించే ఆ ఘరానా మోసగాడి పేరు తాట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి, అలియాస్ అనిల్‌కుమార్. తూర్పు గోదావరి పిఠాపురం. ఇతడు జేన్టీయూ కళాశాలలో బీటెక్ చదివి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు. జీతం చాలదనుకొని తెలివితేటలను ఉపయోగించి గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పేరు గాంచిన ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసుకున్నాడు. సచివాలయం నుంచి ఫోన్ అంటూ.. ఒక్కొరికి ఫోన్ చేసి సార్ నేను సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు కోరినట్లుగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాలంటే మాకు పర్సెంటెజ్ ఇవ్వాలి. ఒక ప్రైవేట్ వ్యక్తి ఖాతా ద్వారా డబ్బులు జమచేయమని చెబుతాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి రూ. కోట్లలో దండుకున్నాడు. వీరి జాబితాలో గత ప్రభుత్వంలో కడప జిల్లా మంత్రి కూడా ఆ జాబితాలో ఉండటం విశేషం. ఆయన కూడా లక్షలాది రూపాయాలు సమర్పించుకున్నాడు. కానీ బయటకు చెప్పుకోలేక గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల ద్వారా ఆ మోసగాడిని పట్టుకోమ్మని పురమాయించారు. మాయగాడి ఉచ్చులో జిల్లా వాసులు 2017లో జిల్లాకు చెందిన ఓ మంత్రితో పాటు రాయచోటికి చెందిన ప్రజాప్రతినిధితో మారో ద్వితియ శ్రేణి నాయకుడుకి కూడా గాలం వేశాడు. వీరు కూడా ఈ మోసగాడికి భారీగా చెల్లించుకున్నారు. తరువాత ఇతనిపై పలు స్టేషన్లలో కేసులు నమోదు చేయడంతో ఉల్లిక్కి పడ్డారు. విషయం తెలిసి ఎవరికి చెప్పాలో తెలియక గుట్టుచప్పుడు కాకుండా రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది చదవండి : పీడీజేకు ఫోన్ చేసి దొరికిపోయిన నిందితుడి సోదరుడు ఎట్టకేలకు అరెస్ట్ అప్పటి నుంచి ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. నిందితుడిని పట్టుకోవడానికి అహర్నిశలు శ్రమించారు. చివరికి మంగళవారం రాత్రి తెల్లవారు జామున హైదరాబాద్‌లో అరెస్టు చేసి రాయచోటికి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం రాయచోటి కోర్టుకు హాజరు పెట్టారు. కోర్టు నిందిడికి రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇవ్వడంతో మరో కంటికి కనిపించకుండా పోలీసులు హైదరాబాద్‌లోని చెంచ్ల్ గూడా జైల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. నిందితుడిని పట్టుకున్న వారిలో రాయచోటి ఎస్ఐ మహమ్మద్ రఫీ, అర్బన్ సీఐ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. -
పోలీస్‌స్టేషన్‌లో దౌర్జన్యం
సాక్షి, కడప: కడప టూటౌన్ పోలీస్ స్టేషన్లోకి ఆదివారం నిందితుని బంధువులు జొరబడి, ఎస్ఐ విచారిస్తుండగానే అతన్ని లాక్కొని వెళ్లారు. వారిని వారించేందుకు వచ్చిన స్టేషన్‌రైటర్, కానిస్టేబుళ్లను సైతం పక్కకు తోసేశారు.విశ్వసనీయ వర్గాల సమాచారం, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హబీబుల్లా వీధికి చెందిన షేక్ షాబుద్దీన్ అనే వ్యక్తిపై అతనిభార్య సల్మాత్ సోదరులు గౌహర్‌ఆలీ, షేక్ ఖాలిద్ దాడి చేశారు. ఈ సంఘటనపై జూన్ 2వ తేదీన కేసు నమోదైంది. నిందితులను అరెస్ట్ చేసి తీసుకొచ్చేందుకు ఎస్ఐ మంజునాథ్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం స్టేషన్ రైటర్, హెడ్ కానిస్టేబుల్ చాంద్‌బాషా ఆధ్వర్యంలో పోలీసు బృందం వెళ్లింది. నిందితుల్లో ఒకరైన గౌసర్‌ఆలీని స్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్ఐ ముందు హాజరుపరిచారు. ఎస్ఐ అతన్ని విచారిస్తున్న సమయంలో నిందితుని బంధువులు షేక్ రేష్మా, గుల్జార్‌బేగం, సల్మా, జావేద్‌ఆలీ, ముబారక్, ఆయేషా నేరుగా పోలీస్ స్టేషన్ ఆవరణకు చేరుకున్నారు. లోపలికి చొరబడి, తమ వెంట గౌసర్‌ఆలీని లాక్కొని వెళుతుండగా, రైటర్ చాంద్‌బాషా, కానిస్టేబుళ్లు రాఘవులు, పంచలింగాలు, రాజశేఖర్, చంద్రనారాయణ రెడ్డి వారిని నివారించే ప్రయత్నం చేశారు. కానీ దౌర్జన్యంగా తోసేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రైటర్ చాంద్‌బాషా చేతి మధ్యవేలికి గాయమైంది. ఈ సంఘటన కడప నగరంలో దుమారం చెలరేగింది. సంఘటన స్థలానికి కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్లో పట్టపగలు ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంపై పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే చిన్న సంఘటన జరిగిందని, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. రైటర్ చాంద్‌బాషా ఫిర్యాదు మేరకు పై ఆరుగురితో పాటు, పై కేసులో నిందితుడైన గౌసర్ ఆలీపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. -
ముగ్గురిని బలిగొన్న బస్సు వేగం
సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : సొంత ఊరిలోని భూములను చూసుకుని తిరిగి వస్తూ ఆ ముగ్గురూ మృత్యు ఒడికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ కుటుంబ సభ్యులే. వివరాలివి. లక్ష్మిదేవి(45) , ఆమె భర్త వెంకట సుబ్బయ్య, ఈశ్వరమ్మ(65), అంజనమ్మ(35)లు వై. కోడూరుకు చెందిన వారు. ఉపాధి నిమిత్తం కడప సమీపాన చలమారెడ్డి పల్లెకు వచ్చేశారు. స్వస్థలమైన వై.కోడూరులో బంధువు మృతి చెందడంతో వీరంతా శనివారం చూసేందుకు వెళ్లారు. ఎలాగూ వచ్చామని పనిలో పనిగా గ్రామంలో తమకున్న కొద్దిపాటి స్థలాన్ని చూసుకున్నారు. ఈ లోగా చీకటిపడుతుండటంతో స్వగ్రామానికి బయలుదేరారు. కోడూరు గ్రామంలో ఒక సప్లయర్ ఆటోలో ఎక్కారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఆరుగురు ఉన్నారు. ఎర్రగుంట్ల– వై కో డూరు గ్రామాల మధ్య వేంపల్లె మార్గంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు ఆటో చేరుకోగానే ఎర్రగుంట్ల నుంచి వేంపల్లెకు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అంజనమ్మ, లక్ష్మిదేవి, ఈశ్వరమ్మలు అక్కడికి అక్కడే మృతి చెందారు. వెంకటసుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో డ్రైవర్, మరో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రుడు వెంకటసుబ్బయ్యను వెంటనే 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. వెంకటసుబ్బయ్య దంపతులు, అంజనమ్మలు పొట్టకూటికి పదేళ్ల కిందటే కడప దగ్గర ఉండే చలామరెడ్డి పల్లెకు వచ్చేశారు. అక్కడే కూలి పనులు చేసుకుంటు బతుకుతున్నారు. లక్ష్మిదేవి మేనత్త ఈశ్వరమ్మ ఎర్రగుంట్ల పట్టణంలోనే నివాసం ఉంటోంది. ఈమె భర్త బాలసుబ్బయ్య గతంలోనే చనిపోయాడు. అనుకోని సంఘటన ముగ్గురి ప్రాణాలను బలిగొన్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రుష్యేంద్రబాబు పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడ్డంతో వెంట వెంటనే తొలగింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బస్సు వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్థన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. మృతుల వివరాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు..ఏమైందో కానీ..
సాక్షి, గాలివీడు(కడప) : మండల పరిధి పందికుంట గ్రామం బోయపల్లెకు చెందిన దేరంగుల వెంకటరమణ పెద్ద కుమారుడు దేరంగుల శివకుమార్ (21) ఇంట్లో ఉరి వేసుకొని బలవర్మరణానికి పాల్పడిన సంఘటన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..శివకుమార్ రాయచోటికి చెందిన శైలజను ప్రేమించి ఇరువురి కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. బోయపల్లెలోనే జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో నాలుగు రోజులు నుంచి భార్యభర్తలిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్క గదిలో వంట చేస్తున్న శైలజ గమనించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగలగొట్టారు. కొనఊపిరితో ఉన్న శివకుమార్‌ను చికిత్స నిమిత్తం నూలివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గాయత్రి తెలిపారు. -
పెళ్లై నెల కాకముందే..
సాక్షి, ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరంలో బుధవారం యువరాణి (19) అనే నూతన వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒంటిమిట్ట పోలీసు స్టేషన్ రైటర్ ముజీర్ తెలిపిన వివరాల మేరకు.. గతనెల 9వ తేదీన ఈమెకు సిద్దవటం మండలం గొల్లపల్లెకు చెందిన మేనేమామ గుర్రయ్యతో వివాహమైంది. మూడు రోజుల క్రితం ఆమె కొత్తమాధవరంలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. బుధవారం తల్లిదండ్రులు పనిమీద కడపకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. కాళ్లపారాణి ఆరకనే తమ బిడ్డ దూరమైందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఎస్ఐ అశ్విని మృతదేహాన్ని పీఎం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లై నెల కాకముందే ఏం జరిగింది ? పెళ్లి అయ్యి సరిగ్గా నెల కూడా కాలేదు.. యువరాణి ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భర్త మాత్రం మా మధ్య ఎటువంటి సమస్యలు లేవంటున్నారు. యువరాణి తల్లిదండ్రులు తమ కుమార్తె చాలా మంచిదని చెబుతున్నారు. అంత్తింట్లో, పుట్టింట్లో ఏ సమస్యలు లేకున్నా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుదో అర్థం కావడం లేదని బంధువుల పేర్కొంటున్నారు. -
నిద్రిస్తున్న యువకుడిపై ఇసుక అన్లోడ్
సాక్షి, వల్లూరు(కడప) : మండల పరిధిలోని కడప ఎయిర్ పోర్ట్ ఆవరణంలో యువకుడు కుమార్ బోయ (19) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా డోన్ పట్టణ పరిధిలోని చానుగొండ్ల గ్రామానికి చెందిన కుమార్ బోయ గత కొంత కాలంగా తమ గ్రామస్తులతో కలసి ఎయిర్ పోర్ట్‌లో కాంక్రీట్ పనులు చేస్తున్నాడు. ఆదివారం కాంక్రీట్ కలిపేందుకు వినియోగించే ఇసుక జల్లెడ పై పడుకున్నాడు. అయితే ఇసుక లోడుతో వచ్చిన టిప్పర్ డ్రైవర్ ఇసుకను జల్లెడ పై అన్లోడ్ చేశాడు. నిద్రలో ఉన్న కుమార్‌పై ఇసుక ఒక్కసారిగా మీద పడటంతో ఊపిరి ఆడక మృతి చెందాడు. కొద్ది సేపు తర్వాత సహచరులు కుమార్ కనిపించలేదని వెతక సాగారు. అయితే అక్కడే ఉన్న ఒక బాలుడు జల్లెడ పై పడుకొని ఉండటం తాను చూశానని చెప్పాడు. దీంతో ఇసుక తొలగించి చూడగా కుమార్ బోయ విగత జీవిగా పడి ఉన్నాడు. మృతుని సహచరుడు రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వల్లూరు ఎస్ఐ మధు మల్లేశ్వర్ రెడ్డి తెలిపారు. -
వదినపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
సాక్షి, కడప: భర్తను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న వరుసకు వదినైన మహిళపై వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణం నగరిగుట్టకు చెందిన టీడీపీ జిల్లా కార్యదర్శి వీరభద్రారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలాగే ఆమెను ఒప్పించాలంటూ మరో మహిళపై బెదిరింపులకు దిగారు. దీంతో పులివెందుల మహిళా సంఘాలకు ఆర్పీగా వ్యవహరిస్తున్న మల్లేశ్వరి, ఆర్పీ మస్తానమ్మ సోమవారం ఎస్పీ అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి తన ఫిర్యాదులో తన భర్త జయరామిరెడ్డి ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించాడని.. తాను ఆర్పీగా పనిచేస్తున్నట్లు వివరించారు. అయితే తన చెల్లెలు భర్త అయిన వీరభద్రారెడ్డి తనను మానసికంగా వేధిస్తూ దుర్బుద్ధితో లోబరుచుకునేందుకు బెదిరిస్తున్నాడన్నారు. స్నేహితురాలైన మస్తానమ్మ ద్వారా రాయబారం పంపిస్తూ.. లొంగకపోతే తన కుమారులిద్దరిని బండితో గుద్ది చంపుతానని బెదిరిస్తున్నాడని మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బ్యాంక్ వద్ద కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ దూషించాడన్నారు. అతని మాట వినకపోతే తమ ఇద్దరి గురించి పత్రికల్లో వేయిస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. మహిళా సంఘాల్లోని కొంత మంది ఆర్పీలు తమకు అండగా నిలబడటంతో.. వారిని కించపరిచే విధంగా అసభ్యంగా ప్రచారం చేస్తూ ఉద్యోగాలనుంచి తీయిస్తానని వారిపై కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు వాపోయారు. అలాగే మెప్మాలో పనిచేసే సిబ్బంది గురించి, ఆర్పీల గురించి వాట్సాప్ ద్వారా అసత్యపు ప్రచారాలు చేస్తున్నాడన్నారు. తమను వీరభద్రారెడ్డి బారినుంచి కాపాడాలని ఎస్పీకి మల్లేశ్వరి, మస్తానమ్మలు సోమవారం ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ విచారణ చేయాల్సిందిగా పులివెందుల పోలీసులకు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పులివెందుల పోలీసులు వీరభద్రారెడ్డి, మల్లేశ్వరి, మస్తానమ్మలతో పాటు మెప్మాలో పనిచేస్తున్న ఇతర ఆర్పీలను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కాగా, వీరభద్రారెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని కొందరు తెలుగు దేశం పార్టీ నాయకులు మల్లేశ్వరిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. పోలీసులు విచారించి వీరభద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు. -
వెలుగులోకి మరో కుట్రకోణం!
సాక్షి ప్రతినిధి కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం పథకంలో మరో కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల వైఎస్ వివేకా ఇంటి పరిసరాల్లో ఉన్న ఓ కుక్కను గుర్తు తెలియని దుండగులు కర్రలతో కొట్టి చంపారు. ఇంటి ఆవరణ, రహదారి వైపు కొత్త వ్యక్తులు ఎవరైనా తచ్చాడితే రయ్యిన మొరుగుతూ వారిపైకి ఉరికేది. అటు వైపు కొత్త వ్యక్తులు వచ్చేందుకు సాహసం చేయలేని విధంగా పరిస్థితి ఉండేది. అయితే ఇటీవల ఆ కుక్కను ఎవరో కొట్టి చంపారు. అప్పట్లో వైఎస్ వివేకానందరెడ్డి ఊదాసీనంగా వ్యవహరించిన ఫలితమే ప్రాణాలు మీదకు తెచ్చిందా? అనే అనుమానాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా రెక్కీ నిర్వహించడం, లేదా పథకంలో భాగంగా హత్య చేసేందుకు వచ్చినవారిని కుక్క అడ్డగించడంతోనే అప్పట్లో చంపేశారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సంబంధిత కథనాలు జగన్ చిన్నాన్న దారుణ హత్య మళ్లీ అదే తరహా కుట్ర.. వివేకానందరెడ్డి హత్య వెనక పెద్ద కుట్రే! సీబీఐ విచారణ జరిపించాల్సిందే రాజకీయం కోసం ఇంత కిరాతకమా -
సీఐ వచ్చే వరకు రక్తం తుడవలేదు
సాక్షి ప్రతినిధి కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబు మరో కొత్త పన్నాగానికి తెరతీసినట్లు అర్థమవుతోంది. రక్తాన్ని ఎందుకు తుడిచేశారంటూ కొత్త పల్లవి అందుకుని కేసును గందరగోళంలోకి నెట్టేసేందుకు సర్వశక్తులా శ్రమిస్తున్నట్లు అవగతమవుతోంది. అసలు జరిగిందేంటంటే.. వివేకా మృతి చెందారన్న విషయాన్ని ధృవీకరించుకున్న పీఏ కృష్ణారెడ్డి ముందుగా కుటుంబసభ్యులకు అక్కడి పరిస్థితిని వివరించారు. తర్వాత మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. నిర్జీవంగా పడి ఉన్న పెదనాన్నను చూసి నిర్ఘాంతపోయారు. శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. అప్పట్లో గాయాలు సైతం కన్పించని పరిస్థితి. గుండెపోటు సందర్భంగా రక్తపు వాంతుల కారణంగా అలా అయిపోయారని భావించారు. వైఎస్ వివేకా చాలా సౌమ్యుడు, ఎవరికీ అన్యాయం తలపెట్టని వ్యక్తి. దీంతో ఆయన హత్యకు గురై ఉంటారని కుటుంబసభ్యులు ఊహించలేదు. కాగా వివేకా హత్యానంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రక్త నమూనాలు ఎందుకు చెరిపేశారంటూ పదేపదే ప్రసంగించారు. వాస్తవంగా సీఐ శంకరయ్య వచ్చేవరకు ఎవరూ రక్త నమూనాలు చెరపలేదు. కుటుంబసభ్యులు మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సీఐ సమక్షంలో అంబులెన్సు తెప్పించి ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ముఖంపై రక్తం తుడవగా గాయాలు కన్పించాయి. ఇప్పటికీ బాత్రూంలో రక్త నమూనాలు అలాగే ఉన్నాయి. బాత్రూంకు పోలీసులే తాళం వేసుకుని వెళ్లారు. కానీ ఘటన తీవ్రతను దెబ్బతీసేలా సీఎం ఎత్తుగడలు పన్నారని పలువురు వివరిస్తున్నారు. -
నిజాలు నిగ్గు తేలుస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య గర్హనీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దారుణహత్య వెనుక ఉన్న వారెవరో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చేందుకే ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్‌ను నియమించామన్నారు. ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం రాత్రి మీడియాతో బాబు మాట్లాడుతూ వివేకా హత్యకు గురైతే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా చేయకుండా ఎందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని చూస్తేనే అది హత్య అని తెలుస్తుంది కానీ ఆయన గుండెపోటుతో మృతి చెందారని మొదట చెప్పి తరువాత అనుమానాస్పద మృతి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని సందేహం వ్యక్తం చేశారు. వివేకా పీఏ ఉదయం 5.30 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి తలపుకొట్టినా ఆయన తీయకపోవడం.. భార్యకు ఫోన్ చేశారనడం.. రాత్రి లేట్‌గా వచ్చి ఉంటారని ఆమె అనడం.. తరువాత పెరటి తలుపు తీసి ఉండటాన్ని చూడటం.. 6.45 గంటలకు అవినాష్ పోలీసులకు ఫోన్ చేయడం ఏమిటని చంద్రబాబు వరుసగా సందేహాలు లేవనెత్తారు. అవినాష్‌కు ఎవరు ఫోన్ చేశారు.. ఆయన ఎవరెవరికి ఫోన్ చేశారో చెప్పాలని చంద్రబాబు అన్నారు. మృతదేహాన్ని బాత్రూం నుంచి బెడ్ రూమ్‌లోకి ఎవరు మార్చారు.. రక్తపు మరకలు ఎవరు చెరిపేశారు.. పోలీసులు వచ్చే లోగా ఘటనా స్థలంలో సీన్ ఆఫ్ అఫెన్స్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వీటన్నింటికీ వైఎస్ కుటుంబ సభ్యులే జవాబు చెప్పాలని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు సీబీఐ విచారణ కోసం గవర్నర్‌ను కలిస్తే ఆయన కూడా ఇవే ప్రశ్నలు వారిని అడగాలని చెప్పారు. -
విలక్షణ నాయకుడు వైఎస్ వివేకా
సాక్షి ప్రతినిధి కడప: పులివెందుల సమితి ప్రెసిడెంటు.. ఎమ్మెల్యే.. కడప ఎంపీ.. రాష్ట్ర మంత్రి.. ఏ పదవిలో ఉన్నా, హోదాలతో నిమిత్తం లేకుండా సామాన్యులను గౌరవించడం ఆయన స్వభావం. అత్యంత మృదుస్వభావి. తాను చెప్పాలనుకున్న విషయం సున్నితంగా, సూటిగా వివరించే తత్వం ఆయన స్వంతం. తన సోదరుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా చిరుద్యోగులను సైతం సార్... అంటూ గౌరవంగా సంబోధించే వ్యక్తిత్వం. ప్రాంతం కోసం, ప్రజల ఉన్నతికోసం అంతే పట్టుదలతో మొండిగా పట్టుబట్టే మనస్తత్వం కలిగిన నేత. ఇన్ని సుగుణాలు కలగలిసిన నాయకుడే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి. వైఎస్సార్ జిల్లాలో విలక్షణ నాయకుడు. ప్రాంత ఉన్నతికోసం ఏస్థాయిలో ఆరాటం ప్రదర్శిస్తారో, నమ్ముకున్న వారికోసం అంతే పట్టుదలతో అండగా నిలుస్తారు. ఎలాంటి అండ లేనివారు నిర్భయంగా ఆయన్ను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకుంటారు. వెంటనే తనదైన శైలిలో స్పందించి ఆపన్నులకు ఆయన అండగా నిలుస్తారు. ఈ సుగుణమే ఆయన్ను దార్శనికుడుగా నిలిపింది. జిల్లాలో ఎక్కడికెళ్లినా రాజకీయాలకు అతీతంగా ఆదరించేవారు అధికం. స్వతహాగా ప్రత్యర్థులను సైతం అభిమానించే స్వభావి. మాట ఇచ్చారంటే ఎంత కష్టమైనా వెనుతిరగని ధీరత్వం కలిగిన నాయకుడు. గురువారం సైతం మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల్లో పలువురు నాయకులతో మంతనాలు జరిపి పొద్దుపోయాక ఇంటికి చేరారు. తెల్లవారేసరికి విగతజీవిగా రక్తపుమడుగులో పడి ఉండడాన్ని కడప జిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడం ఆయన లక్షణం పులివెందుల సమితి ప్రెసిడెంటుగా 1981లో వైఎస్ వివేకానందరెడ్డి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. రాయలసీమ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించారు. ఆపై తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారించడంతో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను వివేకానందరెడ్డి తన భుజస్కంధాలపై వేసుకున్నారు. 1989లో తొలిసారిగా పులివెందుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 47,746 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1994లో మరోమారు పులివెందుల ఎమ్మెల్యేగా 71,563 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడంతో, కడప పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ వివేకా పోటీ చేశారు. 26,597 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2004లో మరోమారు కడప ఎంపీగా పోటీ చేసిన ఆయన 1,29,744 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిత్యం ప్రజాజీవితంలో ఉన్న ఆయన పదవులు, హోదాతో నిమిత్తం లేకుండా ప్రజాసేవకు అంకితమయ్యారు. ఎంత ఎదిగినా అత్యంత అణకువగా మెలగడం ఆయనకే స్వంతమైంది. తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ పోలీసు కానిస్టేబుల్‌ను సైతం.. సార్ అని సంబోధించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అభివృద్ధి సాధించడంలో ప్రత్యేక చొరవ... జిల్లా అభివృద్ధికోసం వైఎస్ వివేకానందరెడ్డి పరితపించేవారు. మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలనే సంకల్పమున్న నాయకుడు కావడంతో.. నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన అనంతరం ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి ఆయా పథకాలు సాధించేవారు. పులివెందుల గడ్డకు కృష్ణా జలాలు చేరుతున్నాయంటే అందులో ఆయన పాత్ర అత్యంత కీలకం. పైడిపాళెం రిజర్వాయర్ ఏర్పాటుకు తన సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో చర్చించి జీఎన్ఎస్ఎస్ పథకంలో ఆ ప్రాజెక్టును చేర్పించిన ఘనత ఆయనదే. పైడిపాళెం ప్రాజెక్టు పూర్తయ్యింది కాబట్టే నేడు పులివెందుల గడ్డపైకి కృష్ణా జలాలు చేరాయి. అంతేకాదు రైతులు చెల్లించిన ప్రీమియం మేరకు పంటల బీమా రాకపోతే.. ఎంపీగా ఆయన రైతులకోసం ప్రత్యక్ష ఆందోళన చేసిన ఘటనలెన్నో ఉన్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమంలో భాగంగా పులివెందులలో కొంతమంది బీఎస్ఎన్ఎల్ టవర్‌కు నిప్పుపెట్టారు. ఎంపీగా ఎంతో శ్రమకోర్చి పులివెందులలో బీఎస్ఎన్ఎల్ టవర్ నిర్మిస్తే నిప్పుపెట్టారనే ఆవేదన ఆయన్ను వెంటాడింది. నిప్పుపెట్టిన వారిపై చర్యలు చేపట్టాలని ధర్నా చేపట్టారు. ప్రాంతం వృద్ధికి పరితపించే గుణమున్న నేపథ్యమే ఇలాంటి చర్యలకు ఉపక్రమించేలా చేసిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. -
సీబీఐ విచారణ జరిపించాల్సిందే
సాక్షి ప్రతినిధి కడప: తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ లేదా థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయం జరగదని అన్నారు. శుక్రవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని భాకరాపురంలో వైఎస్ వివేకానందరెడ్డి భౌతిక కాయానికి జగన్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలు చేయించేది వాళ్లే(టీడీపీ పెద్దలు).. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించేదీ వాళ్లే.. ఇక ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. థర్డ్ పార్టీతోనైనా లేక సీబీఐతోనైనా విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జగన్ స్పష్టం చేశారు. ఇది ఒక్కరు చేసిన పనికాదు ‘‘35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ మృదు స్వభావిగా గుర్తింపు పొందిన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా ఇంట్లో చొరబడి గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. వయస్సు రీత్యా చూసినా, వ్యక్తిత్వపరంగా చూసినా ఆయనంత సౌమ్యుడు ఎవరూ లేరు. దర్యాప్తు దారుణంగా, అధ్వానంగా ఉంది. చనిపోతూ లెటర్ రాశారా? డ్రైవర్ పేరు చెప్పి లెటర్‌ను సృష్టించారా? తలమీద ఐదుసార్లు గొడ్డలితో నరికారు. చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి బాత్రూంలో పడేసి రక్తం కక్కుకుని చనిపోయినట్లు చిత్రీకరించారు. కానీ, బెడ్రూం నుంచి బాత్రూం వరకు ఎత్తుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక్కరు చేసిన పని కాదు. కిందపడి స్పృహ తప్పి పడిపోయి చనిపోయారని చెబుతున్నప్పుడు లెటర్ ఎలా రాస్తారు? చంపిన వారే లెటర్ రాయించారా? డ్రైవర్‌పై నెపం నెట్టడం కోసం లెటర్ రాశారా?’’వైఎస్ జగన్ నిలదీశారు. నిజాలకు పాతర వేసేందుకు యత్నాలు ‘‘సౌమ్యుడిగా పేరుపొందిన చిన్నాన్నను పొట్టన పెట్టుకున్నారు. ఎంత అన్యాయం. పైగా నాతో మాట్లాడుతుండగా.. ఎస్పీకి అనేకసార్లు ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు నుంచి ఫోన్‌కాల్స్ వస్తూనే ఉన్నాయి. విషయాన్ని వారికి చేరవేస్తున్నారు. నిజాలకు పాతర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తున్నారు. ఇలా అయితే నిజాలు ఎలా వెలుగులోకి వస్తాయి? నిజాలు వెలుగులోకి రావాలి. ఎవరు హత్య చేశారో తేలాలి. అందుకే సీబీఐ విచారణ చేయాలి’’అని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలోనే తాత, చిన్నాన్న హత్యలు ‘‘రాష్ట్ర రాజకీయాల వైపు వెళ్లకుండా నాన్నను కడపకే పరిమితం చేయాలని తాతను(రాజారెడ్డి) చంపారు. మొదటగా తాతను టార్గెట్ చేసి హతమార్చిన తర్వాత వారే నాన్నను చంపారు. ఆ విషయంలో ఇప్పటికీ మాకు అనుమానం ఉంది. అప్పట్లో విచారణ చేపట్టింది జేడీ లక్ష్మీనారాయణ. తాను తలచుకుంటే అసెంబ్లీకి రాలేవు అని సెప్టెంబర్ 1న అసెంబ్లీలో వైఎస్ రాజశేఖరరెడ్డిని చంద్రబాబు చాలెంజ్ చేశారు. మీరు మళ్లీ అసెంబ్లీకి ఎలా వస్తారని బెదిరించారు. మర్నాడే(సెప్టెంబర్) 2న నాన్నను చంపారు. తాత రాజారెడ్డిని చంపినప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి. నాన్నను అసెంబ్లీలో బెదిరించింది చంద్రబాబే. నాపై దాడి జరిగినప్పుడు సీఎం చంద్రబాబే. చిన్నాన్న హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనే. తర్వాత అత్యంత పకడ్బందీ భద్రత ఉండే ఎయిర్‌పోర్ట్‌లో నాపై దాడి చేశారు. విచారణ అధికారులు చంద్రబాబుకు రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటకు రావాలి. అప్పుడే నిజాలు నిగ్గు తేలుతాయి. అప్పుడే విచారణ నిక్కచ్చిగా జరుగుతుంది. చిన్నాన్న హత్య నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా పూర్తి సంయమనం పాటించాలని కోరుతున్నా’’అని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, తన సోదరి షర్మిలమ్మ తదితరులు ఉన్నారు. -
జగన్ చిన్నాన్న దారుణ హత్య...
వైఎస్ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని రాజకీయ ప్రత్యర్థులు పొట్టన పెట్టుకున్నారు. ఎన్నికల రణరంగంలో ప్రత్యక్షంగా ఎదుర్కోలేక పిరికిపందల్లా దొంగ దెబ్బ తీశారు. ఎన్నికలకు సరిగ్గా 25 రోజుల ముందు చిమ్మచీకట్లో దారుణంగా హత్య చేశారు. ఈసారి కడప జిల్లాను ఎలాగైనా సొంతం చేసుకుంటామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలే వివేకానందరెడ్డి ప్రాణాలను బలిగొన్నారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు కంటతడి పెడుతున్నారు. అత్యంత సౌమ్యుడు, మృదుస్వభావి, స్నేహశీలి అయిన తన చిన్నాన్న విగతజీవిగా మారడం చూసి జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. మొదట తన తాతను చంపారని, తర్వాత తనపై హత్యాయత్నం చేశారని, ఇప్పుడు చిన్నాన్న ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయని అన్నారు. అసెంబ్లీకి మళ్లీ ఎలా వస్తావో చూస్తానంటూ చంద్రబాబు హెచ్చరించిన మరుసటి రోజే తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారని గుర్తుచేశారు. సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైఎస్సార్ జిల్లాలో అజాతశత్రువుగా పేరుగాంచిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. పులివెందులలోని తన ఇంట్లో నిద్రిస్తున్న ఆయన్ను శుక్రవారం వేకువజామున దుండగులు తలపై నరికి దారుణంగా హత్య చేశారు. పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా తలపై నరకడంతోనే మృతి చెందినట్లు రిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఆయన శరీరంపై మొత్తం ఏడు చోట్ల నరికిన గాయాలు ఉన్నాయి. ఒక్క తలపైనే ఐదు చోట్ల గాయాలు ఉన్నాయి. గురువారం మైదుకూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పలు సమీకరణలు, సంప్రదింపులు అనంతరం రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకున్న వివేకాను అత్యంత పథకం ప్రకారం అతి కిరాతకంగా హత్య చేశారు. వైఎస్ కుటుంబసభ్యులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రక్తపు మడుగులో వివేకా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి గురువారం మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పర్యటించారు. పార్టీలో చేరికలు, పలువురితో సంప్రదింపులు అనంతరం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో డ్రైవర్ ప్రసాద్ ద్వారా అల్పహారం తెప్పించుకున్నారు. అల్పహారం తిన్న అనంతరం కర్టెన్స్ సర్ది ఇంటికి వెళ్లమని వివేకానందరెడ్డి సూచించడంతో డ్రైవర్ ఆ పని పూర్తి చేసి వెళ్లిపోయాడు. అనంతరం వివేకానందరెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగా.. ఇంటి వరండాలో వాచ్‌మన్ రంగన్న పడుకున్నాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వ్యక్తిగత కార్యదర్శి ఎంవీ కృష్ణారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. సాధారణంగా అప్పటికే నిద్ర లేచే వివేకానందరెడ్డి లేవకపోవడంతో.. రాత్రి పొద్దుపోయాక వచ్చారని తెలుసుకున్న కృష్ణారెడ్డి న్యూస్ పేపర్లు చదువుతూ ఉండిపోయారు. ఈలోపు వంట మనిషి తన కుమారుడు అశోక్‌తో కలసి ఇంటికొచ్చింది. ఆరు గంటలు దాటిన తర్వాత ఇంతవరకూ సార్ నిద్రపోయింది ఎప్పుడూ లేదు.. ఎంత ఆలస్యంగా వచ్చినా లేస్తారని చెప్పి వంట మనిషి పిలువసాగారు. అయితే ఎంతకూ లోపలినుంచి అలికిడి లేకపోగా.. ప్రక్కన ల్యాన్‌లోకి వచ్చే తలుపు తెరిచి ఉండడాన్ని వాచ్‌మన్ రంగన్న గమనించాడు. తలుపు తెరిచి ఉండడంతో ఆ దారి గుండా ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో బెడ్రూమ్ తలుపు కూడా తెరిచి ఉంది. లోపలకు వెళ్లగానే రక్తపు మడుగు కనిపించింది. కానీ బెడ్ మీద వివేకానందరెడ్డి కనిపించలేదు. దీంతో వారు బాత్రూంలోకి వెళ్లారు. అక్కడ రక్తపుమడుగులో పడి ఉండడాన్ని గమనించి కంగుతిన్నారు. వెంటనే పీఏ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేశారు. తర్వాత మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. నిర్జీవంగా పడి ఉన్న పెదనాన్నను చూసి నిర్ఘాంతపోయారు. అనంతరం సీఐ శంకరయ్య వచ్చి అంబులెన్స్ తెప్పించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం పార్థివదేహాన్ని అభిమానుల కోసం వివేకానందరెడ్డి ఇంటికి తీసుకొచ్చారు. అత్యంత పథకం ప్రకారమే హత్య.. స్వతహాగా వైఎస్ వివేకానందరెడ్డి అజాతశత్రువు. తనను ఆశ్రయించిన వారికి చేయూతనివ్వడం ఆయన నైజం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవ్వరైనా నేరుగా వెళ్లి వారి ఇబ్బందులను వివరిస్తారు. అందుకు తగిన పరిష్కార మార్గం చూపించడంలో వైఎస్ వివేకానందరెడ్డి ముందూ వెనుకా ఆలోచించరు. అలాంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేయడానికి వెనుక ఏకైక కారణం రాజకీయం మినహా మరే కారణం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఒకే పార్టీలో చేరిన తర్వాత అక్కడ మరే పార్టీ బతికి బట్టకట్టదని అందరూ భావించారు. అందుకు కారణం అక్కడి ఫ్యాక్షన్ రాజకీయాలే. అయితే జమ్మలమడుగులో వైఎస్సార్సీపీకి అపారంగా జనాదరణ లభిస్తోంది. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీలో చేరికలతో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు పక్కా పథకం ప్రకారం ఆయన్ను అంతమొందించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉంటారని అందరికీ తెలుసు. గన్‌మన్ లేకుండా ఎక్కడికైనా స్వయంగా వెళ్లే గుణం ఉందని తెలుసు. దీన్ని అదునుగా తీసుకుని పక్కా పథకం ప్రకారం ఆయన్ను అంతం చేసినట్లు భావిస్తున్నారు. కరడుగట్టిన నేర స్వభావం ఉన్నవారే ఇలా కిరాతకంగా హత్య చేయగలిగే అవకాశముందని, టార్గెట్ మిస్ కాకుండా ఉండేందుకు తలపైనే నరికారని వారు చెబుతున్నారు. జమ్మలమడుగు నుంచి వెంబడించిన 2 వాహనాలు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి గురువారం రాత్రి జమ్మలమడుగు పరిధిలోని ఓ కోల్డ్ స్టోరేజీలో పలువురితో చర్చించిన తర్వాత పులివెందులకు బయల్దేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరేందుకు పలువురితో సంప్రదింపులు నిర్వహించారు. అనంతరం పులివెందులకు పయనమవగా.. జమ్మలమడుగు నుంచి రెండు వాహనాలు వైఎస్ వివేకానందరెడ్డి వాహనాన్ని వెంబడించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వివేకా వాహనంలో ఆయనతోపాటు తొండూరు మండల నాయకులు ఎర్రగంగిరెడ్డి, రవీంద్రారెడ్డి ఉన్నట్టు సమాచారం. వారిద్దర్నీ పులివెందుల మార్గంలోని మల్లేల గ్రామంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో వదిలిపెట్టారు. తర్వాత ఆయన పులివెందులకు వెళ్లారు. దీంతో వెంబడిస్తూ వాహనాల్లో వచ్చిన వ్యక్తులే, సమయం చూసి హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పదునైన కత్తితో తలపై దాడి చేయడంతోనే: ఎస్పీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి తలపై పదునైన కత్తితో నరకడం వల్లే చనిపోయారని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మీడియాకు శుక్రవారం మధ్యాహ్నం వెల్లడించారు. ‘ఉదయాన్నే తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఘటనాస్థలం పరిశీలిస్తే హత్య చేసినట్లుగా స్పష్టమైంది. తలపై బలమైన గాయాలవడం వల్లే మృతి చెందారని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. హత్య ఉదంతంపై ప్రత్యేక దర్యాప్తు టీమ్‌ను ఏర్పాటు చేశాం. క్లూస్ టీమ్ పరిశీలించింది.. వారికి కొన్ని ఆధారాలు లభించాయి. డ్రైవర్ పేరు మీద లెటర్ ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’అని సాయంత్రం మరోమారు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతుండగా పదేపదే వివిధ ఫోన్‌కాల్స్ రావడం గమనార్హం. చలించిపోయిన వైఎస్ జగన్.. వైఎస్ వివేకా హత్య వార్త విని యావత్తు వైఎస్సార్ జిల్లా వాసులు నిశ్చేష్టులయ్యారు. పులివెందుల కన్నీటి సంద్రంగా మారింది. తన చిన్నాన్న హత్య విషయం తెలియడంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నారు. పులివెందుల్లో అజాతశత్రువుగా కీర్తించబడ్డ తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని నిర్జీవ స్థితిలో చూడడంతో ఆయన చలించిపోయారు. తన చిన్నాన్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిలు భౌతిక కాయాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భారతమ్మ మరిది మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. విజయమ్మతోపాటు ఆమె తనయ షర్మిలమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్ సోదరులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది తరలివచ్చి వివేకా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వీరిలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరులు, బొత్స సత్యనారాయణ, సినీ నటుడు, వైఎస్ కుటుంబం సమీప బంధువు డాక్టర్ మోహన్‌బాబు, మంచు విష్ణు, పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు తదితరులు ఉన్నారు. సుధాకర్‌రెడ్డిని నేనే బయటకు తీసుకొచ్చా: సతీష్ రెడ్డి కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకరరెడ్డిని తానే బయటకు తీసుకొచ్చానని పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎస్.వి.సతీష్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సతీష్‌రెడ్డి, సుధాకరరెడ్డి ఆరోపణలెదుర్కొంటున్న సంగతి తెల్సిందే. శుక్రవారం ఓ చానెల్లో జరిగిన చర్చలో పాల్గొన్న సతీష్ రెడ్డి ఈ మేరకు వెల్లడించారు. చంద్రబాబును ప్రాధేయపడి, పలుమార్లు విజ్ఞప్తులు చేసి సుధాకరరెడ్డిని బయటకు తీసుకొచ్చానని సతీష్‌రెడ్డి వెల్లడించారు. అంతేకాదు వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిన వెంటనే తాను శుక్రవారం ఉదయం డీజీపీ ఠాకూర్‌కు ఫోన్ చేశానని సతీష్‌రెడ్డి బయటపెట్టారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. నేడు అంత్యక్రియలు వైఎస్ వివేకానందరెడ్డి భౌతిక కాయానికి శనివారం ఉదయం 11 గంటలకు పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. తెరపైకి లెటర్.. ‘‘డ్రైవర్ ప్రసాద్ రోజూ త్వరగా రమ్మంటున్నానని నన్ను కొట్టాడు. డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టోదు.. వదిలిపెట్టోద్దు.’అంటూ ఓ లెటర్ ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వాస్తవంలో డ్రైవర్ ప్రసాద్ అల్పాహారం తెప్పించి.. చివరగా ఇంటికెళ్లారు. ఒకవేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నిజంగా లెటర్ రాసినా... దుండగులే ఆయనతో ఇలా బలవంతంగా రాయించే అవకాశం కూడా ఉంది. లెటర్ రాయించిన తర్వాత అంతమొందించి ఉండవచ్చు. ఒకవేళ ప్రసాద్‌కు ఏమాత్రం సంబంధం ఉన్నా ఎప్పుడో పరారీ అయ్యే అవకాశముంది. కానీ ప్రసాద్ ఉదయం నుంచీ రాత్రి వరకూ అన్నీ కార్యక్రమాల్లో ఉన్నాడు. దుండగులు వ్యవహారాన్ని పక్కదారి పట్టించే లక్ష్యంతోనే ఇలా పక్కాగా లెటర్ సృష్టించి ఉంటారని పలువురు చెబుతున్నారు. ఈ మొత్తం తతంగం వెనుక భారీ స్కెచ్ ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. గన్‌మన్ లేకపోవడం, ఎస్పీని బదిలీ చేయడం.. వైఎస్ వివేకానందరెడ్డి ఒకసారి సమితి ప్రెసిడెంటుగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండు మార్లు ఎంపీగా పనిచేశారు. అంతేగాక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయానా సోదరుడు. పైగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వయానా చిన్నాన్న. ఇన్ని అర్హతలున్నా చంద్రబాబు సర్కారు ఆయనకు గన్మన్లను ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. జిల్లా ఎస్పీగా నిష్పక్షపాతంగా పనిచేసిన అభిషేక్ మహంతిని కొద్దిరోజులపాటే కొనసాగించడమూ అనుమానాలకు తావిస్తోంది. మహంతి కేవలం 42 రోజులు మాత్రమే జిల్లాలో పనిచేసినా, తనదైన శైలిలో నిష్పక్షపాతంగా విధి నిర్వహణ చేపట్టారు. అధికారపార్టీకి ఇది మింగుడు పడలేదు. ఆయన్ను అర్ధాంతరంగా బదిలీ చేశారు. ఆయన్ను బదిలీ చేసిన నెలలోపే వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ కోణం దాగి ఉన్నదనే భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. -
భార్యా, పిల్లల్ని ఊరికి పంపి..
వైఎస్ఆర్ జిల్లా ,ప్రొద్దుటూరు క్రైం :స్థానిక గీతాశ్రమం వీధిలోని చౌడేశ్వరి ఆలయం సమీపంలో పామిలేటి నరసింహ (36) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో భార్యా, పిల్లలు లేని సమయంలో అతను దూలం కొక్కికి చీర చుట్టుకొని ఉరి వేసుకున్నాడు. సమాచారం తెలియడంతో త్రీ టౌన్ ఎస్ఐ నరసయ్య సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నరసింహ కారు డ్రైవర్‌గా వెళ్తుంటాడు.అతనికి ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు గ్రామానికి చెందిన సుహాసినితో 8 ఏళ్ల క్రితం వివాహం అయింది. వారికి రేవంత్, నిఖ్లేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరు గీతాంజలి హైస్కూల్లో చదువుకుంటున్నారు. నరసింహ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. పుట్టింటి నుంచి డబ్బు తీసుకొని రమ్మని నిత్యం భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. నిత్యం అతను భార్యతో గొడవ పడేవాడు. గురువారం సాయంత్రం భార్యతో గొడవ పడ్డాడు. అహోబిళానికి వెళ్లాలని, పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకొని రమ్మని భార్యను పంపించాడు. అతని వేధింపులను భరించలేని ఆమె పిల్లలను తీసుకొని చౌడూరుకు వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్థానికులు ఆమెకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె హుటాహుటినా ఇంటికి రాగా నరసింహ ఉరికి వేలాడుతున్నాడు. పసి పిల్లలను వదిలేసి వెళ్లావా.. వీరిని ఎలా పెంచాలి దేవుడా అంటూ ఆమె విలపించసాగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసయ్య తెలిపారు. -
ప్రమాదం.. విషాదం..
సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలనుకున్న ఆ ఇంట విషాదం ఆవరించింది. సరదాగా మనవడిని తీసుకుని స్కూటీపై బయటకు వెళ్లిన వారిని మృత్యువు వెంటాడింది. రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో తాతా మనవడు దుర్మరణం చెందారు. వైఎస్ఆర్ జిల్లా , రామాపురం : కర్నూలు – చిత్తూరు 40వ నెంబరు జాతీయ రహదారిపై రామాపురం మండలం గువ్వలచెరువు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద మంగళవారం సాయంత్రం స్కూటీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో గువ్వలచెరువుకు చెందిన సుబ్బరాయుడు(55), అతని మనవడు యశ్వంత్(4) అక్కడికక్కడే మృతి చెందారు. రామాపురం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గువ్వలచెరువుకు చెందిన సుబ్బరాయుడు తన మనవడైన యశ్వంత్‌తో స్కూటీలో పెట్రోల్ పట్టుకుని తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డుపైకి రాగానే కడప వైపు నుంచి వస్తున్న ఏపీ 04బీఎల్ 4915 నెంబరు గల కారు అధిక వేగంతో వచ్చి స్కూటీని ఢీ కొంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రామాపురం ఎస్ఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలకు అంతరాయం లేకుండా చూశారు. గువ్వలచెరువులో విషాదం ఈ ప్రమాద విషయం తెలియగానే సంక్రాంతి పండుగ రోజున గువ్వలచెరువులో విషాదం చోటు చేసుకుంది. చిన్నారి యశ్వంత్ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే గడికోట దార్వకనాధరెడ్డి ఆసుపత్రిలో మృతుల కుటుంబీకులను పరామర్శించారు. -
ఈ హత్యలు ఎవరి పనో..?
వైఎస్ఆర్ జిల్లా , రాజంపేట: రాజంపేట పట్టణం నడిబొడ్డున నూనివారిపల్లెరోడ్డులోని నలందా స్కూలు వీధిలో ఓ ఇంటిలో మహిళ దారుణహత్యకు గురైన సంఘటన బుధవారం సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాసులరెడ్డి, సుజాత దంపతులు నలందనగర్లో నివాసం ఉంటున్నారు. భర్త జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో కిషోర్‌కుమార్‌రెడ్డి గల్ఫ్‌కు వెళ్లగా, మరొక కుమారుడు దినేష్‌రెడ్డి వేరే ఊరిలో చదువుకుంటున్నాడు. సుజాత ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె ఇంటి బెడ్ రూమ్‌లో శవమై కనిపించింది. అక్కడి సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంచం కింద రక్తం ప్రవహించింది. మృతదేహంపై ఉన్న గాయాలు కనిపించకుండా దుండగులు ఆమెపై చీరలు కప్పి వెళ్లారు. రాజంపేట రూరల్ సీఐ నరసింహులు సుజాత మృతి చెందిన గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టణ ఎస్ఐ చెన్నకేశవ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కడప నుంచి క్లూస్‌టీంను రప్పిస్తున్నట్లు ఆయన వివరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హత్య ఎలా వెలుగు చూసిందంటే.. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు సుజాత ఇంట్లోనుంచి బయటకు రాకపోగా.. ఆమె ఉం టున్న ఇంటికి బయట తాళం వేసి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారు తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్రూమ్లో ఆమె శవమై కనిపించింది. ఆమె ఒంటిపై చీరలు కప్పి ఉండటంతో ఎక్కడెక్కడ గాయాలైంది అర్థం కాలేదు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగిందా? లేక బుధవారం రోజు పగలే జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు దొంగలు చొరబడి నగలు దోచుకునే క్రమంలో ఆమెను హత్య చేశారా లేక ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల పనా అనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికితోడు ఇంటి బయట తాళం వేసి వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. బండరాయితో మోది చంపి.. పోరుమామిళ్ల(కలసపాడు): కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లె దళితవాడకు చెందిన ఓబు ళాపురం థామస్(26) మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లారేటప్పటికే ఈ వార్త పరిసర గ్రామాల్లో సంచలనమైంది. చెన్నారెడ్డిపల్లె – నల్లగొండుపల్లె మధ్య చెరువు సమీపంలో గజ్జ రాయితో తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతునికి భార్య మంజుల, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. థామస్‌కు మద్యం తాగే అలవాటు తప్పితే ఏ ఇతర అలవాట్లు లేవని, ఇతర విషయాల్లో తలదూర్చేవాడు కాదని సమాచారం. క్రిస్మస్ సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామంలో తేరు ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో ఉన్న థామస్ ఊరి బయటకు ఎందుకు వెళ్లాడో తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. అతని బలహీనత తెలిసిన వ్యక్తులు మద్యం సేవిద్దామని ఊరికి దూరంగా తీసుకెళ్లి రాయితో కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య సమయంలో పెనుగులాట జరిగినట్లు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ హత్యలో ముగ్గురు, నలుగురు పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయని, పోలీస్ స్టేషన్ వరకు ఈ తగాదా వెళ్లినట్లు తెలిసింది. మృతుని భార్య మంజులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కలసపాడు ఎస్ఐ వెంకటరమణ కేసు నమోదు చేసుకున్నారు. ఏమీ తేల్చని డాగ్‌స్క్వాడ్: సంఘటన సమాచారం తెలిసి బుధవారం ఉదయం డాగ్‌స్క్వాడ్ అక్కడికి చేరుకుంది. మృతదేహం వద్ద వాసన చూసిన కుక్కలు ఆ తర్వాత చెరువు కట్టపై తారాడి మహనందిపల్లె వరకు వెళ్లాయి. అయినా అవి ఏమీ నిర్ధారించలేకపోయాయి. -
అదుపు తప్పి కారు బోల్తా
వైఎస్ఆర్ జిల్లా, రామాపురం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై మండల పరిధిలోని చిట్లూరు పంచాయతీ పాలన్నగారిపల్లె సమీపంలో మంగళవారం సాయంత్రం కారు అదుపుతప్పి బోల్తా పడడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తెలం గాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి తన కుటుంబంతో కలసి టీఎస్ 06 ఈఆర్ 6484 నంబరు గల కారులో తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణంలో కాణిపాకంలో వినాయకుడిని దర్శనం చేసుకొని మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. రామాపురం మండలం పాలన్నగారిపల్లె సమీపంలోకి రాగానే కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న భార్య సంధ్య, కుమార్తె వైష్ణవి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు ఫోన్ చేసినప్పటికి ఎంతకూ రాకపోవడంతో అటుగా వెళుతున్న మరో వాహనంలో ఆసుపత్రికి తరలించారు. రామా«పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశ తీరక.. అవమానం భరించలేక
వైఎస్ఆర్ జిల్లా,బద్వేలు అర్బన్ : ఆ యువకుడు చిన్నతనం నుంచి కష్టపడి చదివేవాడు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివించారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఆశ నెరవేరలేదన్న కారణంతో పాటు డబ్బుల విషయంలో తన స్నేహితుడు చేసిన అవమానం భరించలేకఅర్ధాంతరంగా తనువు చాలించాడు. కన్నవారి కలలను దూరం చేశాడు. బద్వేలు పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయనగర్‌లో నివసించే వెంకటసుబ్బయ్య, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటసుబ్బయ్య జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. వెంకటసుబ్బయ్య పెద్ద కుమారుడైన ఆవులేటిచైతన్య (27) బీటెక్ పూర్తిచేసి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కొన్ని నెలలుగా తన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని, తన స్నేహితుని ఉద్యోగం కోసం డబ్బులు చెల్లిస్తే వారు మోసం చేశారని, ఇదే సమయంలో తన స్నేహితుడు డబ్బుల కోసం ఒత్తిడి పెట్టడంతో పాటు జరిగిన విషయాన్ని వాట్సాప్ ద్వారా తన మిత్రులకు తెలిపి తన పరువు తీశాడని మదనపడుతుండేవాడని తెలిసింది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన చైతన్య స్వగ్రామానికి చేరుకున్నాడు. అదే రోజు తల్లి, తమ్ముడు కర్నూలుజిల్లా చాగలమర్రిలో జరిగే వివాహానికి వెళ్లారు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి తలుపులు తట్టగా తీయలేదు. కిటికీలో నుంచి చూడగా ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి సోదరుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకుని మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్నో కష్టాలు పడి నిన్ను చదివించాం. నీకు ఉన్న ఇబ్బందులు మా దృష్టికి తీసుకు వచ్చింటే తీర్చేవారం కదరా, ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా నాయనా అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. -
రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
వైఎస్ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల– నిడుజివ్వి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి 9.30 గంటలకు జరిగిన రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ ఓబులయ్య (35) మృతి చెందారు.విధులు ముగించుకొని బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే రూరల్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు..ఓబులయ్య ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో (పీసీ నంబరు 363) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఈయన సుమారు ఆరు నెలల కిందట చిన్నమండెం పోలీస్‌స్టేషన్ నుంచి బదిలీపై ఎర్రగుంట్లకు వచ్చారు. ఈయన స్వగ్రామం ముద్దనూరు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎర్రగుంట్లలో ట్రాíఫిక్ విధులు నిర్వర్తిస్తున్నారు. రోజు మాదిరిగానే విధులు ముగించుకొని పిల్లలకు అరటి పండ్లు తీసుకొని స్కూటర్లో ముద్దనూరుకు బయలుదేరారు. ఎర్రగుంట్ల– నిడుజివ్వి గ్రామ సమీపాన క్వారీ వద్దకు రాగనే గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొంది. ఇనుప రాడ్ తలకు బలంగా తగిలింది. దీంతో హెల్మెట్ పగలిపోయి తల లోపలికి రాడ్డు దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ ఓబులయ్య అక్కడిక్కడే దుర్మరణం చెందారు. స్కూటర్ దూరంగా పడిపోయింది. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ కొండారెడ్డి పరిశీలించారు. వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. పరిస్థితిని పరిశీలించారు. -
ఎర్రగుంట్ల బస్టాండ్.. చోరీలకు కేరాఫ్
వైఎస్ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్ చోరీలకు నిలయంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ బస్సులు ఎక్కాలంటేనే ఏ బ్యాగులో నుంచి ఏ వస్తువు చోరీ చేస్తారో.. ఎవరి జేబులో నుంచి ఎంత నగదు మాయమవుతుందో.. ఎవరి పర్సు కొట్టేస్తారో.. అనే భయం ప్రయాణికులను వెంటాడుతోంది. ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు మాత్రం హస్త లాఘవం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక్కడ సెల్ ఫోన్లు, బంగారు , డబ్బులు చోరీ కావడం నిత్యకృత్యమైంది. బుధవారం ఏకంగా ఓ వ్యక్తి నిక్కరు జేబును బ్లేడ్‌తో కోసి రూ.2 లక్షలు నగదు దొంగిలించిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లో బస్సులు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు పెరిగిపోవడమే గాని చోరీల నియంత్రణకు పోలీసులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. నిఘా కెమెరాలు ఉన్నా లేనట్టే.. ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుస్తోంది. ఈ కెమెరాలు ఉన్న డైరెక్షన్లో చెట్లు అడ్డంగా ఉండడంతో చోరీ జరిగిన సంఘటనలు అందులో నమోదు కాలేకపోతున్నాయి. ఒక వేళ నమోదయినా దొంగలు సరి గా కన్పించడంలేదు. అంతేకాక బస్సులు కూడా నిఘా కెమెరాలకు అడ్డంగా వస్తుండడంతో ప్రయాణికులు బస్సు ఎక్కే దృశ్యాలు నమోదు కాలేక పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు స్పందించి బస్టాండులో నిఘా ఏర్పాటు చేసి అ నుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకుని చోరీలను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
కలలన్నీ కాటికి !
కుటుంబ పోషణ కోసం అయినవారికి దూరంగా వెళ్లాడు. మూడేళ్లు దుర్భర జీవనం తర్వాత కలలు కంటూ ఇంటికి పయనమయ్యాడు. విమానం దిగగానే కళ్లెదుట భార్య.. తమ్ముడు, అతని భార్య, వారి ఏకైక సంతానం. మూడేళ్లపాటు వారి ఊహలతో గడిపిన అతని మది ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆనందంగా అందరూ కలిసి ఓ వాహనంలో ఇంటికి పయనమయ్యారు. కుమారులను చూడాలన్న తాపత్రయం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతలోనే రెప్పపాటులో జరిగిన ప్రమాదం.. ఊహకందని విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని పొట్టనబెట్టుకుంది. అయిన వారి ఆక్రందనలను ఆపడమెవరి తరమూ కాలేదు.. కారణమేదైనా తెల్లవారక ముందే ఇంటికి చేరాల్సిన వారంతా కాలగర్భంలో కలసిపోవడం తీరని విషాదాన్ని మిగిల్చింది. రేణిగుంట : రేణిగుంట–కోడూరు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని బలితీసుకుంది. వారిలో ఇప్పుడిప్పుడే ముద్దులొలికే మాటలు నేర్చుకుంటున్న ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ నేపథ్యం ఇదీ.. వైఎస్సార్ జిల్లా సీకే దిన్నెకు చెందిన గంగాధరం ఆరేళ్ల కిందట జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. మూడేళ్ల కిందట ఓ సారి ఇంటికి వచ్చి మళ్లీ తిరిగి వెళ్లాడు. ఆయనకు భార్య విజయమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రవీణ్‌కుమార్(24) ఇటీవలే వివాహం చేసుకుని బెంగళూరులో ల్యాబ్ టెక్నీషియన్‌గా స్థిరపడ్డాడు. రెండో కుమారుడు ప్రదీప్‌కుమార్ (15) స్థానికంగా 10వ తరగతి చదువుతున్నాడు. ఈ ప్రమాదంలో గంగాధరంతో పాటు అతని భార్య విజయమ్మ, సోదరుడు ప్రసన్న, అతని భార్య మరియమ్మ, వారి ఒక్కగానొక్క చిన్నారి ప్రజ్వన్కుమార్ మృతి చెందారు. ప్రసన్న వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిద్రమత్తు– అతివేగమే కారణమా? కువైట్ నుంచి మూడేళ్ల తర్వాత తిరిగి వస్తున్న గంగాధరాన్ని కళ్లారా చూడాలన్న ఆతృత ఆయన భార్యకే కాదు... సోదరుడు, అతని భార్యకు కలిగింది. వారంతా కలసి శనివారం ఉదయం కారులో ఇంటి నుంచి బయల్దేరి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గంటల తరబడి నిరీక్షించి విమానం దిగిన గంగాధరాన్ని చూసి మురిసిపోయారు. అక్కడ నుంచి అందరూ కలసి కారులో మాట్లాడుకుంటూ బయల్దేరారు. తాను తెచ్చిన బంగారు ఆభరణాలను కుటుంబీకులకు చూపించాడు. సుమారు మూడున్నర గంటల పాటు వారి ప్రయాణంలో పిచ్చాపాటి మాటలతో మొదలై అప్పుడప్పుడే కొద్దిపాటి కునుకు తీస్తూ సాగింది. వారి వాహనం రేణిగుంట మండలం మామండూరు దాటాక ఎదురుగా ఓ లారీ మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. కారులో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దుర్ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను కారులోంచి బయటకు తీశారు. మృతుల బంధువులకు సమాచారం అందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తప్పించారు. మితిమీరిన వేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. లారీ కోడూరు వైపు నుంచి సున్నపురాయి లోడుతో రేణిగుంట వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృత్యుంజయుడు ప్రదీప్‌కుమార్ గంగాధరం చిన్నకుమారుడు ప్రదీప్‌కుమార్ నాన్నను చూసేందుకు కారులో తాను చెన్నైకు వస్తానని మారాం చేశాడు. 10వ తరగతి చదువుతుండడంతో క్లాసులకు గైర్హాజరు కావడమెందుకన్న కారణంతో వీరి వెంట రాకుండా ఆగిపోయి స్కూల్‌కు వెళ్లాడు. మృత్యుంజయుడుగా మారినా.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలాడు. మృతదేహాల అప్పగింత ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మృతుల బంధువులు రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి పోస్ట్‌మార్టం చేస్తున్న తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను అప్పగించినట్లు రేణిగుంట సీఐ శివరాముడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారకాల్వలో మిన్నంటిన రోదనలు చక్రాయపేట : రేణిగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చక్రాయపేట మండలం కుమార కాల్వకు చెందిన గంగాధర కుటుంబ సభ్యులు ప్రస్తుతం వేంపల్లె మండలం శ్రీరాం నగర్లో నివసిస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామమైన కుమారకాల్వకు తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో మృతదేహాలను చూసి బంధువులు బోరున విలపించారు. -
మూడో పెళ్లి మోజులో.. భార్యపై...
సాక్షి, రైల్వేకోడూరు: అతను మొదటి భార్యను వదిలేశాడు. రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెనూ వదిలించుకుని మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అంతే.. కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తప్పించుకుని వచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రైల్వేకోడూరులో చోటు చేసుకున్న సంఘటన వివరాలు బాధితురాలి కథనం మేరకు ఇలా ఉన్నాయి. రైల్వేకోడూరు పట్టణంలోని పాతబజారుకు చెందిన యాదాల శంకరయ్యకు యాదాల ప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. వీరు కోడూరులో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. యాదాల ప్రసాద్ 1999లో నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన సుధ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆమెను వదిలేసి 2013లో చిత్తూరు జిల్లా కందూరుకు చెందిన ప్రణీత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. గత ఐదేళ్లుగా భర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. భర్త వేధింపులు భరించలేక గతంలో తాను కడప మహిళా పోలీస్ స్టేషన్, రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్, చిత్తూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే తన భర్త వద్ద డబ్బులు బాగా ఉండటంతో పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని, కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతూ వచ్చారని పేర్కొంది. అయినా తన భర్త మారలేదని ఆమె విలపిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తాను మరొక మహిళను వివాహం చేసుకుంటానని చెబుతూ ప్రతి రోజూ రాత్రి సమయంలో చిత్రహింసలు పెడుతున్నాడని ఆమె పేర్కొంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చున్నీతో నా మెడకు ఉరివేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో తన మామ, అత్త కూడా అక్కడే ఉండి తన భర్తకు సహకరించారని ఆరోపించింది. తాను గట్టిగా వదిలించుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పింది. గొంతుకు తీవ్ర గాయం కావడంతో కోడూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం తిరుపతి రుయాకు వెళ్లి చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని ఎస్ఐ భక్తవత్సలం తెలిపారు. -
ఆత్మహత్యాయత్నమా.. హత్యాయత్నమా !
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : వివాహితను వేధింపులకు గురి చేసిన సంఘటనపై భర్తతో పాటు అత్తామామలపై మహిళ తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు రోడ్డులోని గేటు వీధిలో నివాసం ఉంటున్న షేక్ ఆసిఫాకు 14 నెలల క్రితం శాంతకుమారి వీధికి చెందిన షేక్ ఇస్మాయిల్‌తో వివాహం అయింది. ఆసిఫా తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో మేనమామ ఖాదర్‌బాషా ఆమెను పెంచి పెద్ద చేశాడు. పెళ్లి సమయంలో కట్న కానుకుల కింద ఆసిఫాకు 10 తులాల బంగారు, రూ. 1 లక్ష నగదు ఇచ్చారు. ఇస్మాయిల్ ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్నాడు. రెండు నెలల పాటు భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండేవారు. ఆసిఫా వద్ద ఉన్న బంగారును భర్త బ్యాంకులో కుదవ పెట్టాడు. రూ. 4 లక్షలు దాకా బాకీ ఉందని, మేనమామను అడిగి తీసుకొని రావాలని ఆమెను చిత్రహింసలకు గురి చేసేవారు. భర్త, అత్తామామలు ఎంతగా ఇబ్బంది పెడుతున్నా ఆమె ఈ విషయాన్ని మేనమామతో చెప్పలేదు. ఈ క్రమంలో ఆసిఫా ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు గురువారం ఖాదర్బాషాకు ఫోన్ వచ్చింది. దీంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆసిఫా అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు అందరూ భావించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆసిఫాకు మెలుకువ వచ్చింది. తాను ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదని, తనకు ఏదో మత్తు ఇచ్చారని తెలిపింది. తనకు ఏం జరిగిందో తెలియదని, మెలుకు వచ్చేసరికి ఆస్పత్రిలో ఉన్నానని ఆసిఫా పోలీసులకు తెలిపింది. ఆసిఫాకు మత్తు ఇచ్చి చంపే ప్రయత్నం చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె భర్త, అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇరువురు మాట్లాడుకుంటున్నారని, తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం రాత్రి తెలిపారు. -
10 ఏళ్ల క్రితం వివాహం.. ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం!
వైఎస్ఆర్, నంద్యాల: సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. అది ప్రేమగా మారింది. ఆమెకు అప్పటికే వివాహమైంది. అయినప్పటికీ ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అయితే..ఇంతలోనే ఏం జరిగిందో కానీ ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రియుడు మృతి చెందగా..ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురువారం కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన విద్యుత్ శాఖ ఏడీఏ రఘుతో దివ్యకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. పైగా వయసులో 23 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఇదిలా ఉండగా.. అదే జిల్లా ప్రొద్దుటూరులోని దొరసానిపల్లె వీధికి చెందిన బండారు శ్రావణ్‌కుమార్(26) నెల్లూరులో ఏపీ జెన్కోలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి, దివ్యకు ఏడాది క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరు అప్పుడప్పుడు కలుసుకొనే వారని స్థానికులు తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఇంటి నుంచి ఇద్దరూ బయటకు వచ్చారు. భార్య అదృశ్యమైందని దివ్య భర్త రఘు పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి జాడ ఎవరికీ కనిపించలేదు. పెళ్లి చేసుకోవడానికే ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. గురువారం ఉదయం తిరుపతి నుంచి రైలులో నంద్యాల రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. శ్రావణ్‌కుమార్ తన బంధువులకు ఫోన్ చేసి తాను బతకనని, పురుగు మందు తాగుతున్నానని తెలిపాడు. తాము మాట్లాడతామని వారు చెప్పినా వినకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. అనంతరం రైల్వేస్టేషన్ వెలుపల కూల్‌డ్రింక్స్ కొనుగోలు చేసి.. అందులో పురుగు మందు కలుపుకొని ఇద్దరూ తాగారు. తర్వాత రైల్వేస్టేషన్‌లోకి వెళుతూ స్టేషన్ ఆవరణలోనే పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రాగానే నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పోలీసులకు వారి పేర్లు, అడ్రస్ తెలిపి తామిద్దరం ప్రేమించుకున్నామని మాత్రమే చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా కోలుకోలేక శ్రావణ్‌కుమార్ మృతి చెందాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రావణ్‌కుమార్ తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రఫీ తెలిపారు. -
భార్యను కత్తితో పొడిచి.. ఆత్మహత్య చేసుకున్నాడు
వైఎస్ఆర్ జిల్లా, సింహాద్రిపురం : కూలీ డబ్బుల విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితిలో కోపంతో భార్యపై కత్తితో దాడి చేశాడు. ఆపై తాను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ నాగబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సింహాద్రిపురం మండల పరిధిలోని అంకాలమ్మ గూడూరులో నివాసముంటున్న కొండయ్య తన పొలంలో నాలుగు రోజుల క్రితం కలుపుతీత పనులు చేపట్టాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కొండయ్య మద్యం తాగి వచ్చి తన భార్య వెంకటసుబ్బమ్మ(45)తో కూలీ డబ్బు విషయమై గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగి భార్యను కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన కోడలు సింధుకు గాయాలయ్యాయి. దాడిలో గాయపడిన భార్య మృతి చెంది ఉంటుందని భావించి ఊరి బయట చెట్టుకు ఉరి వేసుకుని కొండయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటసుబ్బమ్మను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. బుధవారం ఉదయం కొండయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో అంకాలమ్మ గూడూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వందల్లో బుకీలు.. వేలల్లో పంటర్లు
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం: గాంధీరోడ్డులో బాగా పేరున్న కుటుంబం.. ఆ కుటుంబంలోని ఒక యువకుడు కొన్ని నెలల నుంచి ఇంట్లో తెలియకుండా క్రికెట్ పందేలు ఆడుతున్నాడు. రూ. వందల్లో ప్రారంభమైన క్రికెట్ బెట్టింగ్ రూ. లక్షలకు చేరుకుంది. కనీస పరిజ్ఞానం లేకుండానే క్రికెట్ జట్లపై రూ. లక్షల్లో పందేలు కాసేవాడు. ఇలా అతను సుమారు రూ. 40 లక్షలకు పైగా ప్రధాన బుకీకి బాకీ పడ్డాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. బయట తెలిస్తే పరువుపోతుందని క్రికెట్ బుకీకి డబ్బు కట్టారు. మైదుకూరు రోడ్డులోని ఒక యువకుడు బంగారు దుకాణం నిర్వహించేవాడు. రెండేళ్లలోనే రూ. లక్షలు సంపాదించాడు. అయితే తోటి మిత్రుల మాటలు విని తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. సుమారు రూ.35 లక్షలు దాకా పోగొట్టుకున్నాడు. బుకీల నుంచి ఒత్తిళ్లు రావడంతో దిక్కు తోచని స్థితిలో భార్యను కొట్టి పుట్టింటికి పంపించాడు. డబ్బు తీసుకొని వస్తేనే కాపురానికి పిలుచుకుంటాను లేకుంటే వద్దని చెప్పాడు. ప్రొద్దుటూరులోని ఎక్కువ మంది బుకీలు చేసే పని ఇదే. డబ్బున్న యువకులను ఎంచుకొని బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. పరువు పోతుం దనే భయంతో బంగారు నగలు విక్రయించి బాకీ కట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊళ్లోనూ క్రికెట్æ బెట్టింగ్ బాధితులు ఉన్నారు. గతంలో అప్పుల పాలై ఆత్మహత్యలకు ప్రయత్నించిన వారు, ఆత్మహత్య చేసుకున్నవారు కూడా ఉన్నారు. సంపన్నులు, వ్యాపారుల పిల్లలే టార్గెట్.. క్రికెట్ ఆట ద్వారా సంపాదనకు అలవాటు పడిన బుకీలు అమాయకులపై ఆశల వల విసురుతున్నారు. ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన ప్రధాన బుకీలు జిల్లాలోని తమ బుకీల ద్వారా మండల కేంద్రాల్లో సబ్ బుకీలను, బాయ్‌లను నియమించుకొని క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కొత్త వ్యక్తులను కూడా బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. 20–20 మ్యాచుల్లో పందేలు కాస్తే సునాయసంగా డబ్బు గెలుచుకోవచ్చని మభ్యపెడుతున్నారు. ఫలాన వ్యక్తి మా దగ్గర బెట్టింగ్ ఆడి రూ.లక్షలు గెలుచుకున్నారంటూ నమ్మ బలుకుతున్నారు. ధనికులు, వ్యాపార వర్గాలకు చెందిన పిల్లలపై బుకీలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రూ.లక్షలు బాకీ పడ్డాక బుకీలు వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గ్రామాలకు ప్రాకిన బెట్టింగ్ జాడ్యం.. క్రికెట్ పందేల జాడ్యం గ్రామ స్థాయికి చేరింది. గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన క్రికెట్ పందేలు ఇప్పుడు గ్రామాల్లోకి గల్లీలకు ప్రాకింది. క్రికెట్ పందేలు అడే వారే కాకుండా బుకీలు కూడా గ్రామల్లో ఎక్కువగా ఉన్నారు. దువ్వూరు, ఎర్రగుంట్ల, చాపాడు, ఆర్టీపీపీల నుంచి పందేలు నిర్వహించడానికి ప్రొద్దుటూరుకు వస్తున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని ఖాదర్‌బాద్ గ్రామంలో పెద్ద సంఖ్యలో బుకీలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన ఒక ప్రధాన బుకీ ప్రస్తుతం తిరుపతిలో ఉంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సబ్ బుకీలను నియమించుకొని అతను ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరో ప్రధాన బుకీ హైదరాబాద్‌లో ఉంటూ బినామీలను నియమించుకొని కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతనిపై ప్రొద్దుటూరులోని పలు స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల పలువురు బుకీలుగా అవతారం ఎత్తినట్లు తెలిసింది. కనిపించని పోలీసుల చర్యలు.. గతంలో క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయాల్లో ఆయా స్టేషన్ల పరిధిలో ఉన్న బుకీలను పోలీస్స్టేషన్లలో కూర్చోబెట్టేవారు. మ్యాచ్‌లు ముగిసే వరకు స్టేషన్లలోనే వారిని ఉంచుకునేవారు. ఈ చర్యల వల్ల కొంత మేర పందేలు అదుపులో ఉండేది. గతంలో పని చేసిన డీఎస్పీలు శ్రీనివాసులరెడ్డి, పూజితానీలం ఈ విధానం అనుసరించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రతి వీధిలోనూ క్రికెట్ బెట్టింగ్ ఆడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. పట్టణంలో వందల సంఖ్యలో బుకీలు, వేలల్లో పంటర్లు (ఆడేవారు) ఉన్నారు. చాలా మంది ప్రధాన బుకీలు హైదరాబాద్, బెంగుళూరు, గోవా, విజయవాడ కేంద్రాలుగా చేసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ – ఇండియా క్రికెట్ మ్యాచుల్లో బుకీలు బాగా లాభ పడినట్లు తెలుస్తోంది. బాగా లాభాలు రావడంతో పలువురు బుకీలు విదేశీ టూర్లకు కూడా వెళ్లినట్లు సమాచారం. -
పెళ్లి పేరుతో సంపన్నులను బుట్టలో వేసుకొని..
వైఎస్ఆర్ జిల్లా, ఖాజీపేట/గిద్దలూరు: పవిత్రమైన వివాహ బంధాన్ని ఎగ‘తాళి’ చేసేలా వ్యవహరించి వరుసగా ఆరుగురిని వివాహం చేసుకున్న ఓ నిత్య పెళ్లికూతురును వైఎస్సార్ జిల్లా ఖాజీపేట పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరు రూరల్ సీఐ కంభగిరి రాముడు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖాజీపేట మండలం కొమ్మలూరుకు చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మూడు నెలల క్రితం ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం మోదినీపురం గ్రామానికి చెందిన మౌనికను వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు నెల 25న ఆమె తండ్రి వచ్చి కూతురిని పుట్టింటికి తీసుకెళ్తున్నానని చెప్పి పిలుచుకుని వెళ్లాడు. ఆమె వెళ్లేటప్పుడు అత్తింటిలో నుంచి బంగారు నగలను తీసుకెళ్లింది. ఆమె తిరిగి రాకపోగా, ఆమె పుట్టింట్లో కూడా లేకపోవడంతో అన్నిచోట్లా గాలించి ఈనెల 10న ఆమె భర్త రామకృష్ణారెడ్డి పోలీసుకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మౌనికతో పాటు, ఆమె తండ్రి అనంతరెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వీరిని మైదుకూరు పట్టణంలో గుర్తించి ఆదివారం అరెస్టు చేశారు. మౌనిక, ఆమె తండ్రి అనంతరెడ్డి తోపాటు రత్నావల్ చంటినాయక్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆ నగలను విక్రయించి వచ్చిన డబ్బుతో వీరు ముగ్గురూ జల్సాలు చేసేవారు. ముగ్గురిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కిలాడీ లేడీది ప్రకాశం జిల్లా మొహిద్దీన్‌పురం.. ఆరు పెళ్లిళ్లు చేసుకుని భర్తలను మోసం చేస్తూ బంగారు నగలు, నగదుతో ఉడాయిస్తున్న మౌనికది ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలోని మొహిద్దీన్‌పురం. మొహిద్దీన్‌పురానికి చెందిన చేగిరెడ్డి అనంతరెడ్డిది పేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అనంతరెడ్డికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మద్యం వ్యసనానికి బానిసైన అనంతరెడ్డి అందంగా ఉన్న తన కుమార్తెను పావుగా చేసుకుని సంపాదించాలనుకున్నాడు. పెళ్లి మీద పెళ్లి చేస్తూ నగలు, డబ్బుతో ఉడాయిస్తున్నాడు. మార్కాపురంలో మొదటి పెళ్లి చేశాడు. నెలకే ఇంటికి వచ్చింది. రెండో వివాహం గిద్దలూరు మండలంలోని వేములపాడు గ్రామంలో చేసుకుంది. రెండు నెలలకే నగలు, డబ్బుతో పుట్టింటికి చేరింది. రెండేళ్లు ఖాళీగా ఉన్న ఆమె.. తిరిగి మూడో పెళ్లి బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లెలో యువకుడిని చేసుకుంది. రెండు నెలలకే భర్తకు చెందిన బంగారు, నగదు తీసుకెళ్లడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. నాలుగో వివాహం తెనాలిలో, ఐదో పెళ్లి ఖాజీపేటలో చేసుకుని నగలు, డబ్బుతో పరారు కావడంతో అక్కడ కేసు నమోదయింది. ఆ కేసు ఉండగానే హైదరాబాద్‌కు చెందిన యువకుడిని ఆరో వివాహం చేసుకుంది. -
పుట్టింటికని.. పత్తా లేకుండా పోయారు..
వైఎస్ఆర్ జిల్లా, ఖాజీపేట : అత్తింట్లో ఉన్న ఆ యువతి వద్దకు ఆమె తండ్రి వచ్చి పుట్టింటికి తీసుకెళ్లి తిరిగి తీసుకు వస్తానని చెప్పి పిలుచుకుని వెళ్లాడు. 45 రోజులు దాటినా వారి ఆచూకీ లేకపోవడంతో ఆందోళన చెందిన అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే యువకునికి ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన మౌనికతో 3 నెలల క్రితం వివాహమైంది. వారిద్దరు అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మౌనిక తండ్రి అనంత రెడ్డి ఆగస్టు 25న కొమ్మలూరుకు వచ్చి తన కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లి తిరిగి తీసుకువస్తానని చెప్పి పిలుచుకుని పోయాడు. మామను, భార్యను రామకృష్ణారెడ్డి ఖాజీపేట బస్టాండ్‌కు తీసుకు వచ్చి బస్సు ఎక్కించి పంపాడు. తరువాత వారు ప్రకాశం జిల్లాలోని వారి ఇంటికి వెళ్లలేదు. ఇటు కొమ్మలూరుకు రాలేదు. సుమారు 45 రోజులు దాటినా వారి ఆచూకీ లేకపోవడంతో ఆందోళన చెందిన రామకృష్ణారెడ్డి ఈనెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ఛాలెంజ్‌గా తీసుకుని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పెళ్లిళ్లు చేసుకోవడం పరారవడం..? మౌనిక తన భర్తతో గొడవ పడి వెళ్లిందా లేక ఇంటిలోని బంగారాన్ని తీసుకుని ఉడాయించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తతో గొడవ పడితే పుట్టింటికి వెళ్లాలి కానీ ఇలా ఎవ్వరికీ అంతుచిక్కకుండా వెళ్లడంపై పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో ఆమె తండ్రి అనంత రెడ్డి పాత్ర పై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మౌనిక స్వగ్రామానికి వెళ్లి విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమె ఇలా గే కొందరిని వివాహం చేసుకుని ఆ తరువాత డబ్బు, బంగారంతో అత్తవారింటి నుంచి పరారైనట్లు అక్కడి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. తండ్రి, కూతురు కనిపించకపోయినా కనీసం మౌనిక కుటుంబ సభ్యులు ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం కూడా పలు అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తమది పేద కుటుంబం అని తాము ఎలాంటి కట్న కానుకలు ఇవ్వలేమని చెప్పడం.. ఆ తర్వాత పెళ్లి కుమారునితోనే అమ్మాయికి బంగారం పెట్టించడం.. అలా వచ్చిన బంగారంతో ఉడాయించడం జరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరు వాడుతున్న ఫోన్ ఆధారంగా వారి ఆచూకి కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలు వారు ఎందుకు వెళ్లిపోయారు.. పుట్టింటికి ఎందుకు వెళ్లలేదు.. అందుకు కారణం ఏమిటి.. కేవలం బంగారం కోసమే ఇలా చేశారా.. భర్తతో వచ్చిన గొడవలే కారణమా అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తండ్రి, కూతురు ఆచూకీ దొరికితే గానీ మిస్టరీ వీడదని పోలీసులు చెబుతున్నారు. -
జల్సాల కోసం చోరీలు.. కటకటాల పాలు
కడప అర్బన్ : జల్సాల కోసం చోరీలు చేయడం మొదలుపెట్టారు. చివరికి కటకటాల పాలయ్యారు. కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈనెల 5వ తేదీ సాయంత్రం ఇద్దరు అంతర్జిల్లా దొంగలను చిన్నచౌక్ సీఐ ఎస్. పద్మనాభన్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆర్వీ కొండారెడ్డి, తమ సిబ్బందితో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3,03,000 విలువైన 101గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన వివరాలను కడప డీఎస్పీ సేక్ మాసుంబాషా తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం వెల్లడించారు. చిత్తూరు జిల్లా కలకడ మండలం, కోటగుడి బండగ్రామం, చొక్కనవారిపల్లెకు చెందిన పిట్టి శరత్‌కుమార్, మదనపల్లె, ఎంఎస్ఆర్ వీధికి చెందిన కొట్టి నరేష్ జల్సాలకు అలావాటు పడ్డారు. డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడేవారన్నారు. శరత్‌కుమార్ తన మామ ఇంటిలో రూ.80 వేలు నగదు చోరీ చేసి కేసులో మదనపల్లి సబ్‌జైలులో శిక్ష అనుభవించి విడుదల అయ్యి, తర్వాత రెండవ నిందితుడితో స్నేహం చేశాడన్నారు. ఇద్దరు కలిసి కడపకు వచ్చి చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృత్యుంజయకుంటలో ఓ చోరీ, ఒన్‌టౌన్ పరిధిలో రెండు నేరాలకు పాల్పడ్డారన్నారు. చిన్నచౌక్ పరిధిలో ఒక కేసు, ఒన్‌టౌన్ పీఎస్‌లో రెండు కేసులలో పై బరువున్న, విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. చోరీకి పాల్పడిన దొంగ అరెస్టు కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శంకరాపురానికి చెందిన మంద వంశీకృష్ణ అనే యువకుడు 2016లో ఓ వివాహానికి వెళ్లి అక్కడ గదిలో ఓ బ్యాగ్‌ను చోరీ చేశాడు. బ్యాగ్‌లో రూ. 95,100 విలువైన 31.700 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 5000 నగదుతో పరారయ్యాడు. నిందితుడిని ఈనెల 5 వ తేదీ కడప నగర శివార్లలోని ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలో అరెస్ట్ చేశారు. అతని వద్ద నగదు, ఆభరణాలు రికవరీ చేశారు. పైరెండు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన చిన్నచౌక్ సీఐ పద్మనాభన్, ఎస్ఐ ఆర్వీ కొండారెడ్డిలతో పాటు సిబ్బందిని డీఎస్పీ షేక్ మాసుంబాషా అభినందించారు. -
అయ్యో.. ఏం కష్టమొచ్చిందో.!
వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట : రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కూతురు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. స్థానికుల కథనం మేరకు రాజంపేట పట్టణం ఉస్మాన్ నగర్లో నివాసముంటున్న సౌజన్య (28)కు పెనగలూరు మండలం సిద్దవరానికి చెందిన శ్రీనివాసులరెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి శిరీష అనే ఐదేళ్ల పాప ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం బలిజపల్లె పరిధిలోని ఉప్పరపల్లె సమీపంలో ఉన్న రైలు పట్టాల వద్దకు ఆమె చేరుకుంది. రైలు వచ్చే సమయంలో రైలు కిందపడి కూతురుతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో తల్లిని రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె తీవ్ర గాయాలతో బయటపడింది. స్థానికులు గమనించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసి అనంతరం పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పాప కూడా మృతి చెందింది. సౌజన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రేణిగుంట జీఆర్పీ సీఐ అశోక్ తెలిపారు. కాగా మృతురాలు మూడు నెలల గర్భిణిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి సుబ్బారెడ్డి (సుబ్బన్న) ఆర్టీసీలో (వీఆర్ఎస్) రిటైర్డ్ అయ్యారు. ఈయన ఎర్రబల్లిలో నివాసం ఉంటున్నారు. తల్లీబిడ్డ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
శబాష్.. పోలీస్ !
కడప అర్బన్ : కడప నగరంలోని నమస్తే బోర్డు సమీపంలో ఆటోలో బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోగొట్టుకున్న బాధితులకు టూటౌన్ ఎస్ఐ రుష్యేంద్రబాబు తమ సిబ్బందితో కలిసి కేవలం గంట వ్యవధిలోనే రికవరీ చేసి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిస్మిల్లా నగర్‌కు చెందిన హనీఫ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు శంకరాపురం స్కౌట్ హాల్లో తమ బంధువుల వివాహం ఉందని ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే తమ బ్యాగ్‌లో 5 తులాల బంగారు ఆభరణాలు పెట్టుకుని రోడ్డుపైకి వచ్చారు. అక్కడ ఆటోలో మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బయలుదేరారు. శంకరాపురం నమస్తే బోర్డు సమీపంలో స్కౌట్హాల్ వద్ద ఆటోలోనుంచి దిగుతూ బంగారు నగల బ్యాగ్ మరిచిపోయారు. పెళ్లి దగ్గరికి వెళ్లి బ్యాగ్ చూసుకునేసరికి లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజిల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఐ, తమ సిబ్బందితో కలిసి ఆటోతో సహా డ్రైవర్‌ను వెతికి పట్టుకున్నారు. ఆటోలోనే ఉన్న బ్యాగ్, అందులో నగలను కేవలం గంట వ్యవధిలో 2:30 గంటలకు రికవరీ చేయగలిగారు. హనీఫ్‌కు ఆటోడ్రైవర్ కరీముల్లా ద్వారా బంగారు నగల బ్యాగ్‌ను అప్పగించారు. -
గువ్వల చెరువు ఘాట్‌లో తప్పిన ఘోర ప్రమాదం
వైఎస్ఆర్ జిల్లా, చింతకొమ్మదిన్నె/కోటిరెడ్డిసర్కిల్ : ఉదయాన్నే వివిధ పనుల మీద కడప నగరానికి ప్రయాణికులు బస్సులో బయలుదేరారు. రాయచోటిలో ఏడు గంటలకు ఏపీ04 టీయూ 8316 నెంబరుగల ఆర్టీసీ హయ్యర్ నాన్‌స్టాప్ బస్సు 40 మంది ప్రయాణికులతో కదిలింది. ఈ బస్సు గువ్వలచెరువు ఘాట్ మీదుగా మరో అర గంటలో కడప నగరానికి చేరుకోవాల్సి ఉండింది. ఘాట్‌లోని చివరి మలుపు వద్ద ఆంజనేయస్వామి గుడి సమీపంలో మలుపు తిరుగుతుండగా వెనుకవైపు నుంచి లోడుతో వస్తున్న తమిళనాడుకు చెందిన టీఎన్03 ఏఎల్ 8362 నెంబరు గల లారీ బ్రేకులు పనిచేయక ముందు వెళుతున్న బస్సును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురై బోల్తాపడింది. లారీ డ్రైవర్ ఆందోళనకు గురై లారీ నుంచి దూకడంతో లారీ బస్సును ఈడ్చుకుంటూ వెళ్లింది. బస్సు ఒక్క ఉదుటున రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ రక్షణ గోడ వైపు వెళ్లింది. బస్సు బోల్తాపడిన సమయంలో బస్సులోని ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వెంటనే రాయచోటి నుంచి కడపకు వస్తున్న వాహనదారులు, కడప నుంచి రాయచోటికి వెళుతున్న ప్రయాణికులు వారి వాహనాలు నిలిపివేసి సహాయక చర్యలకు పూనుకున్నారు. అయితే బస్సు లోయలో పడకుండా రక్షణగా ఏర్పాటు చేసిన గోడను ఆనుకుని ఉన్న గ్రిల్స్ అడ్డుకట్ట వేయడంతో ప్రయాణికులకు గండం తప్పింది. బస్సు గనుక లోయలోపడి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అక్కడున్న వాహనదారులు తెలిపారు. బస్సు బోల్తా పడిన సంఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన చింతకొమ్మదిన్నె పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 వాహనాన్ని పిలిపించి గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న ఎపి 26 ఎల్ 9779 నంబరు గల కారు బస్సుకు, రక్షణ గోడలకు మధ్య ఇరుక్కుపోయింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. బస్సు కారుపై పడి ఉంటే పెద్ద ప్రాణ నష్టం సంభవించేది. రిమ్స్‌లో వైద్య సేవలు బస్సు ప్రమాదంలో విశాలిని, జ్యోతి, శ్రీనివాసులు, సాంబశివారెడ్డి, చెట్టిబాబు, భాస్కర్‌నాయక్, అన్నయ్య, వెంకటదాసు, లారీ డ్రైవర్ సెల్వ కుమార్‌లకు బలమైన గాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో తరలించి రిమ్స్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గిరిధర్, ఆర్ఎంఓ డాక్టర్ వెంకటశివ ఆధ్వర్యంలోని వైద్య బృందం బాధితులకు వైద్య చికిత్సలు అందించారు. వీరిలో లారీ డ్రైవర్ సెల్వకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించినట్లు డాక్టర్ గిరిధర్ తెలిపారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆర్టీసీ ఆర్ఎం విజయరత్నం, సీఐ కన్యాకుమారి, టీఐ–3 శోభాదేవి, కంట్రోలర్ బజ్జొప్పలు పరామర్శించారు. కేసు నమోదు ఈ ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే కడప రూరల్ సీఐ నాయకుల నారాయణ, సీకే దిన్నె ఎస్ఐ హేమకుమార్, హైవే పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించడంలో తమవంతు సహకారాన్ని అందించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగాబస్సు కుదుపునకు గురైంది నా పేరు నరసింహులు. బళ్లారి వెళ్లేందుకు రాయచోటిలో బస్సు ఎక్కాను. ఘాట్‌లోని అన్ని మలుపులను దాటుకున్నాం. చివరి మలుపులో వెనుకవైపు నుంచి లారీ ఒక్కసారిగా ఢీ కొట్టడంతో కుదుపునకు గురైంది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే బస్సు పల్టీలు కొట్టింది. బస్సులో ఉన్నవాళ్లంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. అస్సలు బతుకుతాం అనుకోలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాం. – నరసింహులు, శిబ్యాల గ్రామస్తుడు, ప్రత్యక్ష సాక్షి -
హత్యా? ప్రమాదమా?
కడప అర్బన్: కడప నగర శివారు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధి గండి వాటర్ వర్క్స్ సమీపంలో ఉరిమెళ్ల రాజేష్‌కుమార్(22) మృతి మిస్టరీగా మారింది. ఈ సంఘటనలో పలు అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. సంఘటనకు రాజేష్‌కుమార్‌ను తీసుకెళ్లిన మేస్త్రీ, మరో నలుగురు కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయవర్గాలు, బంధువుల ఆరోపణలు, చిన్నచౌక్ పోలీసుల వివరాల మేరకు... చిన్నచౌక్ అశోక్ నగర్‌కు చెందిన శివకుమారి, తల్లిదండ్రులు లేని తన అక్క కుమారుడైన రాజేష్‌కుమార్(22)ను చేరదీసి, తనతోపాటు జీవనం సాగించేది. రాజేష్‌కుమార్ ఎర్రముక్కపల్లెకు చెందిన గిరినాగప్రసాద్ దగ్గర రాడ్‌బెండింగ్ పని చేసేవాడు. తన చిన్నమ్మకు, కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. 2016 జూన్ 15న అట్లూరు మండలం, వేమలూరుకు చెందిన కొండయ్య కుమార్తె మమతను వివాహం చేసుకున్నాడు. వీరికి రియా(1) సంతానం ఉంది. వివాహ సమయంలో రాజేష్‌కుమార్ మేస్త్రీ దగ్గర రూ.40వేలు అప్పుగా తీసుకున్నాడు. తన భార్య మమత ప్రసవానికి వెళ్లిన సమయంలో రాజేష్‌కుమార్, మేస్త్రీ మధ్య మనస్పర్థలు రావడంతో వాస్మోల్ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చేరిన వెంటనే మేస్త్రీ వచ్చి, ఎలాంటి ఫిర్యాదులు చేయకుండానే రాజీకుదుర్చుకుని, ఇటీవల నాలుగు నెలల నుంచి మరలా తన దగ్గరే పనికి తీసుకెళ్లేవాడు. అంతేగాక ప్రస్తుతం తిలక్‌నగర్‌లో నెలరోజుల నుంచి తన భార్య, బిడ్డతో పాటు వేరుగా కాపురం ఉంటున్నాడు. ఈనెల 21న మేస్త్రీ గిరినాగప్రసాద్‌తో పాటు, డిన్నర్‌కు వెళుతున్నానని భార్యతో చెప్పాడు. సాయంత్రం అయినా భర్త రాకపోవడంతో ఫోన్ చేస్తే స్పందించలేదు. తర్వాత మేస్త్రీకి ఫోన్ చేస్తే, తమ ఇంటి వద్దకు వచ్చి, రాజేష్‌కుమార్ ఇక రాడని.. బెదిరించి వెళ్లినట్లు మమత ఆరోపించారు. మంగళవారం సాయంత్రం మమత, తన చిన్నత్త శివకుమారి, తండ్రి కొండయ్యతో కలిసి చిన్నచౌక్ పోలీసులను ఆశ్రయించారు. రాజేష్‌కుమార్ సరదాగా తన మేస్త్రీతో పాటు ఆదివారం వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం గండి వాటర్ వర్క్స్ సమీపంలో రాజేష్‌కుమార్ మృతదేహం బాగా ఉబ్బి బయటపడింది. సంఘటనా స్థలం వద్దే మృతదేహానికి రిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాలెన్నో ... రాజేష్‌కుమార్ మృతి సంఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని అతని భార్య మమత, చిన్నమ్మ శివకుమారి, మామ కొండయ్య ఆరోపిస్తున్నారు. మేస్త్రీ తన దగ్గర పని చేస్తున్న రాజేష్ కుమార్‌ను ఆదివారం సరదాగా డిన్నర్‌కు పిలిచి, పథకం ప్రకారమే హత్య చేశారని చెబుతున్నారు. ఈతకు మేస్త్రీ రాజేష్‌తో పాటు, తన దగ్గర పనిచేస్తున్న వారినీ తీసుకుని వెళ్లారా? లేకుంటే వేరే వారిని తీసుకుని వెళ్లి మద్యం సేవింపజేసి నీళ్లలో ముంచివేసి, అనుమానం రాకుండా మట్టుపెట్టారా అంటూ అనుమానాలు ఉన్నాయన్నారు. రాజేష్‌కుమార్‌కు సంబంధించిన సెల్‌ఫోన్ మేస్త్రీ దగ్గరే ఎందుకు ఉందని ప్రశ్నించారు. మృతదేహం బయటపడిన చోట ఎలాంటి నీటిమట్టం లేకపోవడం గమనార్హం. ప్రవాహానికి మృతదేహం కొట్టుకుని వచ్చిందంటే తలపై ఎందుకు పెద్దగాయం ఉందని ప్రశ్నించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మగ దిక్కును కోల్పోయామని కన్నీరుమున్నీరుగా రోదించారు. చిన్నచౌక్ సీఐ వివరణ ఈ సంఘటనపై చిన్నచౌక్ సిఐ ఎస్. పద్మనాభన్ మాట్లాడుతూ సమగ్రంగా విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహం నుంచి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం అవసరమైన వాటిని సేకరించి పంపించామన్నారు. పూర్తి స్థాయి విచారణ చేస్తామని, నిజానిజాలు వెల్లడిస్తామన్నారు. -
వృద్ధురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : తప్పతాగి వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన కాక ర్లసిద్దయ్య అనే వ్యక్తిని సోమవారం అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక అర్బన్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బద్వేలు అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ ఎం.రమేష్‌బాబు నిందితుని వివరాలు వెల్లడించారు. మైదుకూరురోడ్డులోని దివ్యజ్యోతి వృద్ధాశ్రమంలో ఏడాది నుంచి 80 ఏళ్ల వృద్ధురాలు ఉంటోంది. అయితే వృద్ధాశ్రమం సమీపంలోనే ఉంటున్న కాకర్ల సిద్దయ్య అనే వ్యక్తి వృద్ధురాలిపై కన్నేశాడు. ఈ నెల 19న వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో సిద్దయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న వృద్ధురాలు కుమార్తె అయిన సరోజమ్మ అర్బన్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మైదుకూరురోడ్డులోని వీరారెడ్డి కళాశాల ఎదురుగా ఉన్న నాయుడు హోటల్ వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అర్బన్ ఎస్ఐ చలపతినాయుడు, హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్ పాల్గొన్నారు. -
నలుగురు క్రికెట్ బుకీలు అరెస్టు
కడప అర్బన్ : ఎక్కడ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా బెట్టింగ్‌లకు పాల్పడుతూ అమాయక ప్రజలను ఆ వ్యసనానికి బానిసలుగా మారుస్తున్న నలుగురు క్రికెట్ బుకీల ముఠాను సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. వివరాలను ఆదివారం సాయంత్రం కడప సీసీఎస్ పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ వెల్లడించారు. ప్రొద్దుటూరు టౌన్ నడింపల్లెవీధికి చెందిన షేక్ ఇమ్రాన్, ఆర్ట్స్ కళాశాల రోడ్డులో నివసిస్తున్న కందుల కుమార్ అలియాస్ రాజేష్, ముళ్ల మైనుద్దీన్, షేక్ మహబూబ్‌బాషా ముఠాగా ఏర్పడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తమ మకాం మారుస్తూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల సమయాల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతారు. దీంతో వారిపై పోలీసులు నిఘా ఉంచారు. ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం రాజంపేట మండలం మన్నూరు పోలీసుస్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో క్రికెట్ బెట్టింగ్, గంజాయి అమ్మకం గురించి తెలుసుకుని దాడి చేశారు. పై నలుగురు నిందితులు టీవీలో ఇండియా–వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ చూస్తూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ గంజాయి పెట్టుకుని అమ్ముతూ ఉండగా సీసీఎస్ డీఎస్పీ తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో రెండున్నర కిలోల గంజాయి, రూ. 8,00,550 నగదు, బొలెరో వాహనం, పది సెల్ఫోన్లు, ఒక టీవీ, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు కృషి చేసిన పెండ్లిమర్రి ఎస్ఐ ఎన్.రాజరాజేశ్వరరెడ్డి, మన్నూరు ఎస్ఐలను, సీసీఎస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుళ్లు భూపాల్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, జగన్నాథరెడ్డి, కానిస్టేబుళ్లు పరమేష్, ప్రసాద్, బాలరాజు, హోంగార్డు సుబ్బరాయుడులను డీఎస్పీ అభినందించారు. -
భర్త కలలోకి వస్తున్నాడని...
పతినే ప్రాణంగా భావించింది... ఆయన లేడన్న నిజం నిత్యం తనను బాధించింది.. ఆర్నెళ్ల నుంచి కన్నీరుమున్నీరుగా విలపించింది.. ముగ్గురు పిల్లల పోషణ భారమైంది... చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం పిల్లల పాలిట శాపమైంది.. తాను ఆత్మహత్యకు పాల్పడి పిల్లలను అనాథలను చేసింది. ఈఘటన శనివారం ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.పతినే ప్రాణంగా భావించింది... ఆయన లేడన్న నిజం నిత్యం తనను బాధించింది.. ఆర్నెళ్ల నుంచి కన్నీరుమున్నీరుగా విలపించింది.. ముగ్గురు పిల్లల పోషణ భారమైంది... చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం పిల్లల పాలిట శాపమైంది.. తాను ఆత్మహత్యకు పాల్పడి పిల్లలను అనాథలను చేసింది. ఈఘటన శనివారం ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు క్రైం: భర్త లేడన్న బాధతో చౌడు శ్రీలక్ష్మి (44) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని ఆచార్లకాలనీ, శ్రీనివాసపురంలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భర్త సుధాకర్ ఆరు నెలల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన భార్య శ్రీలక్ష్మి తీవ్ర మనోవేదనతో బాధపడుతూ ఉండేది. రాత్రి వేళల్లో భర్త కలలోకి వస్తున్నాడని, అతను పక్కనే ఉన్నట్లు తనకు అనిపిస్తోందని పిల్లలతో చెప్పేది. కుమార్తెలు, బంధువులు ఆమెకు ధైర్యం చెబుతూ వచ్చేవారు. ఈ క్రమంలో వారి ఇంటి పక్కన ఒక మహిళ శనివారం మృతి చెందడంతో ఉదయం 6 గంటల సమయంలో ఆమె నిద్రలేచి మృతదేహాన్ని కూడా చూశారు. అయితే 6.30 గంటల తర్వాత కుమార్తెలు నిద్రలేచి చూస్తే తల్లి బెడ్రూంలో కనిపించలేదు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ ఉంది. పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న బంధువులు వచ్చి చూడగా ఆమె మృతి చెందింది. కాటేసిన మద్యం చౌడు సుధాకర్ చేనేత పని చేసేవాడు. గతంలో అతను మద్యం బాగా తాగేవాడు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. మద్యం తాగడం మానుకోవాలని ఆమె భర్తను కోరేది. భార్య అభ్యర్థన మేరకు సుధాకర్ మద్యం తాగడం మానేశాడు. కొన్ని నెలల తర్వాత బంధువుల పెళ్లికి వెళ్లిన సుధాకర్ మద్యం సేవించి నడవలేని స్థితిలో ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన శ్రీలక్ష్మి తీవ్ర ఆవేదన చెందారు. తాగనని చెప్పి మళ్లీ తాగి ఇంటికి వస్తారా అంటూ భర్తతో చెప్పారు. తాగనని మాట ఇచ్చి మద్యం తాగి రావడం, భార్య బాధ పడటం చూసిన అతను ఆవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలోనే మగ్గం కొయ్యకు చీర కట్టుకొని ఈ ఏడాది ఏప్రిల్ 20న ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తను ఎంతగానో ప్రేమించే శ్రీలక్ష్మి ఆయన మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయింది. భర్త దూరమైన నాటి నుంచి ఆమె దిగులుగా ఉంటోంది. పిల్లలే ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెబుతూ వచ్చేవారు. ఈ క్రమంలో భర్త ఆత్మహత్య చేసుకున్న చోటే ఆమె కూడా మగ్గం కొయ్యకు చీర కట్టుకొని ఉరి వేసుకుంది. అర్బన్ సీఐ జయానాయక్, ఎస్ఐ కృష్ణంరాజునాయక్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. అనాథలైన పిల్లలు... ఆర్నేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సుధాకర్, శ్రీలక్ష్మికి ధరణి, చరణి ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు కార్తీ్తక్ ఉన్నాడు. ధరణి బీటెక్, చరణి తొమ్మిది, కుమారుడు ఆరో తరగతి చదువుతున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కుమార్తెలు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోధన అక్కడి వారిని కలచివేసింది. ఒంటరి వారిని చేసి వెళ్లిపోయారా అంటూ గుండెలు పగిలిలేలా విలపించారు. -
నయంకాని వ్యాధితో.. హిజ్రా ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పెన్నానగర్లో పిక్కిలి రామ్మోహన్ (20) అనే హిజ్రా శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెన్నానగర్‌కు చెందిన పెద్దక్కకు రామ్మోహన్ ఒక్కగానొక్క కుమారుడు. అతను నాలుగేళ్ల నుంచి పట్టణంలోని హిజ్రాల వెంట తిరిగేవాడు. వారితో కలిసి ప్రోగ్రాంలు, వంట చేయడానికి తరచు వెళ్లేవాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం అతను ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి జిల్లా ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు నయంకాని వ్యాధి సోకినట్లు తెలిపాడు. దీంతో అతను వైద్యుల సూచన మేరకు వ్యాధికి సంబంధించిన మందులు ఇంటికి తెచ్చుకొని రోజూ వాడేవాడు. మందు డబ్బాలను చూసిన తల్లి ఎందుకు ఇన్ని మందులు వాడుతున్నావు.. ఏమైంది అని అడిగింది. రెండు రోజుల వరకు అతను తల్లికి అసలు విషయం చెప్పలేదు. అయితే ఆమె బలవంతం చేయడంతో వ్యాధి సోకిన విషయం చెప్పాడు. ఆ రోజు నుంచి ఇక నేను బతకను.. చచ్చిపోతాను అని తల్లితో చెప్పేవాడు. శుక్రవారం తల్లి దోసెలు తీసుకొని రాగా, కొద్ది సేపటి తర్వాత తింటానని చెప్పాడు. బయటికి వెళ్లిన పెద్దక్క గంట తర్వాత ఇంటికి రాగా రామ్మోహన్ ఫ్యాన్‌కు చీర కట్టుకొని ఉరి వేసుకున్నాడు. తల్లి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే అతను చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు. -
ఆరుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
కడప అర్బన్: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు బుకీలను కడప పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 3న సాయంత్రం సౌత్ఆఫ్రికా– జింబాబ్వే జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా వివిధ ప్రదేశాల్లో కడప నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా ఆధ్వర్యంలో అర్బన్ ఇన్చార్జి సీఐ టీవీ సత్యనారాయణ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కడప తాలూకా ఇన్చార్జి ఎస్ఐ జి. అమర్నాథ్ రెడ్డి, పెండ్లిమర్రి ఎస్ఐ ఎన్. రాజరాజేశ్వర రెడ్డి, క్రైం పార్టీ సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి పాల్గొన్నారు. అరెస్ట్ వివరాలను డీఎస్పీ షేక్ మాసుంబాషా గురువారం తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ♦ కడప నగరం అక్కాయపల్లి శాస్త్రి నగర్లో ఇంటి ముందు వరండాలో కొత్తపల్లి శివారెడ్డి అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, ఒక టీవీ, రూ. 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను పెండ్లిమర్రి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. ♦ మరోకేసులో తాలూకా పరిధిలో చౌటపల్లి రోడ్డు రైల్వేగేటు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.55 లక్షలు నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ♦ ఈ సంఘటనలో అరెస్టయిన వారిలో కడప నగరం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చెందిన గోపిశెట్టి వెంకట సామ్రాట్ బిందెల వ్యాపారం చేస్తూ, దురలవాట్లకు బానిసగా మారి క్రికెట్‌బుకీగా మారా>డు. ♦ శివానందపురానికి చెందిన షేక్ మహమ్మద్ సేల్స్‌మాన్‌గా పనిచేస్తూ క్రికెట్‌బుకీగా మారాడు. ♦ పెండ్లిమర్రి మండలం, నందిమండలానికి చెందిన కోవూరు రవిశంకర్ ఫోటోస్టూడియోతో జీవనం సాగిస్తూ, క్రికెట్ బుకీగా మారాడు. ♦ ఓ కార్యాలయంలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్న, ఇండస్ట్రియల్ ఎస్టేట్ నివాసియైన గుగ్గుళ్ల మహేశ్వర రెడ్డి క్రికెట్ బుకీగా మారాడు. ♦ కడప నగరం అక్కాయపల్లికి చెందిన పోలిరెడ్డి కొండారెడ్డి వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. క్రికెట్ బుకీగా మారాడు. ♦ రెండు కేసుల్లో ఆరుగురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేయగా, వారి వద్ద నుంచి రూ. 3.05 లక్షలు నగదు, ఒక టీవీ, 9 సెల్ఫోన్లు, రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ♦ క్రికెట్ బుకీలను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ టీవీ సత్యనారాయణ, కడప తాలూకా ఇన్చార్జి ఎస్ఐ జి. అమర్నాథ్ రెడ్డి, పెండ్లిమర్రి ఎస్ఐ ఎన్. రాజరాజేశ్వరరెడ్డి, క్రైం పార్టీ సిబ్బంది హుస్సేన్, శేఖర్, నరేంద్ర, సాయిగోపి, సుధాకర్, కడప తాలూకా సిబ్బందిని కడప డీఎస్పీ అభినందించారు. -
పీఎఫ్ కార్యాలయ ఉద్యోగి ఆత్మహత్య
కడప అర్బన్ : కడప నగరంలోని ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కార్యాలయంలో మెసెంజర్‌గా పనిచేస్తూ మూడు నెలల క్రితం సస్పెన్షన్‌కు గురైన యండ్రపల్లె సుబ్బారెడ్డి (52) మంగళవారం పాలకొండల్లో చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు, పోలీసు ల కథనం మేరకు ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని పీఎఫ్ కార్యాలయంలో అధికారిగా పనిచేస్తున్న రమేష్‌బాబుతోపాటు వై.సుబ్బారెడ్డి ఏడుగురితో కలిసి ఉద్యోగుల భవిష్యనిధి కార్యాలయానికి చెందిన రూ. 82.98 లక్షల నిధులను మోసపూరితంగా తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారని సీబీఐ ఇటీవల కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి వై.çసుబ్బారెడ్డి మూడు నెలల క్రితం సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈయన తన భార్య భాగ్యమ్మ, కుమారుడు వై.కొండారెడ్డిలతో కలిసి పాత బైపాస్‌రోడ్డులో ఉన్న శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. తనపై కేసు నమోదు, సస్పెన్షన్ కావడానికి అధికారి రమేష్‌బాబుతోపాటు మరికొంతమంది కారణమని తీవ్ర ఆవేదనతో కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులతో కూడా పలుమార్లు చర్చించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8.15 గంటల సమయంలో బయటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఒక బ్యాగులో మద్యం, ఇడ్లీల ప్యాకెట్, తెల్లని నైలాన్ తాడు తీసుకుని పాలకొండలవైపు వెళ్లాడు. మద్యం సేవించిన కొద్దిసేపటికి ఇడ్లీ తిని స్నేహితుడు వెంకటేశ్‌కు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే వెంకటేశ్ డయల్ 100కు ఫోన్ చేసి వివరాలను తెలియజేశాడు. సుబ్బారెడ్డి పాలకొండల్లోని దేవాలయానికి ఎగువ భాగాన కిలోమీటరు దూరంలో చెట్ల మధ్య ఓ చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే సుబ్బారెడ్డి విగత జీవుడిగా తాడుకు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. ∙సూసైడ్ నోట్లో మృతుడు సుబ్బారెడ్డి తాను ఆత్మహత్యకు పాల్పడటానికి కేవలం తన పై అధికారి రమేష్‌బాబుతోపాటు మరో నలుగురు కారణమని, వారి వల్లనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని అందులో పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని రిమ్స్ సీఐ పురుషోత్తంరాజు ,ఎస్ఐ కుళ్లాయప్ప, సిబ్బంది పరిశీలించారు. మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి రిమ్స్ మార్చురీకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పురుషోత్తంరాజు తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు పాలకొండల్లో పీఎఫ్ కార్యాలయ మెసెంజర్ సుబ్బారెడ్డి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి కార్యాలయ ఉద్యోగి రమేష్ బాబుతోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలుతాయని సీఐ పురుషోత్తంరాజు, ఎస్ఐ కుళాయప్ప తెలిపారు. -
చీరల ఆశచూపి.. నగలతో ఉడాయించారు
వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి టౌన్ : బంగారు చీరల పేరుతో ఓ యువకుడిని మోసగించి అతని వద్ద ఉన్న బంగారు నగలతో ఉడాయించిన ఘరానా మోసగాళ్ల ఉదంతమిది. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన టి. సుండుపల్లెకు చెందిన విశ్వనాథ అనే యువకుడు రామాపురం మండలం పప్పిరెడ్డిగారిపల్లె సమీపంలో నెల రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి కానుకలలో భాగంగా అతనికి నాలుగు ఉంగరాలు, ఒక చైన్ ఇచ్చారు. వాటిని ధరించి ఆదివారం తన భార్య పుట్టింట్లో ఉండటంతో అత్తగారింటికి వెళ్లడానికి రాయచోటికి చేరుకున్నాడు. రాయచోటి డైట్ స్కూల్ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకొనే సమయంలో ముగ్గురు వ్యక్తులు దగ్గరకు వచ్చి తెలిసిన వారిలాగా పరిచయం చేసుకున్నారు. భుజంపై చేతులు వేశారు. మాటా మాటా కలిపారు. నడుచుకొంటూ ప్రభుత్వ ఆస్పత్రి వెనుక వైపు వెళ్లారు. అక్కడ వీరికి సంబంధించిన మరో వ్యక్తి వచ్చి రెండు చీరెలు చూపెట్టాడు. వారిలో మరో వ్యక్తి ఈ చీరలు బంగారుతో నేసినవిలా ఉన్నాయే అన్నాడు. అవును ఇవి బంగారుతో తయారు చేసినవే వీటి విలువ ఒక్కొక్కటి రూ.లక్ష అవుతుందని చెప్పాడు. ఈ రెండు చీరలను ఎవరికైనా రూ.లక్షకు అయినా అమ్మేస్తానని చెప్పాడు. దీంతో వారిలో మొదటి వ్యక్తి తన వద్ద రూ.10 వేలు ఉన్నాయి. మిగిలిన డబ్బులు తరువాత ఇస్తానని చెప్పాడు. అలా కుదరదు మొత్తం డబ్బులు ఇచ్చిన తరువాతే ఇస్తానని చీరలు తెచ్చిన వ్యక్తి అన్నాడు. ఇంతలో విశ్వనాధ వైపు చూసి నీ వద్ద బంగారు ఆభరణాలు ఉన్నాయి కదా వాటిని ఇస్తే ఈ రెండు చీరలు నీకు ఇస్తానని చెప్పాడు. అక్కడున్న వారి మాటలు నమ్మిన విశ్వనాథ వెంటనే తన చేతులలోని నాలుగు ఉంగరాలు, ఒక చైను మొత్తం సుమారు 40 గ్రాములు వారి ఇచ్చేశాడు. వారు కూడా అతనికి రెండు చీరలు ఇచ్చి వీటిని ఎవరికీ చూపొద్దని చెప్పి పంపించేశారు. వాటికి ఇంటికి తీసుకెళ్లి భార్యకు చూపించగా ఇవి కేవలం రూ.1000కు మించి ఖరీదు కావని చెప్పడంతో తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. -
భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేప్రయత్నం
కడప అర్బన్ : జీవితాంతం తోడు నీడగా ఉండే భర్తను తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి కట్టుకున్న భార్యే హత్య చేయించింది. ఆత్మహత్యగా చిత్రీకరించి సంఘటనను పక్కదారి పట్టించేం దుకు ప్రయత్నించారు. ఈ సంఘటనను పోలీసులు ఛేదించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. కడప రూరల్ సర్కిల్లో చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 24వ తేదీ రాత్రి ఊటుకూరు మజరా ఏఎల్ కాలనీలో నివసిస్తున్న చిత్తూరు జిల్లా మదనపల్లె టౌన్ నక్కలదిన్నె తాం డాకు చెందిన బుక్యా రవీంద్రనాయక్ ఊటుకూరు ప్రాంతంలోని సునీత, మురళినాయక్‌ల కుమార్తెను నాలుగున్నర సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. వివాహమైనప్పటి నుంచి రవీంద్రనాయక్ ఇల్లరికం అల్లుడిగానే అత్తగారింట్లోనే కాపురం ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. మురళి నాయక్ బంధువు హరి నాయక్‌తో హతుని భార్య రేఖారాణి వివాహేతర సంబంధం కలిగి ఉంది. ఈ విషయం తెలిసిన రవీంద్రనాయక్ పలుమార్లు తన భార్యను మందలించాడు. అంతేకాకుండా తనతోపాటు స్వగ్రామం నక్కలదిన్నె తాండాకు పిల్లలతోసహా వెళ్లి జీవనం సాగిస్తామని భార్య, అత్తమామలకు ఎన్నోసార్లు చెప్పి చూశాడు. ఆమె ఇందుకు వ్యతిరేకించింది. భర్త ఒత్తిడి తట్టుకోలేక రేఖారాణి తన తల్లిదండ్రులు సునీత, మురళినాయక్, బంధువులు హరి నాయక్, గోపాల్‌నాయక్, ఆంజనేయులు నాయక్, మల్లికార్జున నాయక్ అలియాస్ బుడగ నాయక్‌లతో కలిసి రవీంద్రనాయక్‌ను కట్టెలతో కొట్టి చంపారు. తర్వాత చనిపోయాడని తెలిసి ఆత్మహత్యగా చిత్రీకరించి చుట్టుపక్కల వారిని నమ్మించారు. అలాగే ఆటోలో రవీంద్రనాయక్‌ను రిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు మృతి చెందాడని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా, రూరల్ సీఐ నాయకుల నారాయణ, సిబ్బందితో కలిసి మృతదేహాన్ని పరిశీలించారు. తర్వాత మృతుని బంధువులు రవీంద్రనాయక్‌ను చంపేశారని ఆరోపించారు. మృతుని తల్లి సాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన రూరల్ సీఐ నాయకుల నారాయణ, ఇన్‌ఛార్జి, వల్లూరు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి, ఏఎస్ఐలు దస్తగిరి, కొండారెడ్డి, కానిస్టేబుళ్లు పుల్లయ్య, సర్వేశ్వర్‌రెడ్డిలను డీఎస్పీ అభినందించారు. -
పగలు రెక్కీ.. రాత్రి చోరీ
కడప అర్బన్: పగటి పూట తాళం వేసి ఉన్న ఇంటిని రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లి ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళుతూ గత ఆరేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మాసాపేట దొరల ఘోరీల వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కడప నగరం కుమ్మరికుంట వీధికి చెందిన షేక్ మహమ్మద్ హుసేన్ స్కూటిలో వెళుతూ అనుమానంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తాను 2012 నుంచి దొంగతనాలకు పాల్పడేవాడినని, 2018లో కూడా దొంగతనానికి పాల్పడ్డానని పోలీసులకు తెలిపాడు. ఈ సందర్భంగా నిందితుని అరెస్టు వివరాలను శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎ.శ్రీనివాసరెడ్డి వివరించారు. ♦ కడప నగరానికి చెందిన షేక్ మహమ్మద్ హుసేన్ అనే ఘరానా దొంగ 2012 నుంచి 53 దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. వీటిల్లో కడప టుటౌన్ పరిధిలో 32, తాలూకా పరిధిలో 14, వన్‌టౌన్ పరిధిలో 4, చిన్నచౌకు పరిధిలో 3 దొంగతనాలు చేశాడని తెలిపారు. ♦ నిందితుడు గతంలో స్వర్ణకారుడిగా పని చేసేవాడని, బెట్టింగ్ వ్యసనంతో అప్పులపాలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇతను విలక్షణమైన శైలిలో దొంగతనాలు చేస్తూ 53 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడన్నారు. ♦ పగటిపూట తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో తాను లక్ష్యం చేసుకున్న ఇళ్లల్లో ఎంచక్కా తన పని ముగించేవాడని అదనపు ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్దనుంచి 2.054 కిలోల బంగారు ఆభరణాలు, 4.743 కిలోల వెండి ఆభరణాలు, 1,47,140 రూపాయలు నగదు, స్కూటీ, ఇనుపరాడ్డు, మూడు తాళం చెవుల గుత్తులు, రెండు ఉలులు, పాస్‌పోర్టు సీజ్ చేశామన్నారు. ♦ నిందితుడు దొంగతనాలకు పాల్పడుతూనే పాస్‌పోర్టు, వీజాలను తెప్పించుకుని గల్ఫ్ దేశాలకు కూడా వెళ్లి వచ్చేవాడని విచారణలో తేలిందన్నారు. ♦ చాకచక్యంతో ఘరానా దొంగ షేక్ మహమ్మద్ హుసేన్‌ను అరెస్టు చేసిన కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా, సీసీఎస్ డీఎస్పీ జి.నాగేశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, టుటౌన్ ఎస్ఐ జి.అమర్నాథరెడ్డి, టుటౌన్ హెడ్ కానిస్టేబుల్ చాంద్‌బాషా, కానిస్టేబుళ్లు బాలకృష్ణారెడ్డి, భాస్కర్, డీఎస్పీ క్రైం పార్టీ కానిస్టేబుళ్లు హుసేన్, నరేంద్ర, శేఖర్, గోపినాథ్, సుధాకర్‌లను జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీనివాసరెడ్డి అభినందించారు. దొంగ ఎలా దొరికాడంటే.. ఈ సంఘటనలో నిందితుడైన షేక్ మహమ్మద్ హుసేన్ గతంలో చోరీలకు పాల్పడినప్పుడు ఓ ఇంటి సీసీ కెమెరాలో చిక్కాడు. సీసీ కెమెరా పుటేజీల ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ మహమ్మద్ హుసేన్‌పై పోలీసులు నిఘా పెంచారు. దీంతో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
మోటార్‌సైకిల్ చోరీ
కడప అర్బన్ : కడప నగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని యాక్సిస్ బ్యాంక్, లక్ష్మివిలాస్ బ్యాంక్‌ల సెల్లార్ కింద పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్ చోరీకి గురైంది. యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కత్తి వెంకటసుబ్బయ్య అలియాస్ వెంకట్ తన బైక్‌ను తాను పని చేస్తున్న బ్యాంక్ సెల్లార్లో మధ్యాహ్నం 12:10 గంటలకు పార్కింగ్ చేశారు. తర్వాత ఆఫీసులోకి వెళ్లారు. 12:45కు భోజనానికి వెళ్లేందుకు మోటార్ సైకిల్ కోసం చూడగా.. అక్కడ లేకపోవడంతో చుట్టుపక్కలా వెతికారు. కనిపించకపోవడంతో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరించారు. పార్కింగ్ చేసిన ఐదు నిమిషాల్లోనే ఓ యువకుడు రోజ్ కలర్ షర్ట్‌తో వచ్చి, ఎంచక్కా చోరీ చేసి తీసుకెళ్లాడు. బాధితుడు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేస్తున్నారు. -
మౌనంగా రోదించి.. తనువు చాలించి..
దేశమంతా మంగళవారం ఆత్మహత్యల నివారణ దినాన్ని నిర్వహిస్తున్న వేళ.. ఓ అభాగ్యురాలు అదే అఘాయిత్యం చేసుకోవడం విషాదకరం.. ఆమెకు పుట్టుకతోనే మూగ, చెవుడు.. చిన్నప్పటి నుంచి బాధలు భరిస్తోంది.. కుటుంబ ఆర్థిక సమస్యలు అష్టకష్టాలకు గురి చేశాయి... ఇలాంటి సమయంలో ఆదరించాల్సిన భర్త వేధించడం మొదలెట్టాడు... ఆమె మౌనంగా భరించిందే కానీ పల్లెత్తు మాట అనలేని పరిస్థితి... అయినా ఆరళ్లు ఎక్కువ కావడంతో తనువు చాలించింది. ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని అమృతానగర్‌కు చెందిన కొండపల్లి జహుర్‌బీ (23) మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అమృతానగర్‌లోని మాబుషరీఫ్నకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె జహుర్‌బీ, మూడో కుమార్తె ఫాతిమాకు పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్నాయి. రెండో కుమార్తె మాబుచాన్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. జహుర్బీకి 9 నెలల క్రితం బద్వేలుకు చెందిన జిలాన్‌తో వివాహం చేశారు. అతను లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద ఒకటిన్నర తులం బంగారు, రూ.15 వేల నగదు ఇచ్చారు. పెళ్లి అయ్యాక జహుర్‌బీ అమ్మగారింట్లోనే కాపురం ఉండేలా.. వారి మధ్య అంగీకారం కుదిరింది. అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ వారింట్లోనే ఉంటున్నారు. వేరుగా కాపురం ఉండాలనిచెప్పడంతో.. వయసు మీద పడటంతో మాబుషరీఫ్ పనికి వెళ్లడం మానేశాడు. ఆయన భార్య ఖాదర్‌బీ మిల్లులో పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. అల్లుడు, కుమార్తె కూడా ఇంటిలోనే ఉండటంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. కుమార్తె, భర్తను వేరుగా కాపురం పెట్టించాలని తమ ఇంటి పక్కనే తండ్రి బాడుగ ఇల్లు కూడా చూశాడు. ఇదే విషయాన్ని అల్లుడు జిలాన్‌తో చెప్పాడు. అయితే అతను వేరుగా కాపురం ఉండటానికి అంగీకరించలేదు. ‘పక్కన కాపురం పెట్టాల్సి వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాను.. మా ఊరికి వెళ్తాను’ అని చెప్పి అత్తామామలతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో గత నెల 17న జిలాన్ భార్యను పిలుచుకొని బద్వేలు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన నాటి నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. అతను తాగి వచ్చి రోజూ భార్యను వేధించేవాడు. ఈ నెల 4న దివ్యాంగుల పింఛన్ కోసం బద్వేలు నుంచి జహుర్‌బీ ఆమె అత్తతో కలసి ప్రొద్దుటూరు వచ్చింది. పింఛన్ తీసుకున్న వెంటనే బద్వేలుకు వెళ్లారు. బాధలు తండ్రితో తెలుపుకొని.. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం ఆమె తండ్రికి ఫోన్ చేసింది. దీంతో ఆయన సోమవారం బద్వేలు వెళ్లగా.. భర్త పెట్టే బాధలను సైగల ద్వారా చెప్పుకొని రోదించింది. కుమార్తెను వెంట తీసుకొని ఆయన అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరు వచ్చాడు. మంగళవారం ఉదయం తల్లి, మరో చెల్లెలు మిల్లులోకి పనికి వెళ్లగా, రెండో చెల్లెలు పాఠశాలకు వెళ్లింది. తండ్రి పని మీద పట్టణంలోకి వెళ్లాడు. అతను మధ్యాహ్నం ఇంటికి వచ్చి తలుపులు తీయడానికి ప్రయత్నించగా లోపల గడియ వేసి ఉంది. కుమార్తె పడుకొని ఉందేమోనని భావించి బయట పడుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలు దాటినా కుమార్తె వాకిలి తీయకపోవడంతో మిద్దెపైకి వెళ్లి గవాచిలో నుంచి చూడగా.. జహుర్‌బీ ఉరికి వేలాడుతూ కనిపించింది. గట్టిగా రోదిస్తూ తండ్రి కిందికి దిగి వచ్చాడు. ఆమె దూలానికి చీర కట్టి ఉరి వేసుకుంది. విషయం తెలియడంతో రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు జిలాన్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎంత చదివినా.. ఉద్యోగం రాలేదు..
ఇద్దరూ చదువుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా జీవితం బాగు పడుతుందనుకున్నారు.. ఎంత శ్రమించినా ఒకరికి కూడా రాలేదు.. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. రాయచోటి టౌన్(వైఎస్సార్ కడప) : ‘నేను ఎంత కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదు. నాకు సొంత జీవితం లేదు. అలాంటప్పుడు నేను చచ్చినా.. బతికినా ఒక్కటే. అందుకే నాకు నేను ఆత్మహత్య చేసుకొంటున్నాను’ అని రాయచోటి పట్టణంలో నివాసం ఉంటున్న కుసుమ అనే నిరుద్యోగ మహిళ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. నా చావుతో నా తల్లిదండ్రులు, భర్తకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకొంటున్నానంటూ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. రాయచోటి పట్టణ పరిధిలోని బోస్ నగర్లో నివాసం ఉండే మురళీకృష్ణ భార్య కుసుమ (27) ఆదివారం తెల్లవారుజామున ఈ అఘాయిత్యం చేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంబేపల్లె మండలం బొగ్గలవారిపల్లెకు చెందిన వెంకటరమణ, నాగ రత్నమ్మకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు మురళీకృష్ణ, రెండో కుమారుడు శివ. మురళీకృష్ణ ఎమ్మెస్సీ మ్యాథ్స్ పూర్తి చేశాడు. ఆయనకు అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన కుసుమతో వివాహం జరిగింది. ఆమె కూడా బీకాం పూర్తి చేసింది. వీరు కొన్నేళ్లు అన్యోన్యంగా జీవనం సాగించారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ.. ఇద్దరూ కలసి రాయచోటి పట్టణానికి వచ్చి ప్రైవేట్ సంస్థలలో పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. మురళీకృష్ణ ముందుగా ఓ విద్యాసంస్థలో పని చేస్తుండే వాడు. వేతనం చాలకపోవడంతో మరో విద్యాసంస్థలో చేరాడు. ఆమె కొన్నాళ్లు ప్రైవేట్ సంస్థలలో పని చేసింది. ఇలా తక్కువ వచ్చే జీతాలతో ఎలా కాపురం సాగించాలంటూ బ్యాంక్ కోచింగ్ చేస్తూనే.. ఆర్ఆర్బీకి సిద్ధం అవుతోంది. దీనికోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంటిలోనే ఉంటూ ఎంతో శ్రద్ధగా చదివేది. ఇలా గంటల కొద్దీ చదివితే ఎలా అంటూ భర్త అనేక సార్లు వారించినా వినేది కాదు. ఎలాగైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే తపనతో మరింత కఠోరంగా శ్రమించేది. నిర్వేదానికి లోనై.. గత పోటీ పరీక్షలలో ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయింది. తీవ్ర నిర్వేదానికి లోనైంది. ప్రతి చిన్న విషయానికి కోపగించుకొనేది. ఇలా ఉండటంతో పది రోజుల క్రితం అనంతపురం జిల్లాలోని పుట్టింటికి తీసుకెళ్లి మానసిక వైద్యుడితో చికిత్స చేయించుకొని వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన భర్తతో కొంత వాగ్విదానికి దిగింది. చాలా పొద్దుపోయే వరకు ఇద్దరూ గొడవ పడటంతో.. నీతో వాదించలేనంటూ మురళీకృష్ణ పక్క దగిలోకి వెళ్లి పడుకొన్నాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. ఇక పడుకొంటుందిలే అనుకొని నిద్రపోయాడు. ఈ సమయంలో ఆమె తనకు తానుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. తెల్లవారుజామున నిద్ర లేచి చూసే సరికి ఫ్యాన్‌కు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే బంధువులకు విషయాన్ని తెలిపాడు. అంతలోనే పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆస్పత్రిలో అధికారులు ఎవరూ లేకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. మధ్యాహ్నం సమయానికి కుసుమ పుట్టింటి వారు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే అల్లుడు మురళీకృష్ణ తీవ్ర నిర్వేదంలో రోదిస్తుండగా వారు ఆయన వద్దకు చేరుకున్నారు. ‘చాలా మంచి వాడివని, నా కూతురికి దొరికిన దేవుడవని సంతోషించాం కదా నాయనా.. ఇలా ఎందుకు జరిగింది’ అంటూ రోదించారు. వారు మురళీకృష్ణను పట్టుకొని బోరున విలపించారు. -
మరో 24 గంటల్లో పెళ్లి.. పెళ్లి కుమారుడి అదృశ్యం
కడప అర్బన్ : మరో 24 గంటల్లో పెళ్లి అనగా గురువారం కనిపించకుండా పోయిన పెళ్లికుమారుడు, అతని తండ్రిపై శుక్రవారం చిన్నచౌక్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయ్యింది. కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ నగర్లో నివాసం ఉంటున్న ఓ యువతికి, గాజుల వీధి నివాసి రామసుబ్బయ్య, స్వర్ణకుమారీ కుమారుడు వెంకట ఫణీంద్ర కుమార్‌కు శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య వివాహం జరగనుంది. అయితే 30 వ తేదీన ఉదయం పెళ్లికుమార్తె బంధువులు కార్యక్రమాల గురించి మాట్లాడుకునేందుకు గాజుల వీధిలోని పెళ్లికుమారుని ఇంటికి వెళ్లారు. ఐతే ఆ సమయంలో వెంకట ఫణీంద్రకుమార్, అతని తండ్రి రామసుబ్బయ్యలు కనిపించకుండా పోయారు. దీంతో ఆవేదనతో గురువారం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. ఎట్టకేలకు యువతి, వారి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చిన్నచౌక్ ఎస్ఐ మోహన్ తెలిపారు. వరుడు హైకోర్టులో టైపిస్ట్‌గా పని చేస్తున్నాడు. కాగా ఇతనికి కట్నకానుకల కింద రూ. 15 లక్షలు ఇచ్చారు. -
మృత్యు శకటం
కడప అర్బన్ : కడప నగర శివారులో ఆపి ఉన్న బైక్‌ను, కారు దూసుకొచ్చి ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం రిమ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కడపలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన రూథమ్మ(47) భర్త సుధాకర్ రైల్వే ఐడబ్ల్యూలో కార్పెంటర్ పని చేస్తూ పదవీ విరమణ పొందారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రూథమ్మ చెల్లెలు కుమార్తె భార్గవి కడప నగర శివారులోని పీఎస్ నగర్లో నివసిస్తోంది. రూథమ్మ తమ్ముడు వసంత్(40) తన స్వగ్రామం పెద్దముడియం నుంచి ప్రకాష్‌నగర్‌లోని తన అక్క దగ్గరికి వచ్చాడు. ఈ క్రమంలో రూథమ్మ, వసంత్ తమ ద్విచక్రవాహనంలో భార్గవిని చూసేందుకు ప్రధాన రహదారిపైకి బుధవారం సాయంత్రం వచ్చారు. పీఎస్‌నగర్‌కు ఎదురుగా ప్రధాన రహదారి చివర ఎడమవైపున తమ ద్విచక్రవాహనాన్ని నిలిపి అడ్రస్ కనుగొనేందుకు నిలుచొని వుండగా.. వెనుక వైపు నుంచి కారు (ఏపీ04 బీవీ 3012) వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో వారు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. 108 వాహనం వారు వచ్చినప్పటికీ అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. కారులో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి వున్నట్లు తెలుస్తోంది. వారిలో కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలం పరిశీలన సంఘటన స్థలానికి కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా తమ సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు, ప్రత్యక్షంగా చూసిన వారిని అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ సీఐ ఆర్ పురుషోత్తం రాజు అంతకు ముందుగానే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను తమ సిబ్బంది సహాయంతో రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కారుకొందామని వెళుతూ.. మృత్యు ఒడికి
ఎంత జాగ్రత్తగా ప్రయాణిస్తున్నా బలీయమైన విధికి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు తప్పిదం లేకున్నా.. ముందువైపు వెళుతున ట్రాక్టర్ నుంచి ఒక భాగం ఊడి పడటం..వెనుకనే వస్తున్న టిప్పర్ దాన్ని తప్పించే ప్రయత్నంలో రాంగ్ రూట్లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొంది. కారుపై టిప్పర్ పడి నుజ్జునుజ్జు కావడంతో ముగ్గురు ప్రయాణికులు అక్కడే దుర్మరణం చెందారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముద్దనూరు: మండలంలోని తిమ్మాపురం క్రాస్ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కడప పట్టణానికి చెందిన నవాజ్ అలీఖాన్(40), మహమ్మద్ జావీద్(42), తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన దిలీప్‌కుమార్(22)లు దుర్మరణం చెందగా, దిలీప్ కుమార్ తండ్రి శ్రీనివాసులు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. కడపకు చెందిన అలీఖాన్, జావీద్‌లు వారి స్నేహితుడు శ్రీనివాసులు కుమారుడు దిలీప్‌కుమార్‌కు కారును కొనుగోలు చేయడానికి అనంతపురం పట్టణానికి కారులో బయలుదేరారు. ముద్దనూరు నుంచి కంకర రాళ్ల లోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్ తిమ్మాపురం క్రాస్ సమీపానికి వస్తుండగా టిప్పర్‌కు ముందువైపు వెళుతున్న ట్రాక్టర్‌కు అకస్మాత్తుగా హోసింగ్ ఊడిపోయి రోడ్డుపై పడింది. వెనుకనే వస్తున్న టిప్పర్ వేగంగా ట్రాక్టర్ నుంచి ఊడిపోయిన విడిభాగాన్ని ఢీకొంది. దీంతో డ్రైవరు టిప్పర్‌ను పూర్తిగా కుడివైపుకు తిప్పాడు. అలా దూసుకెళ్లిన టిప్పర్ అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. కారుతో సహా టిప్పర్ రహదారి పక్కలో లోతట్టు ప్రాంతంలోకి పడిపోయింది. కారుమీద టిప్పర్ పడడంతో అందులో ఉన్న శ్రీనివాసులు తప్ప ముగ్గురు కారులోనే మృతిచెందారు. సుమారు ఒక గంట పాటు పోలీసులు, స్థానికులు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. కారులో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలైన శ్రీనివాసులును ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఓఎస్డీ నయీం అస్మీ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవరు రామాంజినేయులు వాహనం నుంచి హోసింగ్ ఊడిపడగానే సీటులో నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలను బలిగొన్న టిప్పర్ తెలుగుదేశం పార్టీ నాయకులైన పోట్లదుర్తి బ్రదర్స్ కంపెనీకి చెందినదిగా తెలుస్తోంది. డీఎస్పీ కృష్ణన్, సీఐ చిన్నపెద్దయ్య, ఎస్ఐ రాజారెడ్డిలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. శోకసంద్రంలో బంధువులు కడప అర్బన్ : జిల్లాలోని ముద్దనూరు పోలీసుస్టేషన్ పరిధిలోని తుమ్మలూరు క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వారిలో కడప నగరం ఐటీఐ సర్కిల్ సమీపంలో నివసిస్తున్న నవాజ్ అలీ, అతని స్నేహితుడు మహమ్మద్ జావిద్‌లు ఉన్నారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సంఘటన జరిగిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడప నగరం నుంచి హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తి చేసుకున్న తర్వాత మృతదేహాలను ముద్దనూరు పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ప్రొద్దుటూరులో చైన్ స్నాచింగ్
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని మిట్టమడివీధిలో ఇందిరాదేవి అనే మహిళ మెడలో నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు ఇందిరాదేవి దుకాణానికి వెళ్లి ఇంటికి వస్తుండగా గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్‌లో వచ్చి గొలుసును లాక్కొని పారిపోయారు. ముందు వైపు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె గట్టిగా కేకలు వేయగా నిందితులు బైక్‌లో పారిపోయారు. డీఎస్పీ శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలిని విచారించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటశివారెడ్డి తెలిపారు. నిందితుల ఫొటో విడుదల చేసిన పోలీసులు మిట్టమడివీధిలో సీసీ కెమెరా ఉండటంతో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. పరిశీలించిన పోలీసులు నిందితుల ఫొటోను పత్రికలకు విడుదల చేశారు. వారిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. ఇక్కడ చైన్ స్నాచింగ్‌కు పాల్ప డ్డ వారు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు చేసే అవకాశం ఉందని సీఐ అన్నారు. -
అ'శోకం' మిగిలింది.!
కడప అర్బన్/ సిద్దవటం : జిల్లాలోని సిద్దవటం మండలం రోళ్లబోడు బీట్ పరిధిలో బొక్కరాయకనుమ అటవీ ప్రాంతంలో ఈనెల 25న రెగ్యులర్ బీట్ వాచింగ్‌కు వెళ్లిన అటవీశాఖ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. సిద్దవటం రేంజ్ ఆఫీసర్ ఎంవి ప్రసాద్ నేతృత్వంలో ఎఫ్బీఓ సుబ్రమణ్యం, ప్రొటెక్షన్ వాచర్లు అశోక్, వంశీ, నాగమోహన్ రెడ్డి, బాలనాగిరెడ్డి, డ్రైవర్ అనిల్ కుమార్‌లు ఏడుగురు బృందంగా ఏర్పడి బంగ్లాబావి బేస్‌క్యాంప్ నుంచి బుధవారం రెగ్యులర్ బీట్ వాచ్‌కు వెళ్లారు. రోళ్లబోడు బీట్, బొక్కరాయి కనుమ సమీపంలోకి వెళ్లగానే ఎర్రచందనం చెట్లను నరుకుతున్న శబ్దం వినపడగానే అటువైపుగా వెళ్లారు. పైభాగాన దాదాపు 30 మంది, కింది భాగాన 10 మందికి పైగా తమిళ కూలీలు ఉండటాన్ని గమనించారు. వారిని లొంగిపోవాలని కోరిన అటవీశాఖ సిబ్బందిపై తమిళ కూలీలు రాళ్లు, గొడ్డళ్లు, రంపాలతో దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎఫ్బీఓ సుబ్రమణ్యం తన వద్ద ఉన్న 12 బోర్‌పంప్ యాక్షన్ గన్‌తో ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కొందరు చెల్లాచెదురుగా వెళ్లిపోయారు. వీరిలో ఒక తమిళ కూలీతో ప్రొటెక్షన్ వాచర్ అశోక్ పోరాడాడు. ఈ క్రమంలో దెబ్బలు తగిలి రాయి తట్టుకుని ఇద్దరు లోయలో పడ్డారు. ∙ఈ సంఘటన సరిగ్గా సాయంత్రం 4 గంటల నుంచి 4:30 గంటల మధ్య చోటుచేసుకుంది. లోయలో పడ్డ అశోక్ కోసం అటవీ సిబ్బంది గాలించారు. లోయలోకి వెళ్లి తీవ్ర గాయాలతో ఉన్న అశోక్‌ను బయటకు తీసుకుని వచ్చేసరికే పరిస్థితి విషమించింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, వారి ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సాయంత్రం 6గంటలకు పైగా సమయం పట్టిందని సిబ్బంది తెలిపారు. తమిళకూలీ గాయాలతో ఎటో వెళ్లి పోయాడని, అతని జాడ తెలియరాలేదని తెలిపారు. అశోక్ మరణం తమకు తీరని లోటని సహచర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు గురువారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో బంగ్లాబావి బేస్‌క్యాంప్‌కు అశోక్ మృతదేహాన్ని తీసుకురాగలిగారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు పోస్టుమార్టం కోసం తీసుకుని వచ్చారు. కొనసాగుతున్న కూంబింగ్..అదుపులో ముగ్గురు నిందితులు? సిద్దవటం అటవీ ప్రాంతంలో రోళ్లబోడు బీట్ బొక్కరాయకనుమ సమీపంలో జరిగిన సంఘటనతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు, పోలీసుల సహకారంతో కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. అలాగే ఆయా ప్రాంతాల రోడ్ల పరిసర ప్రాంతాలలో కూడా నిఘా ఉంచారు. తమిళ కూలీలలో ముగ్గురు అదుపులో ఉన్నట్లు సమాచారం. రిమ్స్ మార్చురీలో ఉన్న అశోక్ మృతదేహాన్ని ఓఎస్డీ అద్నాన్ నయీం అస్మి తమ సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంఘటనపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని, కూంబింగ్‌ను కొనసాగిస్తున్నామన్నారు. రోడ్లను కూడా జల్లెడ పడుతున్నామన్నారు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. అశోక్ మరణం జీర్ణించుకోలేకున్నాం : ఎఫ్బీఓ సుబ్రమణ్యం ఖాజీపేట మండలం పత్తూరుకు చెందిన బైరి అశోక్ (23) ఐదేళ్ల క్రితం వనిపెంట రేంజ్ పరిధిలో ప్రొటెక్షన్ వాచర్‌గా విధుల్లో చేరాడు. రెండు సంవత్సరాల క్రితం సిద్దవటం రేంజ్లో చేరాడు. తొమ్మిది నెలలుగా బంగ్లాబావి బేస్ క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మాతో పాటు ఈనెల 25న రెగ్యులర్ బీట్ వాచింగ్‌కు వచ్చాడు. తమిళ కూలీని పట్టుకునే క్రమంలో లోయలోకి జారిపడి మృతి చెందాడు. అతని మరణాన్ని జీర్ణించుకోలేకున్నాం. అశోక్ మరణం దురదృష్టకరం :కడప డీఎఫ్ఓ శివప్రసాద్ వెల్లడి కడప డివిజన్ పరిధిలోని సిద్దవటం మండలం రోళ్లబోడు బీట్‌లో బొక్కరాయకనుమ సమీపంలో తమిళ కూలీలు ఎదురుపడ్డ సంఘటనలో అశోక్ అనే ప్రొటెక్షన్ వాచర్ మరణించడం తమ శాఖకు దురదృష్టకరమని, ఇదే చివరి మరణంగా భావిస్తున్నామని కడప డీఎఫ్ఓ శివప్రసాద్ విలేకరులకు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ వంతు కృషి చేస్తామన్నారు. అశోక్‌కు ప్రభుత్వం ద్వారా అందాల్సిన రాయితీలను త్వరలో అందేలా చూస్తామన్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన ఆయుధాలు పది రోజుల్లో వస్తాయన్నారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులు కూడా అదుపులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అశోక్ మాతోపాటు వచ్చి మరణించాడు :ప్రొటెక్షన్ వాచర్‌గా పని చేస్తూ మరణించిన అశోక్ మా గ్రామానికి చెందిన వాడే. మాపై ఒక్కసారిగా తమిళ కూలీలు ఎదురుదాడికి పాల్పడ్డారు.మా ఎఫ్బీఓ ఒక్కరి దగ్గర మాత్రమే గన్ ఉంది. ఆయన కాల్పులు జరపడంతోనే వారు చెల్లాచెదురయ్యారు. అశోక్ కూలీతో తలపడి లోయలోకి జారిపోయాడు. ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాం. అతని మరణం తీరనిలోటు.– వంశీ, సహచర ప్రొటెక్షన్ వాచర్ వివాహం చేయాలనుకునేంతలో నిండు నూరేళ్లు నిండాయా? మాతో పాటు ఇంట్లో సందడిగా ఉండే అశోక్‌కు త్వరలో వివాహం చేయాలని అనుకున్నాం. అంతలోపే డ్యూటీకి వెళ్లిన మా తమ్ముడు అశోక్ మరణించాడని అధికారులు చెప్పారు. మా అమ్మకు అశోక్ మరణం గురించి ఇంకా చెప్పలేదు. – జయపాల్, అశోక్ అన్న. -
కోట్లకు పడగెత్తిన హెడ్
ప్రొద్దుటూరు క్రైం : ఆ హెడ్‌కానిస్టేబుల్ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. ప్రొద్దుటూరులో హెడ్ కానిస్టేబుల్ చిన్న వీరయ్య ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరుతోపాటు కడప, బెంగళూరులోని అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ దాడులు జరిగాయి. ప్రొద్దుటూరులోని త్యాగరాజనగర్‌లో నివాసం ఉంటున్న చిన్న వీరయ్య బి.మఠం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతను ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నాడని సమాచారం రావడంతో జిల్లా ఏసీబీ డీఎస్పీ నాగరాజు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరులోని త్యాగరాజనగర్, లైట్‌పాలెం, శ్రీనివాసనగర్, జేమ్స్‌కొట్టాలలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిన్న వీరయ్య 1993లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేశాడు. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2013లో హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొంది బి.మఠం స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. బ్యాంకుల్లో రుణం తీసుకున్నా.. ఇళ్ల నిర్మాణం కోసం 10 బ్యాంకుల్లో రుణం తీసుకున్నానని హెడ్ కానిస్టేబుల్ చిన్న వీరయ్య ఏసీబీ అధికారులకు తెలిపాడు. తనంటే గిట్టని వాళ్లు కావాలనే ఫిర్యాదు చేశారన్నాడు. తనకు అక్రమాస్తులు లేవని ఉన్న ఆస్తులకు సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. రూ 7 కోట్ల మేర ఆస్తులు .. ఏసీబీ దాడుల్లో రూ.7కోట్ల మేర హెడ్‌కానిస్టేబుల్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో 6 సెంట్లలో ఇళ్లు, మోడంపల్లెలోని జేమ్స్‌పేటలో 5 సెంట్లలో ఇటీవలే నిర్మించిన విలాసవంతమైన భవంతి, చాపాడు మండలంలో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, త్యాగరాజనగర్‌లో అరసెంటులో ఇల్లు, అనుమతి లేకుండా నిర్వహించే సంగీత పరికరాల దుకాణం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నగదు, బంగారం, స్థిరాస్తుల విలువ సుమారు రూ.7కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సోదాలు ఇంకా జరుగుతున్నాయని ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ చిన్న వీరయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సోదాల్లో సీఐలు రామచంద్ర, ఖాదర్‌బాషా సిబ్బంది పాల్గొన్నారు. హెడ్‌కానిస్టేబుల్ ఇంటిలో ఏసీబీ సోదాలు జరగడంతో పట్టణంలోని పోలీసులు ఒక్క సారిగా ఉలికిపాటుకు గురయ్యారు. అతను పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కలిగి ఉండటం చర్చనీయాంశంగా మారింది.