
మృతి చెందిన కానిస్టేబుల్ ఓబులయ్య
వైఎస్‌ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల– నిడుజివ్వి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి 9.30 గంటలకు జరిగిన రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్ ఓబులయ్య (35) మృతి చెందారు.విధులు ముగించుకొని బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే రూరల్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు..ఓబులయ్య ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో (పీసీ నంబరు 363) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఈయన సుమారు ఆరు నెలల కిందట చిన్నమండెం పోలీస్‌స్టేషన్ నుంచి బదిలీపై ఎర్రగుంట్లకు వచ్చారు.
ఈయన స్వగ్రామం ముద్దనూరు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎర్రగుంట్లలో ట్రాíఫిక్ విధులు నిర్వర్తిస్తున్నారు. రోజు మాదిరిగానే విధులు ముగించుకొని పిల్లలకు అరటి పండ్లు తీసుకొని స్కూటర్‌లో ముద్దనూరుకు బయలుదేరారు. ఎర్రగుంట్ల– నిడుజివ్వి గ్రామ సమీపాన క్వారీ వద్దకు రాగనే గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొంది. ఇనుప రాడ్ తలకు బలంగా తగిలింది. దీంతో హెల్మెట్ పగలిపోయి తల లోపలికి రాడ్డు దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ ఓబులయ్య అక్కడిక్కడే దుర్మరణం చెందారు. స్కూటర్ దూరంగా పడిపోయింది. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ కొండారెడ్డి పరిశీలించారు. వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. పరిస్థితిని పరిశీలించారు.