పీఎఫ్‌ కార్యాలయ ఉద్యోగి ఆత్మహత్య | PF Employee Commits SUicide In YSR Kadapa | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ కార్యాలయ ఉద్యోగి ఆత్మహత్య

Published Wed, Oct 3 2018 2:06 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

PF Employee Commits SUicide In YSR Kadapa - Sakshi

సుబ్బారెడ్డి మృతదేహం

కడప అర్బన్‌ : కడప నగరంలోని ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) కార్యాలయంలో మెసెంజర్‌గా పనిచేస్తూ మూడు నెలల క్రితం సస్పెన్షన్‌కు గురైన యండ్రపల్లె సుబ్బారెడ్డి (52) మంగళవారం పాలకొండల్లో చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు, పోలీసు ల కథనం మేరకు ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
కడప నగరంలోని పీఎఫ్‌ కార్యాలయంలో అధికారిగా పనిచేస్తున్న రమేష్‌బాబుతోపాటు వై.సుబ్బారెడ్డి ఏడుగురితో కలిసి ఉద్యోగుల భవిష్యనిధి కార్యాలయానికి చెందిన రూ. 82.98 లక్షల నిధులను మోసపూరితంగా తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారని సీబీఐ ఇటీవల కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి వై.çసుబ్బారెడ్డి మూడు నెలల క్రితం సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈయన తన భార్య భాగ్యమ్మ, కుమారుడు వై.కొండారెడ్డిలతో కలిసి పాత బైపాస్‌రోడ్డులో ఉన్న శ్రీనగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. తనపై కేసు నమోదు, సస్పెన్షన్‌ కావడానికి అధికారి రమేష్‌బాబుతోపాటు మరికొంతమంది కారణమని తీవ్ర ఆవేదనతో కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులతో కూడా పలుమార్లు చర్చించేవాడు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8.15 గంటల సమయంలో బయటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఒక బ్యాగులో మద్యం, ఇడ్లీల ప్యాకెట్, తెల్లని నైలాన్‌ తాడు తీసుకుని పాలకొండలవైపు వెళ్లాడు. మద్యం సేవించిన కొద్దిసేపటికి ఇడ్లీ తిని స్నేహితుడు వెంకటేశ్‌కు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే వెంకటేశ్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేసి వివరాలను తెలియజేశాడు. సుబ్బారెడ్డి పాలకొండల్లోని దేవాలయానికి ఎగువ భాగాన కిలోమీటరు దూరంలో చెట్ల మధ్య ఓ చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే సుబ్బారెడ్డి విగత జీవుడిగా తాడుకు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.
∙సూసైడ్‌ నోట్‌లో మృతుడు సుబ్బారెడ్డి తాను ఆత్మహత్యకు పాల్పడటానికి కేవలం తన పై అధికారి రమేష్‌బాబుతోపాటు మరో నలుగురు కారణమని, వారి వల్లనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని అందులో పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని రిమ్స్‌ సీఐ పురుషోత్తంరాజు ,ఎస్‌ఐ కుళ్లాయప్ప, సిబ్బంది పరిశీలించారు. మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి రిమ్స్‌ మార్చురీకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పురుషోత్తంరాజు తెలిపారు.

ఐదుగురిపై కేసు నమోదు
పాలకొండల్లో పీఎఫ్‌ కార్యాలయ మెసెంజర్‌ సుబ్బారెడ్డి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి కార్యాలయ ఉద్యోగి రమేష్‌ బాబుతోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలుతాయని సీఐ పురుషోత్తంరాజు, ఎస్‌ఐ కుళాయప్ప తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement