చైతన్య (ఫైల్)
వైఎస్‌ఆర్ జిల్లా,బద్వేలు అర్బన్ : ఆ యువకుడు చిన్నతనం నుంచి కష్టపడి చదివేవాడు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివించారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఆశ నెరవేరలేదన్న కారణంతో పాటు డబ్బుల విషయంలో తన స్నేహితుడు చేసిన అవమానం భరించలేకఅర్ధాంతరంగా తనువు చాలించాడు. కన్నవారి కలలను దూరం చేశాడు. బద్వేలు పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయనగర్‌లో నివసించే వెంకటసుబ్బయ్య, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటసుబ్బయ్య జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు.
వెంకటసుబ్బయ్య పెద్ద కుమారుడైన ఆవులేటిచైతన్య (27) బీటెక్ పూర్తిచేసి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కొన్ని నెలలుగా తన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని, తన స్నేహితుని ఉద్యోగం కోసం డబ్బులు చెల్లిస్తే వారు మోసం చేశారని, ఇదే సమయంలో తన స్నేహితుడు డబ్బుల కోసం ఒత్తిడి పెట్టడంతో పాటు జరిగిన విషయాన్ని వాట్సాప్ ద్వారా తన మిత్రులకు తెలిపి తన పరువు తీశాడని మదనపడుతుండేవాడని తెలిసింది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన చైతన్య స్వగ్రామానికి చేరుకున్నాడు. అదే రోజు తల్లి, తమ్ముడు కర్నూలుజిల్లా చాగలమర్రిలో జరిగే వివాహానికి వెళ్లారు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి తలుపులు తట్టగా తీయలేదు. కిటికీలో నుంచి చూడగా ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి సోదరుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకుని మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్నో కష్టాలు పడి నిన్ను చదివించాం. నీకు ఉన్న ఇబ్బందులు మా దృష్టికి తీసుకు వచ్చింటే తీర్చేవారం కదరా, ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా నాయనా అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment