ప్రొటెక్షన్ వాచర్ అశోక్ మృతదేహం
కడప అర్బన్/ సిద్దవటం : జిల్లాలోని సిద్దవటం మండలం రోళ్లబోడు బీట్ పరిధిలో బొక్కరాయకనుమ అటవీ ప్రాంతంలో ఈనెల 25న రెగ్యులర్ బీట్ వాచింగ్‌కు వెళ్లిన అటవీశాఖ బృందానికి చేదు అనుభవం ఎదురైంది.
సిద్దవటం రేంజ్ ఆఫీసర్ ఎంవి ప్రసాద్ నేతృత్వంలో ఎఫ్‌బీఓ సుబ్రమణ్యం, ప్రొటెక్షన్ వాచర్లు అశోక్, వంశీ, నాగమోహన్ రెడ్డి, బాలనాగిరెడ్డి, డ్రైవర్ అనిల్ కుమార్‌లు ఏడుగురు బృందంగా ఏర్పడి బంగ్లాబావి బేస్‌క్యాంప్ నుంచి బుధవారం రెగ్యులర్ బీట్ వాచ్‌కు వెళ్లారు.
రోళ్లబోడు బీట్, బొక్కరాయి కనుమ సమీపంలోకి వెళ్లగానే ఎర్రచందనం చెట్లను నరుకుతున్న శబ్దం వినపడగానే అటువైపుగా వెళ్లారు. పైభాగాన దాదాపు 30 మంది, కింది భాగాన 10 మందికి పైగా తమిళ కూలీలు ఉండటాన్ని గమనించారు. వారిని లొంగిపోవాలని కోరిన అటవీశాఖ సిబ్బందిపై తమిళ కూలీలు రాళ్లు, గొడ్డళ్లు, రంపాలతో దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎఫ్‌బీఓ సుబ్రమణ్యం తన వద్ద ఉన్న 12 బోర్‌పంప్ యాక్షన్ గన్‌తో ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కొందరు చెల్లాచెదురుగా వెళ్లిపోయారు. వీరిలో ఒక తమిళ కూలీతో ప్రొటెక్షన్ వాచర్ అశోక్ పోరాడాడు. ఈ క్రమంలో దెబ్బలు తగిలి రాయి తట్టుకుని ఇద్దరు లోయలో పడ్డారు.
∙ఈ సంఘటన సరిగ్గా సాయంత్రం 4 గంటల నుంచి 4:30 గంటల మధ్య చోటుచేసుకుంది. లోయలో పడ్డ అశోక్ కోసం అటవీ సిబ్బంది గాలించారు. లోయలోకి వెళ్లి తీవ్ర గాయాలతో ఉన్న అశోక్‌ను బయటకు తీసుకుని వచ్చేసరికే పరిస్థితి విషమించింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, వారి ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సాయంత్రం 6గంటలకు పైగా సమయం పట్టిందని సిబ్బంది తెలిపారు. తమిళకూలీ గాయాలతో ఎటో వెళ్లి పోయాడని, అతని జాడ తెలియరాలేదని తెలిపారు. అశోక్ మరణం తమకు తీరని లోటని సహచర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు గురువారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో బంగ్లాబావి బేస్‌క్యాంప్‌కు అశోక్ మృతదేహాన్ని తీసుకురాగలిగారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు పోస్టుమార్టం కోసం తీసుకుని వచ్చారు.
కొనసాగుతున్న కూంబింగ్..అదుపులో ముగ్గురు నిందితులు?
సిద్దవటం అటవీ ప్రాంతంలో రోళ్లబోడు బీట్ బొక్కరాయకనుమ సమీపంలో జరిగిన సంఘటనతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు, పోలీసుల సహకారంతో కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. అలాగే ఆయా ప్రాంతాల రోడ్ల పరిసర ప్రాంతాలలో కూడా నిఘా ఉంచారు. తమిళ కూలీలలో ముగ్గురు అదుపులో ఉన్నట్లు సమాచారం. రిమ్స్ మార్చురీలో ఉన్న అశోక్ మృతదేహాన్ని ఓఎస్‌డీ అద్నాన్ నయీం అస్మి తమ సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంఘటనపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని, కూంబింగ్‌ను కొనసాగిస్తున్నామన్నారు. రోడ్లను కూడా జల్లెడ పడుతున్నామన్నారు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.
అశోక్ మరణం జీర్ణించుకోలేకున్నాం : ఎఫ్‌బీఓ సుబ్రమణ్యం
ఖాజీపేట మండలం పత్తూరుకు చెందిన బైరి అశోక్ (23) ఐదేళ్ల క్రితం వనిపెంట రేంజ్ పరిధిలో ప్రొటెక్షన్ వాచర్‌గా విధుల్లో చేరాడు. రెండు సంవత్సరాల క్రితం సిద్దవటం రేంజ్‌లో చేరాడు. తొమ్మిది నెలలుగా బంగ్లాబావి బేస్ క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మాతో పాటు ఈనెల 25న రెగ్యులర్ బీట్ వాచింగ్‌కు వచ్చాడు. తమిళ కూలీని పట్టుకునే క్రమంలో లోయలోకి జారిపడి మృతి చెందాడు. అతని మరణాన్ని జీర్ణించుకోలేకున్నాం.
అశోక్ మరణం దురదృష్టకరం :కడప డీఎఫ్‌ఓ శివప్రసాద్ వెల్లడి
కడప డివిజన్ పరిధిలోని సిద్దవటం మండలం రోళ్లబోడు బీట్‌లో బొక్కరాయకనుమ సమీపంలో తమిళ కూలీలు ఎదురుపడ్డ సంఘటనలో అశోక్ అనే ప్రొటెక్షన్ వాచర్ మరణించడం తమ శాఖకు దురదృష్టకరమని, ఇదే చివరి మరణంగా భావిస్తున్నామని కడప డీఎఫ్‌ఓ శివప్రసాద్ విలేకరులకు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ వంతు కృషి చేస్తామన్నారు. అశోక్‌కు ప్రభుత్వం ద్వారా అందాల్సిన రాయితీలను త్వరలో అందేలా చూస్తామన్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన ఆయుధాలు పది రోజుల్లో వస్తాయన్నారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులు కూడా అదుపులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
అశోక్ మాతోపాటు వచ్చి మరణించాడు :ప్రొటెక్షన్ వాచర్‌గా పని చేస్తూ మరణించిన అశోక్ మా గ్రామానికి చెందిన వాడే. మాపై ఒక్కసారిగా తమిళ కూలీలు ఎదురుదాడికి పాల్పడ్డారు.మా ఎఫ్‌బీఓ ఒక్కరి దగ్గర మాత్రమే గన్ ఉంది. ఆయన కాల్పులు జరపడంతోనే వారు చెల్లాచెదురయ్యారు. అశోక్ కూలీతో తలపడి లోయలోకి జారిపోయాడు. ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాం. అతని మరణం తీరనిలోటు.– వంశీ, సహచర ప్రొటెక్షన్ వాచర్
వివాహం చేయాలనుకునేంతలో నిండు నూరేళ్లు నిండాయా?
మాతో పాటు ఇంట్లో సందడిగా ఉండే అశోక్‌కు త్వరలో వివాహం చేయాలని అనుకున్నాం. అంతలోపే డ్యూటీకి వెళ్లిన మా తమ్ముడు అశోక్ మరణించాడని అధికారులు చెప్పారు. మా అమ్మకు అశోక్ మరణం గురించి ఇంకా చెప్పలేదు. – జయపాల్, అశోక్ అన్న.
Comments
Please login to add a commentAdd a comment