మాట్లాడుతున్న ప్రణీత
సాక్షి, రైల్వేకోడూరు: అతను మొదటి భార్యను వదిలేశాడు. రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెనూ వదిలించుకుని మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అంతే.. కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తప్పించుకుని వచ్చి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రైల్వేకోడూరులో చోటు చేసుకున్న సంఘటన వివరాలు బాధితురాలి కథనం మేరకు ఇలా ఉన్నాయి. రైల్వేకోడూరు పట్టణంలోని పాతబజారుకు చెందిన యాదాల శంకరయ్యకు యాదాల ప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. వీరు కోడూరులో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. యాదాల ప్రసాద్ 1999లో నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన సుధ అనే మహిళను వివాహం చేసుకున్నాడు.
కొన్నాళ్లకు ఆమెను వదిలేసి 2013లో చిత్తూరు జిల్లా కందూరుకు చెందిన ప్రణీత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. గత ఐదేళ్లుగా భర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. భర్త వేధింపులు భరించలేక గతంలో తాను కడప మహిళా పోలీస్ స్టేషన్, రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్, చిత్తూరు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే తన భర్త వద్ద డబ్బులు బాగా ఉండటంతో పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని, కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతూ వచ్చారని పేర్కొంది.
అయినా తన భర్త మారలేదని ఆమె విలపిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తాను మరొక మహిళను వివాహం చేసుకుంటానని చెబుతూ ప్రతి రోజూ రాత్రి సమయంలో చిత్రహింసలు పెడుతున్నాడని ఆమె పేర్కొంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చున్నీతో నా మెడకు ఉరివేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో తన మామ, అత్త కూడా అక్కడే ఉండి తన భర్తకు సహకరించారని ఆరోపించింది. తాను గట్టిగా వదిలించుకుని వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పింది. గొంతుకు తీవ్ర గాయం కావడంతో కోడూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం తిరుపతి రుయాకు వెళ్లి చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment