ఆసిఫా వద్ద ఫిర్యాదు తీసుకుంటున్న పోలీసు
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : వివాహితను వేధింపులకు గురి చేసిన సంఘటనపై భర్తతో పాటు అత్తామామలపై మహిళ తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు రోడ్డులోని గేటు వీధిలో నివాసం ఉంటున్న షేక్ ఆసిఫాకు 14 నెలల క్రితం శాంతకుమారి వీధికి చెందిన షేక్ ఇస్మాయిల్‌తో వివాహం అయింది. ఆసిఫా తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో మేనమామ ఖాదర్‌బాషా ఆమెను పెంచి పెద్ద చేశాడు. పెళ్లి సమయంలో కట్న కానుకుల కింద ఆసిఫాకు 10 తులాల బంగారు, రూ. 1 లక్ష నగదు ఇచ్చారు. ఇస్మాయిల్ ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్నాడు. రెండు నెలల పాటు భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండేవారు. ఆసిఫా వద్ద ఉన్న బంగారును భర్త బ్యాంకులో కుదవ పెట్టాడు.
రూ. 4 లక్షలు దాకా బాకీ ఉందని, మేనమామను అడిగి తీసుకొని రావాలని ఆమెను చిత్రహింసలకు గురి చేసేవారు. భర్త, అత్తామామలు ఎంతగా ఇబ్బంది పెడుతున్నా ఆమె ఈ విషయాన్ని మేనమామతో చెప్పలేదు. ఈ క్రమంలో ఆసిఫా ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు గురువారం ఖాదర్‌బాషాకు ఫోన్ వచ్చింది. దీంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆసిఫా అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు అందరూ భావించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆసిఫాకు మెలుకువ వచ్చింది. తాను ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదని, తనకు ఏదో మత్తు ఇచ్చారని తెలిపింది. తనకు ఏం జరిగిందో తెలియదని, మెలుకు వచ్చేసరికి ఆస్పత్రిలో ఉన్నానని ఆసిఫా పోలీసులకు తెలిపింది. ఆసిఫాకు మత్తు ఇచ్చి చంపే ప్రయత్నం చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె భర్త, అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇరువురు మాట్లాడుకుంటున్నారని, తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం రాత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment