Tamil smugglers
-
అ'శోకం' మిగిలింది.!
కడప అర్బన్/ సిద్దవటం : జిల్లాలోని సిద్దవటం మండలం రోళ్లబోడు బీట్ పరిధిలో బొక్కరాయకనుమ అటవీ ప్రాంతంలో ఈనెల 25న రెగ్యులర్ బీట్ వాచింగ్‌కు వెళ్లిన అటవీశాఖ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. సిద్దవటం రేంజ్ ఆఫీసర్ ఎంవి ప్రసాద్ నేతృత్వంలో ఎఫ్బీఓ సుబ్రమణ్యం, ప్రొటెక్షన్ వాచర్లు అశోక్, వంశీ, నాగమోహన్ రెడ్డి, బాలనాగిరెడ్డి, డ్రైవర్ అనిల్ కుమార్‌లు ఏడుగురు బృందంగా ఏర్పడి బంగ్లాబావి బేస్‌క్యాంప్ నుంచి బుధవారం రెగ్యులర్ బీట్ వాచ్‌కు వెళ్లారు. రోళ్లబోడు బీట్, బొక్కరాయి కనుమ సమీపంలోకి వెళ్లగానే ఎర్రచందనం చెట్లను నరుకుతున్న శబ్దం వినపడగానే అటువైపుగా వెళ్లారు. పైభాగాన దాదాపు 30 మంది, కింది భాగాన 10 మందికి పైగా తమిళ కూలీలు ఉండటాన్ని గమనించారు. వారిని లొంగిపోవాలని కోరిన అటవీశాఖ సిబ్బందిపై తమిళ కూలీలు రాళ్లు, గొడ్డళ్లు, రంపాలతో దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎఫ్బీఓ సుబ్రమణ్యం తన వద్ద ఉన్న 12 బోర్‌పంప్ యాక్షన్ గన్‌తో ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కొందరు చెల్లాచెదురుగా వెళ్లిపోయారు. వీరిలో ఒక తమిళ కూలీతో ప్రొటెక్షన్ వాచర్ అశోక్ పోరాడాడు. ఈ క్రమంలో దెబ్బలు తగిలి రాయి తట్టుకుని ఇద్దరు లోయలో పడ్డారు. ∙ఈ సంఘటన సరిగ్గా సాయంత్రం 4 గంటల నుంచి 4:30 గంటల మధ్య చోటుచేసుకుంది. లోయలో పడ్డ అశోక్ కోసం అటవీ సిబ్బంది గాలించారు. లోయలోకి వెళ్లి తీవ్ర గాయాలతో ఉన్న అశోక్‌ను బయటకు తీసుకుని వచ్చేసరికే పరిస్థితి విషమించింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, వారి ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సాయంత్రం 6గంటలకు పైగా సమయం పట్టిందని సిబ్బంది తెలిపారు. తమిళకూలీ గాయాలతో ఎటో వెళ్లి పోయాడని, అతని జాడ తెలియరాలేదని తెలిపారు. అశోక్ మరణం తమకు తీరని లోటని సహచర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు గురువారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో బంగ్లాబావి బేస్‌క్యాంప్‌కు అశోక్ మృతదేహాన్ని తీసుకురాగలిగారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు పోస్టుమార్టం కోసం తీసుకుని వచ్చారు. కొనసాగుతున్న కూంబింగ్..అదుపులో ముగ్గురు నిందితులు? సిద్దవటం అటవీ ప్రాంతంలో రోళ్లబోడు బీట్ బొక్కరాయకనుమ సమీపంలో జరిగిన సంఘటనతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు, పోలీసుల సహకారంతో కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. అలాగే ఆయా ప్రాంతాల రోడ్ల పరిసర ప్రాంతాలలో కూడా నిఘా ఉంచారు. తమిళ కూలీలలో ముగ్గురు అదుపులో ఉన్నట్లు సమాచారం. రిమ్స్ మార్చురీలో ఉన్న అశోక్ మృతదేహాన్ని ఓఎస్డీ అద్నాన్ నయీం అస్మి తమ సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంఘటనపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని, కూంబింగ్‌ను కొనసాగిస్తున్నామన్నారు. రోడ్లను కూడా జల్లెడ పడుతున్నామన్నారు. ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. అశోక్ మరణం జీర్ణించుకోలేకున్నాం : ఎఫ్బీఓ సుబ్రమణ్యం ఖాజీపేట మండలం పత్తూరుకు చెందిన బైరి అశోక్ (23) ఐదేళ్ల క్రితం వనిపెంట రేంజ్ పరిధిలో ప్రొటెక్షన్ వాచర్‌గా విధుల్లో చేరాడు. రెండు సంవత్సరాల క్రితం సిద్దవటం రేంజ్లో చేరాడు. తొమ్మిది నెలలుగా బంగ్లాబావి బేస్ క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మాతో పాటు ఈనెల 25న రెగ్యులర్ బీట్ వాచింగ్‌కు వచ్చాడు. తమిళ కూలీని పట్టుకునే క్రమంలో లోయలోకి జారిపడి మృతి చెందాడు. అతని మరణాన్ని జీర్ణించుకోలేకున్నాం. అశోక్ మరణం దురదృష్టకరం :కడప డీఎఫ్ఓ శివప్రసాద్ వెల్లడి కడప డివిజన్ పరిధిలోని సిద్దవటం మండలం రోళ్లబోడు బీట్‌లో బొక్కరాయకనుమ సమీపంలో తమిళ కూలీలు ఎదురుపడ్డ సంఘటనలో అశోక్ అనే ప్రొటెక్షన్ వాచర్ మరణించడం తమ శాఖకు దురదృష్టకరమని, ఇదే చివరి మరణంగా భావిస్తున్నామని కడప డీఎఫ్ఓ శివప్రసాద్ విలేకరులకు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ వంతు కృషి చేస్తామన్నారు. అశోక్‌కు ప్రభుత్వం ద్వారా అందాల్సిన రాయితీలను త్వరలో అందేలా చూస్తామన్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన ఆయుధాలు పది రోజుల్లో వస్తాయన్నారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులు కూడా అదుపులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అశోక్ మాతోపాటు వచ్చి మరణించాడు :ప్రొటెక్షన్ వాచర్‌గా పని చేస్తూ మరణించిన అశోక్ మా గ్రామానికి చెందిన వాడే. మాపై ఒక్కసారిగా తమిళ కూలీలు ఎదురుదాడికి పాల్పడ్డారు.మా ఎఫ్బీఓ ఒక్కరి దగ్గర మాత్రమే గన్ ఉంది. ఆయన కాల్పులు జరపడంతోనే వారు చెల్లాచెదురయ్యారు. అశోక్ కూలీతో తలపడి లోయలోకి జారిపోయాడు. ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాం. అతని మరణం తీరనిలోటు.– వంశీ, సహచర ప్రొటెక్షన్ వాచర్ వివాహం చేయాలనుకునేంతలో నిండు నూరేళ్లు నిండాయా? మాతో పాటు ఇంట్లో సందడిగా ఉండే అశోక్‌కు త్వరలో వివాహం చేయాలని అనుకున్నాం. అంతలోపే డ్యూటీకి వెళ్లిన మా తమ్ముడు అశోక్ మరణించాడని అధికారులు చెప్పారు. మా అమ్మకు అశోక్ మరణం గురించి ఇంకా చెప్పలేదు. – జయపాల్, అశోక్ అన్న. -
ఔరా.. తంబీ..!
కడప అర్బన్ : ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం జిల్లాలోని అటవీ ప్రాంతంలో లభ్యమవుతోంది. దీన్ని అక్రమంగా నరికి, రవాణా చేసేందుకు తమిళ స్మగ్లర్లు, కూలీలు ఎప్పటికప్పుడు రూటు మారుస్తూ, తెగబడుతున్నారు. గతంలో చెన్నై నుంచి జిల్లాలోకి ప్రవేశించే వారు. పోలీసు, అటవీ శాఖ అధికారుల నిరంతర కూంబింగ్‌తో కొంత రూటు మార్చా రు. తిరుపతి, రైల్వేకోడూరు, రాజంపేట, బాలుపల్లి, కడప పరిసర ప్రాం తాల్లోని అడవిలోకి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, రైళ్ల ద్వారా వచ్చా రు. ఈ మార్గాల్లోనూ అధికారులు పర్యవేక్షణ పెంచారు. దీంతో తిరువన్నామలై జిల్లా జావాదిమలై ప్రాంతంలోని తమిళ కూలీలు బెంగళూరు నుంచి అనంతపురం, కమలాపురం నుంచి ఖాజీపేట పరిసర ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారు. ఇటీవల పోలీసు అధికారులు గండివాటర్స్, కడప నగర శివార్ల ప్రాంతంలో వారిని పట్టుకున్నారు. తర్వాత జావాదిమలై ప్రాంతం నుంచి ఎర్రచందనం స్మగ్లర్ల సహకారంతో తమిళ కూలీలు నేరుగా బెంగుళూరు ప్రాంతానికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి కడప, రాయచోటి, వేంపల్లి రేంజ్‌ల పరిధిల మధ్య భాగంలో వున్న అటవీ ప్రాంతానికి వెళ్తున్నారు. వారితో పాటు స్మగ్లర్లు కిట్ బ్యాగ్‌లు, బియ్యం, కూరగాయలు, వంటసామగ్రి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ‘మెక్ డోవెల్స్ బ్రాందీ ’ టెట్రా ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్‌ను తమ వెంట తెచ్చుకుంటున్నారు. పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు తమ భరోసాతో తమిళ కూలీలను ప్రైవేట్, ఇతర వాహనాల ద్వారా పైన చెప్పిన అటవీ ప్రాంతాలకు దగ్గరగా వదిలివెళుతున్నారు. వీరు తమ వెంట తెచ్చుకున్న కిట్లను సునాయాసంగా మోసుకుని వెళుతూ, ఎర్రచందనంను సులభంగా నరికి, దుంగలుగా తయారు చేస్తున్నారు. ముమ్మరంగా దాడులు ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న కడప డీఎఫ్ఓ శివప్రసాద్, స్క్వాడ్ డీఎఫ్ఓ ఈడీ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలసి ఆదివారం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. అప్పటికే నరికి వుంచిన 99 ఎర్రచందనం దుంగలను తమిళ కూలీలు తొట్ల నరవ ప్రాంతంలో అక్కడక్కడా దాచి వుంచా రు. వీటి బరువు సుమారు 2.5 టన్నులు, విలువ రూ. 2.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ అధికారులు, సిబ్బందిని చూసి.. దాదాపు 80 మంది తమిళ కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో దాడులు చేస్తూనే పరారయ్యారు. వారి వెంట తెచ్చుకున్న కొంత వంట సామగ్రితోపాటు, ఒక గొడ్డలి, బ్రాందీ ఖాళీ టెట్రా ప్యాకెట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలు, ఇతర సామగ్రిని కడప డీఎఫ్ఓ కార్యాలయానికి తరలించారు. దుంగల నరికివేత ఆపేందుకు కృషి : డీఎఫ్ఓ ‘జిల్లాలో కడప సబ్ డివిజన్ పరిధిలోని కడప, రాయచోటి, వేంపల్లి రేంజ్లలోని రహదారులను మెరుగుపరుస్తున్నాం, వైర్లెస్ సెట్, సీసీ కెమెరాలతో నిఘా పెంచుతున్నాం’ అని కడప డీఎఫ్ఓ శివప్రసాద్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెక్‌పోస్టులలో ఏం జరుగుతుందో అక్కడి సీసీ కెమెరాల ద్వారా తమ సెల్‌ఫోన్‌కు గానీ, కార్యాలయానికి గానీ అనుసంధానం చేసి నిఘా పెంచుతున్నామని పేర్కొన్నారు. ఎర్రచందనం దుంగల నరికివేత జరగకుండా కూడా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అటవీ ప్రాంత పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరైనా అపరిచిత, లేదా తమిళ కూలీలు సంచరిస్తూ వుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, సమాచారం నిజమైతే వారికి ప్రభుత్వం నుంచి తగిన పారితోషికం ఇప్పిస్తామని వివరించారు. సమావేశంలో స్క్వాడ్ డీఎఫ్ఓ ఈడీ వెంకటేశ్వర్లు, కడప ఎఫ్ఆర్ఓ బాలసుబ్రమణ్యం, వేంపల్లి ఎఫ్ఆర్ఓ స్వామి వివేకానంద, రాయచోటి ఎఫ్ఆర్ఓ మణి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫారెస్ట్ సిబ్బందిపై తమిళ కూలీల దాడి
వైఎస్సార్ జిల్లా : సిద్ధవటం మండలం లంకమల్ల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా తమిళ కూలీల రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు ఫారెస్ట్ సిబ్బంది గాయపడ్డారు. దీంతో సిబ్బంది హెచ్చరికలు చేసి గాలిలోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఒకరిని అరెస్ట్ చేశారు. ఆరుగురు పరారయ్యారు. ఏడు ఎర్రచందనం దుంగలు, నాలుగు గొడ్డళ్లు, మూడు రంపపు బ్లేడు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన తమిళ స్మగ్లర్‌ను మీడియా ఎదుట హాజరు పరచి స్థానిక డీఎస్పీ శివప్రసాద్ వివరాలు వెల్లడించారు. -
‘దేశం’ నేతల్లో వణుకు
- తమిళ స్మగ్లర్ల విచారణతో పలు ఆసక్తికర అంశాలు - అధికారులకు మంత్రి స్థాయిలో ఒత్తిళ్లు - భారీగా దొరుకుతున్న ఎర్ర డంప్‌లు - తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: తమిళ స్మగ్లర్ల విచారణతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. ముఖ్యం గా చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోని పలువురు ‘పచ్చ’నేతలకు ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ‘దేశం’ తమ్ముళ్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నా యి. ఇప్పటికే పలువురు తెలుగు తమ్ముళ్లకు స్మగ్లింగ్‌తో సం బంధం ఉందని, ఇందుకు అవసరమైన ఆధారాలు సైతం అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ టీడీపీ నేతల ప్రమేయానికి సంబంధించిన నివేదికను బయట పెట్టకుండా అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో టాస్క్ఫోర్సు, పోలీస్, అటవీ శాఖ ఉన్నతాధికారులు స్మగ్లర్ల జాబితాను గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయాన్ని బయటపెడితే ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని అధికారులు సైతం ఆందోళన చెందుతున్నట్ల్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే చిత్తూరు జిలాల్లో ఎస్పీ 12 మందిపై పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు పంపారు. వారం రోజులు అయినా దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ప్రకంపనలు... తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు వరసగా పట్టుబడుతున్నారు. గత నెల 19న పశ్చిమ బెంగాల్ - చెన్నై ఆపరేషన్‌లో జిల్లా పోలీసులు షణ్ముగం, సౌందర్‌రాజన్ ముఠా నుంచి దాదాపు రూ.23 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా చెన్నై నగరంలోని తూత్తుకుడిలో రూ.8 కోట్లు విలువ చేసే ఎర్రచందనం డంప్‌ను పోలీసులు గుర్తించారు. జిల్లాలోని శేషాచలం అడవుల నుంచి ఎర్ర సంపద అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్లడంపై జిల్లా పోలీసు యంత్రాంగం చాలా సీరియస్‌గా ఉంది. దీనికి తోడు శేషాచలంలో జరిగిన ఎన్కౌంటర్ జిల్లా పోలీసులపై మరింత ఒత్తిడిని పెంచింది. ఈ క్రమంలో ఆపరేషన్ రెడ్, టాస్క్ఫోర్సు పోలీసులు చేస్తున్న దాడులు కలిసి వస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడులోని పలువురు స్మగ్లర్లు, అన్నా డీఎంకే పార్టీకి చెందిన నాయకులకు ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే చెన్నైకు చెందిన షణ్ముగం ముఠా, వేలూరుకు చెందిన మోహనాంబాల్ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో దాడులు చేసి, ఎర్రచందనం నిల్వలను గుర్తిస్తున్నారు.ఎర్ర స్మగ్లింగ్ వ్యవహారం తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే, నేతలతో పాటు సినిమా పరిశ్రమలోని పలువురికి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు వెల్లడికావడంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.తూత్తుకుడి, తిరువళ్లూరు, చెన్నై. సేలం. వేలూరు జిల్లాలోని కూలీలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ జిల్లాలో సైతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.