ఔరా.. తంబీ..! | Red Wood Smugglers Route Change In YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఔరా.. తంబీ..!

Published Tue, Jun 12 2018 1:05 PM | Last Updated on Tue, Jun 12 2018 1:05 PM

Red Wood Smugglers Route Change In YSR Kadapa - Sakshi

బ్రాందీ టెట్రా ప్యాకెట్స్‌ను పరిశీలిస్తున్న కడప డీఎఫ్‌ఓ శివప్రసాద్

కడప అర్బన్‌ : ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం జిల్లాలోని అటవీ ప్రాంతంలో లభ్యమవుతోంది. దీన్ని అక్రమంగా నరికి, రవాణా చేసేందుకు తమిళ స్మగ్లర్లు, కూలీలు ఎప్పటికప్పుడు రూటు మారుస్తూ, తెగబడుతున్నారు. గతంలో చెన్నై నుంచి జిల్లాలోకి ప్రవేశించే వారు. పోలీసు, అటవీ శాఖ అధికారుల నిరంతర కూంబింగ్‌తో కొంత రూటు మార్చా రు. తిరుపతి, రైల్వేకోడూరు, రాజంపేట, బాలుపల్లి, కడప పరిసర ప్రాం తాల్లోని అడవిలోకి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు, రైళ్ల ద్వారా వచ్చా రు. ఈ మార్గాల్లోనూ అధికారులు పర్యవేక్షణ పెంచారు. దీంతో తిరువన్నామలై జిల్లా జావాదిమలై ప్రాంతంలోని తమిళ కూలీలు బెంగళూరు నుంచి అనంతపురం, కమలాపురం నుంచి ఖాజీపేట పరిసర ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారు.

ఇటీవల పోలీసు అధికారులు గండివాటర్స్, కడప నగర శివార్ల ప్రాంతంలో వారిని పట్టుకున్నారు. తర్వాత జావాదిమలై ప్రాంతం నుంచి ఎర్రచందనం స్మగ్లర్ల సహకారంతో తమిళ కూలీలు నేరుగా బెంగుళూరు ప్రాంతానికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి కడప, రాయచోటి, వేంపల్లి రేంజ్‌ల పరిధిల మధ్య భాగంలో వున్న అటవీ ప్రాంతానికి వెళ్తున్నారు. వారితో పాటు స్మగ్లర్లు కిట్‌ బ్యాగ్‌లు, బియ్యం, కూరగాయలు, వంటసామగ్రి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ‘మెక్‌ డోవెల్స్‌ బ్రాందీ ’ టెట్రా ప్యాకెట్స్, వాటర్‌ బాటిల్స్‌ను తమ వెంట తెచ్చుకుంటున్నారు. పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు తమ భరోసాతో తమిళ కూలీలను ప్రైవేట్, ఇతర వాహనాల ద్వారా పైన చెప్పిన అటవీ ప్రాంతాలకు దగ్గరగా వదిలివెళుతున్నారు. వీరు తమ వెంట తెచ్చుకున్న కిట్లను సునాయాసంగా మోసుకుని వెళుతూ, ఎర్రచందనంను సులభంగా నరికి, దుంగలుగా తయారు చేస్తున్నారు.

ముమ్మరంగా దాడులు
ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న కడప డీఎఫ్‌ఓ శివప్రసాద్, స్క్వాడ్‌ డీఎఫ్‌ఓ ఈడీ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలసి ఆదివారం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. అప్పటికే నరికి వుంచిన 99 ఎర్రచందనం దుంగలను తమిళ కూలీలు తొట్ల నరవ ప్రాంతంలో అక్కడక్కడా దాచి వుంచా రు. వీటి బరువు సుమారు 2.5 టన్నులు, విలువ రూ. 2.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ అధికారులు, సిబ్బందిని చూసి.. దాదాపు 80 మంది తమిళ కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో దాడులు చేస్తూనే పరారయ్యారు. వారి వెంట తెచ్చుకున్న కొంత వంట సామగ్రితోపాటు, ఒక గొడ్డలి, బ్రాందీ ఖాళీ టెట్రా ప్యాకెట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలు, ఇతర సామగ్రిని కడప డీఎఫ్‌ఓ కార్యాలయానికి తరలించారు.

దుంగల నరికివేత ఆపేందుకు కృషి : డీఎఫ్‌ఓ
‘జిల్లాలో కడప సబ్‌ డివిజన్‌ పరిధిలోని కడప, రాయచోటి, వేంపల్లి రేంజ్‌లలోని రహదారులను మెరుగుపరుస్తున్నాం, వైర్‌లెస్‌ సెట్, సీసీ కెమెరాలతో నిఘా పెంచుతున్నాం’ అని కడప డీఎఫ్‌ఓ శివప్రసాద్‌ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెక్‌పోస్టులలో ఏం జరుగుతుందో అక్కడి సీసీ కెమెరాల ద్వారా తమ సెల్‌ఫోన్‌కు గానీ, కార్యాలయానికి గానీ అనుసంధానం చేసి నిఘా పెంచుతున్నామని పేర్కొన్నారు. ఎర్రచందనం దుంగల నరికివేత జరగకుండా కూడా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అటవీ ప్రాంత పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరైనా అపరిచిత, లేదా తమిళ కూలీలు సంచరిస్తూ వుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, సమాచారం నిజమైతే వారికి ప్రభుత్వం నుంచి తగిన పారితోషికం ఇప్పిస్తామని వివరించారు. సమావేశంలో స్క్వాడ్‌ డీఎఫ్‌ఓ ఈడీ వెంకటేశ్వర్లు, కడప ఎఫ్‌ఆర్‌ఓ బాలసుబ్రమణ్యం, వేంపల్లి ఎఫ్‌ఆర్‌ఓ స్వామి వివేకానంద, రాయచోటి ఎఫ్‌ఆర్‌ఓ మణి, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement