- తమిళ స్మగ్లర్ల విచారణతో పలు ఆసక్తికర అంశాలు
- అధికారులకు మంత్రి స్థాయిలో ఒత్తిళ్లు
- భారీగా దొరుకుతున్న ఎర్ర డంప్‌లు
- తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తమిళ స్మగ్లర్ల విచారణతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. ముఖ్యం గా చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లోని పలువురు ‘పచ్చ’నేతలకు ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ‘దేశం’ తమ్ముళ్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నా యి. ఇప్పటికే పలువురు తెలుగు తమ్ముళ్లకు స్మగ్లింగ్‌తో సం బంధం ఉందని, ఇందుకు అవసరమైన ఆధారాలు సైతం అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ టీడీపీ నేతల ప్రమేయానికి సంబంధించిన నివేదికను బయట పెట్టకుండా అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
దీంతో టాస్క్‌ఫోర్సు, పోలీస్, అటవీ శాఖ ఉన్నతాధికారులు స్మగ్లర్ల జాబితాను గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయాన్ని బయటపెడితే ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని అధికారులు సైతం ఆందోళన చెందుతున్నట్ల్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే చిత్తూరు జిలాల్లో ఎస్పీ 12 మందిపై పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు పంపారు. వారం రోజులు అయినా దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో ప్రకంపనలు...
తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు వరసగా పట్టుబడుతున్నారు. గత నెల 19న పశ్చిమ బెంగాల్ - చెన్నై ఆపరేషన్‌లో జిల్లా పోలీసులు షణ్ముగం, సౌందర్‌రాజన్ ముఠా నుంచి దాదాపు రూ.23 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా చెన్నై నగరంలోని తూత్తుకుడిలో రూ.8 కోట్లు విలువ చేసే ఎర్రచందనం డంప్‌ను పోలీసులు గుర్తించారు. జిల్లాలోని శేషాచలం అడవుల నుంచి ఎర్ర సంపద అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్లడంపై జిల్లా పోలీసు యంత్రాంగం చాలా సీరియస్‌గా ఉంది. దీనికి తోడు శేషాచలంలో జరిగిన ఎన్‌కౌంటర్ జిల్లా పోలీసులపై మరింత ఒత్తిడిని పెంచింది.
ఈ క్రమంలో ఆపరేషన్ రెడ్, టాస్క్‌ఫోర్సు పోలీసులు చేస్తున్న దాడులు కలిసి వస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడులోని పలువురు స్మగ్లర్లు, అన్నా డీఎంకే పార్టీకి చెందిన నాయకులకు ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే చెన్నైకు చెందిన షణ్ముగం ముఠా, వేలూరుకు చెందిన మోహనాంబాల్‌ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో దాడులు చేసి, ఎర్రచందనం నిల్వలను గుర్తిస్తున్నారు.ఎర్ర స్మగ్లింగ్ వ్యవహారం తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే, నేతలతో పాటు సినిమా పరిశ్రమలోని పలువురికి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు వెల్లడికావడంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.తూత్తుకుడి, తిరువళ్లూరు, చెన్నై. సేలం. వేలూరు జిల్లాలోని కూలీలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ జిల్లాలో సైతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
‘దేశం’ నేతల్లో వణుకు
Published Mon, May 4 2015 3:50 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement