వివరాలు వెల్లడిస్తున్న వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, వెనుక నిందితుడు
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): వేరేవారి బ్యాంకు ఖాతాలనుంచి ఆధునిక టెక్నాలజీ సాయంతో డబ్బును దోచేస్తున్న ఓ సైబర్ నేరగాడిని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి..అతని వద్ద నుంచి రూ. 3 లక్షలు రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని సుందరయ్య నగర్‌కు చెందిన మల్లెపోగు ప్రసాద్ (31) ప్రొద్దుటూరు టౌన్ హోమస్‌పేటలో తమ బంధువులకు చెందిన ధనలక్ష్మి వెబ్ సెంటర్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
చదవండి: అన్నా.. అని వేడినా కనికరించలేదు.. ఆ మాటలు విని వారి గుండెలు బద్దలైపోయాయి
ఆరు నెలల క్రితం అరుణ అనే మహిళ నెట్ సెంటర్‌లో తన వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయి డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకుని లాగౌట్ చేయకుండా వెళ్లిపోయింది. దీంతో నిందితుడు వాట్సాప్‌ను చెక్‌చేయగా ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఎవరికో డబ్బులను పంపిన విషయం గమనించాడు. వెంటనే అరుణ కుమార్తె నంబరుకు ఫోన్ చేసి మీ తల్లి ఆధార్, పాన్‌తో లింక్ కాలేదని, తాను చెప్పినట్లు మెసేజ్ పెట్టమని కోరాడు. తరువాత ఆమె సెల్‌కు వచ్చిన మెసేజ్, వెరిఫికేషన్ కోడ్‌లను స్క్రీన్‌షాట్‌గా తెప్పించుకున్నాడు. అనంతరం అరుణ వాడుతున్న నంబరును ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసి హైదరాబాద్‌లో సిమ్‌కార్డును తీసుకుని యాక్టివేట్ చేసుకున్నాడు.
దీని కోసం నిందితుడు తన ఫేస్‌కట్‌తోనే పోలి ఉన్న రాయచోటికి చెందిన మగ్దూం బాషా అనే అతని ఆధార్‌కార్డును ఉపయోగించాడు. ఈ నంబరు సిమ్‌ను తన సెల్‌లో వేసుకుని ఫోన్‌పే, నెట్ బ్యాంకింగ్ ఇన్‌స్టాల్ చేసుకుని అరుణకు చెందిన కెనరాబ్యాంక్ ఖాతానుంచి మొత్తం రూ. 4.31 లక్షలను కాజేశాడు. తన బ్యాంకు ఖాతానుంచి రూ.4 లక్షలకుపైగా డబ్బు మాయం కావడంతో.. ఆందోళనకు గురైన మహిళ ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు, కడప సైబర్ సెల్ పోలీసు బృందం అధునాతన టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు తాను దొంగిలించిన మొత్తంలో రూ. 3.10 లక్షలు తన తల్లి ఆరోగ్య సమస్య తీరడానికి హోమం చేయాలంటూ కర్నూలు జిల్లా కొలిమికుంట్లకు చెందిన ఓ పూజారికి ఇచ్చినట్లు తెలిపాడు. నిందితుడిని అక్కడికి తీసుకుపోయిన పోలీసులు పూజారి నుంచి ఆ రూ.3 లక్షలు రికవరీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment