కారుకొందామని వెళుతూ.. మృత్యు ఒడికి | Three Died In Muddanur Car Accident YSR kadapa | Sakshi
Sakshi News home page

హత విధి

Published Sat, Aug 11 2018 1:06 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

Three Died In Muddanur Car Accident YSR kadapa - Sakshi

ఎంత జాగ్రత్తగా ప్రయాణిస్తున్నా బలీయమైన విధికి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు తప్పిదం లేకున్నా.. ముందువైపు వెళుతున ట్రాక్టర్‌ నుంచి ఒక భాగం ఊడి పడటం..వెనుకనే వస్తున్న టిప్పర్‌ దాన్ని తప్పించే ప్రయత్నంలో రాంగ్‌ రూట్‌లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొంది. కారుపై టిప్పర్‌ పడి నుజ్జునుజ్జు కావడంతో  ముగ్గురు ప్రయాణికులు అక్కడే దుర్మరణం చెందారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

ముద్దనూరు: మండలంలోని తిమ్మాపురం క్రాస్‌ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కడప పట్టణానికి చెందిన నవాజ్‌ అలీఖాన్‌(40), మహమ్మద్‌ జావీద్‌(42), తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన దిలీప్‌కుమార్‌(22)లు  దుర్మరణం చెందగా, దిలీప్‌ కుమార్‌ తండ్రి శ్రీనివాసులు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు..  కడపకు చెందిన అలీఖాన్, జావీద్‌లు వారి స్నేహితుడు శ్రీనివాసులు కుమారుడు దిలీప్‌కుమార్‌కు కారును కొనుగోలు చేయడానికి అనంతపురం పట్టణానికి కారులో బయలుదేరారు. ముద్దనూరు నుంచి కంకర రాళ్ల లోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్‌ తిమ్మాపురం క్రాస్‌ సమీపానికి వస్తుండగా టిప్పర్‌కు ముందువైపు వెళుతున్న ట్రాక్టర్‌కు అకస్మాత్తుగా హోసింగ్‌ ఊడిపోయి రోడ్డుపై పడింది.

వెనుకనే వస్తున్న టిప్పర్‌ వేగంగా ట్రాక్టర్‌ నుంచి ఊడిపోయిన విడిభాగాన్ని ఢీకొంది. దీంతో డ్రైవరు  టిప్పర్‌ను పూర్తిగా కుడివైపుకు తిప్పాడు. అలా దూసుకెళ్లిన టిప్పర్‌ అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. కారుతో సహా టిప్పర్‌ రహదారి పక్కలో లోతట్టు ప్రాంతంలోకి పడిపోయింది. కారుమీద టిప్పర్‌ పడడంతో అందులో ఉన్న శ్రీనివాసులు తప్ప ముగ్గురు కారులోనే మృతిచెందారు. సుమారు ఒక గంట పాటు పోలీసులు, స్థానికులు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. కారులో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలైన శ్రీనివాసులును ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఓఎస్డీ నయీం అస్మీ పరిశీలించారు.  ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవరు రామాంజినేయులు వాహనం నుంచి హోసింగ్‌ ఊడిపడగానే సీటులో నుంచి కిందపడ్డాడు.  తీవ్ర గాయాలపాలవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలను బలిగొన్న టిప్పర్‌  తెలుగుదేశం పార్టీ నాయకులైన పోట్లదుర్తి బ్రదర్స్‌ కంపెనీకి చెందినదిగా తెలుస్తోంది. డీఎస్పీ కృష్ణన్, సీఐ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ రాజారెడ్డిలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

శోకసంద్రంలో బంధువులు
కడప అర్బన్‌ : జిల్లాలోని ముద్దనూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోని తుమ్మలూరు క్రాస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వారిలో కడప నగరం ఐటీఐ సర్కిల్‌ సమీపంలో నివసిస్తున్న నవాజ్‌ అలీ, అతని స్నేహితుడు మహమ్మద్‌ జావిద్‌లు ఉన్నారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సంఘటన జరిగిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడప నగరం నుంచి హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తి చేసుకున్న తర్వాత మృతదేహాలను ముద్దనూరు పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement