సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య గర్హనీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దారుణహత్య వెనుక ఉన్న వారెవరో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చేందుకే ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్‌ను నియమించామన్నారు. ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం రాత్రి మీడియాతో బాబు మాట్లాడుతూ వివేకా హత్యకు గురైతే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా చేయకుండా ఎందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని చూస్తేనే అది హత్య అని తెలుస్తుంది కానీ ఆయన గుండెపోటుతో మృతి చెందారని మొదట చెప్పి తరువాత అనుమానాస్పద మృతి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని సందేహం వ్యక్తం చేశారు.
వివేకా పీఏ ఉదయం 5.30 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి తలపుకొట్టినా ఆయన తీయకపోవడం.. భార్యకు ఫోన్ చేశారనడం.. రాత్రి లేట్‌గా వచ్చి ఉంటారని ఆమె అనడం.. తరువాత పెరటి తలుపు తీసి ఉండటాన్ని చూడటం.. 6.45 గంటలకు అవినాష్ పోలీసులకు ఫోన్ చేయడం ఏమిటని చంద్రబాబు వరుసగా సందేహాలు లేవనెత్తారు. అవినాష్‌కు ఎవరు ఫోన్ చేశారు.. ఆయన ఎవరెవరికి ఫోన్ చేశారో చెప్పాలని చంద్రబాబు అన్నారు. మృతదేహాన్ని బాత్రూం నుంచి బెడ్ రూమ్‌లోకి ఎవరు మార్చారు.. రక్తపు మరకలు ఎవరు చెరిపేశారు.. పోలీసులు వచ్చే లోగా ఘటనా స్థలంలో సీన్ ఆఫ్ అఫెన్స్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వీటన్నింటికీ వైఎస్ కుటుంబ సభ్యులే జవాబు చెప్పాలని ఆయన అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు సీబీఐ విచారణ కోసం గవర్నర్‌ను కలిస్తే ఆయన కూడా ఇవే ప్రశ్నలు వారిని అడగాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment