
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే కుతంత్రం
సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులోకి పోలీసుల పెత్తనానికి పన్నాగం.. కేబినెట్ సమావేశం వేదికగా కుట్రకు తెరతీసిన కూటమి
నాడు బాబు ప్రభుత్వ హయాంలోనే వివేకా హత్య.. నేడు అదే బాబు కూటమి ప్రభుత్వ పాలనలోనే సాక్షి రంగన్న మృతి
సహజ మరణాన్ని కూడా రాజకీయం చేసి వాడుకునేందుకే ‘సిట్’.. హంతకుడు దస్తగిరి అప్రూవర్‌గా మారడం చంద్రబాబు స్కెచ్చే
వివేకానందరెడ్డి రెండో భార్య వాంగ్మూలాన్ని అసలు పట్టించుకోని వైనం.. ఈ పరిణామాలన్నీ చంద్రబాబు మార్కు కుట్రేనని తేటతెల్లం
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచార కుట్రకు టీడీపీ కూటమి ప్రభుత్వం మరోమారు తెరతీసింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మేన్ రంగన్న అనారోగ్యంతో మరణిస్తే, ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం పన్నుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసు పరిధిలోకి రాష్ట్ర పోలీసులను జొప్పించడం ద్వారా చంద్రబాబు తన కుయుక్తులను చాటుకున్నారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం కూటమి ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం.
నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2019 మార్చి 14న వైఎస్ వివేకా హత్యకు గురవ్వగా, ప్రస్తుతం అదే చంద్రబాబు ప్రభుత్వంలో రంగన్న మరణించారన్న వాస్తవాలను కప్పిపుచ్చుతూ తిమ్మిని బమ్మి చేసేందుకు బరి తెగిస్తున్నారు. వాస్తవంగా ఇందుకు బాధ్యత వహించాల్సింది టీడీపీ ప్రభుత్వం. కానీ అందుకు విరుద్ధంగా వివేకా హత్య వెనుక ఉన్న కుట్రను కప్పి పుచ్చేందుకే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రంగన్నను తొలుత పులివెందుల ఆసుపత్రికి, అనంతరం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది.
ఈ సహజ మరణానికి రాజకీయ రంగు పులమాలన్న ఆలోచన రావడం ఒక్క చంద్రబాబు ముఠాకే సాధ్యమైంది. ఎవరికైనా, ఏమైనా సందేహాలు ఉంటే ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి నివేదించాలి. ఇంకోవైపు న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రంగన్నతోపాటు గత ఐదేళ్లలో సంభవించిన మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు. తద్వారా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పరోక్షంగానైనా సరే రాష్ట్ర పోలీసులకు అప్పగించాలన్నది చంద్రబాబు కుతంత్రమని స్పష్టమవుతోంది.
తద్వారా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీపై దు్రష్పచారం చేసే కుట్రను అమలు చేయాలన్నది అసలు ఉద్దేశం. అందుకే కుట్ర పూరితంగా గురువారం బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డితో అసెంబ్లీలో మాట్లాడించి, ఆ రాత్రికే సిట్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. రెడ్‌బుక్ కుట్రలను అమలు చేసేందుకే ప్రత్యేకంగా వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించిన ఇ.జి.అశోక్కుమార్తోనూ అదే రాత్రి హడావుడిగా మాట్లాడించారు.
మంత్రివర్గ సమావేశం వేదికగా కుట్ర
సచివాలయంలో శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో అజెండా అంశాలపై చర్చ అనంతరం.. ముందస్తు పన్నాగం ప్రకారం రంగన్న మృతిపై చర్చకు తెరతీశారు. ఏకంగా డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను మంత్రి మండలి సమావేశ మందిరంలోకి పిలిపించి రంగన్న మృతిపై ఆరా తీసినట్టు హైడ్రామా నడిపారు. ముందు ఇచి్చన స్క్రిప్టు ప్రకారమే డీజీపీ తన పాత్రలో నటించారు. రంగన్నది అనుమానాస్పద మృతేనని ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే, పోస్టుమార్టం నివేదిక రాకుండానే ఆయన ఏకపక్షంగా ప్రకటించడం విడ్డూరం.
బాబు గూటిలో చిలుకే దస్తగిరి
స్వయంగా వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశానని అంగీకరించిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విభ్రాంతికి గురి చేసింది. తద్వారా తాము లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లను అతనితో వాంగ్మూలం ద్వారా చెప్పించడం అన్నది టీడీపీ పకడ్బందీ కుట్రకు తార్కాణం. అప్రూవర్‌గా మారక ముందు అతను ఇచ్చిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలం పూర్తి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.
అత్యంత నేర చరిత్ర కలిగిన దస్తగిరి వైఎస్ వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు వరకు రూ.500 కోసం కూడా అప్పులు చేసే దయనీయ స్థితిలో ఉండేవాడు. స్నేహితుడు సునీల్ యాదవ్‌తో అతని వాట్సాప్ చాటింగులే ఆ విషయాన్ని నిర్ధారించాయి. అటువంటి దస్తగిరి అప్రూవర్‌గా మారిపోగానే... అతని వద్దకు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయన్నది ఈ కేసులో అత్యంత కీలకం.
ఇతను బహిరంగంగా సాగిస్తున్న దందాగిరీ అంతా ఇంతా కాదు. ఇలాంటి కిరాయి రౌడీకి సిద్ధార్థ లూథ్రా వంటి ఢిల్లీ స్థాయి లాయర్లు కేసు వాదిస్తుండటం గమనార్హం. గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు లూథ్రాతో రహస్యంగా భేటీ కావడం గమనార్హం. అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది.

వివేకా రెండో భార్య వాంగ్మూలాన్ని పట్టించుకోరా?
వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్ ఆవేదనతో ఇచి్చన వాంగ్మూలాన్ని అటు సీబీఐ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నాయి. ఆమెతో రెండో వివాహంతోనే వివేకా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పడంతోపాటు ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడాన్ని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
షమీమ్‌ను సునీత తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. వారిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లు ఆ విషయాన్ని బయట పెట్టాయి. వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబ సభ్యులు.. అంటే కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి పాత్ర ఉందని షమీమ్ వాంగ్మూలం ఇచ్చారు.
మరి ఆ అంశానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. తద్వారా వైఎస్ వివేకా హత్య వెనుక కారణాలను కప్పిపుచ్చి, తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోందనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం
సిట్ పర్యవేక్షణలో 4 గంటలపాటు నిర్వహణ
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మేన్ రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురైన రంగన్న కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి గురువారం కడప రిమ్స్‌లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని పులివెందులలోని భాకరాపురం శ్మశానవాటికలో ఖననం చేశారు.
అయితే, రంగన్న మృతి పట్ల సీఎం చంద్రబాబు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనుమానం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సిట్, వైద్య బృందం సభ్యులు కలిసి భాకరాపురం శ్మశానంలో పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీయించారు. శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కడపకు చెందిన వైద్య బృందం, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం సభ్యులు.. రెవెన్యూ అధికారుల సమక్షంలో 4గంటలపాటు రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ముఖ్యమైన శరీర భాగాలను సేకరించి తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment