ఐపీఎల్‌ 2025... డిజిటల్‌ మార్కెటింగ్‌ బొనాంజా...! | Jio Hotstar targets huge marketing revenue | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2025... డిజిటల్‌ మార్కెటింగ్‌ బొనాంజా...!

Published Sun, Mar 9 2025 5:54 AM | Last Updated on Sun, Mar 9 2025 10:42 AM

Jio Hotstar targets huge marketing revenue

భారీ మార్కెటింగ్‌ ఆదాయానికి గురిపెట్టిన జియో హాట్‌స్టార్‌

రూ.4,500 కోట్ల విలువైన ప్రకటనల రాబడిపై కన్ను

4 కోట్ల టీవీలు, 42 కోట్ల ఫోన్లలో మ్యాచ్‌ల స్ట్రీమింగే లక్ష్యం

డిజిటల్‌ మ్యాపింగ్‌ ద్వారా పక్కా ప్రణాళిక

వేసవి వచ్చిందంటే.. విద్యార్థులకు సెలవుల సరదా.. మామిడి పండ్ల మజా.. అంతేనా..? క్రేజీ క్రేజీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సందడి కూడా..! ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్‌ హంగామాకు తెరలేవనుంది. ఈ క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ‘జియో హాట్‌స్టార్‌’ చానల్‌ కూడా ఇందుకుతగ్గట్లే  మార్కెటింగ్‌ వ్యూహాలతో సన్నద్ధమవుతోంది.

రిలయన్స్‌కు చెందిన జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్‌ విలీనమై ‘జియో హాట్‌స్టార్‌’గా ఏర్పడిన తర్వాత ఇదే తొలి ఐపీఎల్‌ సీజన్‌. దీంతో ప్రకటనల ద్వారా భారీ ఆదాయానికి గురిపెట్టింది. అందుకోసం డిజిటల్‌ బ్రెయిన్‌ మ్యాపింగ్‌ వ్యూహాలను అమలు చేస్తుండడం తాజా పరిణామం. ఇప్పటికే గూగుల్, మెటా సంస్థలు ఈ పద్ధతి ద్వారా భారీగా ప్రకటనలు రాబడుతున్నాయి. ఇదే పద్ధతిలో.. జియో హాట్‌స్టార్‌ సైతం భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచంలో క్రికెట్‌ అభిమానులను విశేషంగా అలరించే ఐపీఎల్‌ ద్వారా భారీ ఆదాయంపై కన్నేసింది.    – సాక్షి, అమరావతి

మార్చి 22 నుంచి మే 25 వరకు దేశంలోని 13 నగరాల్లో నిర్వహించే 74 మ్యాచ్‌లకు భారీగా వీక్షకులను ఆకర్షించడం ద్వారా జియో హాట్‌స్టార్‌ రికార్డు స్థాయిలో ప్రకటనల ఆదాయంపై గురిపెట్టింది. ఐపీఎల్‌–2025 భారీ మార్కెటింగ్‌ ఆదాయ వనరుగా మార­నుంది. టీవీలు, డిజిటల్‌ మీడియా ప్రసారాలు, టీమ్‌ స్పాన్సర్‌షిప్‌లు, స్టేడియంలలో ప్రకటనలు, ఇతరత్రా మాధ్య­మాల ద్వారా దాదాపు రూ.7 వేల కోట్లు వస్తాయని మార్కెటింగ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ప్రత్యక్ష ప్రసార హక్కులు పొందిన జియో హాట్‌స్టార్‌ అందులో రూ.4,500 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రికార్డుస్థాయిలో వ్యూయర్‌షిప్‌ సాధించడం ద్వారా తమ చానల్‌లో ప్రకటనలు ఇస్తే వినియోగదారులకు మరింత చేరువ కాగలమని పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు నమ్మకం కలిగించాలన్నది ఉద్దేశం. అందుకోసం జియో హాట్‌స్టార్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ విభాగం ఇటీవల బెంగళూరులో పారిశ్రామిక, వ్యాపార సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సెమినార్‌ నిర్వహించింది. 

కార్పొరేట్‌ పరిశ్రమలు, భారీ వ్యాపార సంస్థల నుంచే కాదు.. రాష్ట్రం/నగరాలకు పరిమితమైన వ్యాపార సంస్థల నుంచి ప్రకటనలు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 17 వేల అమెరికన్‌ డాలర్లు (రూ.14.80లక్షలు)తో ప్రకటనల ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్‌ బ్రెయిన్‌ మ్యాపింగ్‌ ద్వారా ఏ వీక్షకుడి మొబైల్‌ ఫోన్లలో ఎటువంటి ప్రకటనలు ఇవ్వాలన్నది ముందుగానే గుర్తిస్తామని వారికి వివరించింది.

భారీ వ్యూయర్‌షిప్పే లక్ష్యం!
ప్రపంచంలో ఎన్నో క్రికెట్‌ లీగ్‌లు ఉన్నప్పటికీ ఐపీఎల్‌ లెవలే వేరు. బోర్డ్‌ ఆఫ్‌ క్రికెట్‌ కంట్రోల్‌ ఇన్‌ ఇండియా (బీసీసీఐ) 2008లో ప్రారంభించిన ఐపీఎల్‌కు ఏటా  ఆదరణ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అటు స్టేడియాలు, ఇటు టీవీలు, స్మార్ట్‌ఫోన్లలో భారీ వ్యూయర్‌షిప్‌ ఐపీఎల్‌ సొంతం. ఈసారి దీనిని మరింతగా పెంచుకోవాలని జియోహాట్‌స్టార్‌ భావిస్తోంది. ఒక్కో మ్యాచ్‌ను కనీసం 4 కోట్ల టీవీలు, 42 కోట్ల మొబైల్‌ ఫోన్లలో వీక్షించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ ప్యాకేజీల కింద చానల్‌ ప్రసారాలను అందుబాటులోకి తెచ్చింది.

డిజిటల్‌ మ్యాపింగ్‌ అంటే..
వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ పిల్లలను ఇంటర్మీడియట్‌ తరువాత ఏ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేర్చించాలనే విషయంపై వాట్సాప్‌లో చాటింగ్‌ చేశారు. అంతే..! కాసేపటికే వారి ఫేస్‌బుక్‌ వాల్‌పై దేశంలోని పలు ఇంజనీరింగ్‌ కాలేజీల ప్రకటనలు వరదలా పారాయి. స్మార్ట్‌ ఫోన్‌పై ఫేస్‌బుక్‌ ఖాతాను స్క్రోల్‌ చేసినా ఇంజినీరింగ్‌ కాలేజీల ప్రకటనలే. ఇది ఎలా సాధ్యం?

ఆ వ్యక్తులు ఇంజనీరింగ్‌ కాలేజీలపై వాకబు చేయను­న్నారని ఫేస్‌బుక్‌ యాజమాన్య సంస్థ ‘మెటా’కు ఎలా తెలిసింది!? ఈ ప్రశ్నకు సమాధానం.. ‘డిజిటల్‌ బ్రెయిన్‌ మ్యాపింగ్‌’. దీనిని సర్వైలెన్స్‌ క్యాపిటలిజం (నిఘా పెట్టుబడిదారీ విధానం)గా చెబుతారు. డిజిటల్‌ టెక్నాలజీ యుగంలో పారిశ్రామిక, వ్యాపార సంస్థల మార్కెటింగ్‌ ప్రణాళికల్లో సర్వైలెన్స్‌ క్యాపిటలిజం అత్యంత కీలకంగా మారింది.

డిజిటల్‌ బ్రెయిన్‌ మ్యాపింగ్‌ను సొమ్ము చేసుకుంటున్న సంస్థలు
గూగుల్, మెటా, అమెజాన్‌ వంటివి తమ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, వారి అభిరుచులు, వారి వ్యవహార శైలి మొదలైన డేటాను ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషిస్తాయి. ఇదే ‘డిజిటల్‌ బ్రెయిన్‌ మ్యాపింగ్‌’. ఈ డేటాను కొనుగోలు చేసేందుకు గూగుల్, మెటాలతో పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ సంస్థలకు అందిన డేటా ఆధారంగా.. ఖాతాదారుల అభిరుచి, అవసరాలకు తగినట్లుగా వ్యాపార ప్రకటనలు వారి సోషల్‌ మీడియా ఖాతాల్లో ప్రసారమవుతాయి. 

ఇవన్నీ వెంటవెంటనే జరిగిపోతాయి. అంటే సోషల్‌ మీడియా ఖాతాదారులు తమ ఫోన్లలో చేసే ప్రతి సెర్చ్, ప్రతి క్లిక్‌ కూడా డిజిటల్‌ బ్రెయిన్‌ మ్యాపింగ్‌కు దోహదపడుతోంది. తద్వారా సర్వైలెన్స్‌ క్యాపిటలిజం మార్కెటింగ్‌ ప్రణాళికలు రూపొందించేందుకు ఉపకరిస్తోంది. ఇప్పటివరకు గూగుల్, మెటా, అమెజాన్‌ వంటి సంస్థలే డిజిటల్‌ బ్రెయిన్‌ మ్యాపింగ్‌ను సొమ్ము చేసుకుంటున్నాయి. మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్లి భారీగా ప్రకటనల ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా ఇకపై జియో హాట్‌స్టార్‌ కూడా ఈ పద్దతిని అనుసరించనుంది. 

దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించే అభిమానుల అభిరుచులను దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, నగరాల వారీగా విభజించి విశ్లేషించి అందుబాటులోకి తేనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా, భారత దేశం అంతటా, రాష్ట్రాలు, నగరాల వారీగా ఎక్కడికక్కడ వివిధ ప్యాకేజీ­ల కింద ప్రకటనలను రాబట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement