వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం | Womens Day celebrated in grand manner at YSRCP office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం

Published Sun, Mar 9 2025 5:49 AM | Last Updated on Sun, Mar 9 2025 5:49 AM

Womens Day celebrated in grand manner at YSRCP office

భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు  

సాక్షి, అమరావతి:  తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మహిళా నేతలు ముందుగా మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులరి్పంచి, ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా   వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సాధికారత అంటే వైఎస్సార్, ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ మాత్రమే గుర్తుకొస్తారని చెప్పారు. 

మహిళలకు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా వారిని గాలికి వదిలేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. తనను గెలిపించిన కుప్పంలోనే ఎకరాలకు ఎకరాలు గంజాయి సాగు చేస్తుంటే చంద్రబాబుకు కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. హోం మంత్రి సొంత జిల్లా ఉమ్మడి విశాఖలో ఎకరాలుకు ఎకరాలు గంజాయి పండిస్తున్నా, ముఖ్యమంత్రి ఉన్న గుంటూ­రు డ్రగ్స్‌కు అడ్డాగా మారినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. 

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ టీడీపీ కూటమి పాలనలో మహిళల పరిస్థితి దారుణంగా మారిందని చెప్పారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమికి ఎందుకు ఓటేశామా.. అని మహిళలు బాధపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త షేక్‌ నూర్‌ ఫాతిమా, గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి రజనితో పాటు పార్టీ మహిళా నేతలు ఎం శ్రీదేవి, కేవీవీ స్వప్న, టి.స్వప్నలత, బొజ్జా సుజాత, పి. చైతన్య రెడ్డి, దాసరి దర్యాబీ పలువులు మహిళా నేతలు పాల్గొన్నారు.

మహిళలను నట్టేట ముంచడం బాబుకు అలవాటే..: ఆర్కే రోజా
నవ మాసాల్లో మహిళలను నవ విధాలుగా మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆమె శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించి, అధికారంలోకి రాగానే మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మహిళలు సా మాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిలదొక్కుకునేలా అన్ని విధాలా అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి, ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచడమే కాకుండా మగవారితో సమానమైన స్థానం కల్పించి, మహరాణుల్లా చూసుకున్నా రని గుర్తుచేశారు. వారి భద్రత కోసం దిశ యాప్, దిశా పోలీస్‌ స్టేషన్లను తీసుకొచ్చి వారికి అండగా నిలిచారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. 

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం  పవన్, హోంమంత్రి అనితకు మహిళలు అంటే గౌరవమే లేదన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారంటూ ఊగిపోయిన పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా వారిని ఇళ్లకు ఎందుకు తేవట్లేదని నిలదీశారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆయన శైలి చూస్తే ఆయనేమిటో అర్థమవుతుందన్నారు.  

హామీల అమలేది? వరుదు కళ్యాణి 
ఓట్ల కోసం కూటమి పార్టీలు మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏమైందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరు దు కళ్యాణి ప్రశ్నించారు. మహిళా భద్రతను కూ టమి గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. జగన్‌ కంటే ఎక్కువ మేలు చేస్తామంటూ సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రకటించి, ఇప్పుడు వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మహాశక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా ఈ పథకం కింద మేలు జరగలేదన్నారు.

మహిళా దినోత్సవం ఒక మహత్తర కార్యక్రమం
వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజారాణి
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం అనేది ఒక వేడుక కంటే ఎక్కువని వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజారాణి చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని శనివారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. 

ఎంపీ తనూజారాణి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి గంగాపురం కావ్య, కేంద్ర సహాయ మంత్రి భూపతి శ్రీనివాస వర్మ సతీమణి భూపతి వెంకటేశ్వరీదేవి, వ్యవసాయ శాఖ జాయిండ్‌ సెక్రటరీ పెరిన్‌ దేవి, ఢిల్లీ విద్యాశాఖ డైరెక్టర్‌ వేదిత రెడ్డి, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ కమలారావు, సఫ్దర్‌గంజ్‌ హాస్పిటల్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ కరుణ కుమారికి ప్రపంచ మహిళా దినోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఆంధ్ర అసోసియేషన్‌ నార్త్‌ ఢిల్లీ సెక్రటరీ సౌజన్య, సెంట్రల్‌ ఢిల్లీ సెక్రటరీ శారద,  ప్రమీళ, కళ్యాణి, వసంత, సుశీలలు అవార్డులను  అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement