
ఎల్లో మీడియా, ప్రభుత్వ పెద్దలది దుష్ప్రచారమే
డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయాడు
ఆ బాధ నుంచి కోలుకోలేకున్నాం
ఈసీ గంగిరెడ్డి కరోనా, దీర్ఘ కాల అనారోగ్యంతో చనిపోయారు
వాచ్‌మేన్ రంగయ్య అనారోగ్యం ఇక్కడ అందరికీ తెలుసు
వీరి సహజ మరణాలకు పెడర్ధాలు తీస్తున్నారు
అభిషేక్ రెడ్డి తండ్రి, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందితే, దానిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దానికి ప్రభుత్వ పెద్దలు కూడా వంతపాడుతున్నారని అభిషేక్ రెడ్డి తండ్రి, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ మదన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారంటూ ఎల్లో మీడియా విషపూరిత కథనాలు ప్రచురించడాన్ని ఖండించారు.
తమ కుమారుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శక్తివంచన లేకుండా ప్రయత్నించారని, కోమా నుంచి బయటపడతాడని ఆశించామని, దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందాడని తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న అభిషేక్‌రెడ్డి చిన్న వయస్సులో చనిపోవడం ఈ ప్రాంతంలో అందరినీ కలచివేసిందని చెప్పారు. అభిషేక్‌రెడ్డి పిల్లలను చూస్తే కడపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
అభిషేక్ మృతి తమకు తీరని లోటని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నామని తెలిపారు. ఇలాంటి తీవ్ర విషాద పరిస్థితుల్లో తాముంటే.. చిన్నాన్న వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, అందులో కుట్ర ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడర్థాలు తీయడం, ప్రభుత్వ పెద్దలూ ఇదే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్, అనారోగ్యంతో దీర్ఘ కాలం చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.
మొన్న వాచ్‌మేన్ రంగన్న కూడా అనారోగ్యంతో చనిపోయాడని చెప్పారు. రంగన్నకు ఆయాసం ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారని, అతని అనారోగ్యం ఇక్కడి అందరికీ తెలుసునని చెప్పారు. వీరందరి సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోందని అన్నారు. బయటి ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలియజెప్పేందుకు ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వ పెద్దల చర్యలూ ఇదే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.
సిట్ కాదు.. జ్యుడీషియల్ విచారణ జరిపించండి
చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వ సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం వస్తోందని వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మందిపై పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏకపక్ష విచారణ అందరమూ కళ్లారా చూస్తున్నామని, అందువల్లే సిట్‌పై నమ్మకం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment