ఆరుగురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌ | Cricket Betting Gang Arrest In YSR kadapa | Sakshi
Sakshi News home page

ఆరుగురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌

Published Fri, Oct 5 2018 1:48 PM | Last Updated on Fri, Oct 5 2018 1:48 PM

Cricket Betting Gang Arrest In YSR kadapa - Sakshi

నిందితుల అరెస్ట్‌ వివరాలను తెలుపుతున్న కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాషా

కడప అర్బన్‌:  క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు బుకీలను కడప పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 3న సాయంత్రం సౌత్‌ఆఫ్రికా– జింబాబ్వే జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ సందర్భంగా వివిధ ప్రదేశాల్లో కడప నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాషా ఆధ్వర్యంలో అర్బన్‌ ఇన్‌చార్జి సీఐ టీవీ సత్యనారాయణ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కడప తాలూకా ఇన్‌చార్జి ఎస్‌ఐ జి. అమర్‌నాథ్‌ రెడ్డి, పెండ్లిమర్రి ఎస్‌ఐ ఎన్‌. రాజరాజేశ్వర రెడ్డి, క్రైం పార్టీ సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి పాల్గొన్నారు.  అరెస్ట్‌ వివరాలను డీఎస్పీ షేక్‌ మాసుంబాషా గురువారం తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు.

కడప నగరం అక్కాయపల్లి శాస్త్రి నగర్‌లో ఇంటి ముందు వరండాలో కొత్తపల్లి శివారెడ్డి అనే యువకుడు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్‌లు, ఒక టీవీ, రూ. 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను పెండ్లిమర్రి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు.
మరోకేసులో తాలూకా పరిధిలో చౌటపల్లి రోడ్డు రైల్వేగేటు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.55 లక్షలు నగదు, 7 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటనలో అరెస్టయిన వారిలో కడప నగరం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌కు చెందిన గోపిశెట్టి వెంకట సామ్రాట్‌ బిందెల వ్యాపారం చేస్తూ, దురలవాట్లకు బానిసగా మారి క్రికెట్‌బుకీగా మారా>డు.
శివానందపురానికి చెందిన షేక్‌ మహమ్మద్‌ సేల్స్‌మాన్‌గా పనిచేస్తూ క్రికెట్‌బుకీగా మారాడు.
పెండ్లిమర్రి మండలం, నందిమండలానికి చెందిన కోవూరు రవిశంకర్‌ ఫోటోస్టూడియోతో జీవనం సాగిస్తూ, క్రికెట్‌ బుకీగా మారాడు.
ఓ కార్యాలయంలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్న, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ నివాసియైన గుగ్గుళ్ల మహేశ్వర రెడ్డి క్రికెట్‌ బుకీగా మారాడు.
కడప నగరం అక్కాయపల్లికి చెందిన పోలిరెడ్డి కొండారెడ్డి వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. క్రికెట్‌ బుకీగా మారాడు.  
రెండు కేసుల్లో ఆరుగురు క్రికెట్‌ బుకీలను అరెస్ట్‌ చేయగా, వారి వద్ద నుంచి రూ. 3.05 లక్షలు నగదు, ఒక టీవీ, 9 సెల్‌ఫోన్‌లు, రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్‌ బుకీలను అరెస్ట్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ టీవీ సత్యనారాయణ, కడప తాలూకా ఇన్‌చార్జి ఎస్‌ఐ జి. అమర్‌నాథ్‌ రెడ్డి, పెండ్లిమర్రి ఎస్‌ఐ ఎన్‌. రాజరాజేశ్వరరెడ్డి, క్రైం పార్టీ సిబ్బంది హుస్సేన్, శేఖర్, నరేంద్ర, సాయిగోపి, సుధాకర్, కడప తాలూకా సిబ్బందిని కడప డీఎస్పీ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement