ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు హీట్ పుట్టిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఒక వైపు.. మరోవైపు ఎన్నికల ఫలితాలు మరింత కాక పుట్టిస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు మొదలైతే పందెం రాయుళ్లకు పండగే. బుకీలు, సబ్ బుకీలే కాకుండా అన్ని వర్గాల వారు క్రికెట్ మ్యాచ్‌లపై పందెం కాస్తారు. సాధారణ మ్యాచ్‌లకు భిన్నంగా బెట్టింగ్ కోసమే నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో ఎన్నికల ఫలితాలు కూడా తోడు కావడంతో పందేలు జాతరను తలపిస్తున్నాయి.
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ మే 23న నిర్వహించనున్నారు. ఫలితాలు వెలువడటా నికి ఎక్కువ వ్యవధి ఉండటంతో పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా ఎన్నికల ఫలితాలపై మాట్లాడుకోవడం, సవాళ్లు విసురుకోవడం, కొందరు మరో అడుగు ముందుకేసి వారి శక్తి మేరకు గెలుపోటములపై పందేలు కాస్తున్నారు. చాలా మంది పార్టీలపై అభిమానాన్ని పక్కన పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా పందేలు పెట్టుకుంటున్నారు. గ్రామాల్లోని రచ్చబండలు, చావిడులతో పాటు పట్టణాల్లో టీ బంకులు, పార్కులు ఫలితాల విశ్లేషణ కేంద్రాలుగా మారాయి. అభ్యర్థుల మాటేమోగానీ సాధారణ ప్రజలకు మాత్రం ఈ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను రేకిస్తున్నాయి.
ప్రొద్దుటూరు కేంద్రంగా బెట్టింగ్..
ప్రొద్దుటూరు అంటేనే ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్‌కు పెట్టింది పేరు. క్రికెట్ పందేలకు రాష్ట్రంలోనే ప్రొద్దుటూరుకు రికార్డు ఉంది. జిల్లాతో పాటు రాయలసీమలోని అనేక ప్రాంతాలకు ఇక్కడి బుకీలే బెట్టింగ్ పాఠాలు నేర్పారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో క్రికెట్ బుకీలు పోలీసులకు పట్టుబడ్డా వారిలో ప్రొద్దుటూరుకు చెందిన వారు ఉంటారు. అందుకే క్రికెట్ పందేలతో పాటు ఏ పందేలు ఆడటంలో అయినా ఇక్కడి బుకీలు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న బుకీల చూపు ఎన్నికల ఫలితాలపై పడింది. నిత్యం రూ. కోట్లు చేతులు మారుతున్నాయి. గ్రూపులుగా ఏర్పడి చాలా మంది పందేలు కాస్తున్నారు. 5 శాతం కమీషన్ తీసుకొని ఇరువురి మధ్య దళారులు పందేలు కుదుర్చుతున్నారు.
క్రికెట్ బెట్టింగ్ అవగాహన ఉన్నవారు మాత్రమే నిర్వహిస్తుండగా, ఎన్నికల ఫలితాలపై అన్ని వర్గాల వారు పందేలకు దిగుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ తరహాలోనే ఎన్నికల ఫలితాలపై అంశాల వారిగా పందేలు కాస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుంది..? అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? ప్రొద్దుటూరులో మెజారిటీ ఎంత వస్తుంది..? మంగళగిరిలో గెలుపెవరిది..? జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? జమ్మలమడుగులో ఏ పార్టీ జెండా ఎగురుతుంది? ఇలా అనేక విధాలుగా పందేలు కాస్తున్నారు. బెట్టింగ్‌లో రకరకాల పద్దతులు ఉన్నాయి. పందెం కాసి రూపాయికి రూపాయి ఇవ్వడం ఒక పద్దతి. ఒకటికి ఒకటినర్ర.. ఒకటికి రెండు ఇలా రకరకాలుగా పందెం కాస్తున్నారు. ఫలితాలు వెలువడటానికి ఇంకా ఎక్కువ సమయం ఉండటంతో ప్రస్తుతానికైతే ఒకటికి ఒకటి చొప్పున పందెం కాస్తున్నారు. ప్రొద్దుటూరుతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బెట్టింగ్‌గే జీవనంగా సాగించే పెద్ద పెద్ద బుకీలు ఉన్నారు. వారు ఇంకా రంగంలోకి దిగలేదు.
Comments
Please login to add a commentAdd a comment